మర ప్రజ్ఞ మహా మాయ!

క్యాబ్‌ బుక్‌ చేయడానికి ఓలా లేదా ఊబర్‌ యాప్‌ ఉపయోగిస్తే పికప్‌ లొకేషన్స్‌, గమ్యస్థానం చేరే టైమ్‌ వెంటనే డిస్‌ప్లే అవుతుంది. ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్‌ చేయగానే ఫలానా ఫ్రెండ్స్‌ని ట్యాగ్‌ చేయాలా అని అడిగేస్తుంది. గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుంటే అంతకు ముందు అదే సబ్జెక్టుపై జరిగిన సెర్చ్‌ లిస్ట్‌లను చూపించేస్తుంది. కోట్లమంది కస్టమర్ల నుంచి కొంతమందిని కొద్దిటైమ్‌లోనే డిస్కౌంట్‌ కూపన్లకు అర్హులుగా అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ సంస్థలు గుర్తించేస్తాయి. ఇవన్నీ... ఎలా జరుగుతున్నాయి? పెద్దఎత్తున ఉన్న డేటాను అత్యంత వేగంగా విశ్లేషించి అంతే స్పీడుతో నిర్ణయాన్ని ప్రకటించే ఆ యంత్ర శక్తి ఏమిటి? అదే మెషిన్‌ లర్నింగ్‌. ఇవన్నీ మనుషుల కంటే కొన్ని కోట్లరెట్ల సామర్థ్యంతో పనిచేసే మర ప్రజ్ఞ మహా మాయలే. ఇది ఇప్పుడు కొత్త కొత్త కోర్సులకు, ఎన్నో రకాల ఉద్యోగాలకు కేంద్రంగా మారుతోంది.

మీ యాక్టివిటీస్‌ అన్నింటిపై మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. తరచూ ఎవరి ప్రొఫైల్స్‌ చూస్తున్నారు, మీ అభిరుచులు ఏమిటి, ఏయే గ్రూప్‌ల్లో ఎలాంటి కంటెంట్‌ పోస్ట్‌ చేస్తున్నారు... వీటన్నింటినీ కనిపెట్టి మీ ఆసక్తులకు తగిన ఫ్రెండ్స్‌ని మీకు సూచిస్తుంది.
కొన్ని ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో లైవ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కస్టమర్ల ప్రశ్నలకు టక టకా సమాధానాలు ఇచ్చేస్తుంటారు. ఆ జవాబులు ఇచ్చేది మనుషులు కాదు, చాట్‌బోట్‌.
అలాగే.. అడిగిన వెంటనే మన అవసరాలకు దాదాపు తగిన సమాచారాన్ని అందించే గూగుల్‌!
ఎప్పుడో ఒకసారి ఏమీ తోచక ఏదో వెబ్‌సైట్లో కావాల్సిన వస్తువు కోసం కాసేపు వెతికితే, దానికి సంబంధించి కొత్త సమాచారాన్ని తరచూ మెయిల్స్‌, మెసేజ్‌ల రూపంలో మోసుకొచ్చే టెక్నికల్‌ వ్యవస్థ!
ఇవన్నీ మెషిన్‌ లర్నింగ్‌ మాయలే.
మనుషుల ప్రమేయం లేకుండా ఒక కంప్యూటర్‌ ప్రోగామ్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని, సమస్యలకు సరైన సమాధానాలను కనిపెట్టగలిగే సామర్థ్యాన్ని సంతరించుకున్న సైన్స్‌ విజ్ఞాన విభాగాన్ని మెషిన్‌ లర్నింగ్‌ (మర ప్రజ్ఞ) అంటారు. నిర్ణయాలకు కావాల్సిన పూర్వపు డేటాను శోధించి, విశ్లేషించడానికి అవసరమైన శక్తిని ఈ ప్రోగ్రామ్‌లు కలిగి ఉండటం మెషిన్‌ లర్నింగ్‌ ప్రత్యేకత.
ఇలా కంప్యూటర్లు పనిచేయడానికి అవసరమైన అల్గారిథమ్‌ (క్రమసూత్ర పద్ధతి) రచన, నిర్మాణం, డెవలప్‌మెంట్‌లను చేయగలిగిన మెషిన్‌ లర్నింగ్‌ నిపుణుల అవసరం ఇప్పుడు వేగంగా పెరుగుతోంది.
ప్రతి దానికీ మనుషులు విడిగా ప్రోగ్రామ్‌లు రాసే అవసరం లేకుండా కంప్యూటర్లే స్వయంగా ప్రోగ్రామ్‌లను చేయడం మెషిన్‌ లర్నింగ్‌తో సాధ్యమవుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) రంగంలోని కంప్యుటేషనల్‌ లర్నింగ్‌ (గణన ప్రజ్ఞ), ప్యాటర్న్‌ రికగ్నిషన్‌ (రీతుల మాన్యత)ల మిశ్రమమే మెషిన్‌ లర్నింగ్‌ (మర ప్రజ్ఞ).
మర ప్రజ్ఞ రకాలు
మనకు కావాల్సిన ఫలితాల ఆధారంగా మెషిన్‌ లర్నింగ్‌ అల్గారిథమ్‌ను ప్రధానంగా మూడు రకాలుగా గుర్తించవచ్చు.
* సూపర్‌వైజ్‌డ్‌ లర్నింగ్‌ (పర్యవేక్షిత ప్రజ్ఞ)
* అన్‌-సూపర్‌వైజ్‌డ్‌ లర్నింగ్‌ (అపర్యవేక్షిత ప్రజ్ఞ)
* రీ-ఇన్‌ఫోర్స్‌డ్‌ లర్నింగ్‌ (ప్రబలిత ప్రజ్ఞ)
అంతరాలు తెలియాలి
మెషిన్‌ లర్నింగ్‌కి సంబంధించి ప్రధానంగా నాలుగు కొత్త పదాలు కనిపిస్తాయి. అవే డేటా సైన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డీప్‌ లర్నింగ్‌. ఒకే భావాన్ని వేర్వేరు పదాల్లో చెప్పినట్లు అనిపించినా వీటి మధ్య అంతరాలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా తెలుసుకోవాలి.
* డేటా సైన్స్‌లో ప్రధానంగా డేటా విశ్లేషణ ఉంటుంది. ఇందులో ఆర్‌ అనే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజిని ఉపయోగిస్తారు.
* మెషిన్‌ లర్నింగ్‌లో మనుషుల కన్నా కంప్యూటర్లు నడిపే ప్రోగ్రామ్‌లకు ప్రాధాన్యం ఉంటుంది.
* డీప్‌ లర్నింగ్‌ అంటే దృశ్య, శ్రవణ, పాఠ్య మాధ్యమాల్లోని డేటాను విశ్లేషించి, వర్గీకరణ చేసే మెషిన్‌ లర్నింగ్‌లోని ఉపరంగం. ఇది న్యూరల్‌ నెట్‌వర్క్‌ అర్కిటెక్చర్‌ మీద ఆధారపడి పనిచేస్తుంది.
* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌లతో కూడిన కుటుంబానికి పెద్దలాంటిది. ఇది కంప్యూటర్లను మనుషుల్లా వివేకంతో కూడుకున్నవిగా అభివృద్ధి చేసే వ్యవస్థ.
ఏయే రంగాల్లో వినియోగం?
మెషిన్‌ లర్నింగ్‌ టెక్నాలజీ అనువర్తన ఈ కింది రంగాల్లో రోజు రోజుకీ విస్తరిస్తోంది.
* ఇమేజ్‌ రికగ్నిషన్‌ - నలుపు, తెలుపు చిత్రాలు; రంగు చిత్రాల అక్షరాలను గుర్తించడం, ముఖాన్ని గుర్తించడం.
* స్పీచ్‌ రికగ్నిషన్‌ - మాటలు, ధ్వని గుర్తించడం.
* మెడికల్‌ డయాగ్నోస్టిక్స్‌ - వైద్యరంగంలో వ్యాధి లక్షణ పరిశీలన, రోగ నిర్ధారణ.
* ఫైనాన్షియల్‌ ఆర్బిట్రేజ్‌ - వ్యాపార రంగంలో వస్తు వినియోగ పద్ధతులు, అలవాట్లు, కొత్త ఆవిష్కరణలు, షేర్‌ మార్కెట్‌లలో పెట్టుబడి నిర్ణయాలు.
* క్లాసిఫికేషన్‌ - ఒకే రకమైన లక్షణాలు కలిగిన భిన్న సమూహాల వర్గీకరణ.
* బ్యాంకింగ్‌ వ్యవస్థ - రుణాల మంజూరీ నిర్ణయాలు, ఎగవేతదారుల ముందస్తు గుర్తింపు.
* ఇన్‌ఫర్మేషన్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ - నిర్మిత, అనిర్మిత డేటా నుంచి ఉపయోగమైన సమాచారం వెలికితీత.
* విద్యారంగం - విద్యార్థుల గ్రాహ్య, వినిమయ శక్తి, పద్ధతుల గుర్తింపు.
* సెర్చ్‌ఇంజిన్‌ - గూగుల్‌ లాంటి సెర్చ్‌ ఇంజిన్ల వివేచన సామర్థ్యాన్ని పెంచడం.
* డిజిటల్‌ మార్కెటింగ్‌- వినియోగదారుల అభిరుచిని బట్టి ఉత్పాదకతకు ప్రాముఖ్యాన్నివ్వడం, వ్యక్తిగత ఇష్టానిష్టాల గుర్తింపు.
* హెల్త్‌కేర్‌ - వైద్య ఆరోగ్య రంగం, ఆరోగ్య బీమా
శిక్షణ నిచ్చే సంస్థల్లో కొన్ని!
ప్రభుత్వ సంస్థలు
* ఐఐటీ, బాంబే నీ ఐఐటీ, మద్రాసు
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, దిల్లీ నీ ట్రిపుల్‌ ఐటీ, హైదరాబాద్‌ నీ ట్రిపుల్‌ ఐటీ, బెంగళూరు
ప్రైవేటులో..
* కెర్నెల్‌స్ఫియర్‌ టెక్నాలజీస్‌, హైదరాబాద్‌
* మెషిన్‌ లర్నింగ్‌ ల్యాబ్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌
* అనలిటిక్స్‌ పాత్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌
* డేటా సైన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ ట్రెయినింగ్‌, రామచంద్రాపురం, హైదరాబాద్‌
* ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌
* అనలిటిక్స్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌
* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ ట్రెయినింగ్‌, రామచంద్రాపురం, హైదరాబాద్‌
ఆన్‌లైన్‌లో..
* కోర్స్‌ఎరా (మూడు కోర్సులు) దీ ఉడాసిటీ (రెండు కోర్సులు) దీ ఎడెక్స్‌ లర్నింగ్‌ (రెండు కోర్సులు) దీ కార్నెజి మెల్లన్‌ యూనివర్సిటీ
* క్యాగ్‌ల్‌ దీ కొల్లబెర టాక్ట్‌ దీ జిగ్‌సా అకాడమీ దీ ఎడ్వన్సర్‌ ఎడ్యువెంచర్స్‌ (edvancer eduventures) ఐవీ ప్రొఫెషనల్‌ స్కూల్‌ దీ సింప్లీలర్న్‌ దీ మైక్రోసాఫ్ట్‌ ఎంసీఎస్‌ఏ ‘వి స్కిల్స్‌’ అనే ప్రభుత్వ సంస్థ ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ ఇస్తుంది.
అభ్యర్థులకు అవసరమైన మెలకువలు
మెషిన్‌ లర్నింగ్‌ నేర్చుకోవడానికి అవసరమైన మెలకువలు, నైపుణ్యాలను రెండు వర్గాలుగా నిర్వచించవచ్చు. ఇది ఒక వ్యవస్థకు అవసరమైన, ఉపయోగకరమైన, సమగ్రమైన సమాధానాన్ని అందించే టెక్నాలజీ. కాబట్టి దాన్ని ఎక్కడ వినియోగిస్తారో తెలుసుకోవాలి. ఈ డొమెయిన్‌ నాలెడ్జ్‌ని మొదటి వర్గంగా పేర్కొంటారు. రెండో దాంట్లో సాంకేతిక నైపుణ్యాలు ఉంటాయి.
* కంప్యూటర్‌ సైన్స్‌ మౌలికాంశాలపై, ప్రధానంగా ప్రోగ్రామింగ్‌లో మంచి ప్రవేశం ఉండాలి. కంప్యూటర్‌ నిర్మాణానికి సంబంధించిన హార్డ్‌వేర్‌పై సరైన అవగాహన ఒక స్థాయి వరకు అవసరమవుతుంది.
* గణిత శాస్త్రంలోని సమితులు, ప్రమేయాలు, సంభావ్యత, గణాంక శాస్త్రం, క్రమసూత్రాల సంక్లిష్టతలు (సెట్స్‌, ఫంక్షన్స్‌, రిలేషన్స్‌, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌, అల్గారిథమ్‌ కాంప్లెక్సిటీ) తదితర పాఠ్యాంశాల్లో పట్టు ఉండాలి.
* డేటా మోడలింగ్‌, మూల్యాంకనాలను నేర్చుకోవాలి.
* మెషిన్‌ లర్నింగ్‌ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన అపాచె సింగ, షోగన్‌, అపాచె మహూత్‌, అపాచె స్పార్క్‌ ఎంఎల్‌లిబ్‌, టెన్సర్‌ప్లో, ఓరిక్స్‌-2, అకార్డ్‌.నెట్‌, అమెజాన్‌ మెషిన్‌ లర్నింగ్‌, ప్రిడిక్షన్‌ఐఓ, ఎక్లిప్స్‌ డీప్‌ లర్నింగ్‌ వంటి టూల్స్‌, ఫ్రేమ్‌వర్క్‌ల్లో ఒకటి కన్నా ఎక్కువ వాటితో పరిచయం ఉండాలి (కోచింగ్‌ సెంటర్లు వీటిలో కొన్నింటికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది).
* చివరగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌లలో కొంతమేరకు నైపుణ్యం అవసరం.
పెరుగుతున్న ఉద్యోగాలు
* ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్‌ అంచనాల ప్రకారం మెషిన్‌ లర్నింగ్‌ రంగంలో పేటెంట్ల సంఖ్య 2018లో దాదాపు 34% పెరిగింది.
* మరో అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ అంచనాల ప్రకారం 2021 నాటికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో పెట్టుబడులు 57 బిలియన్‌ డాలర్ల పైగానే ఉంటుంది.
* అంతర్జాతీయ సంస్థ డెలాయిట్‌ అంచనాల ప్రకారం ఈ రంగంలో ప్రాజెక్టులు 2020 నాటికి నాలుగు రెట్లు పెరుగుతాయి.
* కెల్లిఓసీజీ ఇండియా అంచనాల ప్రకారం మనదేశంలో 2018 నాటికి మెషిన్‌ లర్నింగ్‌లో ఉద్యోగావశాకాలు 60% వరకు పెరిగే అవకాశాలున్నాయి.
* మొదట రూ. రెండు నుంచి రూ. నాలుగు లక్షల వరకు వార్షిక ఆదాయం లభిస్తుంది. తర్వాత అనుభవం, నైపుణ్యాలను బట్టి పారితోషికం క్రమంగా పెరుగుతుంది.

నీల‌మేఘ‌శ్యామ్ దేశాయ్‌, Career Dev.cell, ACE ఇంజినీరింగ్ క‌ళాశాల


Posted on 14-03-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning