అంతర్జాలమే.. పరిశోధనశాల!

* ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ వర్చువల్‌ ల్యాబ్‌
* ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉచితంగా ప్రయోగ పాఠాలు

ఈనాడు - హైదరాబాద్‌ : పుస్తకాల్లోని పాఠాలను క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే విషయజ్ఞానలోపం ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు శాపంగా మారుతోంది. నాస్కామ్‌ గణాంకాల ప్రకారం ఇంజినీరింగ్‌ పూర్తి చేసి బయటకు వచ్చిన విద్యార్థుల్లో కేవలం 12-18 శాతం మందిలో మాత్రమే కంపెనీల అవసరాలకు అనుగుణమైన పరిజ్ఞానం ఉంటున్నట్లు గుర్తించారు. అధిక శాతం సాంకేతిక కళాశాలల్లో సరైన వసతులు, ప్రయోగశాలలు కరవై ఉద్యోగ వేటలో వెనుకబడుతున్నారు. సంస్థల అవసరాలకు తగిన నైపుణ్యాలు లేక అద్భుతమైన కెరీర్‌ను చేజార్చుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐఐటీ హైదరాబాద్‌ వేదికగా వర్చువల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవసరమైన సమాచారం ఇక్కడ నిక్షిప్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి అయినా వర్చువల్‌ ల్యాబ్‌లో ఉచితంగా ప్రయోగాలు చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని భావి ఇంజినీర్ల నైపుణ్యాలకు మెరుగులు దిద్దేందుకు వీలుగా ఇంటర్న్‌షిప్‌ నిర్వహణకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ చేయూతనిస్తోందని వర్చువల్‌ ల్యాబ్స్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పి.రవిశంకర్‌ పేర్కొన్నారు. మూడున్నరేళ్ల వ్యవధిలో 8 లక్షల మంది విద్యార్థులు వర్చువల్‌ ల్యాబ్‌ ద్వారా ప్రయోగ సేవలను వినియోగించుకున్నట్లు వివరించారు.
11 విద్యా సంస్థలు.. 1400 ప్రయోగాంశాలు
ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో శాస్త్ర, సాంకేతిక కోర్సులు చేస్తున్న విద్యార్థుల కోసం వర్చువల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) ఆధ్వర్యంలో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చి సెంటర్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పుర్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహతి, అమృత విశ్వవిద్యాపీఠం, దయాల్‌బాగ్‌ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ కర్ణాటక, సీవోఈ పుణే, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ విద్యాసంస్థలు సంయుక్తంగా వర్చువల్‌ ల్యాబ్‌ నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద వర్చువల్‌ ల్యాబ్‌ రూపకల్పనలో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వెంకటేష్‌ చొప్పెళ్ల కీలక పాత్ర పోషించారు. ఫేజ్‌-2లో భాగంగా రూ.68 కోట్లతో ప్రాజెక్టును ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ, పరిశోధక విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు అనుకూలంగా పరిశోధనశాలకు రూపకల్పన చేశారు. వివిధ విభాగాల్లో 1400 ప్రయోగాలను ల్యాబ్‌లో ఉంచారు. వీటిలో 1100 ప్రయోగాంశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు వర్చువల్‌ ల్యాబ్‌ సమన్వయకర్త ప్రియారామచంద్రన్‌ తెలిపారు. వర్చువల్‌ ల్యాబ్‌ ద్వారా 12 బ్రాంచీలకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రయోగాలు చేసుకోవచ్చు. సిలబస్‌లోని పాఠ్యాంశాలకు తగినట్లుగా 11 ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు పరిశోధనలకు అవసరమైన అంశాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. విద్యార్థులు ఉచితంగా తాము చేయాల్సిన ప్రయోగాంశాలను వర్చువల్‌ ల్యాబ్‌ వెబ్‌సైట్‌ ద్వారా నేర్చుకోవచ్చు. పరిశోధనకు అవసరమైన పూర్తి సమాచారం దాన్నుంచి తీసుకోవచ్చు. ప్రయోగాల విజయాల్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా అభివృద్ధి పరచిన విధానం విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ల్యాబ్‌ టెక్నికల్‌ మేనేజర్‌ తిరుమల రావుల.
సొంతంగా ఇంటర్న్‌షిప్‌ నిర్వహణకు చేయూత
సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, సమస్యను పరిష్కరించటం, కొత్త ప్రయోగాలకు ఊతమివ్వటం వర్చువల్‌ ల్యాబ్‌ లక్ష్యం. ఖరీదైన ప్రయోగ పాఠాలను ఉచితంగా అందజేయటం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలకు ఊతమిస్తారు. దీంతోపాటు కళాశాలలు స్వయంగా ఇంటర్న్‌షిప్‌ చేపట్టేందుకు వర్చువల్‌ ల్యాబ్‌ అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తుంది. ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన బోధన నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు ఇంటర్న్‌షిప్‌ సేవలు అందిపుచ్చుకునే వీలుంది. ప్రతి కళాశాల నుంచి ఒకరిద్దరు ఫ్యాకల్టీ, నలుగురైదుగురు విద్యార్థులు జట్టుగా కొత్త ప్రాజెక్టు రూపొందించి వివరాలను వర్చువల్‌ ల్యాబ్‌ ద్వారా పంచుకోవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, ప్రయోగాలకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ దిశానిర్దేశం చేస్తుంది. కళాశాల బోధన నిపుణులు, విద్యార్థులు రూపొందించిన ఇంటర్న్‌షిప్‌ అంశం పూర్తయిన తరువాత ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ధ్రువపత్రాలు అందజేస్తుంది. దీనివల్ల సృజనాత్మకత, ప్రయోగాల పట్ల ఆసక్తి పెరుగుతుందని రవిశంకర్‌ వివరించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ సిలబస్‌లోని అంశాలపై పట్టు పెంచుకునేందుకు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందుకుంటారన్నారు. క్లౌడ్‌ ద్వారా దేశంలోని ఏ విద్యార్థి అయినా వర్చువల్‌ ల్యాబ్‌ను వినియోగించుకోవచ్చని ల్యాబ్‌ టెక్నికల్‌ మేనేజర్‌ తిరుమల తెలిపారు. ఏజీపీఎల్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ల్యాబ్‌ టూల్స్‌ను ఎవరైనా వినియోగించుకోవచ్చని చెప్పారు.Posted on 16-07-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning