డిగ్రీలోనే నాంది... సివిల్స్‌కు పునాది!

ఎందరో విద్యార్థుల బంగారు కల.. సివిల్‌ సర్వీసెస్‌! డిగ్రీ చివరి సంవత్సరంలోనో, పూర్తయ్యాకో దానిపై దృష్టి పెట్టటం కంటే .. ముందుగానే పునాది ఏర్పరుచుకునే ప్రయత్నం చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో నీటి బొట్టు కలిస్తేనే ప్రవాహంగా మారుతుంది. అలాగే సివిల్స్‌కు అవసరమైన దృక్పథం అలవర్చుకోవటం, పరీక్ష కోసం చేయాల్సిన ప్రాథమిక కృషి మూడు నాలుగేళ్ళ పాటు విడివిడి అంశాల అధ్యయనంగా.. వాటి సమాహారంగా కొనసాగాలి.

'సివిల్‌ సర్వీసెస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్న అడిగినప్పుడు చాలామంది టాపర్లు చెప్పే సమాధానం- ‘ఇది మా చిన్ననాటి కల’. అంటే.. వీరు తమ సన్నద్ధతను చిన్నవయసు నుంచే మొదలుపెట్టారని కాదు. నిజానికి అంత అవసరం కూడా లేదు.
మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించినవారిలో చాలామంది మాత్రం తమ సన్నద్ధతను మిగతావారితో పోల్చినపుడు కాస్త ముందుగానే ప్రారంభించివుండటం గమనించవచ్చు. ముందుగా అంటే మరీ ఏడెనిమిది తరగతుల్లోనో, ఇంటర్మీడియట్‌లోనో అని కాదు! పరీక్ష రాయాలనుకుంటున్న సంవత్సరానికి 3-4 ఏళ్ళ ముందుగా.. అంటే గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరం నుంచి సన్నద్ధత ప్రారంభించటం మేలు. సివిల్‌్్సకు అవసరమైన దృక్పథం (ఏ అంశాన్నయినా కేవలం ఒక కోణానికే పరిమితం కాకుండా బొమ్మాబొరుసూ రెండూ చూడగలగడం) పెంచుకునే అవకాశం ఉంటుంది. వివిధ సమస్యలను స్థిమితంగా అధ్యయనం చేసే సమయం, వెసులుబాటు ఉంటుంది. సమస్యలను ప్రజాక్షేమం కోణంలో పరిశీలించటాన్ని అలవర్చుకునే వీలు లభిస్తుంది.
ముందుగా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, బీఎస్‌సీ, బీకాం .. ఇలా దేనిలోనైనా చేరాక సివిల్స్‌ నిమిత్తం దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులతో పోలిస్తే.. సివిల్‌ సర్వీసెస్‌లోవి వేరుగా ఉంటాయి. 1. జనరల్‌ స్టడీస్‌ 2. జాగ్రఫీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ 3. ఇండియన్‌ పాలిటీ 4. ఇండియన్‌ ఎకానమీ 5. హిస్టరీ ఆఫ్‌ ఇండియా 6. ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌ 7. కరంట్‌ ఇవెంట్స్‌ 8. మెంటల్‌ ఎబిలిటీ 9. ఎథిక్స్‌.. ఇంత విస్తృతమైన విభిన్నమైన సబ్జెక్టుల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్నీ, దృష్టి కోణాన్నీ పరీక్షిస్తారు. సంబంధిత పుస్తకాల అధ్యయనం, నిపుణుల ప్రసంగాలు విని ఆకళింపు చేసుకోవడం సివిల్స్‌ అభ్యర్థులకు ముఖ్యం. అంతవరకూ పెద్దగా తెలియని సబ్జెక్టులపై ఆసక్తిని పెంచుకుని, నిలుపుకోవటం...అధ్యయనం చేయటం ...సివిల్స్‌ ఆశావహులకు ప్రధాన సవాళ్ళు!
కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళిక తప్పనిసరి. ఆర్ట్స్‌ చదివేవారికి కొన్ని సబ్జెక్టులు కలిసినా వాటిలోనూ పరిధి, లోతు విషయంలో ఎంతో తేడా ఉంటుంది.
దేశంపై అవగాహన ముఖ్యం
సివిల్స్‌ పరీక్ష కోసం ఏం చదవాలి అని అనుభవజ్ఞులను అడిగితే ‘ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో సిద్ధమవండి’ అని చెబుతారు. ఆ పుస్తకాలన్నీ కొని, ఒకటి లేదా రెండింటితో మొదలుపెట్టి, తరువాత ముందుకు సాగలేకపోవచ్చు. కారణం- చదువుతున్న అంశంపై ఆసక్తిని కొనసాగించలేకపోవడమే. అలా ఆసక్తిని కొనసాగించాలనుకుంటే 21వ శతాబ్దంలో భారత్‌ను అర్థం చేసుకోవాలి. ప్రస్తుతస్థితికి దేశం ఎలా చేరిందో, రేపటి అవకాశాలేంటో గ్రహించాలి.
* భారత్‌ తన బహుళ సంస్కృతితో ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తన శక్తితో ఉత్తేజపరుస్తుంది. సంప్రదాయాలతో ఆకర్షిస్తుంది - భారతీయ సంస్కృతి మౌలిక లక్షణాలు దీనికి కారణం.
* హింస, పేదరికం, అవినీతి పరంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అయినా ప్రపంచ దేశాలు.. ముఖ్యంగా ఇంగ్లిష్‌ దేశాలు, ప్రజాస్వామిక సంస్థలు అభిమానించేలా ఉంటుంది.
* ఈ శతాబ్ద మధ్యకాలానికి ప్రపంచంలోనే జనాభాపరంగా మొదటిస్థానానికీ¨, ఆర్థికపరంగా రెండో స్థానానికీ చేరుకునే అవకాశముంది.
* ఇతర దేశాలతోపాటు భారత్‌ కూడా భూతాప ప్రభావానికి గురవుతోంది. దానికి పరిష్కారాల విషయంలోనూ ముందుంటోంది.
* ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీల విషయంలో కీలకపాత్ర పోషిస్తోంది.
* 21వ శతాబ్దం.. భారత్‌దే!
ఈ అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాటి విభిన్న కోణాలపై పరిజ్ఞానం సంపాదించే కృషి ప్రారంభించండి. వీటికి సమాధానాలు తెలుస్తున్నాయంటే.. సివిల్స్‌ను అర్థం చేసుకునే మార్గంలో మీరున్నట్లే. అప్పుడిక సివిల్స్‌లో కీలకమైన జనరల్‌ స్టడీస్‌పై దృష్టిపెట్టవచ్చు.
జనరల్‌స్టడీస్‌ విషయంలో..
మొదటి అంచెలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సిలబస్‌ను విశ్లేషించాలి. 1. కరెంట్‌ అఫైర్స్‌ 2. జనరల్‌ నాలెడ్జ్‌ 3. హిస్టరీ ఆఫ్‌ ఇండియా అండ్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌ 4. ఇండియన్‌ పాలిటీ, గవర్నెన్స్‌ 5. జనరల్‌ సైన్స్‌ 6. ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ 7. ఇండియన్‌ అండ్‌ వరల్డ్‌ జాగ్రఫీ. ఈ అంశాలు ప్రిలిమ్స్‌లోనూ, మెయిన్స్‌లోనూ గమనించవచ్చు. ఇలా వివిధ అంశాల్లో పోలికల జాబితా తయారుచేసుకున్నాక సన్నద్ధత ప్రారంభించొచ్చు.
* ప్రతి అంశానికీ ఒక కొత్త రిజిస్టర్‌ను పెట్టి, ముఖ్యాంశాలను నోట్‌ చేస్తుండాలి. శాస్త్రీయంగా ఉండే జాగ్రఫీ వంటి వాటితో మొదలుపెట్టాలి. పదోతరగతి స్థాయిలో చదివిందే కాబట్టి, దీన్ని అందరూ అనుకూలంగా భావించే వీలుంటుంది. దీనికి ఎన్‌సీఈఆర్‌టీ ప్రాథమిక పుస్తకాలు చదివితే సరిపోతుంది.
* ప్రాథమిక విషయాలను తెలుసుకున్నాక ఆ సబ్జెక్టుకు వర్తమాన వ్యవహారాలను జోడించడం మొదలుపెట్టాలి. ఉదాహరణకు- తుపాను హెచ్చరిక గురించి దినపత్రికల్లో వార్త వస్తే ...తుపాన్లు ఎందుకు వస్తాయి? లక్షణాలేమిటి అనేది తెలుసుకోవాలి. తుపాన్లకూ, హరికేన్లూ, టోర్నడోలకూ తేడాలేమిటో చూడాలి. తుపాన్లకు పెడుతున్న పేర్లూ, వాటికి కారణాలూ వీటన్నిటిపైనా పరిజ్ఞానం సంపాదించాలి. ఇలా చేస్తే చాలావరకూ ఈ సబ్జెక్టుపై పట్టు వస్తుంది.
* తర్వాత ఎన్విరాన్‌మెంట్‌ చదివితే, అది జాగ్రఫీతో సంబంధమున్నది కాబట్టి కష్టమనిపించదు. జాగ్రఫీకి అనుసరించిన విధానాన్నే పాటించి పరిజ్ఞానం పెంచుకోవాలి.
* ఆపై సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అధ్యయనం సాగించాలి. దీనిలో తాజా పరిణామాలను గ్రహించాలి.
* దీని తర్వాత హిస్టరీ సంగతి చూడాలి. మొదట ఒక నవలలాగా చదవాలి. తర్వాత ఆసక్తి పెరిగాక..దానిపై నోట్సు తయారుచేసుకోవటం మొదలుపెట్టాలి.
* మిగిలిన అంశాలైన ఎకనామిక్స్‌, సోషల్‌ డెవలప్‌మెంట్‌, పాలిటీల విషయంలో అధ్యాపకుల సహాయం తీసుకుంటే మంచిది. సీనియర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ రకంగా వివిధ సబ్జెక్టుల్లో పునాదిని ప్రణాళికాబద్ధంగా ఏర్పరచుకోవాలి.
పక్కాగా పాటిస్తే సులువే!
ఈ రోజుల్లో 21-22 సంవత్సరాల వయసులోనే కొందరు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికవుతున్నారు. వాళ్ళు మొదటిసారే సివిల్స్‌ పరీక్ష రాసి విజయం సాధించివుండవచ్చు కానీ దానికి పునాదిని అంతకుముందే నిర్మించుకుంటూ వచ్చారని గ్రహించాలి. విద్యార్థులు సాధారణ డిగ్రీ గానీ బీటెక్‌, మెడికల్‌ లాంటి వృత్తి విద్యాకోర్సులు గానీ చదువుతూ సివిల్స్‌కు తగిన పునాదిని వేసుకోవచ్చు.
సిలబస్‌ చాలా విస్తృతం. దానిలోని ప్రధానమైన తొమ్మిది సబ్జెక్టులకు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవటం ప్రారంభించాలి. మార్కెట్‌లో వివిధ సబ్జెక్టుల్లో ప్రామాణికమైన పుస్తకాలు కూడా లభిస్తున్నాయి. ఇవన్నీ చదవటానికి నెలవారీగా సమయాన్ని విభజించుకుని, కేటాయించుకోవాలి. డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం నుంచే డిగ్రీ అధ్యయనానికి ఎలాంటి ఇబ్బందీ కల్గించకుండానే ఈ టైమ్‌టేబుల్‌ వేసుకోవచ్చు. రోజూ వీలైనంత సమయం క్రమం తప్పకుండా చదివేలా ప్రణాళిక వేసుకుంటే డిగ్రీ ముగిసే సమయానికి సివిల్స్‌ పరీక్ష ప్రాథమిక అంశాలపై చక్కటి పట్టు వచ్చేస్తుంది.
సివిల్స్‌ ఆశావహులు ప్రతిరోజూ వార్తాపత్రిక చదవటం అలవాటు చేసుకోవాలి. కరంట్‌ అఫైర్స్‌ చాలా ముఖ్యం. ముఖ్యంగా వివిధ అంశాలపై పత్రికల్లో ప్రచురించే ఎడిటోరియల్స్‌ చదవటం వల్ల భిన్నకోణాలపై అవగాహన వస్తుంది.
హిస్టరీ, పాలిటీ మొదలైన సబ్జెక్టుల అధ్యయనం గురించి యూట్యూబ్‌లో చాలా ఛానల్స్‌ ఉన్నాయి. తేలిక భాషలో నాణ్యమైన విషయ వివరణతో ఉంటాయవి. వాటిని ఉపయోగించుకోవాలి.
వ్యాసాలు (ఎస్సేలు) రాయటం ప్రత్యేకమైన నైపుణ్యం. సివిల్స్‌ పరీక్షలో వీటికి ప్రాముఖ్యం ఉంది. సుప్రసిద్ధ నాయకుల, మేధావుల, రచయితల కొటేషన్లు జోడిస్తే వ్యాసాలకు విలువ వస్తుంది. అలాంటివి తెలుసుకుంటూ సందర్భోచితంగా ఉటంకిస్తూ రాయటం డిగ్రీ ముగిసేలోపే సాధన చేయటం మంచిది.Posted on 05-07-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning