ఐ.ఐ.ఎం. విద్యార్థులు అదరగొట్టారు

* ఒకొక్కరికీ కనీసం లక్ష వేతనం
* తొలిబ్యాచ్‌లోని 60 మందికీ అవకాశాలు

విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో 2015లో ఏర్పాటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐ.ఐ.ఎం.) మూడేళ్లలోనే విశేషమైన ప్రగతి సాధించింది. తాజాగా కోర్సు పూర్తి చేసుకున్న 60 మంది విద్యార్థులు ఒక్కొక్కరూ సగటున నెలకు కనీసం రూ.లక్ష వేతనానికి కొలువుల్లో కుదిరారు. దేశవ్యాప్తంగా 42 ప్రముఖ సంస్థలు ఇక్కడికొచ్చి ప్రాంగణ నియామకాల ద్వారా వారిని ఎంపిక చేసుకున్నాయి.
ఐ.ఐ.ఎం. నిర్వహణ బాధ్యతను ఐ.ఐ.ఎం. బెంగళూరు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అక్కడి ఆచార్యులు తరచూ విశాఖ వచ్చి బోధన చేసేవారు. బెంగళూరు ఐ.ఐ.ఎం.లో సీటు రాకపోయినా విశాఖలో వస్తే చాలన్న అభిప్రాయం విద్యార్థుల్లో బలపడింది. అందుబాటులో ఉన్న నైపుణ్యాన్ని ఔపోసనపట్టి రాటుదేలారు. కొత్తగా ఏర్పాటైనా.. అంతర్జాతీయస్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. ఇక్కడ చేరిన వారిలో అత్యధికులు బీటెక్‌ పట్టభద్రులే. వారు టెక్రోక్రాట్లుగా మారేలా, సొంత పరిశ్రమలు కూడా స్థాపించుకునే నైపుణ్యాన్ని సమకూర్చుకున్నారు. హెచ్‌.ఎస్‌.బి.సి, హెచ్‌.డి.ఎఫ్‌.సి., ఐ.సి.ఐ.సి.ఐ., కె.పి.ఎం.జి., బోష్‌, ముసిగ్మా.. విద్యార్థులను నియమించుకున్న సంస్థల్లో కొన్ని.
ప్రభుత్వానికి సేవలందించేందుకు కూడా ఆసక్తి.....:
వివిధ శాఖల్లో ఆధునిక సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిపుణుల సలహాలను, సేవలను తీసుకుంటోంది. ఐ.ఐ.ఎం.ల నుంచి నిష్ణాతులైన కొందిమందిని ఎంపిక చేసి ఆయా శాఖల కన్సల్టెంట్లుగా నియమిస్తోంది. గతేడాది పది మందిని ఇలా నియమించుకోగా ఈ సంవత్సరం కూడా కొంతమందికి అవకాశం ఇచ్చింది. ఈ తరహా సేవలందించేందుకు చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఇతర రాష్ట్ర విద్యార్థులు కూడా కన్సల్టెంట్లుగా అవకాశం దక్కించుకున్నారు. ప్రభుత్వం వారికి తొలుత ఫెలోషిప్‌ అందించి అనంతరం ప్రభుత్వానికి సేవలందించేలా కన్సెల్టెంట్లుగా నియమించనుంది.
అరుదైన అవకాశం... - అమిత్‌, చంద్రాపూర్‌
మాకు ప్రముఖ బహుళజాతి సంస్థల్లో అత్యుత్తమస్థాయి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం రావడం మాత్రం అరుదైన విషయమే. ప్రభుత్వసేవల్లో నాణ్యత పెంపొందించడానికి వీలుగా మా సేవలు వినియోగించుకోవాలని భావించడం సుపరిపాలనకు దోహదపడుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కన్సల్టెన్సీ సేవలు అందించే అవకాశం దక్కించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చా. ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమందిలో స్థానం సంపాదించా.
ఉజ్వల భవిష్యత్తు ఉంది.... - గౌరవ్‌, ఉత్తర ప్రదేశ్‌
అత్యంత సుందర, పర్యాటక ప్రాధాన్యం ఉన్న విశాఖ నగరంలో ఉన్న ఐ.ఐ.ఎం.కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. చాలామంది విశాఖ ఐ.ఐ.ఎం.లో చదవాలని కోరుకుంటున్నారు. నేను బీటెక్‌ చేసిన తరువాత శాంసంగ్‌లో నాలుగేళ్లపాటు లీడ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించి విశాఖ ఐ.ఐ.ఎం.ను ఎంచుకుని ఇక్కడ చదువుకున్నా. చండీగడ్‌లోని క్లిక్‌ల్యాబ్స్‌తో తాజా ప్రాంగణ నియమకాల్లో అవకాశం దక్కించుకున్నా. బెంగళూరు ఐ.ఐ.ఎం. మెంటార్‌షిప్‌ ఉండడం విశాఖ ఐ.ఐ.ఎం.కు నిజంగా ఒక వరం అని చెప్పొచ్చు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో బోధన.... -రంజన్‌పాల్‌, మేనేజర్‌, సి.డి.ఎస్‌.విభాగం, ఐ.ఐ.ఎం., విశాఖపట్నం
విశాఖ ఐ.ఐ.ఎం.లో అత్యాధునిక పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నాం. కొత్త ఐ.ఐ.ఎం. కావడంతో మౌలిక సదుపాయాలన్నీ ఆధునికస్థాయిలో సమకూరాయి. సహజంగానే మంచి ప్రతిభావంతులు ఇక్కడికొస్తుంటారు. ఐ.ఐ.ఎం. ఆచార్యుల పర్యవేక్షణలో తమతమ తెలివితేటల్ని మరింత పరిపుష్ఠం చేసుకుంటున్నారు. తాజాగా ప్రాంగణ నియమాకాల కోసం వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులు విద్యార్థుల ప్రతిభ చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ నెలకు రూ. లక్ష చొప్పున 60 మంది మంచి హోదాల్లో నియామకాలు పొందారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు మరింత డిమాండు, మరిన్ని మంచి అవకాశాలు సాధిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
రాష్ట్రప్రభుత్వ నిర్ణయం బాగా నచ్చింది - రాహుల్‌, విశాఖపట్నం
రాష్ట్రప్రభుత్వం కొన్ని శాఖలకు కన్సల్టెన్సీ సేవలందించేందుకు ఐ.ఐ.ఎం. విద్యార్థులకు అవకాశం కల్పించడం నాకు బాగా నచ్చింది. ప్రజలకు వివిధ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్రప్రభ్వుత్వం కల్పించిన అవకాశాన్ని దక్కించుకున్నా. ప్రభుత్వశాఖల పనితీరుపై అవగాహన ఉండడం భవిష్యత్తులో మాకు ఉపయోగకరంగా ఉంటుంది.

Posted on 15-03-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning