రాబోయే కొలువులకు కావాలి నిపుణులు!

సినిమాలో పడే వర్షంతో మనం తడిసినంత అనుభూతి అందితే బాగుంటుంది కదూ! కావాల్సిన వస్తువులను కావాల్సినప్పుడల్లా కంప్యూటర్‌ క్లిక్‌తో ఉత్పత్తి చేసుకునే ఊహ ఉత్సాహాన్ని కలిగిస్తోందా! జనంతో కిటకిటలాడే రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లోని విశ్రాంతి గదుల్లో ఎవరూ లేకపోయనా వెలిగే బల్బులు, ఫ్యాన్ల వివరాలను క్షణాల్లో సేకరించి వాటిని నియంత్రించే టెక్నాలజీ ఇంకా విస్తృతమైతే విద్యుత్తు ఎంత పొదుపు అవుతుంది? ఒక సెకనులో వంద హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్‌ అయితే ఎలా ఉంటుంది! ఇంకో అయిదు లేదా పది సంవత్సరాల్లో ఇవన్నీ సాధ్యమే అంటున్నారు నిపుణులు. అందుకే ఆయా టెక్నాలజీలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకుంటే రాబోయే ఉద్యోగావకాశాలను అందుకోవచ్చని సూచిస్తున్నారు.

రాబోయే కాలంలో మనిషి జీవన సరళిపై టెక్నాలజీల ప్రభావం అధికంగా ఉండబోతుంది. వేగంగా జరుగుతున్న సాంకేతిక ఆవిష్కరణలు సమాజానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడబోతున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఇన్ఫోసెక్‌, బిగ్‌ డేటా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఆటోమేషన్‌, రోబోటిక్స్‌, హెల్త్‌కేర్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీల గురించి ఈ మధ్య తరచూ వింటున్నాం. ఆ కోవలోనే మరికొన్ని కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వాటికి తగినట్లుగా ఇప్పటి తరం సన్నద్ధం కావాలి. ఆ ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోడానికి అవసరమైన శిక్షణలు, నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు, మెలకువలపై అవగాహన పెంచుకోవాలి.
ప్రముఖ అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ మెక్‌కెన్సీ తన నివేదికలో ఈ కొత్త టెక్నాలజీల సవాళ్లను ఎదుర్కోవాలంటే ఆయా రంగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకొని, సామర్థ్యాలను పెంచుకోవడం ఒక్కటే మార్గమని పేర్కొంది.
ఇమ్మర్సివ్‌ మీడియా
ఇప్పుడు వర్చువల్‌ రియాలిటీగా వ్యవహరిస్తున్న టెక్నాలజీకి కొనసాగింపుగా రేపటి రూపం ఇమ్మర్సివ్‌ మీడియా. అవాస్తవ వాతావరణంలో ఇంద్రియ, నాడీ వ్యవస్థలను నిజ ప్రపంచ అనుభూతులకు గురిచేసే టెక్నాలజీనే ఇది. శాస్త్ర-సాంకేతిక, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో దీని ఉపయోగం చాలా ఉంటుంది.
ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీలకు శిక్షణ ఇచ్చే సంస్థలన్నీ ఇమ్మర్సివ్‌ మీడియాలో ట్రెయినింగ్‌ ఇస్తాయి.
ఉద్యోగాలు:
* నోయిడా కేంద్రంగా ఉన్న గ్రేకెర్నెల్‌ (www.greykernel.com)
* ముంబయిలోని మిరాకీ (www.merakivr.com)
* నోయిడాలోని స్మార్ట్‌విజ్‌ (www.smartvizx.com)
* గుడ్‌గావ్‌లోని టెసెరాక్ట్‌ (www.tessaract.com)
* మొహాలీలోని ద ట్రాన్సెండ్‌ (www.thetranscend.xyz) వంటి సంస్థలు ఇమ్మర్సివ్‌ మీడియాకు సంబంధించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
ఎడ్జ్‌ టెక్నాలజీస్‌
వివిధ గాడ్జెట్లు సేకరించిన డేటాలో సున్నితమైన, ముఖ్యమైన డేటాను స్థానిక డేటా సేకరణ కేంద్రాలైన మైక్రో డేటా సెంటర్లలో పరిశీలించి క్లౌడ్‌లో భద్రపరిచే టెక్నాలజీ ఇది. ఐఓటీతో అనుసంధానం చేసి ఉపయుక్తమైన డేటాను మాత్రమే భద్రపరిచే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే సాంకేతిక పరిజ్ఞానమే ఎడ్జ్‌ టెక్నాలజీ. ఇది డేటా రద్దీని కూడా నియంత్రిస్తుంది. కనెక్టివిటీ సరిగా లేని పరిస్థితుల్లో, డేటా వేగం అధికంగా అవసరం ఉన్న సందర్భాల్లో ఎడ్జ్‌ కంప్యూటింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ రంగంలో అవకాశాలు అందుకోవాలంటే బీటెక్‌ స్థాయిలో వివిధ వ్యవస్థల పట్ల సమగ్ర అవగాహన పెంచుకోవాలి. హెచ్‌టీఎమ్‌ఎల్‌, సీఎస్‌ఎస్‌, జావా వంటి ప్రోగ్రామింగ్‌లతోపాటు జావా స్క్రిప్టింగ్‌, హెచ్‌టీటీపీ వంటి ప్రోటోకాల్స్‌ గురించి బాగా తెలిసి ఉండాలి. ఇది కూడా రాబోయే కాలంలో ఎన్నో కొత్త ఉద్యోగావకాశాలను కల్పించే రంగం.
వేగవంతమైన, స్థిరమైన ఇంటర్‌నెట్‌
ఇంటర్‌నెట్‌ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఒక కుటుంబంగా మారిపోయింది. దీని వినియోగం రోజురోజుకీ విస్తృతమవుతోంది. కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైల్‌ ఫోన్లు ఇంకా ఇతర గ్యాడ్జెట్‌లు ఇప్పటికే ఇంటర్‌నెట్‌కు అనుసంధానమయ్యాయి. ఐఓటీ వంటి టెక్నాలజీలు ఇంకా కొత్త పరికరాలను ఇంటర్‌నెట్‌ సేవలకు కలుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటర్‌నెట్‌ వేగం, నాణ్యత ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. వినియోగదారులు ఇంకా పెరిగితే మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి కొత్త టెక్నాలజీల అభివృద్ధి తప్పడం లేదు. అందులో భాగంగా వైర్‌లెస్‌ రౌటర్లు, ఎక్కువ ఎత్తులో పనిచేసే ఇంటర్‌నెట్‌ డ్రోన్ల వంటి పరికరాల నిర్మాణం జరుగుతోంది. వాటిలో ఈ కింది కొన్ని టెక్నాలజీలు ఉపయోగిస్తున్నారు.
లై-ఫై: ఎల్‌ఈడీ బల్బులకు ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ అమర్చి ఆప్టికల్‌ టెక్నాలజీ ఆధారంగా డేటా పంపడం. ఇది ప్రస్తుతం ఉన్న వై-ఫై కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వేగంతో డేటాను సరఫరా చేస్తుంది. సెకనుకు పది గిగా బిట్ల వేగాన్ని సాధించే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. లై-ఫై కాంతి ఆధారంగా పని చేస్తుంది. కాబట్టి గోడలను దాటి డేటా ప్రయాణించలేదు.
5-జీ: ఈ వైర్‌లెస్‌ టెక్నాలజీ టెక్ట్స్‌, మెయిల్‌, వీడియోలను అధిక వేగంతో డౌన్‌లోడ్‌ చేస్తుంది. నాణ్యమైన అధునాతన హెచ్‌డీ సినిమాలు, వీడియోలు కూడా చాలా వేగంగా డౌన్‌లోడ్‌ అవుతాయి.
లోరా టెక్నాలజీ: ప్రపంచవ్యాప్తంగా ఐఓటీ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి అనువైన టెక్నాలజీ ఇది. లోరా అంటే లాంగ్‌ రేంజ్‌కి సంక్షిప్త పదం. తక్కువ విద్యుత్తు వినియోగించి, ఎక్కువ దూరాల్లో ఉన్న వివిధ ఉపకరణాలను నెట్‌వర్క్‌ పరిధిలోకి తెచ్చి వేగంతోపాటు భద్రంగా సమాచారాన్ని చేరవేయడమే టెక్నాలజీ లక్ష్యం. ప్రస్తుతం ఉన్న సెల్యులార్‌ నెట్‌వర్క్‌ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సేవలు అందించడం దీనివల్ల సాధ్యమవుతుంది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని వీధి దీపాలు, కార్లు, గృహోపకరణాలు, పరిశ్రమలు, ఇంకా ఇతర గ్యాడ్జెట్లలో వాడుతున్నారు.
ప్రస్తుతం మనదేశంలో లోరా టెక్నాలజీ సేవలు అందుబాటులో లేవు. కానీ రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాల్లో వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తాయని అంచనా.
ఎస్తోనియా దేశానికి చెందిన వెల్మెన్ని (www.velmenni.com) అనే అంకుర సంస్థ మనదేశంలో దిల్లీ కేంద్రంగా హార్డ్‌వేర్‌, టెక్నాలజీ రంగాల్లో లై-ఫై ఉపయోగంపై పరిశోధనలు చేస్తోంది. సమీప భవిష్యత్తులో బహుళజాతి దిగ్గజాలైన సామ్‌సంగ్‌, ఫిలిప్స్‌, జీఈ, ఆల్కాటెల్‌ వంటి సంస్థలు ఈ రంగంలోకి పెద్ద ఎత్తున అడుగు పెట్టబోతున్నాయి.
కావాల్సిన మెలకువలు: ప్రధానంగా కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్లు ఈ రంగంలో అవసరమవుతారు. కమ్యూనికేషన్‌ రంగంలోని వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థపై మంచి పట్టు సాధించాలి. కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, వివిధ ప్రోటోకాల్స్‌ గురించి తెలుసుకోవాలి. ఆపరేటింగ్‌ సిస్టంల పనితీరుపై స్పష్టత ఉండాలి.
ఉద్యోగాలు: ఈ రంగంలో హార్డ్‌వేర్‌ డిజైన్‌ ఇంజినీర్‌ కావాలనుకునే వారికి వీఎల్‌ఎస్‌ఐకి సంబంధించిన ఎఫ్‌పీజీఏ, ఎఫ్‌పీజీఏ డిజైన్‌, ఏఎస్‌ఐసీ, వేరిలాగ్‌, వీహెచ్‌డీఎల్‌/వేరిలాగ్‌, ఆర్‌టీఎల్‌ డిజైన్‌ల్లో కనీసం కొన్నింటిలో అయినా అనుభవం ఉండాలి.
కమ్యూనికేషన్‌ ఇంజినీర్‌ కావాలంటే ఈ కింది వాటిలో కనీసం కొన్నింటిలో అయినా అనుభవం ఉండాలి. సర్టిఫికేషన్లు ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇంజినీరింగ్‌ స్థాయిలో పీజీ పొందడం ఉత్తమం.
* కోడింగ్‌ థియరీ, ఇన్‌ఫర్మేషన్‌ థియరీ, అడాప్టివ్‌ ఫిల్టరింగ్‌, సిగ్నల్‌ డిటెక్షన్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్‌
* మోడెమ్‌ అల్గారిథమ్‌ డిజైన్‌, ఛానల్‌ ఇంటర్‌ఫియరెన్స్‌ ఎస్టిమేషన్‌, అడ్వాన్స్‌డ్‌ రిసీవర్లు, డీకోడర్స్‌.
* కమ్యూనికేషన్‌ సిమ్యులేషన్‌ టూల్స్‌ డిజైన్‌ అయిన సీఎస్‌ఎంఏ/ ఎఫ్‌డీఎంఏ/ టీడీఎంఏ వంటి మల్టిపుల్‌ యాక్సెస్‌ టెక్నిక్స్‌
* ఆర్‌ఎల్‌సీ, పీడీసీపీ, ఆర్‌ఆర్‌సీ, ఎస్‌-1, ఎక్స్‌-9, ఐపీ, యూడీపీ, హెచ్‌టీటీపీ, టీసీపీ/ఐపీ వంటి ప్రోటోకాల్స్‌లో కనీసం ఒకదానిలో అనుభవం.
* సీ, సీ++, యూనిక్స్‌, విండోస్‌, లినక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టంలలో కనీసం ఒక దానిలో పని చేసి ఉండాలి.
కొన్ని శిక్షణ సంస్థలు:
* బెంగళూరులోని నానోసెల్‌ నెట్‌వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 5జీ, లై-ఫైలలో శిక్షణ ఇస్తోంది (www.nanocellnetworks.com).
* ముంబయిలోని టెలిమాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ 5జీ, ఫైబర్‌ ఆప్టిక్స్‌ టెక్నాలజీల్లో సర్టిఫికేషన్‌తో కూడిన శిక్షణ ఇస్తోంది (www.teleman.in).
3-డీ ప్రింటింగ్‌
కంప్యూటర్‌ సహాయంతో అభివృద్ధి చేసిన డిజిటల్‌ నిర్మాణ చిత్రాన్ని 3-డీ మోడల్‌గా పెంపొందించి భౌతికంగా వస్తువు ఉత్పాదనకు ఉపయోగపడే టెక్నాలజీని 3-డీ ప్రింటింగ్‌ (సంకలనాత్మక నిర్మాణం) అంటారు. ఇది వస్తువును లేయర్లుగా ఉత్పత్తి చేస్తుంది.
ఈ రంగంలో ఉద్యోగాలు పొందాలంటే ముఖ్యంగా మెకానికల్‌ విభాగంలో అవసరమయ్యే మోడలింగ్‌, ఆటోక్యాడ్‌, సిమ్యులేషన్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీల్లో శిక్షణ పొందాలి. ఇంజినీరింగ్‌ స్థాయి నుంచే పరిశోధన వైపు దృష్టి సారించడం ఉత్తమం. ఈ టెక్నాలజీలో పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉంటాయి.
త్రీడీ ప్రింటింగ్‌లో కెరియర్‌ను సాగించడానికి ఈ కింది సాఫ్ట్‌వేర్‌లలో శిక్షణ తీసుకోవాలి.
* సాలిడ్‌ వర్క్స్‌ (Solid Works)
* ప్రో-ఈ (Pro-E)
* త్రీడీ క్యాడ్‌ (3D CAD)
* 3డీ యానిమేషన్‌
పైతాన్‌, సీ++, జావా వంటి ప్రోగ్రామింగ్‌ల్లో కనీసం ఒకదానిలో ప్రావీణ్యం అవసరం. అల్గారిథమ్‌ అభివృద్ధి, వివిధ రకాలైన సిస్టంలపై మంచి అవగాహన ఉండాలి.
శిక్షణ సంస్థలు: యానిమేషన్‌, మోడలింగ్‌ల్లో పలు శిక్షణ సంస్థలు ఇప్పటికే ఉన్నాయి. ఆటోడెస్క్‌ అధీకృత శిక్షణ సంస్థలు 3డీ మోడలింగ్‌, మాయా మోడలింగ్‌, క్యాడ్‌లలో సర్టిఫికేషన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. విన్సిస్‌, సీఎస్‌ క్యాడ్‌ టెక్నాలజీస్‌, క్యాడ్‌ సెంటర్‌ మొదలైన ఎన్నో శిక్షణ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ శిక్షణ సంస్థల్లో హైదరాబాద్‌ బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌, విద్యానగర్‌లోని అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ముఖ్యమైనవి.
ఉద్యోగాలు: డిజైన్‌, మాన్యుఫాక్చరింగ్‌, టెక్నికల్‌ సపోర్ట్‌, సేల్స్‌, శిక్షణ రంగాల్లో త్రీడీ డిజైన్‌, తీడ్రీ ప్రింటింగ్‌ ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ రంగం కొత్తది కావడం వల్ల శిక్షణకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలామంది ముందు శిక్షణ సంస్థల్లో పని చేసి వివిధ టూల్స్‌పై అనుభవం సంపాదించి తర్వాత పరిశ్రమల్లో అవకాశాలు వెతుక్కుంటున్నారు.
ప్రస్తుతం ఉన్న సంస్థలతోపాటుగా మరికొన్ని అంకుర సంస్థలు సాఫ్ట్‌వేర్‌ సేవలు అందిస్తున్నాయి. వాటిలో కూడా ఉద్యోగాలు ఉంటాయి. కొన్ని సంస్థల వెబ్‌సైట్లు...
www.robolab.com (పుణె)
www.stanely3dtech.com (ముంబయి)
www.maiervidorno.com (గుడ్‌గావ్‌)
www.linside3dprinting.co.in (ముంబయి)
www.3dmacinfo.com (హైదరాబాద్‌)
www.printzworldwide.com (కోల్‌కతా)

Posted on 12-04-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning