సాధన మంత్రం... ఎదిగే తంత్రం

* నేర్చుకుంటే..మార్చుకోవచ్చు

* యువ ఉద్యోగులకు అదే కీలకం

న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌ : ఉద్యోగం రాగానే తొలుత భయం.. అనుభవం రాగానే కాస్త అహం.. ఒక్కో మెట్టు ఎక్కే కొద్ది 'అన్నీ నాకు తెలుసులే.. నేను చెప్పేది చేయండి..' అంటూ చెప్పుకొచ్చే 'బాస్‌'తత్వ నియంతృత్వం.. ఇవన్నీ సాధారణంగా చాలా మందిలో కనిపించే స్వభావ లక్షణాలు. ఆధునిక సాంకేతికతతో... ఒకప్పుడు శారీరక శ్రమతో చేసే అనేక పనులు నేడు యంత్రాల సాయంతో సులువుగా చేసే స్థాయికి ఎదిగినా.. మనిషి ఎదిగే తంత్రం మారడం లేదు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరేకొద్దీ ఒదిగి ఉండటమే కాదు.. అసలు ఎదగడానికి సాధన ఎంతో ముఖ్యమంటున్నారు పలువురు వ్యాపార నిపుణులు. ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండటం అవసరమని సూచిస్తున్నారు.
ప్రముఖులైనా... నిత్య విద్యార్థులే...
ఐసీఐసీఐ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కె.వి.కామత్‌నే చూడండి.. ఆయనో నిత్య విద్యార్థి. కచ్చితంగా రెండు వారాల పాటు వివిధ సదస్సులకు హాజరవుతుంటారు. అక్కడ ప్రతి ఒక్కరూ చెప్పే విషయాలను ఆసక్తిగా వింటారు. తనకు తెలియని వాటిని తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. సందేహాలు వస్తే పక్కవారిని అడిగి మరీ నివృత్తి చేసుకుంటారు. ఒక్క కామత్‌ మాత్రమే కాదు.. చాలామంది వ్యాపార దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, రతన్‌టాటా, బిల్‌గేట్స్‌, స్టీవ్‌జాబ్స్‌ ఇలాంటి పద్ధతుల్నే అనుసరిస్తుంటారు. ఆ తీరు వారిని వ్యాపార ఉన్నతిలోనే కాదు.. ఆలోచనల పరిణతిలోనూ అందలంపై నిలబెడుతోంది.
ఉన్నతికి ఇదే సూత్రం... ఏరంగంలో పని చేస్తున్న వారైనా ఇవే పద్ధతుల్ని అవలంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నేటి యువ ఉద్యోగులు. ఇప్పుడు బ్యాంకింగ్‌ రంగంతోపాటు ప్రభుత్వపరంగానూ ఎన్నో ఉద్యోగాలకు విస్తృతంగా నియామకాలు జరుగుతున్నాయి. వీటి కోసం పోటీ పడే వారంతా ఓర్పు, నేర్పుతోనే గాకుండా... నిత్యం నేర్చుకోవాలనే తనపతో ఉంటే విజయాలను సొంతం చేసుకోవచ్చని పలువురు చెబుతున్నారు. అదే ఒరవడిని తర్వాతా కొనసాగిస్తే ఉద్యోగ జీవితంలోనూ మరింత ఉన్నతంగా ఎదగవచ్చంటున్నారు.
ప్రతీది ఒక కొత్త పాఠం... క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ను చూడండి. మొదట్లో విఫలమైనా... తర్వాత క్రికెట్‌ దేవుడిగా మారాడు. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌.. ఇలా చాలా మందిని సెల్యులాయిడ్‌ తెరపై తొలుత పనికిరారన్నారు. కానీ వారే వెండితెరపై వెలుగులీనుతున్నారు. మొదట అపజయం ఎదురవచ్చు. అందుకు నిరాశపడిపోకుండా... జీవితంలో ప్రతి వైఫల్యాన్ని, అపజయాన్ని ఒక పాఠంగా తీసుకున్నప్పుడు విజయమార్గం సొంతం అవుతుంది. అందుకే.. ఉద్యోగ జీవితంలో ప్రతి అంశం ఒక కొత్తపాఠమే. ఎదురయ్యే సవాళ్లను స్వీకరించేందుకు భయపడకూడదు. ఇందుకోసం అవసరమైన విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఎలాంటి నైపుణ్యాలతో ముందుకెళ్లాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. తోటి ఉద్యోగులతో వారానికి ఒకసారి కూర్చొని మాట్లాడాలి. 'ఉపాయాల గది'ని ఏర్పాటు చేసుకోవాలి. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ చెప్పే విషయాలను కచ్చితంగా వినాలి. మన అభిప్రాయాలను తెలియజేయడమే కాకుండా ఎదుటి వారి అభిప్రాయాలనూ గౌరవించాలి. బాసిజాన్ని పక్కకు పెట్టడమే కాకుండా ఎక్కువ, తక్కువ అనే ఆలోచనలను దరి చేరనివ్వవద్దు. అనుభవాన్ని ఆపాదించుకొని అందుకనుగుణంగా మన ఆలోచనల తీరును మార్చుకోవాలి.
పుస్తకాలు నేస్తాలు... చాలా మంది వృత్తిపరమైన ఒత్తిళ్లలో పడి అవసరమైన వాటిని దూరం పెడుతుంటారు. ఉద్యోగుల జీవితాలను వారు నడిచే మార్గాలను పుస్తకాలూ చాలావరకు ప్రభావితం చేస్తాయి. ఇతరులే కాదు.. ఉద్యోగులూ మంచి పుస్తకాల వేటలో ఉండాలి. అప్పుడే వాటిలోని అంశాల్లో మనకు అవసరమైన వాటిని తీసుకొనే వీలుంటుంది. ఇక బృంద చర్చలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక అంశంపై ఇతరులతో అభిప్రాయాల్ని, ఆలోచనల్ని పంచుకోవటం ముఖ్యమంటున్నారు మానవ వనరుల అభివృద్ధి అధికారి రాజ్‌కమల్‌ వెంపటి. వీటికితోడు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావటం ద్వారా... మనోల్లాసంతోపాటు సూక్షస్థాయి అంశాలను తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ప్రధానంగా వీటికంటే ముందుగా నేర్చుకోవాలనే ఆసక్తి కచ్చితంగా వారిలో ఉండాలని సూచిస్తున్నారు.
నలుగురితో కలిసినప్పుడే..
-భార్గవ్‌ దాస్‌గుప్తా, సీఈవో, ఐసీఐసీఐ లాంబార్డ్‌
వర్క్‌.. నాలుగక్షరాల ఈ పదం ఎంతో బలమైనది. పరిజ్ఞానం (నాలెడ్జ్‌), అపజయాలను ఎదుర్కొనే తత్వం(రెజిలెన్స్‌), స్వయంవృద్ధి(ఓనర్‌షిప్‌), పని(వర్క్‌) ... ఈ నాలుగు పదాలు ఉద్యోగ జీవితంలో చాలా విలువైనవి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ పక్కవారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. తోటి ఉద్యోగులే కాదు.. మన సేవలను పొందే వారూ ఏం కోరుకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం అవసరం. అంతేకాదు.. ఇందుకోసం ముందుగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం ముఖ్యం. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది.
మనమే తెలుసుకోవాలి...
-రాజ్‌కమల్‌ వెంపటి, మానవ వనరుల అభివృద్ధి నిపుణురాలు
చదువుకొనే రోజుల్లో తల్లిదండ్రులు...పాఠశాలలో ఉపాధ్యాయులు ఎన్నో విషయాలు చెబుతారు. మరి పెద్దయ్యాక, ఉద్యోగం వచ్చాక..! మనమే తెలుసుకోవాలి. ఉద్యోగ బాధ్యతల్లోనూ ప్రతి పాఠం ఎంతో ముఖ్యం. ప్రతి విషయాన్ని నేర్చుకొనేందుకు ఆసక్తి చూపాలి. స్వయంగా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. అవసరాన్ని బట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇందుకోసం నలుగురితో సంప్రదించాలి. పరిశీలనా పరిజ్ఞానాన్నీ పెంచుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకోవడం నిలిపివేస్తామో అప్పుడు మన అభివృద్ధి సైతం నిలిచిపోతుంది. నిరంతరం నేర్చుకొనే విధానామే మనల్ని కొత్తగా ఆవిష్కరిస్తుంది.


 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning