ఆలోచన.. ఆవిష్కరణ

* వెల్లివిరిసిన యువ ఇంజినీర్ల ప్రతిభ

* జాతీయస్థాయి పోటీల్లో ప్రదర్శన

యువ ఇంజనీర్లు ఆలోచనలకు పదును పెట్టారు...వాటిని ప్రయోగాత్మకంగా ఆవిష్కరించారు. జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేర్చుకున్న విద్యను వివిధ అంశాల్లో ప్రదర్శించారు. ఎలాంటి ఒత్తిడిలకు గురికాలేదు. నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు టకటక సమాధానాలు చెప్పారు. తోటి విద్యార్థుల ఎదుట తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల వరంగల్‌ నిట్‌లో 'టెక్నోజియన్‌-13' అనే పేరుతో నిర్వహించిన జాతీయస్థాయి ఉత్సవాల్లో జిల్లాకు చెందిన యంత్ర విద్య చదువుతున్న విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. సాంకేతిక, వివిధ విభాగాల్లో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీల్లో పాల్గొన్న పలువురు యువ ఇంజనీర్లపై 'న్యూస్‌టుడే' కథనం....
ఎన్మీ డిస్ట్రాయిర్‌ అప్లికేషన్:
ఈఈఈ విభాగంలో ద్వితీయ సంవత్సరం చ‌దువుతున్న గౌరి . 'అప్లికేషన్‌ అభివృద్ధి' అనే విభాగంలో పాల్గొంది. వివిధ రకాల అంశాలను ఉపయోగిస్తూ ఒక కొత్త ఆటను రూపొందించింది. దానికి 'ఎన్మీ డిస్ట్రాయిర్‌' అనే నామకరణం చేసి ప్రదర్శించింది. తోటి విద్యార్థులకు వివరించింది. వివిధ సాప్ట్‌వేర్లను ఎలా కంప్యూటర్‌లోకి ఎక్కించాలో, బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియల్లో ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలియచేసి నిర్వాహకుల ప్రశంసలు పొందింది.
గ్రామీణాభివృద్ధిపై.... ప్రదర్శన:
గోదావరిఖనికి చెందిన గంగిపల్లి రాజేంద్రప్రసాద్‌, గోలి అరవింద్‌లు ఈఈఈ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ప్రతిభా పాటవ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వీరిద్దరు 'ఆకాంక్ష' అనే విభాగంలో పాల్గొన్నారు. గ్రామీణాభివృధ్ధి అనే అంశంపై పోస్టర్‌ ప్రెజంటేషన్‌ చేశారు. ఇలా అయితే గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయవచ్చన్నారు. ప్రాజెక్టులను ఎలా రూపొందించాలి..? వాటిని ఎలా ప్రదర్శించాలి అనే విషయాలను బాగా తెలుసుకున్నామంటున్నారు.
పోటీల్లో పాల్గొంటేనే ప్రతిభ పెరుగుతుంది:
మహంకాళి నిఖిల్‌ మెకానికల్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మొదటిసారిగా పోటీల్లో పాల్గొన్నాడు. ఎలాంటి ఒత్తిడిలకు గురికాలేదు. భయాన్ని జయించాడు. పోస్టర్‌ ప్రెజంటేషన్‌ అనే అంశంలో పాల్గొన్నాడు. 'ఓరియంటల్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఆటో మొబైల్స్‌' అనే అంశంపై వివరించాడు. నిర్వాహకులు అడిగిన పలు సందేహాలకు చకచకా సమాధానాలు చెప్పాడు. పోటీల్లో పాల్గొంటేనే ప్రతిభ పెరుగుతుందని, ఇక్కడ చాలా విషయాలను నేర్చుకున్నానని అంటున్నాడు.
పుస్తక జ్ఞానం ఒక్కటే స‌రిపోదు:
ఈఈఈ విభాగంలో ద్వితీయ సంవత్సరం చ‌దువుతున్న ప్రవీణ. తాను నేర్చుకున్న విద్యను ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తెచ్చింది. వివిధ అంశాలను ఉపయోగించి ఒక కొత్త ఆటను రూపొందించింది. దానికి 'షూటింగ్‌ ఎన్మీ బుల్లెట్‌' అని నామకరణం చేసింది. ఈ ఆటను పోటీల్లో ప్రదర్శించింది. నిర్వాహకులకు వివరించింది. కేవలం పుస్తక జ్ఞానం ఉంటనే సరిపోదని, ప్రయోగాత్మకంగా ప్రదర్శించాలని, సాఫ్ట్‌వేర్‌ల్లో కొత్తకొత్తగా 2డీ, 3డీలను ప్రదర్శించటం తెలుసుకున్నానంటుంది.
యంత్రాల తయారీ:
మెకానికల్‌లో ద్వితీయ సంవత్సరం చ‌దువుతున్న కేతిరి సాయిమల్లారెడ్డి, రవ్వ రాంరుశీల్‌, గట్ల హరీష్‌లు వర్క్‌షాప్‌ విభాగంలో పాల్గొన్నారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలో అందుకోసం మనమేం చేయాలో అనే అంశాలపై పలు చిత్రాల ద్వారా వివరించారు. నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాగా చెప్పారు. ఈ పోటీల్లో అధునాతన యంత్రాలు ఎలా తయారు చేయాలి..? వాహనాల వేగాన్ని ఎలా పెంచాలి..? ఎలా నిరోధించాలనే విషయాలను తెలుసుకున్నామంటున్నారు.
సర్క్యూట్ల ఏర్పాటులో ప్రతిభ
ఈసీఈలో ద్వితీయ సంవత్సరం చ‌దువుతున్న తాడూరి ప్రమోద్‌కుమార్‌రెడ్డి, జిల్లెల్ల రోహన్‌లు . వీరిద్దరు 'సర్క్యూట్‌ ట్రిక్స్‌' అనే విభాగంలో పాల్గొన్నారు. నిర్వాహకులు ఇచ్చిన ప్రశ్నాపత్రం ప్రకారం ఇచ్చిన సమాధానాలకు అనుగుణంగా సర్క్యూట్‌లను తయారు చేశారు. అన్ని ఎలక్ట్రికల్‌ పరికరాల్లో సర్క్యూట్లు వాడుతున్నారు. అతి తక్కువ పరిమాణంతో ఉండే సర్క్యూట్లను ఎలా తయారు చేయవచ్చో అవగాహన పెంచుకున్నామంటున్నారు.
అవగాహనతో కాలుష్య నివారణ
వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే అవగాహనే ముఖ్యమనుకున్నారు. ఇందుకు అనుగుణంగా తమ ఆలోచనలను, భావాలను జాతీయస్థాయి పోటీలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో వివరించారు కడారి శ్రావన్‌కుమార్‌, డి.సాయిక్రిష్ణ. వీరిద్దరు మెకానికల్‌ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. 'వాతావరణ మార్పుల్లో నాయకత్వ లక్షణాలు' అనే అంశంపై సమర్ధవంతంగా వివరించారు. వాతావరణంలో 360 పీపీఎం కార్బన్‌డై ఆక్సైడ్‌ ఉందని, 2020కి అది 400 నుంచి 500 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనటంతో ఎన్నో తెలవని విషయాలను అవలీలగా తెలుసుకున్నామంటున్నారు.
పేదరికం, నిరక్షరాస్యతలపై...వివరణ
నిరక్షరాస్యత, పేదరికం, గ్రామీణాభివృద్ధి అనే అంశాలపై చక్కగా సాంకేతిక చిత్రాల ద్వారా వివరించారు గన్ను సహజ, అర్జుల కావ్య. వీరిద్దరు ఈసీఈ, సీఎస్‌ఈలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పోటీల్లో పాల్గొన్నారు. 'సాంఘిక సంక్షేమం' అనే అంశంపై పోస్టర్‌ ప్రెజంటేషన్‌ ఇచ్చారు. పలు అంశాలను చిత్రాలతో వివరించారు. గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే భారత్‌ అగ్రగామి దేశాల సరసన చేరుతుందని తెలిపారు. జాతీయస్థాయి పోటీలు చాలా బాగున్నాయి. విద్యపరంగా చాలా ఉపయోగపడే విషయాలు గమనించామంటున్నారు.
బ్యాటరీ సహయంతో నడిచే కారుపై వివరణ
ఎస్‌.కె గాలిబ్‌పాషా, ఆర్‌.మణికంఠశర్మ, ఎం.అభిలాష్‌లు పోస్టర్‌ ప్రెజెంటేషన్‌లో పాల్గొన్నారు. వీరు ఈఈఈ, మెకానికల్‌ విభాగాల్లో చివరి సంవత్సరం చదువుతున్నారు. యంత్రం, ఇంధనం, ఆయిల్‌ లేకుండా బ్యాటరీ సహాయంతో కారును నడిపించవచ్చనని వివరించారు. కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. లాభాలను సైతం వివరించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో మాట్లాడవచ్చని, వారితో చర్చించటంతో ఆయా విషయాలపై పరిజ్ఞానం పెరిగిందంటున్నారు.
సర్క్యూట్లు తయారు చేయటం తెలిసింది
ఎస్‌.ప్రణమ్య, కె.మనీషాలు ఈసీఈలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు కరీంనగర్‌, హన్మకొండకు చెందినవారు. 'సర్క్యూటిక్స్‌' పోటీల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు ముందుగా పరీక్షను ఏర్పాటు చేయగా సమర్ధవంతంగా రాశారు. వివిధ చిత్రాల ద్వారా సమస్యలకు అనుగుణంగా సర్క్యూట్లను చిత్రీకరించారు. ఇవి యంత్ర విద్యకు ఎంతగానో తోడ్పడతాయి. వీటి తయారుపై మంచి అవగాహన పెంచుకున్నామంటున్నారు. ఇది విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
అభిలాష్‌కు ప్రథమ బహుమతి
ముదునూరు అభిలాష్‌ కిట్స్‌లో మెకానికల్‌ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. జాతీయస్థాయి ఉత్సవాల్లో డిజైనింగ్‌ విభాగంలో పాల్గొన్నాడు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పాల్గొనే విద్యార్థులకు ఆయా అంశాలను వివరించాడు. 'మెటీరియల్‌ ఎక్స్‌పర్‌టైజ్‌' అనే అంశంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మొదటి బహుమతిని సాధించాడు. ధ్రువపత్రంతోపాటు రూ.5 వేల నగదును అందుకున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించటం చాలా సంతోషంగా ఉందంటున్నాడు.


 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning