కోర్సుకు తగిన నైపుణ్యం

రోజుకి రూపాయితో వైద్యబీమా అందిస్తాం.. రూపాయి పొదుపుతో పింఛను ఇస్తాం... ఇలా ఎన్నో సంస్థలు ప్రకటనలు చేస్తూనే ఉంటాయి. భవిష్యత్తులో ఎంత వరకు సాధ్యమోకానీ... రోజుకి ఒక్కరూపాయి ఖర్చుతో జీవితంలో ఎత్తైన శిఖరాలు చేరుకోవచ్చు. విద్యార్థులు ఒక నెల పాకెట్‌మనీతో కోర్సు పూర్తయ్యేవరకు ఎన్నెన్నో నైపుణ్య శిక్షణలు పొందవచ్చు.

పోటీ ప్రపంచంలో అవకాశాలు బోలెడున్నాయి. కానీ వాటిని సకాలంలో సరైన సమయానికి అందిపుచ్చుకోవడం ఓ సవాల్‌. మారుతున్న పరిస్థితులు, మార్కెట్‌ అవకాశాలు, నూతన సాంకేతికలను ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకుంటేనే నిలబడి ఉన్నత శిఖరాలను అందుకోగలము. కోరుకున్న రంగంలో మంచి ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కోర్సును ఎంచుకున్నప్పటి నుంచి ప్రణాళిక అవసరం. బేసిక్స్‌ నుంచి శిఖరం వరకు నైపుణ్యం అవసరం. ఈ ప్రణాళిక లేక, మార్కెట్‌ పరిస్థితులు, నైపుణ్య అవసరాలను అంచనా వేయలేక చాలా మంది వెనకబడిపోతున్నారు. తెలంగాణలోని యువత నైపుణ్యలేమితో అవకాశాలకు దూరం కాకూడదన్న ఆశయంతో సర్కారు ఐటీశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ (టాస్క్‌)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో చదువుకునే యువతకు వివిధ కోర్సులు, సర్టిఫికేషన్లకు ఉచిత, తక్కువ ధరల్లో శిక్షణ అందిస్తోంది. బహిరంగ మార్కెట్‌ ధరల కన్నా తక్కువకే విలువైన సర్టిఫికేషన్లు అందిస్తోంది. టాస్క్‌లో చేరేందుకు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ విద్యార్థులను కోరింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
నైపుణ్య శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోంది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ రెండో ఏడాది చదువుతున్న, కొత్తగా కోర్సులో చేరిన విద్యార్థులు టాస్క్‌ వెబ్‌సైట్‌ ద్వారా https://www.task.telangana.gov.in/Student-Registration దరఖాస్తు చేసుకోవాలి. అయితే టాస్క్‌లో నమోదైన కళాశాలల విద్యార్థులకు మాత్రమే శిక్షణ పొందేందుకు వీలవుతుంది. ఈ-మెయిల్‌, మొబైల్‌ నెంబరు, కళాశాల, వ్యక్తిపేరు, చిరునామా నమోదు చేసి నిర్ణీత ఫీజు చెల్లించాలి. ఒకసారి నమోదైతే కోర్సు పూర్తయ్యే వరకు టాస్క్‌ శిక్షణ కార్యక్రమాలు తీసుకోవచ్చు. నైపుణ్యం పొందేందుకు అభ్యర్థి సాధిస్తున్న, సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకోరు. మార్కుల ప్రాతిపదిక ఉద్యోగాల ఎంపికకు వచ్చిన సంస్థలు నిర్ణయించుకుంటాయి. ప్రతిఒక్కరికి నైపుణ్యం అందించాలన్న ఉద్దేశంతోనే సర్కారు ఉంది. సగటున లెక్కిస్తే ఇంజినీరింగ్‌ విద్యార్థులు రోజుకి రూపాయి ఖర్చుతో, ఇతరులు అంతకు తక్కువతో విలువైన నైపుణ్య శిక్షణ పొందేవీలుంది. నూతన సాంకేతికలపై మార్కెట్‌ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో టాస్క్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తోంది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది.
మూడు రకాల శిక్షణలు
టాస్క్‌లో నమోదైన విద్యార్థులకు మూడు రకాలుగా శిక్షణ కార్యక్రమాలు అందుతున్నాయి.
1. టాస్క్‌ తమ శిక్షణ కేలండర్‌లో ముందుగానే సమాచారం అందుబాటులో ఉంచుతుంది. ఫీజుతో కూడుకున్న శిక్షణ అయితే ఆ మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఉచిత శిక్షణకు పేరు నమోదు చేసుకుని హాజరుకావచ్చు. స్వల్పకాల కోర్సులను ఆన్‌లైన్లో ఉచితంగా అందిస్తోంది.
2. టాస్క్‌లో చేరిన కళాశాలల అధ్యాపకులకు కొన్ని కీలకమైన సర్టిఫికేషన్ల బోధనలో ఆయా సంస్థలతో శిక్షణ ఇప్పిస్తోంది. ఈ అధ్యాపకులు తమ విద్యార్థులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
3. కళాశాలలో 40 మంది విద్యార్థులు ఒకేరకమైన కోర్సు కావాలని కోరుకుంటే నిపుణులను అక్కడికే పంపించి బోధిస్తోంది. కొన్ని సందర్భాల్లో రెండు మూడు కళాశాలల విద్యార్థులను ఒకే చోటకు చేర్చుతోంది.
ఉపయోగాలు: టాస్క్‌లో చేరిన విద్యార్థికి బహుముఖ ఉపయోగాలున్నాయి. కోర్సులో చేరినప్పటి నుంచి స్వల్పకాలిక శిక్షణలతో నైపుణ్యం పెంచుకోవడంతో పాటు కోర్సు పూర్తయ్యాక ఫినిషింగ్‌ స్కూల్‌కు హాజరై ఉద్యోగాన్వేషణ చేసుకోవచ్చు. ఐటీ సంస్థల టాస్క్‌ ద్వారా నియామకాలు చేపడుతున్నాయి. పలు సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నాయి. ఇప్పటి వరకు 7వేల మంది వరకు ఉద్యోగాలు పొందారు. ఆంగ్లభాషా ప్రావీణ్యం, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు, మెంటార్‌ టాక్‌, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలు, ప్రయోగశాలల ఉపయోగం, నియామక మేళాల్లో పాల్గొనడం తదితర అవకాశాలున్నాయి. ఇంజినీరింగ్‌లో విభాగాలవారీగా 38 రకాల కోర్సులు అందుతున్నాయి. టాస్క్‌లో నమోదైన తరువాత వెబ్‌సైట్లో ‘స్కిల్‌ ఆఫరింగ్స్‌’ సెక్షన్‌కు వెళ్లి అక్కడ తాము చదువుతున్న కోర్సును ఎంచుకోవాలి. అక్కడ ఉచితంగా ఇచ్చే కోర్సులు, ఫీజులు తీసుకునే కోర్సులు, ఏ యేడాదిలో అందిస్తారో స్పష్టంగా ఉంటాయి. ఇంజినీరింగ్‌లో ప్రస్తుతం 38 కోర్సులు, డిగ్రీలో 17, ఫార్మసీలో ఎనిమిది, ఎంబీఏ, ఎంసీఏకు 9, పాలిటెక్నిక్‌కు, ఐటీఐకు 11 కోర్సులు ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పెంచుతూ వెళ్తారు. శిక్షణ పార్టనర్‌లు అందించే ప్రతి కొత్త సర్టిఫికేషన్‌ కోర్సు టాస్క్‌లో తక్కువ ధరతో ఉంటుంది.
ఇవీ ఫీజులు..
ఇంజినీరింగ్‌...
జనరల్‌, ఓబీసీ విద్యార్థులు - రూ.1416
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు - రూ.708
డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, పీజీ, ఫార్మసీ, పాలిటెక్నిక్‌
జనరల్‌, ఓబీసీ విద్యార్థలు - రూ.590
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు - రూ.295
రూ.100 ఆలస్య రుసుముతో ఆగస్టు 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా...
టాస్క్‌ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ , డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను అందిస్తున్నారు.
ఇంజినీరింగ్‌: ఈ కోర్సు చదివే విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌ను నేర్పుతారు. అన్ని ఇంజినీరింగ్‌ బ్రాంచిలవారికీ 1 నుంచి 2 రోజుల వ్యవధిలో పర్సనల్‌ స్కిల్స్‌, ఆర్గనైజేషనల్‌ అండ్‌ ఇంటర్‌ వ్యూ స్కిల్స్‌, ఏ అండ్‌ ఆర్‌ మూక్స్‌ ఓరియెంటేషన్‌ కోర్సుల్లో నిర్దిష్ట నైపుణ్యాలను టాస్క్‌ ద్వారా బోధిస్తారు. కేంబ్రిడ్జి ద్వారా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ సర్టిఫికేషన్‌ (45 గంటలు), ఏఏ ఎడ్యుటెక్‌ కంపెనీ ద్వారా ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ (90 గంటలు) నేర్పుతారు. ఇక సాంకేతిక నైపుణ్యాలను అన్ని బ్రాంచిలవారికీ, నిర్దిష్ట బ్రాంచిలవారికీ నిర్దిష్ట నైపుణ్యాలను టాస్క్‌తో పాటు ఇన్ఫోసిస్‌, ఐఎస్‌బీ, హైసియా, ఐఐటీ బాంబే, ఇంటర్న్‌శాల, సిస్కో, మైక్రోసాఫ్ట్‌, రెడ్‌హాట్‌, గూగుల్‌ మొదలైన సంస్థలు వివిధ కాల వ్యవధుల్లో నేర్పుతాయి.
డిగ్రీ: ఈ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌ను బోధిస్తారు. సాంకేతిక నైపుణ్యాల్లో బీఎస్‌సీ/బీకాం కంప్యూటర్స్‌ విద్యార్థులకు నిర్దిష్టంగా కొన్ని అంశాలనూ, మిగిలినవి అన్ని డిగ్రీల విద్యార్థులకూ నేర్పుతారు.
ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ: ఈ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌నూ, టెక్నికల్‌ స్కిల్స్‌నూ వివిధ కాల వ్యవధులున్న కోర్సుల ద్వారా బోధిస్తారు.
పాలిటెక్నిక్‌: సాఫ్ట్‌స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌ను బోధిస్తారు. సాంకేతిక నైపుణ్యాలను అన్ని ట్రేడ్లవారికీ, నిర్దిష్ట సాంకేతిక నైపుణ్యాలను మెకానికల్‌, సివిల్‌ వారికీ నేర్పుతారు.

- సి.నాగరాజు, ఈనాడు, హైదరాబాద్‌


Posted on 18-07-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning