నైపుణ్య శిక్షణతో కొలువులకు సై

కంపెనీలు కోరుకునే నైపుణ్యాలు తమలో లేవని ఉద్యోగార్థులు నిరాశపడనక్కర్లేదు. డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇస్తూ వారిలో ఇంటర్వ్యూలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది ఏపీ ఐటీ అకాడమీ. కొత్తగా నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం ఉన్నవారికి ఈ సదవకాశం ఎంతో మేలు చేస్తోంది. కంపెనీలు వర్చ్యువల్‌ రియాలిటీ (వీఆర్‌) గేమింగ్‌ ద్వారా వారిని గుర్తించి ఉద్యోగాలను కల్పిస్తున్నాయి!

కళాశాలల్లో వివిధ సంస్థలు జాబ్‌ మేళాలు నిర్వహించడం మామూలే. అభ్యర్థులు ఆ సంస్థలకు దరఖాస్తులను సమర్పించి, అక్కడ ఇంటర్వ్యూలు నిర్వహిస్తే వాటికి హాజరవుతుంటారు. నైపుణ్యాలుండి, ప్రతిభ చూపినవారే ఎంపికవుతారు. లేకపోతే అవకాశాలు కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్‌ సమాచార, సాంకేతిక సంస్థ (ఏపీఐటీఏ) ఇందుకు భిన్నంగా ఉద్యోగార్థులకు లబ్ధి చేకూరేలా వారికి చేయూతనందించే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తోంది.
దీని పేరు ‘విద్యార్థుల చెంతకే కొలువులు’. దేశంలోనే మొదటిసారిగా ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగార్థుల కోసం అన్వేషణ’ (లీప్‌) పేరుతో 15 రోజులపాటు 13 జిల్లాల్లో కార్యక్రమం నిర్వహించింది. ఫలితంగా 3,847 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.
దేశవ్యాప్తంగా వివిధ ఐటీ సంస్థల అవసరాలకూ, పట్టభద్రుల నైపుణ్యాలకూ మధ్య అనుసంధానం ఉండటం లేదు. ఈ లోపం సవరించేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 250 కళాశాలల్లో ఉన్న డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తోంది ఏపీఐటీఏ. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధానం.. ఇలా అనేక విషయాలపై వీరందరికీ అవగాహన కల్పిస్తోంది.
ఇలా విద్యార్థులు తగిన నైపుణ్యాలు పొందాక వారందరి కోసం జిల్లాల వారీగా ఐటీ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులను ప్రత్యేకంగా రూపొందించిన రెండు బస్సుల్లో తీసుకెళ్లి ఇంటర్వ్యూలు నిర్వహింపజేస్తోంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటివరకూ 6092 మంది కళాశాలల విద్యార్థులు కొలువులు పొందటం విశేషం.
మూడు విభాగాల్లో శిక్షణ
అన్ని రంగాల్లోనూ సమాచార, సాంకేతికత (ఐటీ) అనుసంధానం పెరగడంతో ఇందుకు వీలుగా విద్యార్థులను తయారు చేయడంలో ఏపీఐటీఏ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
ఐటీ కంపెనీలు, ఐటీ అనుబంధ సంస్ధలు, ఐటీ సేవల వినియోగ సంస్థలు...ఇలా మూడు విభాగాల్లోనూ విద్యార్థులు రాణించేలా కళాశాల స్థాయిలో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆంగ్ల భాషలోనూ ప్రావీణ్యం సాధించేలా ప్రాధాన్యమిస్తున్నారు.
కిందటి నెల 15 నుంచి 29 వరకు 13 జిల్లాల్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు 14,328 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 3847 మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు. మరో 700 మంది పరిశీలనలో ఉన్నారు. అనంతపురం జిల్లా నుంచి అత్యధికంగా 473 మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం. తరువాతి స్థానాల్లో కడప, కర్నూలు జిల్లాల విద్యార్థులు నిలిచారు.
కంపెనీలు పోటాపోటీ..
ఏపీఐటీఏ ‘లీప్‌’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఐటీ, ఇతర వ్యాపార సంస్థలు ఎక్కువగా హాజరవుతున్నాయి. గత నెలలో నిర్వహించిన కార్యక్రమానికి 140 కంపెనీలు హాజరయ్యాయి. బైజూస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌, జోహో, ఫాక్స్‌కాన్‌, జెన్‌టెక్‌, వాల్‌మార్ట్‌, మహేంద్ర, సింబయాసిస్‌, ఇండిగో ఎయిర్‌లైన్స్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, అమర్‌రాజా గ్రూపు తదితర కంపెనీలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో సగటున 30 కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆకర్షణీయమైన ప్యాకేజీలు
ఉద్యోగాలకు ఎంపికైన వారిలో విద్యార్థులు 63 శాతం, విద్యార్థినులు 37 శాతం ఉన్నారు.
* ఇన్ఫోసిస్‌ అత్యధికంగా 883 మందికి రూ.3.2 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం కల్పించింది.
* పేటీఎం రూ.3.6 లక్షలు ) ఫ్లిప్‌కార్ట్‌ రూ.4.5 లక్షలు,
* హెచ్‌సీఎల్‌ రూ.3.6 లక్షలు
* బైజూస్‌ రూ.లక్షల ప్యాకేజీలు ఇచ్చాయి.
సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, టీం లీడ్‌ పొజిషన్‌, ప్రొడక్ట్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ప్రోసెస్‌ ఎగ్జిక్యూటివ్‌, ఐటీ సపోర్ట్‌ విభాగంలో విద్యార్థులకు కంపెనీలు అవకాశం కల్పించాయి. ఎంపికైనవారిలో ఎక్కువమంది గ్రామీణ నేపథ్యం కలిగి వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినవారు కావడం విశేషం. - శిరికి సూర్యనారాయణ, ఈనాడు, అమరావతి
ఇంటర్వ్యూల్లో వీఆర్‌ గేమింగ్‌...
* ఇంటర్వ్యూల సందర్భంగా అత్యధిక కంపెనీలు విద్యార్థుల్లో చురుకుదనాన్నీ, ఆలోచన విధానాన్నీ, నైపుణ్యాన్నీ గుర్తించేందుకు వర్చ్యువల్‌ రియాలిటీ (వీఆర్‌) గేమింగ్‌ నిర్వహించాయి. అభ్యర్థులకు డివైజ్‌లు ఇచ్చి వారిలో సృజనను గమనించేందుకు వర్చ్యువల్‌ రియాలిటీ గేమింగ్‌ దోహదం చేస్తోంది. ఇందులో విద్యార్థుల్లో నైపుణ్యం, ఆలోచన విధానాలను గమనించాకే ఇంటర్వ్యూలో తదుపరి దశకు ఎంపిక చేస్తున్నారు.
* విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యంతోపాటు కొత్త విషయాలను నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారా? లేదా? అనే విషయాలను సంస్థలు ప్రధానంగా గమనిస్తున్నాయి. అలాంటి చురుకుదనం, ఉత్సాహం, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన కలిగిన విద్యార్థులనే ఎంపిక చేస్తున్నారు.
* ఏపీఐటీఏలో నమోదైన కళాశాలలతోపాటు కొత్తగా కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం www.apita.ap.gov.in వెబ్‌సైట్‌లో కళాశాలల పేర్లు నమోదు చేసేందుకు మరో పది రోజుల్లో ఏర్పాట్లు చేయనున్నారు. కళాశాలతో సంబంధం లేకుండా విద్యార్థులు కూడా నేరుగా తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.

మంచి ప్రయత్నం
‘నైపుణ్యం కలిగిన విద్యార్థులకు కొదవ లేనప్పటికీ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఏపీఐటీఏ వివిధ కంపెనీల ప్రతినిధులతో కలిసి జిల్లాల వారీగా ఉద్యోగార్ధుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం మంచి పరిణామం. ఈ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఏటా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి’ - స్వాతి, చిత్తూరు
ఊహించని పరిణామం...
‘వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు కళాశాల స్థాయిలోనే ఉద్యోగం వస్తుందని ఊహించలేదు. ఒకేసారి 35 సంస్థల ప్రతినిధుల హాజరై నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో నేకొకణ్ణి కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. జిల్లాల వారీగా ఏపీఐటీఏ ఇంటర్వ్యూలు నిర్వహించిన తీరు బాగుంది. ఇదే విధానాన్ని నిరంతరం కొనసాగిస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది’ - హేమంత్‌, కర్నూలు
భారీ లక్ష్యంతో ముందుకు...
‘ఏపీఐటీఏ ఆధ్వర్యంలో రాష్టంలో 25 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళుతున్నాం. గత నెలలో 15 రోజులపాటు వరుసగా 13 జిల్లాల్లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు విద్యార్థుల నుంచి చక్కని స్పందన లభించింది. హాజరైన కంపెనీల ప్రతినిధులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చెంతకు కంపెనీలు వెళ్లే ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించడం దేశంలోనే ఇదే మొదటిసారి. గిన్నిస్‌ రికార్డు, లిమ్కా అవార్డుల కోసం కూడా దరఖాస్తు చేశాం. కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాం’ - విన్నీ పాత్రో, ఏపీఐటీఏ అదనపు సీఈవోPosted on 04-06-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning