ఐటీ ఉద్యోగులకు ఆకర్షణీయం హైదరాబాద్‌

* బెంగళూరుతో పోలిస్తే ఉద్యోగ నిష్క్రమణ 40-60శాతం తక్కువ: బిలాంగ్‌ సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటం, సులువుగా వ్యాపార నిర్వహణలో తన స్థానాన్ని కాపాడుకోవడం, సానుకూల పరిస్థితులు ఎక్కువగా ఉండటంలాంటి కారణాలతో బెంగళూరుతో పోలిస్తే.. ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక్కడి సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల నిష్క్రమణ శాతం ఐటీ రాజధానితో పోలిస్తే దాదాపు 40-60శాతం వరకూ తక్కువగా ఉంటోంది. దేశీయంగా చూస్తే ఇది దాదాపు 30-60శాతం వరకూ ఉంది. ఉద్యోగ నియామకాల్లో సంస్థలకు సహాయపడే బిలాంగ్‌ చేసిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది. ఈ సర్వే కోసం బిలాంగ్‌ పేరున్న ఐటీ సంస్థలైన ఐబీఎం, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, వెల్స్‌ ఫార్గో, ఇన్ఫోసిస్‌, అమేజాన్‌, మైక్రోసాఫ్ట్‌లాంటి వాటిల్లో హైదరాబాద్‌, బెంగళూరు కార్యాలయాల్లో గత రెండేళ్లుగా ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించింది. కొత్త నైపుణ్యాలైన డేటా సైంటిస్ట్‌లు, యూఐ/యూఎక్స్‌ డిజైనర్లలో పనిచేసేవారు దొరకడం కష్టమైనప్పటికీ.. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో 10-20శాతం తక్కువ వేతనానికే సంస్థలు ఇక్కడ నిపుణులను నియమించుకుంటున్నాయి. పదేళ్లకు మించి అనుభవం ఉన్న డేటా సైంటిస్ట్‌లకు బెంగళూరులో ఏడాదికి రూ.20లక్షలకు పైగానే చెల్లిస్తుండగా.. హైదరాబాద్‌లో రూ.15లక్షలు-రూ.20లక్షల మధ్య చెల్లిస్తున్నారు. యూఐ/యూక్స్‌ డిజైనింగ్‌లో పదేళ్ల అనుభవం ఉంటే బెంగళూరులో రూ.20లక్షలకు మించి వస్తుండగా.. ఇక్కడ రూ.20లక్షలోపే వేతనం ఉంటోంది. అయినా.. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేందుకే మొగ్గు చూపిస్తున్నారు. జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండటంతోపాటు, ఖర్చు తక్కువగా ఉండటం, స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉండటం, మౌలిక వసతులు బాగుండటం, ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ట్రాఫిక్‌ కూడా ఎక్కువగా ఉండకపోవడం, సులువుగా వ్యాపార నిర్వహణలాంటి కారణాలతో పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. గూగుల్‌, అమేజాన్‌, ఉబర్‌, ఫేస్‌బుక్‌లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. ‘తెలంగాణలో ఐటీ అనుకూల వాతావరణం ఏర్పాటు చేయడంలో ఐటీ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ భారత్‌లో మరో సిలికాన్‌ వ్యాలీ అవుతుందని వింటూనే ఉన్నాం. అయితే, మొదటిసారి మా సమాచారం దీన్ని ధ్రువీకరిస్తోంది.. ఇక్కడ ఉద్యోగులను నిలుపుకోవడం సులభం.. పైగా ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ వేతనాలు కూడా ఉండటం టెక్‌ కంపెనీలకు కలిసొస్తుంద’ని బిలాంగ్‌ సహ వ్యవస్థాపకుడు రిషభ్‌ కౌల్‌ అన్నారు. టై హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫణి పటమట స్పందిస్తూ.. నైపుణ్యం ఉన్న ఉద్యోగుల లభ్యత, అందుబాటులో మౌలిక వసతులు, ప్రభుత్వ సానుకూల విధానాలతో టెక్‌ అంకురాలకూ, పెద్ద కంపెనీలకు హైదరాబాద్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోందన్నారు. మంచి ఇంజినీర్లను నియమించుకోవడంతోపాటు, వారిని దీర్ఘకాలం అట్టిపెట్టుకోవడమూ సంస్థలకు ముఖ్యమేనని, ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లో ఇలాంటి వాతావరణం ఉండటం వాటికి ఎంతో మేలని అన్నారు.Posted on 04-05-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning