కొలువుకు కొత్త ఒరవడి

* ‘కోడింగ్‌’ సత్తా ఉన్న విద్యార్థులకు అవకాశాలెన్నో..
* ఐటీతో పరిష్కారానికి పోటీలు
* ప్రాంగణ నియామకాలకు ప్రత్యామ్నాయం కానున్న విధానం?
* ఇప్పటికే కొన్ని కంపెనీల శ్రీకారం

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ కంపెనీలు ఈ విద్యాసంవత్సరం ప్రాంగణ నియామకాలను ప్రారంభించడంతోపాటు ప్రతిభావంతులైన విద్యార్థుల ఎంపికకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిష్కారం చూపే సత్తా ఉన్న విద్యార్థులకు ‘కోడింగ్‌ పోటీలు’ నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టగా సమీప భవిష్యత్తులో ఈ విధానాన్ని అన్ని కంపెనీలూ అనుసరించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బహుళజాతి పరిశ్రమ అయిన జేపీ మోర్గాన్‌ సంస్థ ‘కోడ్‌ ఫర్‌ గుడ్‌’ పేరిట స్వచ్ఛంద సంస్థలు గుర్తించిన కొన్ని సమస్యలను అభ్యర్థుల ఎదుట ఉంచి రెండు రోజుల హాకథాన్‌ నిర్వహించింది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలు కళాశాలల నుంచి ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులు హాజరయ్యారు. జులై 14 ఉదయం 8.30 గంటలకు పోటీలు ప్రారంభమై జులై 15 మధ్యాహ్నం ముగిశాయి. సమస్యలకు పరిష్కారం చూపేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలి. ఇదే బాటలో ఇన్ఫోసిస్‌ కూడా హ్యాక్‌ విత్‌ ఇన్ఫీ పేరిట కోడింగ్‌ పోటీలను జరిపి తమకు అవసరమైన అభ్యర్థులను కొంతవరకు ఎంపిక చేసుకుంటోంది. టీసీఎస్‌ సైతం ప్రాంగణ నియామకాలకు కళాశాలలకు వెళ్లేముందు కోడ్‌ విటా పేరిట అందరికీ అవకాశం కల్పిస్తూ కోడింగ్‌ పరీక్ష జరిపి ఎంపిక చేసుకుంటోంది. కొన్ని ఐటీ కంపెనీలు కోడింగ్‌ పరీక్షలు నిర్వహిస్తూ బహుమతులందజేస్తున్నాయి. కొన్ని ఉద్యోగాలు అందిస్తున్నాయి.
ఎందుకీ విధానం?
జావా, డాట్‌నెట్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ సాంకేతికతను వినియోగించుకొని ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం (ప్రాబ్లం స్టేట్‌మెంట్‌) చూపే ప్రోగ్రాములు రాయడాన్నే కోడింగ్‌ అంటారు. ఇప్పటివరకు భారతీయ ఐటీ కంపెనీలు సర్వీసు రంగంలోనే ఉన్నాయి. ఎక్కువ కంపెనీలు కొత్త సాఫ్ట్‌వేర్లను తయారు చేయడం లేదు. ఆటోమేషన్‌తోపాటు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధాన నిర్ణయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడిన భారతీయ ఐటీ సర్వీసు కంపెనీలకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. అందుకే సొంతగా సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను తయారుచేసే ప్రాడక్ట్‌ కంపెనీలుగా మారే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే కోడింగ్‌లో సత్తా ఉన్న వారి అవసరం ఎక్కువైంది.
సర్వీస్‌ కంపెనీలు సైతం.. - వెంకట్‌ కాంచనపల్లి, సీఈఓ, సన్‌టెక్‌ కార్ప్‌ సొల్యూషన్‌
కొద్ది సంవత్సరాల వరకు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ లాంటి ప్రొడక్ట్‌ కంపెనీలు అభ్యర్థుల్లో కోడింగ్‌ ప్రతిభను చూసి ఎంపిక చేసుకునేవి. అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల వల్ల ఇప్పుడు సర్వీసు కంపెనీలు సైతం అభ్యర్థుల్లో కోడింగ్‌ సత్తాను పరీక్షిస్తున్నాయి. మున్ముందు అభ్యర్థుల ఎంపికకు ఈ విధానాన్నే అనుసరించే సూచనలున్నాయి.
కోడింగ్‌ పరీక్షలు నిజమే - ఎన్‌ఎల్‌ఎన్‌ రెడ్డి, ప్రాంగణ నియామకాల అధికారి, సీబీఐట
జేపీ మోర్గాన్‌ కంపెనీ కళాశాలలకు వెళ్లకుండా కోడింగ్‌ పరీక్ష నిర్వహించింది. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.11 లక్షలు ఇస్తామన్నారు. మొదట మా విద్యార్థుల జాబితాను ఆ కంపెనీకి పంపించాం. వారు వడపోసి కొందరిని ఆహ్వానించారు. ప్రస్తుత సమస్యలు (రియల్‌ టైమ్‌ ప్రాబ్లమ్స్‌)ను పరిష్కరించాలని పోటీ పెట్టడం మంచిదే.


Posted on 18-07-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning