కెరియర్‌లో దూసుకెళదాం!

చదువుల్లో చాలా మార్కులు వచ్చాయి.. చాలదు! టెక్నికల్‌గా టాప్‌ లేపేస్తానంటారా.. ఫర్వాలేదు! కష్టపడటానికి కాస్త కూడా వెనకాడరు.. ఓ..ఓకే! ఇంకేం.. కెరియర్‌కి తిరుగులేదనుకుంటున్నారా? లాభం లేదు.. ఇంకా కావాలి. అంతకుమించి.. ఇంకేవో ఉండాలి. ఏంటవి? అవే ‘బిజినెస్‌ స్కిల్స్‌’. అభ్యర్థుల్లో పరిశ్రమలు పరిశోధిస్తున్న కార్పొరేట్‌ నైపుణ్యాలు. డిగ్రీ పట్టాతో ఉద్యోగ వేట మొదలు పెట్టిన వాళ్లూ, కొత్తగా కొలువులోకి ప్రవేశించి ఎదుగుదలకు ఎదురుచూస్తున్న వాళ్లూ వీటిని తప్పనిసరిగా మెరుగుపరచుకోవాలని ‘మాన్‌స్టర్‌’ సంస్థ మరీమరీ చెబుతోంది.

ఏ కెరియర్‌ను ప్రారంభిస్తున్నా దానిలో విజయం సాధించాలంటే కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. ఇవి ఉంటే వృత్తిలో విజయవంతం కావొచ్చు. భవిష్యత్తులో పదోన్నతులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చేసుకున్న విజ్ఞప్తులు ఫలించే వీలుంటుంది.
ఫలానా పరిశ్రమలో పనిచేస్తున్నారనేదానితో సంబంధం లేకుండా ఈ నైపుణ్యాలు ఎవరికైనా అవసరమే. ప్రతి ఒక్కరిలో ఇవి ఎంతో కొంత ఉంటాయి. వాటిని మెరుగుపర్చుకోవడమూ, మిగతావి నేర్చుకోవడమూ చేస్తే కెరియర్‌లో దూసుకువెళ్ళవచ్చు.
నెగోషియేటింగ్‌
ఎందుకు: కావాల్సినదాన్ని దక్కించుకోవడానికి అనునయాత్మకంగా ఉండటం అవసరం. అది ఎప్పుడు ఎలా ఉండాలో విద్యార్థులూ, అభ్యర్థులూ తెలుసుకోవాలి. ముఖ్యంగా జాబ్‌ ఆఫర్‌ పొందడంలో, నిధులను సమకూర్చుకునే సందర్భంలో ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయి.
కెరియర్‌ ప్రారంభంలోనే మంచి నెగోషియేటర్‌గా మారడం ప్రధానం అంటారు రాబిన్‌ పింక్లే. ఆమె ‘గెట్‌ పెయిడ్‌ వాట్‌ యూఆర్‌ వర్త్‌: ద ఎక్‌ü్సపర్ట్‌ నెగోషియేటర్స్‌ గైడ్‌ టూ శాలరీ అండ్‌ కాంపెన్‌సేషన్‌’’ అనే ప్రసిద్ధ పుస్తక సహ రచయిత. చాలావరకూ వేతన పెరుగుదల ప్రారంభ జీతంపైనే ఆధారపడి ఉంటాయి. ఇది గుర్తిస్తే ఈ అంశం ఎంత ప్రధానమైనదో అర్థమవుతుంది.
వేరే ఉద్యోగానికి బదిలీ అవుతున్నప్పుడు పని నియమావళిలో అనుకూలతలు, అక్కడి ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు పొందడంలో ఈ నైపుణ్యాలు తోడ్పడతాయి.
ఎలా?: శాలరీ నెగోషియేషన్స్‌ కోసం ముందుగా అందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మీ విద్య, నైపుణ్యాలు, అనుభవంతో పరిశ్రమలో సగటున ఎంత మొత్తంలో పొందుతున్నారో తెలుసుకోవాలి. ఇందుకుగానూ మెంటర్‌ సహకారం తీసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో ఎంత జీతానికి మీకు అర్హత ఉందో నిర్ధారించుకోవాలి. వీటన్నింటి సాయంతో మీ అభ్యర్థనను బలపరచుకోవచ్చు.
సమయ నిర్వహణ
ఎందుకు: సమయం అంటే ఒక రకంగా డబ్బు అని చెప్పవచ్చు. ‘మీ పని నాణ్యత కచ్చితంగా కీలకమే అయినప్పటికీ సమయం కూడా ప్రధానం’ అంటారు జూలీ మార్గెన్‌స్టర్న్‌. ‘టైం మేనేజ్‌మెంట్‌ ఫ్రం ద ఇన్‌సైడ్‌ అవుట్‌’ రచయిత్రి ఈమె. మేనేజర్లు ఉద్యోగుల నుంచి ఎప్పుడూ మంచి పనితనాన్ని ఎక్కువ మొత్తంలో ఆశిస్తుంటారు. అందుకే సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. దీని ద్వారా తక్కువ స్థాయి కార్యక్రమాలపై ఎక్కువ శక్తిని ఖర్చు చేయకుండా నిరోధించుకోవచ్చు.
ఎలా?: మీ దృష్టిని ఎక్కడ కేంద్రీకరించాలో తెలియాలంటే.. ముందుగా మేనేజర్‌ నుంచి తుది గడువులు, విజయాన్ని గణించే పద్ధతుల వివరాలు తెలుసుకోవాలి. ఒకసారి ఆ సమాచారాన్ని సేకరించుకుంటే.. మీ పనిలో ఏయే విషయాలకు ప్రాధాన్యమిచ్చి దృష్టి సారించాలి, వేటిని ముందస్తుగా పూర్తిచేయాలనే అంశాలపై స్పష్టత వస్తుంది.
బహిరంగ ప్రసంగ కళ
ఎందుకు?: మిమ్మల్ని మీరు సమర్థులుగా, స్నేహభావం గల వ్యక్తిగా నిరూపించుకోవడానికి ఈ నైపుణ్యాలు అవసరమవుతాయి. పబ్లిక్‌ స్పీకింగ్‌ కోచ్‌, కెన్నెడీ స్పీచ్‌ కమ్యూనికేషన్స్‌ ఫౌండర్‌, కెన్నెడీ అభిప్రాయం ప్రకారం.. ‘పెద్ద సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల ముందు ఉన్నా, చిన్న బృంద సభ్యుల మధ్య ఉన్నా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వ్యక్తపరచడం, మీ భావాలను స్పష్టంగా తెలియజేయడం కొంచెం కష్టమే’.
ఎలా?: బృంద సమావేశాల్లో ప్రెజెంటేషన్లను ఉపయోగించడం ద్వారా పబ్లిక్‌ స్పీకింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ప్రెజెంటేషన్‌ దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థులకైనా, ఉద్యోగులకైనా కాస్త బెరుకు సహజం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. మీరు ఏం చెబుతారు? ఎలా చెబుతారు? సంబంధిత సమాచారాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు? అనేవి పూర్తిగా మీ అధీనంలోనే ఉంటాయి. కాకపోతే ప్రతీ ప్రెజెంటేషన్‌ తరువాత మీ ఉన్నతాధికారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తప్పకుండా తీసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో ఇవ్వబోయే ప్రసంగాలను మెరుగుపరచుకోవచ్చు.
ఆఫీసు బయట ఈ నైపుణ్యాలను మెరుగుపరచుకునే అవకాశాలున్నాయి. పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌లను నిర్వహించే టోస్ట్‌మాస్టర్‌ వంటి ఎన్నో సంస్థలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చేరి నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు.
టీం వర్క్‌, పీపుల్‌ స్కిల్స్‌
ఎందుకు?: తన అవసరాన్ని గుర్తించిన వెంటనే సాయపడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారిని బృందంలోని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అలాగే తోటి ఉద్యోగులతోనూ కలిసిపోవాలి. అప్పుడే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం దొరుకుతుంది. సొసైటీ ఫర్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ జరిపిన సర్వేలో 83% ఉద్యోగులు టీం వర్క్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ప్రారంభ స్థాయి ఉద్యోగులకు ఇది ప్రధానమని వారు చెప్పారు.
ఎలా?: ఈ నైపుణ్యాలు పెంచుకోవాలంటే మంచి శ్రోత అవ్వాలి. ముఖ్యంగా అంతిమ ఫలితాల గురించి ఆలోచిస్తూ ఆందోళన, ఒత్తిడులకు గురవుతూ వాటి నుంచి బయటపడాలనుకునే సహోద్యోగులు చెప్పేది ఆలకించాలి. తోటి ఉద్యోగులు వచ్చి సాయాన్ని అర్థించేవరకూ ఆగకుండా చొరవ చూపి, ఇష్టపూర్వకంగా వారికి సాయం చేయాలి. అలాగే తోటివారితో సంబంధాలు యాంత్రికంగా ఉండకూడదు. వారిపై నిజమైన ఆసక్తిని చూపి, వారితో కలిసిమెలిసివుండాలి.
మీ పరిజ్ఞానాన్ని బృందంతో పంచుకోవాలి. కాన్ఫరెన్స్‌లు, నెట్‌వర్కింగ్‌ ఈవెంట్లు, ఇండస్ట్రీ గురించిన సమాచారాన్ని చదువుతున్నపుడు మీకు ఆసక్తి కలిగించిన అంశాలను వారితో పంచుకోవాలి. పరస్పర సహకారం ఎప్పుడూ అనుకూల ఫలితాలను అందిస్తుంది.
పరిశోధన
ఎందుకు?: సొంత కెరియర్‌ అభివృద్ధికీ, సంస్థ అభివృద్ధికీ తోడ్పడేలా విలువైన ఉద్యోగిగా గుర్తింపు పొందాలంటే.. పరిశ్రమలో చోటు చేసుకునే మార్పులపై అవగాహన ఉండాలి. ప్రముఖ బిజినెస్‌ కోచ్‌ రాచెల్‌ రిట్‌లాప్‌ ఇదే విషయం చెబుతారు.
ఈ కింది అంశాల ద్వారా మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవచ్చని ఆమె సూచించారు.
* సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉండే ఇండస్ట్రీ గ్రూపులు, ఫోరాల్లో పాల్గొనడం
* సోషల్‌ మీడియాలో థాట్‌ లీడర్లను అనుసరించడం
* పోటీ సంస్థల సమాచారాన్ని తెలుసుకోవడానికి గూగుల్‌ అలర్ట్స్‌ను పెట్టుకోవడం
* ఇండస్ట్రీ పోడ్‌కాస్ట్‌లను వినడం
* ఇండస్ట్రీ న్యూస్‌లెటర్లకు సైన్‌ అప్‌ అవడం
* ట్రేడ్‌ పబ్లికేషన్స్‌కు సబ్‌స్క్రైబ్‌ అవడం
* వృత్తిగత సంఘాల్లో చేరడం
* ఇండస్ట్రీ కాన్ఫరెన్సులకు హాజరవడం


Posted on 13-03-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning