ఫేస్‌బుక్‌కి ప‌దేళ్లు !

* అదో వింత ప్రపంచం. జనాభా 126 కోట్ల మంది. ఇక్కడివారికి మరణం ఉండదు.

* పైగా ఇక్కడి వారిలో 70 శాతం యువతే. వీరిలో సగం మంది నిద్రలేచిందే క్లిక్‌మంటారు.

డక నుంచి దిగక ముందే స్నేహితులు, బంధువులు, పరిచయస్తుల యోగక్షేమాలు తెలుసుకొంటారు. గంటల కొద్దీ చాట్లాడతారు. మనసులో మాటను దాచుకోలేరు. యావత్‌ ప్రపంచానికీ తెలియజేస్తారు. వీరిలో కొందరికి ప్రత్యక్షంగా సంబంధాలు ఉండవు. బాధలు, సంతోషాలు, వేడుకలు అన్నీ 'తెర'చాటునే. ఆ వింత ప్రపంచమే ఫేస్‌బుక్‌. అమెరికాలోని మార్క్‌ జుకర్‌బర్గ్‌ అండ్‌ కో ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌కు ఇప్పుడు 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పదేళ్లలో ఇది మానవ సంబంధాలపై మునుపెన్నడూ లేనంత ప్రభావాన్ని చూపింది. అంతర్జాలం.. మొబైల్‌ ఫోన్ల కన్నా భారీ విప్లవాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వాల్ని శాసించాలన్నా.. ప్రజల్లో విప్లవాన్ని తీసుకురావాలన్నా.. ఓట్లు తెచ్చిపెట్టాలన్నా.. కోట్ల వ్యాపారమైనా అన్నిటికీ అవసరమైంది. చదువు, స్నేహం, ప్రేమ, బంధాలు, బంధుత్వాలు, వ్యాపారం, ప్రచారం, ప్రసారం, కబుర్లు, కహానీలు, చాటింగ్‌, మీటింగ్‌, ఇలా రకరకాల భావాలకు, పనులకు వేదికైంది. కోపం, ద్వేషం, అయిష్టం, చికాకు, దుఃఖం, బాధలు, సంతోషాలు, ఆనందాలు, మధుర స్మృతులు ఇలా మదిలోని భావాలకు ప్రతిబింబమైంది. టీవీ, అంతర్జాలం, ఫోన్‌లు ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెస్తే.. ఫేస్‌బుక్‌ అదే ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. రోజులో ఎంత పని చేసినా.. ఏం సాధించినా.. ఎంత బాధపడినా. కనీసం 20 నిమిషాల పాటు నాతో గడుపు అంటుందీ మాయాపుస్తకం. ఒక వ్యక్తి చనిపోయినా బతికే ఉన్నట్లు నమ్మిస్తుంది. అతని జీవితం తాలూకు మధురస్మృతులను కుటుంబీకులు, బంధువులు, స్నేహితులకు వెల్లడిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో ఒక పుట ఉండకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం కనీసం ఒక పేజీ అయినా సాధ్యమవుతుంది. ఇలా చెప్పుకొంటూ పోతే గత పదేళ్లలో ఈ సామాజిక విప్లవం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా దీని వినియోగదారులు ఏటా 22 శాతం పెరుగుతూనే ఉన్నారు.
ఇలా బుక్కయ్యాం
ఫేస్‌బుక్‌లో ఏముంది.. అనుకుంటారు దీని గురించి తెలియనివారు. ఒక్కసారి లోనికి ప్రవేశించామా.. అంతే. మీకు సంబంధించిన స్నేహితులు, బంధువులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులు క్షణాల్లో మీకు 'యాడ్‌' అవుతారు. మీరు, ఇతరుల జీవితానికి సంబంధించిన ప్రతి విషయమమూ ఇందులో నిక్షిప్తమై భద్రంగా దాచుకొనే వీలుంటుంది. ఏళ్ల కొద్దీ చరిత్రను ఒక్క క్లిక్‌తో చూడొచ్చు. ఎవరితో ఎక్కడ ఫొటో/వీడియో దిగినా.. అది ఎలా వస్తుందన్న బెంగ అవసరం లేదు. ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవుతుంది. కొత్త పరిచయాలు, కొత్త వారితో సంబంధాలు, కాస్త ప్రైవసీ ఉండటంతో ఇక్కడ భలేగా ఉందనిపిస్తుంది. వందల పేజీల ఆసక్తికర సమాచారాన్ని ఇక్కడ కొన్ని గంటల్లోనే చదువుకొనే వీలుంటుంది. కాని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పోస్ట్‌, లేదా వ్యాఖ్య తేడాగా చేసినా సరే మీకు బుక్కయిపోతారు. లేనిపోని చిక్కులు వస్తాయి. జీవితంలో ఏ ఘటన జరిగినా దాని తాలూకు సాక్ష్యాలను ఇక్కడ భద్రంగా దాచుకొనే వీలుంటుంది. దీంతో ఒక్కసారి ఇందులోకి ప్రవేశించాక మళ్లీ వెనక్కు వెళ్లడం కష్టమవుతోంది. ప్రతి ఒక్కరికీ అంతర్జాలం అతి తక్కువ ధరకు అందుబాటులోకి వస్తే.. అందరూ తప్పకుండా ఫేస్‌బుక్‌ వినియోగిస్తారు. ఇదీ జుకర్‌బర్గ్‌ భావన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అతి తక్కువ ధరకు అంతర్జాలం ఇచ్చేందుకు ఫేస్‌బుక్‌ కృషి చేస్తోంది. వచ్చే పదేళ్లలో దీన్ని అమల్లోకి తేవాలని చూస్తోంది.
మరో పదేళ్ల తర్వాత ఉంటుందా..!
అంటే కష్టమే అంటున్నారు కొందరు పరిశోధకులు. దీని వ్యవస్థాపకుడు మాత్రం తాము మరింత కాలం సామాజిక మీడియాలో అగ్రస్థానంలోనే ఉంటామని సెలవిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని వ్యవస్థలు, యాప్స్‌ ఫేస్‌బుక్‌ ఉనికికి ఎసరు తెచ్చే విధంగా మారగా.. తన మనుగడను కాపాడుకోడానికి ఎఫ్‌బీ తీవ్రంగా కృషి చేస్తోంది. వాట్స్‌యాప్‌, స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మొబైల్‌ ఆధారిత యాప్స్‌ దీనికి బాగా పోటీనిస్తున్నాయి. యాప్స్‌లో ప్రైవసీ ఎక్కువగా ఉండటంతో యువత వీటిపై ఎక్కువగా ఆకర్షితులవుతోంది. దీంతో యాప్స్‌ వినియోగం పెరిగి.. ఫేస్‌బుక్‌ వినియోగదారుల వృద్ధి కాస్త తగ్గింది. దీంతో జుకర్‌ వెంటనే మేల్కొని పోటీ సంస్థ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ను కొనేశాడు. స్నాప్‌చాట్‌ను కొనేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. ఇలాగే ఉంటే మరికొనేళ్లలోనే ఎఫ్‌బీ కనుమరుగు అవుతుందంటూ పలు అధ్యయనాలు వెల్లడించడంతో.. కొత్త హంగులు, మార్పులు, చేర్పులతో ఎఫ్‌బీని నిత్యం ఆకర్షణీయంగా ఉంచుతూ ఎక్కువ మంది ఇక్కడ కొనసాగేలా జాగ్రత్త పడుతున్నారు. గూగుల్‌కు కూడా సవాల్‌ విసురుతున్నాడు. పరిశోధకులు మాత్రం ఫేస్‌బుక్‌ అనేది ఒక వ్యాధిలాంటిందని మరి కొనేళ్లలో అది అంతరిస్తుందని ఒక వాదన వినిపిస్తున్నారు.
ఎస్‌ఎంఎస్‌లు చూసేందుకు ఫేస్‌బుక్‌ యత్నం!
పదేళ్ల వేడుక జరుపుకొంటున్న ఫేస్‌ బుక్‌పై మరో విమర్శ వచ్చింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ప్లాట్‌ఫాంను ఉపయోగించే వ్యక్తుల ఎస్‌ఎంఎస్‌లు, ఇతర రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకుఅది యత్నిస్తోందని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ఒక ప్రకటనలో పేర్కొంది. ఫేస్‌బుక్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లో ఉన్న ఓ ఫీచర్‌ కొంత మంది వాడకందార్లకు ఆందోళన కలిగిస్తోందని వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు కొన్ని అనుమతులు కోరుతోందని ప్రస్తావించింది. ఎస్‌ఎంఎస్‌లు, మల్టీమీడియా మెసేజ్‌లు చూసేందుకు అనుమతించాల్సిందిగా అప్‌డేటెడ్‌ వర్షన్‌ అడుగుతోందని కాస్పర్‌స్కై తెలిపింది. దీనిపై ఫేస్‌బుక్‌ ఇంకా స్పందించలేదు. డిసెంబరు నాటికి ఫేస్‌బుక్‌ను భారత్‌లో 9.3 కోట్ల మంది ఉపయోగిస్తుండగా, వీరిలో 7.5 కోట్ల మంది మొబైల్‌ ద్వారా ఈ సైట్‌ను వాడుతున్నట్లు ఒక అంచనా ఉంది.
* ఫేస్‌బుక్‌ వయసు 10 ఏళ్లు
* వినియోగదారులు 126 కోట్లు
* ఆదాయం 510 కోట్ల డాలర్లు
* ఏర్పాటు ఫిబ్రవరి 4, 2004
? తెలుసా
* ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఇష్టపడే ఫీచర్‌ లైక్‌. 2009 ఫిబ్రవరిలో ఇది ప్రారంభమైంది.
* ఉదయాన్నే ఎఫ్‌బీ చూస్తున్న యువత శాతం 48
* 57 శాతం మంది నిజజీవితంలో కన్నా ఎఫ్‌బీలో ఎక్కువ మాట్లాడుతున్నారు.
* 3 కోట్ల మంది ఖాతాదారులు
* చనిపోయినా ఇక్కడ సజీవంగా ఉన్నారు.
* ప్రతి 20 నిముషాలకు
* 10 లక్షల లింక్‌లు షేర్‌ అవుతాయి.
* 18 లక్షల మంది స్టేటస్‌ అప్‌డేట్‌ మార్చుతారు
* 27 లక్షల ఫొటోలు అప్‌లోడ్‌ అవుతాయి
* 27 లక్షల సందేశాలు వెళ్తాయి.
* నకిలీలలు
* 10 శాతం ప్రొఫైళ్లు
* 4.5 కోట్ల ఖాతాలు ఇక్కడ నకలు.

- కృష్ణా,న్యూస్‌టుడే
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning