నైపుణ్యాల ప్రత్యేక శిక్షణకు ఎంఎస్‌ఐటీ!

ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఏ బ్రాంచి విద్యార్థులైనా ఐటీ రంగంలో రాణించాలనుకుంటే చేయదగ్గ పీజీ కోర్సు... మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఐటీ (ఎంఎస్‌ఐటీ). పరిశ్రమ కోరుకునే నైపుణ్యాల శిక్షణను కోర్సులోనే భాగం చేయటం దీని విశిష్టత. ఆచరణాత్మక బోధనకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చే ఈ ఎంఎస్‌ఐటీ ప్రకటన ఇటీవలే వెలువడింది. దీని ప్రాముఖ్యం, ఇతర విశేషాలూ తెలుసుకుందామా?

ఐదు విశ్వవిద్యాలయాలు స్థాపించిన కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ (సీఐహెచ్‌ఎల్‌) ఎంఎస్‌ఐటీని అందిస్తోంది. మల్టీ యూనివర్సిటీ, ఇంటర్‌ డిసిప్లినరీ పీజీ ప్రోగ్రాం ఇది. దీనికి అమెరికాలోని కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీతో ఎంఓయూ ఉంది. ఈ కోర్సు రెండో సంవత్సరంలో విద్యార్థులు ఒక స్పెషలైజేషన్‌ను తీసుకుంటారు. ఐటీ నైపుణ్యాలతో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌నూ, కార్పొరేట్‌ జీవితంలో రాణించటానికి అవసరమైన లైఫ్‌ స్కిల్స్‌నూ నేర్పుతారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు చోట్ల ఈ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లోని ఐఐఐటీ (110 సీట్లు), జేఎన్‌టీయూహెచ్‌ (100 సీట్లు); జేఎన్‌టీయూ కాకినాడ (50 సీట్లు), జేఎన్‌టీయూ అనంతపురం (50 సీట్లు), తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (50 సీట్లు) లలో ప్రవేశాలుంటాయి.
ప్రవేశం ఎలా?
ఈ కోర్సులో అడ్మిషన్లను ప్రవేశపరీక్ష (జీఏటీ/ జీఆర్‌ఈ)లో వచ్చిన ర్యాంకు ఆధారంగా నిర్ణయిస్తారు. ఎంఎస్‌ఐటీ కౌన్సెలింగ్‌ 2018లో ర్యాంకు క్రమం ప్రకారం వివిధ కేంద్రాల్లో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
* జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏ, ఎస్‌వీయూలలో అడ్మిషన్లు పొందినవారికి 4 వారాల ప్రిపరేటరీ ప్రోగ్రాంలో శిక్షణ నిర్వహించి, విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత ఎంఎస్‌ఐటీ మెయిన్‌ ప్రోగ్రాంలోకి ప్రవేశపెడతారు.
* ఐఐఐటీ హెచ్‌, జేఎన్‌టీయూహెచ్‌లలో అడ్మిషన్లు పొందినవారికి ఈ కోర్సులోకి నేరుగా ప్రవేశం ఉంటుంది.

ప్రవేశపరీక్ష అయిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీఏటీ) రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాక్‌ ఇన్స్‌. రెండోది ప్రవేశపరీక్ష. అభ్యర్థులు రెండిట్లో ఏదో ఒకదానికి గానీ, రెంటికీ గానీ హాజరుకావొచ్చు.
వాక్‌ ఇన్స్‌: ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్‌ చేసుకుని అనుకూలమైన తేదీల్లో వాక్‌ ఇన్స్‌కు వెళ్ళవచ్చు.హైదరాబాద్‌, కాకినాడల్లో వాకిన్స్‌ జరుగుతాయి.
ప్రవేశపరీక్ష: దీన్ని హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురాల్లో నిర్వహిస్తారు. జులై 2015 తర్వాత జీఆర్‌ఈ రాసి 301/3.5 స్కోరు తెచ్చుకున్నవారికి ఈ జీఏటీ నుంచి మినహాయింపు ఇస్తారు.
‘నేర్పు’గా..
విద్యార్థులకు ఐటీ నైపుణ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పటం ఎంఎస్‌ఐటీ కరిక్యులమ్‌లో భాగం. వీటిని ప్రభావశీలంగా అభ్యసించేలా శ్రద్ధ తీసుకుంటారు.
ఐటీ స్కిల్స్‌
ఆచరణాత్మక పద్ధతిలో సాగే రెండేళ్ళ మాస్టర్‌ కోర్సు ఇది. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీల్లో కాన్సెప్టుల థిÅయరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌ శిక్షణను అందివ్వడం ఈ కోర్సు ప్రత్యేకత.
* విద్యార్థులు కోర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను (కంప్యుటేషనల్‌ థింకింగ్‌ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామింగ్‌, ప్రిన్సిపల్స్‌, అల్‌గారిదమ్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, కంప్యూటర్‌ సిస్టమ్స్‌, డేటా బేసెస్‌ వరకూ) మొదటి సెమిస్టర్లో అభ్యసిస్తారు. బీటెక్‌ నేపథ్యమున్న ఏ విద్యార్థి అయినా ఐటీ డొమెయిన్‌లో పటిష్ఠమైన పునాదిని మొదటి సెమిస్టర్లోనే పొందగలుగుతారు.
* రెండో సెమిస్టర్లో వెబ్‌ ప్రోగ్రామింగ్‌, కంప్యూటర్‌ నెట్‌ వర్క్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ లాంటి ఐటీ కోర్సులుంటాయి.
* సోషల్‌ కంప్యూటింగ్‌, మొబైల్‌ అప్లికేషన్‌ బిల్డింగ్‌, అనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, రోబాటిక్స్‌ లాంటి ఎమర్జింగ్‌ ఐటీ టెక్నాలజీలు రెండో సెమిస్టర్లో భాగం. సరికొత్త సాంకేతిక ధోరణులపై అవగాహనను ఇవి కలగజేస్తాయి. ఇది ఉద్యోగ సాధనలో మేలు చేస్తుంది.
* రెండో సంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టిన కాంపిటీటివ్‌ ప్రోగ్రామింగ్‌ కోర్సు విద్యార్థులను మెరుగైన ప్రోగ్రామర్‌గా చేస్తుంది.
* ఎంతో గిరాకీ ఉన్న మెషిన్‌ లర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌, డేటా విజువలైజేషన్‌, ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఫుల్‌ స్టాక్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ టెక్నాలజీస్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ మొదలైనవాటి నుంచి స్పెషలైజేషన్లను ఎంచుకోవటానికి వీలు కలుగుతుంది.
* రెండో సంవత్సరంలో విద్యార్థులకు ఆర్నెల్ల ప్రాక్టికమ్‌ పీరియడ్‌ ఉంటుంది. ఇంటర్న్స్‌గా కంపెనీలకు వెళ్ళి నేర్చుకుని విద్యార్థి దశ నుంచి ఐటీ వృత్తినిపుణులుగా పరివర్తన చెందేలా వీరికిది సాయపడుతుంది.
సాఫ్ట్‌ స్కిల్స్‌
నేటి ఐటీ పరిశ్రమకు అవసరమైనవి...నాయకత్వ సామర్థ్యాలూ, ఇంటర్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలూ. విద్యార్థులు వీటికి మెరుగులు దిద్దుకునేలా ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌ ఎంప్లాయబిలిటీ ట్రెయినింగ్‌ (ఐఓఈటీ) ఎంఎస్‌ఐటీలో లభిస్తుంది.
* సాఫ్ట్‌స్కిల్స్‌కు సంబంధించిన కీలక భావనల పరిజ్ఞానాన్ని ఈ-మాడ్యూల్స్‌ అందిస్తాయి.
* విద్యార్థుల్లో రాత, మౌఖిక నైపుణ్యాలను ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ మాడ్యూల్స్‌ ద్వారా పెంచటానికి ఈ కోర్సులో కృషిచేస్తారు. దీనిలో ప్రతిరోజూ లిసనింగ్‌ అసైన్‌మెంట్లు, స్పీకింగ్‌ యాక్టివిటీస్‌, రీడింగ్‌-రైటింగ్‌ అసైన్‌మెంట్లు ఉంటాయి. అసైన్‌మెంట్లను మెంటర్లు మూల్యాంకనం చేసి, వాటి తీరు గురించి విద్యార్థులకు అందజేస్తారు.
* ఆత్మవిశ్వాసంతో సమర్థమైన ప్రెజెంటేషన్లు ఇవ్వటం కార్పొరేట్‌ ప్రపంచానికి అవసరం. ప్రతివారం విద్యార్థులు తరగతి విద్యార్థుల ముందు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్లను మెంటర్‌ సమక్షంలో ఇవ్వాల్సివుంటుంది. ఇలా కోర్సు మొదటి సంవత్సరంలో ప్రతి విద్యార్థీ 48 ప్రెజెంటేషన్ల వరకూ ఇచ్చే అవకాశం ఉంటుంది. పోటీలో ఎంఎస్‌ఐటియన్లు ముందుండటానికి ఈ కసరత్తు పనికివస్తుంది.
* కార్పొరేట్‌ ఎటికెట్‌... అక్కడి మర్యాదలూ పద్ధతులపై వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు విస్తృత పరిజ్ఞానం అందించేలా ఇంటరాక్టివ్‌గా ఉండి కార్పొరేట్‌ సంస్కృతిపై విద్యార్థులకు అవగాహన పెంచుతాయి.
* ఎంప్లాయబిలిటీ నైపుణ్యాలు నేర్పటం కూడా ఎంఎస్‌ఐటీ కోర్సులో భాగమే. రెజ్యూమేలు తయారు చేయటం దగ్గర్నుంచి మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరవటం వరకూ విద్యార్థులను సన్నద్ధం చేస్తారు. వీటిమూలంగా ఇంటర్వ్యూ చేసేవారు ఏం ఆశిస్తారో తెలియటం, ధైర్యంగా ముఖాముఖిలకు హాజరై విజయవంతంగా ఉద్యోగాలకు ఎంపికవటం సాధ్యమవుతాయి.
* నిర్దిష్టంగా శ్రద్ధగా విద్యార్థులు శిక్షణ పొందేలా మెంటర్లు సహకరిస్తారు. నలుగురి నుంచి ఏడుగురు విద్యార్థులకు ఒక మెంటర్‌ను కేటాయిస్తారు. ఈ క్లస్టర్డ్‌ మెంటరింగ్‌ సెషన్లలో మెంటర్లు విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తారు.
ముఖ్యమైన తేదీలు
* వాక్‌ ఇన్‌ ఎంట్రన్స్‌: మార్చి 15 నుంచి మే 19, 2018
* దరఖాస్తుల సమర్పణకు ఆఖరితేదీ: మే 14, 2018
* జీఏటీ ప్రవేశపరీక్ష: మే 27, 2018 నుంచి
* కౌన్సెలింగ్‌ మొదలు: జూన్‌ 11, 2018
* వెబ్‌సైట్‌: ‌www.msitprogram.net
* ప్రోగ్రామ్‌ వివరాలకు: సీఐహెచ్‌ఎల్‌, ఐఐఐటీ క్యాంపస్‌, గచ్చిబౌలి, హైదరాబాద్‌-500032, తెలంగాణ రాష్ట్రం
* ఫోన్‌: 040-23001970, మొబైల్‌: 7799834583
* ఈ- మెయిల్‌: enquiries@msitprogram.net
సాంకేతిక సామర్థ్యాలకు ఆస్కారం
‘లర్నింగ్‌ బై డూయింగ్‌’ అనే పద్ధతి ఎంఎస్‌ఐటీలో పదిహేడేళ్ల క్రితం ప్రవేశపెట్టినది. ఐటీ శిక్షణకు ఇది సరైన విధానమని దీనికిప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మారుతున్న ఐటీ పరిశ్రమ ధోరణులకు అనుగుణంగా ఈ కోర్సు కరిక్యులాన్ని ఆధునికీకరిస్తూ వస్తున్నాం. కీలకమైన కంప్యూటర్‌ సైన్స్‌ కాన్సెప్టులకు అదనంగా మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, రోబాటిక్స్‌ లాంటి సరికొత్తగా ఆవిర్భవించే సాంకేతిక సామర్థ్యాలను విద్యార్థులు నేర్చుకునేలా కోర్సు రూపకల్పన జరిగింది. దీనివల్ల గిరాకీ ఉన్న ఉద్యోగాలను పొందే వీలుంటుంది. దీంతోపాటు కంప్యుటేషనల్‌ థింకింగ్‌, అల్గారిదమ్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, కాంపిటీటివ్‌ ప్రోగ్రామింగ్‌ లాంటివాటితో ప్రత్యేకంగా విద్యార్థులకోసం రూపొందించిన కోర్సు ఇది.

- శ్రీనివాసరావు మేడా,డీన్‌, ఎంఎస్‌ఐటీ‌


Posted on 22-03-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning