సెమిస్టర్‌ పరీక్షల్లో సక్సెస్‌ సూత్రం!

ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి నాలుగో ఏడాది అభ్యర్థుల వరకూ అందరికీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు త్వరలో జరగబోతున్నాయి. ఏం చదవాలి, ఎలా చదవాలి, ప్రిపరేషన్‌లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పరీక్షల్లో ఎంత రాయాలి.. తదితర విషయాలపై సరైన అవగాహన ఉంటే కష్టానికి తగిన ఫలితంగా మంచి మార్కులు పొందే వీలుంటుంది. ఇందుకోసం అర్థవంతంగా చదవడానికి, ఆశించిన మార్కులు సాధించడానికి ఉపయోగపడే సూచనలను నిపుణులు అందిస్తున్నారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఏడాదంతా పరీక్షలు రాస్తున్నట్లే కనిపిస్తుంది. ఒక సెమిస్టర్‌ కాగానే రెండో సెమిస్టర్‌ సిద్ధమైపోతుంది. నాలుగేళ్లూ ఇలా గడిచిపోతాయి. థియరీ సబ్జెక్టులకు గరిష్ఠంగా 100 మార్కులు. అందులో 25 మార్కులకు అంతర్గత పరీక్షలను కాలేజీలు, మిగిలిన 75 మార్కులకు సెమిస్టర్‌ పరీక్షలను విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తాయి. పరీక్షలకు తయారవడం ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్నదే. అయినా చిత్తశుద్ధితో కొన్ని మెలకువలను పాటిస్తే పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు.
నాణ్యమైన నోట్స్‌ తొలిమెట్టు
సిలబస్‌ ఇంకా పూర్తికాలేదని నోట్స్‌ తయారీని నిర్లక్ష్యం చేస్తే బ్యాక్‌లాగ్స్‌ బారిన పడతారు. అధ్యాపకులు చెప్పిన పాఠాలకు జతగా అవసరమైన విషయసేకరణ చేసి నోట్స్‌ సమగ్రంగా సిద్ధం చేసుకోవాలి. సమయం తక్కువగా ఉన్నప్పుడు తరగతిలోని పాఠాల వేగాన్ని అందుకోవాలంటే ఇంటి దగ్గర రోజువారీ పద్ధతిలో చదవాలి. దాని వల్ల వెంట వెంటనే వచ్చే ఇంటర్నల్‌, ప్రాక్టికల్‌, సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధంగా ఉండవచ్చు. క్లాస్‌ నోట్స్‌ కఠినంగా అనిపిస్తే అర్థమయ్యే సులువైన పదాలతో తిరగరాసుకోవాలి. కష్టమైన, అర్థంకాని పదాలతో ఉన్న నోట్స్‌ను బట్టీ పట్టడం మంచిది కాదు. కాలేజీకి వెళ్లని రోజుల్లో జరిగిన పాఠాలకు నోట్స్‌ను ప్రత్యేక శ్రద్ధతో రాసుకోవాలి.
ప్రతి సబ్జెక్టుకీ కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. సమాధానాల్లో వాటిని తప్పకుండా వినియోగించాలి. అందరూ తప్పనిసరిగా చదివే ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, హ్యూమన్‌ వాల్యూస్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ వంటి సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సంపాదించాలంటే సరైన పదాల వాడుక అవసరం.
విద్యార్థులు తమ నోట్స్‌లను అధ్యాపకులకు ఇచ్చి పరిశీలించమని కోరాలి. అనుభవజ్ఞులైన లెక్చరర్ల దృష్టి నోట్స్‌ మీద పడితే దాని నాణ్యత పెరుగుతుంది. లోపాల సవరణ జరుగుతుంది. ఇంజినీరింగ్‌లోని అనువర్తన అంశాలకు ఇది తగిన విధానం.
సబ్జెక్టు బాగా అర్థం కావాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు చదవాలి. నోట్స్‌ చదివేటప్పుడు పాఠ్యపుస్తకం దగ్గరే ఉండాలి. పాఠ్యపుస్తకాన్ని పరిశీలించాలి. అవసరమైన పాయింట్లు రాసుకోవాలి. సిలబస్‌ ప్రకారం నోట్స్‌ను సమీక్ష చేయాలి. ఇంజినీరింగ్‌లో ఇది చాలా ప్రధానం.
గత ప్రశ్నపత్రాల విశ్లేషణ
పరీక్షలకు కేవలం పాఠాలు చదివితే సరిపోదు. గతంలో జరిగిన మూడు లేదా అయిదు సంవత్సరాల పరీక్షల ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి. అధ్యాయాలవారీగా ప్రశ్నల సరళిని పరిశీలించాలి. దీని వల్ల ఏయే అధ్యాయాలపై దృష్టి పెట్టాలో తెలుస్తుంది. ఆ ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేసుకొని అధ్యాపకుల అభిప్రాయాన్ని తీసుకోవాలి. పరీక్షల నాటికి మొత్తం సిలబస్‌పై సంతృప్తికర స్థాయిలో తయారవ్వాలి. రోజువారీ రివిజన్‌ చేయాలి.
ఏ ప్రశ్నకు ఎంత సమాధానం?
సాధారణంగా కొన్ని ప్రశ్నలను రెండు లేదా మూడు మార్కులకు, మరికొన్నింటిని అయిదు లేదా పది మార్కులకు ఇస్తారు. వీటి జవాబుల పరిధి పట్ల స్పష్టత ఉండాలి. నిర్వచనాలు, మౌలిక సూత్రాల వంటివి రెండు లేదా మూడు మార్కులకు ఇస్తారు. మౌలికాంశాలపై వచ్చే ఈ ప్రశ్నలకు అయిదు లేదా ఆరు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. అవీ స్థూలంగా, స్పష్టంగా ఉండాలి. సమయం వృథా చేయకూడదు. వ్యాసరూప ప్రశ్నలకు సమగ్రమైన జవాబులు తయారు చేసుకోవాలి. ఇవి సాధారణంగా నిర్వచనాలు, సిద్ధాంత నిరూపణలు, అనువర్తనాలపై ఆధారపడిన లెక్కల (న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌)పై ఉంటాయి. వీటికీ సూటిగా చిన్న వాక్యాల్లో సమాధానాలు తయారు చేసుకోవాలి.
ఇంజినీరింగ్‌లో ఎందుకు ఎక్కువ ఫెయిల్‌?
ఇంటర్మీడియట్‌లో పాయింట్ల వారీగా జవాబులు రాయడానికి అలవాటు పడిన అభ్యర్థులు సెమిస్టర్‌ పద్ధతికి వెంటనే అలవాటు పడలేరు. పరీక్షలు వెంటనే వచ్చేసినట్లు ఉంటాయి. ప్రిపరేషన్‌కు సరిగా ప్లాన్‌ చేయరు. అనువర్తన కోణంలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో తడబడతారు. కొందరు పర్సంటేజీ పెంచుకుందాం అంటూ పరీక్షలను వాయిదా వేస్తారు. ఇంకొందరు ఇంజినీరింగ్‌ పరీక్ష విధానం పట్ల తగిన అవగాహన ఏర్పరచుకోరు. ఈ విధమైన లోపాల వల్ల సంప్రదాయం కోర్సులతో పోల్చినప్పుడు ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటోంది. వీటి పట్ల మొదటి నుంచి అప్రమత్తంగా ఉంటే బ్యాక్‌లాగ్‌లు లేకుండా మంచి మార్కులు సాధించుకోవచ్చు.సెమిస్టర్‌ గరిష్ఠంగా 750 మార్కులకు ఉంటే, అందులో ప్రాక్టికల్స్‌కి 150 లేదా 225 మార్కులు ఉంటాయి. సరిగా సిద్ధమైతే 20 నుంచి 30 శాతం మార్కులు వీటి నుంచే పొందవచ్చు.
పరీక్ష కేంద్రంలో...
* చివరి నిమిషం వరకు చదవద్దు. పరీక్ష రాసేటప్పుడు గుర్తురాదేమోననే అనవసర భయాలు వదిలేయాలి.
* పరీక్షా కేంద్రానికి పావుగంట ముందే చేరుకోవాలి. కాసేపైనా మౌనంగా ఉండటం మంచిది.
* పరీక్షకు చదువుతున్న స్నేహితులకు అంతరాయం కలిగించవద్దు. వాళ్లు సందేహాలు తీర్చమని కోరితే క్లుప్తంగా ముగించాలి.
* కేటాయించిన సీటుకు పది నిమిషాల ముందే చేరాలి. ప్రశాంతంగా ఉండాలి.
* పెన్ను, పెన్సిల్‌, క్యాలిక్యులేటర్‌ వంటి వాటిని ముందే సిద్ధం చేసుకోవాలి. ఇతరులను అడగడం, వారికి ఇవ్వడం సరైనది కాదు.
* ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవాలి. సమాధానాలు తెలిసిన ప్రశ్నలను గుర్తించాలి. బాగా వచ్చిన ప్రశ్నలకు ముందు జవాబులు రాయాలి. తర్వాత మిగిలిన వాటని రాయాలి.
* వీలైనంత వరకు ఒక విభాగంలోని ప్రశ్నలకు ఒకే క్రమంలో జవాబులు రాయాలి.
* అవసరమైన చోట స్పష్టత కోసం బొమ్మలు వేయాలి.
* సమయం మిగుల్చుకొని అదనపు ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.
* చివరి పావుగంటలో అన్ని జవాబులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
* పరీక్ష ముగిసిన తర్వాత అనవసర చర్చలు చేయవద్దు. ఒకవేళ తప్పులు దొర్లినట్లనిపించినా ఆందోళన పడాల్సిన పనిలేదు.
ఇవీ జాగ్రత్తలు!
* పరీక్షల సమయంలో నిద్ర, తిండి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.
* సాత్వికమైన, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
* సినిమాలు, షికార్లు, మొబైల్‌ ఫోన్లు, అనవసర ముచ్చట్లు, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.
* పరీక్ష కేంద్రాలకు మొబైల్‌ తీసుకెళ్లకపోవడం మంచిది.
సమయం సద్వినియోగం
ప్రతి వ్యాసరూప ప్రశ్నకు గరిష్ఠంగా 25 నుంచి 30 నిమిషాల సమయం ఉంటుంది. కానీ అంతకంటే తక్కువ సమయంలోనే జవాబు రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. చివరి నిమిషం వరకూ రాయకూడదు. కొంత సమయాన్ని మిగుల్చుకొని అన్నీ చెక్‌ చేసుకోవాలి.
పరీక్షల్లో విజయం కోసం సమయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆచరణయోగ్యమైన టైంటేబుల్‌ తయారు చేసుకోవాలి. రోజూ కనీసం రెండు సబ్జెక్టులు చదవడానికి ప్రణాళిక వేసుకోవాలి. దీని వల్ల ప్రతి సబ్జెక్టునీ వారంలో రెండుసార్లు చదవచ్చు. పునశ్చరణా జరుగుతుంది. ఇదే సమయంలో అసైన్‌మెంట్లు, రికార్డులు రాసే పని కూడా ఉంటుంది. వీటికి సమాయాన్ని అదనంగా కేటాయించాలి. కాలేజీలో విరామ సమయాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

నీల‌మేఘ‌శ్యామ్ దేశాయ్‌, Career development cell, ACE ఇంజినీరింగ్ క‌ళాశాల‌


Posted on 22-03-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning