ఉపాధికి బాటలేస్తున్న పైపులైన్ ఇంజినీరింగ్

* దక్షిణ భారత్‌లో జేఎన్‌టీయూకేలోనే ఈ కోర్సు
* 2014 నుంచి అందుబాటులోకి
* ఈ రంగ నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్

ఈనాడు, కాకినాడ: కేజీ బేసిన్‌లో చమురు, సహజ వాయు నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలు, రవాణా ఇటీవల కాలంలో పందుకున్నాయి. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో కేజీ బేసిన్‌లో ఉండే నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రంగంలో కార్యకలాపాలు పెరగడంతో ఉపాధి అవకాశాలు సైతం విస్తృతంగా పెరుగుతున్నాయి. పెట్రోలియం విభాగంలో అప్‌స్ట్రీమ్, మిడ్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ వైపు యువతకు ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడ జేఎన్‌టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయం 2014 నుంచి పెట్రోలియం విభాగాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోలియం, పెట్రో కెమికల్ ఇంజినీరింగ్‌లో పలు రకాల కోర్సులను అమలు చేస్తోంది. ఎంటెక్ విభాగంలో పైపులైను కోర్సును అందిస్తున్న విశ్వవిద్యాలయం దక్షిణ భారతదేశంలో ఇదొక్కటేనని ప్రొగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ కె.వి.రావు 'ఈనాడు'కు తెలిపారు. విద్యార్థులకు తక్కువ ఫీజులతో ఇక్కడ ఎంటెక్ పైపులైను కోర్సును పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. విశ్వవిద్యాలయం ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.11 వేలతో ఈ కోర్సు పూర్తి చేయవచ్చు. ఇదే కోర్సును డెహ్రాడూన్‌లోని యూపీఎస్(యునివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్) విశ్వవిద్యాలయంలో చేయాలంటే ఏడాదికి రూ.6.50 లక్షల ఫీజు చెల్లించాలి. రెండేళ్ల కోర్సుకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులు
జేఎన్‌టీయూ కాకినాడ పెట్రోలియం డిపార్ట్‌మెంట్ ప్రొగ్రామ్ డైరెక్టర్ కె.వి.రావు 'ఈనాడు'తో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్రోలియం కోర్సులను జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంలో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. పెట్రోలియం కోర్సులను అందించే ప్రము ఖ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. జేఎన్‌టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం నుంచి మలేషియాలో ఉన్న యూటీపీ(యూనివర్సిటీ టెక్నాలజీ పెట్రోనాస్) విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ఎంపిక అవుతున్నారన్నారు. యూటీపీ ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో పెట్రోలియం కోర్సులను అందిస్తోందన్నారు. విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్‌తో ఈ ఏడాది కూడా జయకృష్ణ సాయిత్ అనే విద్యార్థికి యూటీపీ విశ్వవిద్యాలయంలో అవకాశం వచ్చిందని కేవీరావు తెలిపారు.
ఇప్పటి వరకూ నాలుగు బ్యాచ్‌లు
ఎంటెక్‌లో పైపులైను ఇంజినీరింగ్‌కి సంబంధించి మిడ్‌స్ట్రీమ్ విభాగంలో ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లు బయటకు వచ్చాయని కేవీరావు తెలిపారు. చమురు, సహజ వాయువు తరలింపులో పైపులైను వ్యవస్థ అత్యంత ప్రాధాన్యం ఉండటంతో ఈ రంగంలో నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందని వివరించారు.

Posted on 02-04-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning