కొలువుల బంగారం కోడింగ్‌

* ఆన్‌లైన్‌లో మరో మంచి అవకాశం
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రముఖ కళాశాలల్లోనే జరుగుతాయి. అక్కడా అందరికీ అవకాశాలేమీ లభించవు! మరి అలా అవకాశం దక్కనివారూ... అసలు నియామకాలే జరగని కాలేజీల్లో చదువుతున్నవారి మాటేమిటి? అలాంటి ఔత్సాహిక విద్యార్థులకూ కొలువుల బంగారం ఉంది! ప్రాంగణ నియామకాలు ఉన్నా, లేకున్నా వాటితో సంబంధం లేకుండా నేరుగా నియామకాలకు అవకాశం కల్పిస్తున్నవే.. కోడింగ్‌ కాంపిటిషన్స్‌! ప్రోగ్రామింగ్‌ నేర్చుకుని, ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోగలిగితే చాలు... ఎవరైనా సరే, ఐటీ కొలువులు కొట్టేయవచ్చు!

తరచూ లాప్‌టాప్‌లో మొహం దూర్చి కనపడుతుంటాడు సాత్విక్‌. ఆన్‌లైన్లో ఏవేవో నేర్చుకుంటూ, మెదడుకు పదునుపెట్టుకుంటూ ఉంటాడు. ఓ ప్రముఖ సంస్థలో అతడికి ఉద్యోగం వచ్చిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికతడు ఎప్పుడూ ఏ కంపెనీ నియామక పరీక్షలూ రాయలేదు. కోడింగ్‌ కాంపిటిషన్లలో పాల్గొనటం, సాంకేతికంగా చూపిన ప్రతిభ, సంపాదించిన అనుభవం వల్లనే ఈ చక్కటి అవకాశం అతడికి లభించింది!
కోడింగ్‌ పోటీలు కొద్దికాలం క్రితం ఆరంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే విద్యార్థుల్లో వీటిపై అవగాహన పెరుగుతోంది.
ఒకప్పుడు ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఆప్టిట్యూడ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మాత్రం ఉంటే ఉద్యోగం సులువుగా వచ్చేసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంజినీరింగ్‌ చదివేవారికి వారి బ్రాంచితో సంబంధం లేకుండా ప్రోగ్రామింగ్‌లో పట్టు ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే వారికి ఉద్యోగార్హత నైపుణ్యం ఉన్నట్టు.
ఇతర పోటీలు
‘గూగుల్‌ సమ్మర్‌ ఆఫ్‌ కోడ్‌’ అనేది ప్రాజెక్టు ఆధారిత పోటీ. దీనిలో విజయం సాధిస్తే గూగుల్‌ సంస్థ 5500 డాలర్ల స్టైపెండ్‌ అందిస్తుంది.
* ‘గూగుల్‌ కోడ్‌ జామ్‌’ అంతర్జాతీయ ప్రోగ్రామింగ్‌ పోటీ. దీన్ని గూగులే నిర్వహిస్తుంది. అత్యంత సాంకేతిక ప్రతిభాసంపత్తి ఉన్న ఇంజినీర్లను గుర్తించి, తమ సంస్థలోకి ఆకర్షించటానికి దీన్ని 2003లో ఆరంభించారు.
* ‘అసోసియేషన్‌ ఫర్‌ కంప్యూటింగ్‌ మెషినరీ- ఇంటర్నేషనల్‌ కలిజియేట్‌ ప్రోగ్రామింగ్‌ కాంటెస్ట్‌’ ప్రతిష్ఠాత్మకమైన పోటీ. వివిధ పోటీల్లో పాల్గొని మంచి అనుభవం సంపాదించినవారికి ఈ ఏసీఎం-ఐసీపీసీ మంచి వేదిక.
ప్రోగ్రామింగ్‌ను నేర్చుకోవడం అనేది కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లకో, ఇంజినీర్లకో మాత్రమే పరిమితమైనది కాదు. సాంకేతికపరమైన కంపెనీల్లో ఉద్యోగం కావాలనుకునే సాధారణ గ్రాడ్యుయేట్లు గానీ, వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచీల వారు గానీ ప్రోగ్రామింగ్‌ను ఎంచక్కా నేర్చుకోవచ్చు. కేవలం ప్రోగ్రామింగ్‌పై ఆసక్తి ఉన్నవారు కూడా తమ అభిరుచి మేరకు అభ్యసించవచ్చు.
సాధారణ ఇంజినీర్లతో పోలిస్తే మంచి ప్రోగ్రామర్లను రెండు రెట్లు అదనంగా వేతనం ఇచ్చి కంపెనీలు నియమించుకుంటుంటాయి. కోడింగ్‌ పరిజ్ఞానంపై పట్టున్నవారికి ఉద్యోగాలు ఇవ్వటానికి టెక్నాలజీ కంపెనీలూ, స్టార్టప్‌ సంస్థలూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోడింగ్‌ పోటీల్లో పాల్గొనే ప్రతిభావంతుల నుంచి ఎంచుకోవటం వారికి సులువు అవుతోంది.
మారుమూల ప్రాంతాల్లో ఉండే సాధారణ కళాశాలల విద్యార్థులకు ప్రోగ్రామింగ్‌ అంటే కొంత భయం ఉంటుంది. తమ కళాశాలల్లో కొంత నేర్చుకున్నా అంతకుమించి ఉన్నత స్థాయిలో నేర్చుకునే అవకాశం ఆన్‌లైన్లో లభిస్తోంది. ఎలాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ అయినా నేర్చుకుని కోడింగ్‌ పోటీలో ఉచితంగా పాల్గొనవచ్చు; పాయింట్లు పెంచుకోవచ్చు. మంచి ప్రతిభ చూపిస్తే ఉద్యోగం వస్తుంది. ఒకవేళ వెంటనే రాకపోయినా సాధించిన సాంకేతిక ప్రతిభ కెరియర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
గూగుల్‌ నుంచి ఫేస్‌బుక్‌ వరకూ అన్ని ప్రముఖ టెక్‌ కంపెనీలూ, స్టార్టప్‌ సంస్థలూ ప్రతిభావంతులైన యువ కోడర్‌లను నియమించుకోవడానికి పోటీ పడుతున్నాయి.
ఎలా నేర్చుకోవచ్చు?
కోడింగ్‌ స్వతంత్రంగా నేర్చుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. కోడ్‌ రాయటం బోధించే వెబ్‌సైట్లు చాలానే ఉన్నాయి. ప్రాథమిక అంశాల నుంచి (బేసిక్స్‌) ఆరంభించి అభ్యసించటానికి అత్యుత్తమ వేదికలు.. www.code.org, www.khanAcademy.com
ఈ మధ్య తరచూ విన్పిస్తున్న మాట కాంపిటిటివ్‌ కోడింగ్‌. విద్యార్థుల కెరియర్‌కు కోడింగ్‌ బాగా ఉపకరిస్తుంది. ఒక సమస్యకు సరళమైన పరిష్కారం నుంచి బహుళ పరిష్కారాల వరకూ రాసే సామర్థ్యం దీనికి అవసరం.
నియమిత సమయంలో అత్యంత సరైన పరిష్కారాన్ని పోటీ ధోరణితో రాయటమే కాంపిటిటివ్‌ కోడింగ్‌! ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు 20-30 అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏ లాంగ్వేజ్‌లో అయినా ప్రోగ్రామింగ్‌ రాయొచ్చు.
ఎందుకంత ప్రాముఖ్యం?
వివిధ కార్యకలాపాలకు ఆటోమేషన్‌ను వినియోగిస్తున్నారు. ఈ కారణం వల్ల కంపెనీలు తమ అవసరాలకు మించి అదనంగా ఉండే సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలూ, స్టార్టప్‌ సంస్థలూ ఏ స్థాయి నియామకాలకైనా ( ఇంటర్న్‌, ఫ్రెషర్‌, టీమ్స్‌లో సీనియర్‌ మెంబర్‌) అత్యంత ముఖ్యమైన నైపుణ్యంగా కోడింగ్‌ను పరిగణిస్తున్నాయి.
ఉత్తమ కోడర్‌ అవ్వాలంటే?
దీనికి కోడింగ్‌ వెబ్‌సైట్లలో ముఖ్యాంశాలు నేర్చుకోవాలి. ఒక సైట్‌ను ఎంచుకుని, పునాది నుంచి నేర్చుకోవాలి. ప్రతిరోజూ కనీసం ఒక ప్రోగ్రామ్‌ రాయాలి. ప్రాథమిక ప్రోగ్రాముల నుంచి ఉన్నత స్థాయికి పెంచుకుంటూ 500 నుంచి 1000 సమస్యలకు ప్రోగ్రాములు రాయటం ముఖ్యం.
కోడింగ్‌ వెబ్‌సైట్లు....
www.hackerrank.com, www.hackerearth.com, www.codechef.com, www.codenations.co.in, www.topcoder.com, www.codeforces.com
* 30 రోజుల్లో కోడ్‌ నేర్చుకోవడం లాంటి ప్రోగ్రాములు www.hackerrank.com /domains/tutorials/30-days-of-code లో ఉన్నాయి.
* కోడింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లకు సంబంధించి ఎన్నో ప్రశ్నలకు ఒకేచోట జవాబులు దొరికే వెబ్‌సైట్‌ ‌www.geeksforgeeks.org/
ఎన్నో ఉద్యోగాలు
కోడింగ్‌ పోటీ అయిన CodeVita ద్వారా ప్రతి సంవత్సరం సుప్రసిద్ధ సంస్థ టీఎస్‌ఎస్‌ 1000 మంది తాజా ఇంజినీర్లను నియమించుకుంటోంది. ఏ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయినా దీనిలో పాల్గొనవచ్చు. టీసీఎస్‌కు సంబంధించి EnQuode, EngiNX మొదలైన ఇతర పోటీలు కూడా ఉన్నాయి.
ఇన్ఫోసిస్‌కు కూడా #HackwithInfy అనే కోడింగ్‌ కాంపిటిషన్‌ (హ్యాకథాన్‌) ఉంది. ఎంపిక చేసిన ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ పోటీ ద్వారా ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లను అందిస్తుంటారు.
ఏం కావాలి?
* సి/సి++/పైథాన్‌/జావా/ జావా స్క్రిప్ట్‌/ కోట్లిన్‌/సిచి మొదలైన ఏ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ అయినా తెలిసివుండాలి.
* మ్యాథమేటికల్‌ ప్రాబ్లమ్స్‌కు పరిష్కారాలు రాయటం నుంచి ప్రోగ్రామింగ్‌ ఉపయోగించటం వరకూ తెలిసుండాలి. sprojecteuler.net
* డేటా స్ట్రక్చర్స్‌పై అవగాహన ఉండాలి.
* అల్గారిదమ్స్‌ తెలిసివుండాలి.
* కాన్సెప్టును ప్రోగ్రామింగ్‌కూ/కోడింగ్‌ను అత్యుత్తమ పరిష్కారానికీ అన్వయించగలగాలి.
* కోడ్‌.ఆర్గ్‌, ఖాన్‌ అకాడమీ, కోడ్‌అకాడమీ.కామ్‌ల నుంచి కోడింగ్‌ నేర్చుకోవచ్చు.
వేదికల ఉపయోగాలేమిటి?
www.codechef.com, www.topcoder.com, www.codeforces.com లాంటి కోడింగ్‌ వేదికలు క్రమం తప్పకుండా కోడింగ్‌ పోటీలను నిర్వహిస్తుంటాయి. సరికొత్త సమస్యలతో ఇలాంటి పోటీలు జరుగుతుంటాయి. కోడింగ్‌ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకునే, కాంపిటిటివ్‌ కోడింగ్‌ విషయాల్లో ఈ పోటీలు చాలా మేలు చేస్తాయి.
www.hackerearth.com అనేది కోడింగ్‌కూ, నియామకాలకూ చక్కటి వేదిక.
www.techgig.com సైట్‌ ‘కోడ్‌ గ్లాడియేటర్స్‌’ను నిర్వహిస్తుంది. దీనిలోని పోటీదారుల నుంచి నియామకాలు చేసుకోవటానికి వివిధ కంపెనీలకు ఉపకరిస్తుంది.
కాంపిటిటివ్‌ కోడ్‌ నేర్చుకోదల్చినవారికి కోడ్‌ చెఫ్‌ ‘కోడ్‌ చెఫ్‌ సర్టిఫైడ్‌ డేటా స్ట్రక్చర్‌ అండ్‌ అల్గారిదమ్‌ ప్రోగ్రామ్‌’ను మూడు దశల్లో నిర్వహిస్తోంది. ఇది విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుంది. ‌www.codechef.com/certification
అన్ని సైట్లూ తమ వేదికల్లో కోడ్‌ పోటీల్లో పాల్గొనటానికి ఎలాంటి రుసుమునూ కోరటం లేదు. అన్నీ ఉచితమే.
ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ బ్రాంచితో సంబంధం లేకుండా మొదటి సంవత్సరంలో చేరిన దగ్గర్నుంచీ ఫైనలియర్‌ వరకూ ఈ కోడింగ్‌ పరిజ్ఞానం పెంచుకుని, పోటీల్లో పాల్గొనవచ్చు. వీటిపై ఎంత సమయం వెచ్చించి ప్రోగ్రాములు రాయటంపై పట్టు సాధిస్తే.. అంత కెరియర్‌కు ఉపయోగం. ఇంటర్న్‌షిప్‌లకూ, ఉద్యోగాలకూ ఈ అనుభవం చాలా సహాయపడుతుంది.Posted on 04-07-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning