కోర్సును దాటిపో.. కొత్తవీ నేర్చుకో!

ఇంజినీరింగ్‌లోకి అడుగుపెట్టగానే ఆటపాటలు, పార్టీలు పబ్బులతో ఉత్సాహంగా... ఉల్లాసంగా గడిపాడు అవినాశ్‌. మొదటి సంవత్సరం మొదలు కమ్యూనికేషన్‌, సర్టిఫికేషన్‌, ప్రోగ్రామింగ్‌లు, ప్రాజెక్టులు అంటూ తీరికలేకుండా శ్రమించాడు తరుణ్‌. ఆఖరి సంవత్సరం తర్వాత బ్యాక్‌లాగ్‌ బాధలు దాటి అత్తెసరు మార్కులతో బయటకొచ్చిన అవినాశ్‌కి అంతా చీకటిగా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకున్న తరుణ్‌కి పెద్ద జీతాల ప్యాకేజీలతో అసలైన హ్యాపీడేస్‌ మొదలయ్యాయి. ఇంజినీరింగ్‌ కోర్సులో సబ్జెక్టుపరమైన పరిజ్ఞానానికే పరిమితమైతే సరిపోదు. సిలబస్‌ను దాటి మరిన్ని మెలకువలు, సవాళ్లను స్వీకరించే లక్షణాలను అలవాటు చేసుకుంటే ఆఫర్‌ లెటర్‌ వెతుక్కుంటూ వచ్చేస్తుంది.

అన్ని విధాలుగా అధ్యాపకులపై ఆధారపడే ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచి స్వీయచొరవ తప్పనిసరి అయిన ఇంజినీరింగ్‌ స్థాయికి ఎదగటం విద్యార్థులకు సవాలే. ఇంజినీరింగ్‌లో సబ్జెక్టుపరమైన జ్ఞానం మాత్రమే సరిపోదు. అన్ని కోణాల్లో చొరవతో సవాళ్లను ఎదుర్కొనే వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో ఒత్తిళ్లను తట్టుకుని లక్ష్యాలను సాధించేలా తయారవ్వాలి. ఇంజినీరింగ్‌లోని ప్రతి సెమిస్టర్‌లో యూనివర్సిటీ సిలబస్‌కి అదనంగా ఒక కొత్త మెలకువనూ, నైపుణ్యాన్నీ నేర్చుకోవాలి.
బీటెక్‌ తర్వాత లక్ష్యం ఉద్యోగ సాధనా, ఉన్నతవిద్యా అనేది మొదటిగా నిర్ణయించుకోవాలి. మొదటి సంవత్సరంలోనే దీనిపై స్పష్టత ఉండాలి. లక్ష్యం నిర్ధారించుకుంటేనే గమ్యం చేరుకోవడానికి అడుగులు పడతాయి. ఉద్యోగమే లక్ష్యమైతే మెలకువలు, నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తాం.
* ఇంజినీరింగ్‌ విద్యార్థులకు హాజరు చాలా ముఖ్యం.
* బ్యాక్‌లాగ్స్‌ లేకుండా జాగ్రత్త పడాలి. ఇవి కోర్సు పట్ల విద్యార్థుల అశ్రద్ధనూ, నిరాసక్తినీ సూచిస్తాయి. నియామకాల సందర్భంగా ఇబ్బంది కలిగిస్తాయి.
*అప్రధానమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కోర్సుపై, అదనపు సామర్థ్యాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.
1.మొద‌టి మెట్టు ఆంగ్లంపై ప‌ట్టు
మొదటి సంవత్సరంలో ఆంగ్ల వ్యాకరణం, కమ్యూనికేషన్‌పై దృష్టిపెట్టాలి. తొలి సెమిస్టర్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో భాగమైన Listening, Reading, Speaking and Writing ల్లో ప్రావీణ్యం సంపాదించాలి.
* ఎన్నో కంపెనీలు నిర్వహించే నియామక రాతపరీక్షల్లో మొదటి అంచెలో ఆంగ్లం, ఆప్టిట్యూడ్‌ టెస్టులు నిర్వహిస్తారు. సేవల రంగంలో ఉన్న కంపెనీలు మౌఖిక, భావవ్యక్తీకరణ నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తాయి.
* ఈ మొదటి సంవత్సరంలోనే ఆప్టిట్యూడ్‌ నైపుణ్యంపై శ్రద్ధ చూపాలి. సమయనిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకూ, సమస్యకు సమాధానం కోసం అవలంబించే క్రమపద్ధతిపై పట్టుకూ ఆప్టిట్యూడ్‌ సహాయపడుతుంది.
* పైతాన్‌ వంటి కొత్త ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజి నేర్చుకోవాలి. మొదటి సెమిస్టర్‌లో సి లాంగ్వేజి ఉంటే రెండో సెమిస్టర్లో దీన్ని నేర్చుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి. ఏ బ్రాంచికి చెందినవారైనా ఒక లాంగ్వేజి నేర్చుకోక తప్పదు. ఒక చిన్న ప్రాజెక్టు చెయ్యాలి. ఆ ప్రాజెక్టు మనం ప్రతిరోజూ చూసే అంశంపై కూడా ఉండవచ్చు.
* వీటన్నిటితోపాటు బీటెక్‌కి కూడా తయారవ్వాలి. ఎంత పర్సెంటేజి తెచ్చుకోవాలి లేక ఏ గ్రేడు సాధించాలి అనేది నిర్ధారించుకోవాలి.
* తమ బ్రాంచికి సంబంధించిన అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయి, వాటిక్కావల్సిన అదనపు నైపుణ్యాలు ఏమిటో సమగ్రంగా తెలుసుకోవాలి.
* తమ బ్రాంచికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ ప్రతిభ పరీక్షలు, పోటీల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు ప్రోగ్రామింగ్‌లో అభిరుచి ఉన్నవారికి టీసీఎస్‌ నిర్వహించే ‘కోడ్‌ విటా’, ఏసీఏం నిర్వహించే ఐసీపీసీ పోటీలున్నాయి. హ్యాకథాన్‌లపై అవగాహన పెంచుకోవాలి.
మొదటి సంవత్సరం లక్ష్యాలు: బీటెక్‌ గ్రేడు, ఆప్టిట్యూడ్‌, సి లాంగ్వేజ్‌, పైతాన్‌ లాంగ్వేజి, ఒక చిన్న ప్రాజెక్టు.
2. కనీసం రెండు నైపుణ్యాల్లో శిక్షణ
రెండో సంవత్సరం ప్రతి సెమిస్టర్‌లోనూ కనీసం ఒకటి.. వీలైతే రెండు నైపుణ్యాలు బ్రాంచికి సంబంధించిన సబ్జెక్టుల్లో నేర్చుకోవాలి. ఉదాహరణకు మెకానికల్‌ బ్రాంచి విద్యార్థులు ఆటోక్యాడ్‌, క్యాటియా లేదా ఆన్సిస్‌లో శిక్షణ తీసుకోవాలి. ఐఐటీలు నిర్వహించే NPTEL ఆన్‌లైన్‌ కోర్సులకు రిజిస్టర్‌ చేసుకుని, ఉత్తీర్ణులై సర్టిఫికేషన్‌ తెచ్చుకుంటే ఎంతో మంచిది.
* కొంత సమయం ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌కి కూడా కేటాయించాలి. ప్లూరల్‌ సైట్‌, ఉడాసిటి, యూడెమి వంటి అంతర్జాతీయ ఆన్‌లైన్‌ సంస్థలు, ఏఐసీటీఈ అందించే స్వయం (SWAYAM) వంటి మూక్స్‌ (మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) ద్వారా ప్రామాణిక సర్టిఫికేషన్లకి ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఒక ప్రాజెక్టు చెయ్యాలి. ఇంటర్న్‌షిప్‌ల వివరాలు తెలుసుకోవాలి.
* విదేశాలలో పైచదువులు కావాలనుకునేవారు తమకిష్టమైన రంగంలోని ప్రొఫెసర్ల వివరాలు సంపాదించి, వారిని ఇ-మెయిల్‌ ద్వారా సంప్రదించాలి. చాలావరకు ఈ ప్రొఫెసర్ల నుంచి ప్రత్యుత్తరం వస్తుంది. వారి ప్రశ్నలు సూటిగా ఉంటాయి. స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి.
* సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి.
రెండో సంవత్సరం లక్ష్యాలు: బీటెక్‌ సబ్జెక్టులు, మూక్స్‌ సర్టిఫికేషన్‌, ఎన్‌పిటెల్‌ కోర్సులు, ప్రత్యేక నైపుణ్యాల శిక్షణ. ఒక చిన్న ప్రాజెక్ట్‌.
3. పరిశ్రమల అవసరాలకు దీటుగా
మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోకి వచ్చేవరకే అదనంగా ఇంజినీరింగ్‌ రంగంలో ప్రస్తుతం వస్తున్న మార్పులపై స్పష్టమైన పరిచయం ఏర్పరచుకోవాలి. బీటెక్‌లో ఉన్న సబ్జెక్టులు వాటి మౌలికాంశాల పట్ల అవగాహన ఏర్పరుస్తాయి. ఐతే నిజజీవితంలో ఆ సూత్రాలను పరిశ్రమల్లో ఎలా ప్రయోగిస్తున్నారో గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. దీనివల్ల పరిశ్రమల అవసరానికి సంసిద్ధులం కావొచ్చు.
* ఆన్‌లైన్‌ కోర్సులు (ఒకటి లేదా రెండు) చెయ్యాలి. బీటెక్‌కి అవసరమైన మినీ ప్రాజెక్ట్‌ కూడా సిద్ధం చేసిపెట్టుకోవాలి.
* రెండో సెమిస్టర్‌కి వచ్చేసరికి ఇప్పటివరకు నేర్చుకొన్న అదనపు మెలకువలకు పదునుపెట్టుకోవడం, క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు సంసిద్ధులవడం బీటెక్‌తోపాటు చెయ్యవలసిన ముఖ్యమైన పనులు.
* దీనితోపాటు ఇంటర్న్‌షిప్‌ చేస్తే చాలామంచిది. www.internshala.com వంటి వెబ్‌సైట్‌లు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌కి సహాయపడతాయి. కొన్ని శిక్షణసంస్థలు ఇంటర్న్‌షిప్‌ పేరిట తమ వద్దనున్న కోర్సులను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాయి. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి.
* కాలేజీలోని ప్లేస్‌మెంట్‌ విభాగం కొన్ని అవసరమైన మెరుగుదిద్దే శిక్షణలు నిర్వహించవచ్చు. అవి ఉపయోగించుకోవాలి. AMACT, COCUBES వంటి సంస్థలు ఉద్యోగ సంసిద్ధతకు సూచికలవంటి అసెస్‌మెంట్‌ టెస్టులు నిర్వహిస్తాయి. నామమాత్రపు ఫీజుతో ఉండే వాటిలో పాల్గొనాలి. ఈ సంస్థలు తమ డేటాబేెస్‌ను నియామక పరిశ్రమలతో పంచుకుంటాయి కాబట్టి ఈ మార్గంలో కూడా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
* తమ బ్రాంచికి చెందిన ఒకటి, వీలైతే రెండు అడ్వాన్స్‌డ్‌ కోర్సులు చేస్తే చాలా మంచిది. ఉదాహరణకు మెకానికల్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ వారు రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వంటి కోర్సులు ప్రామాణిక సంస్థల నుంచి చేస్తే మేలు చేకూరుతుంది. వీలైనంతవరకూ ప్రాజెక్టు చెయ్యాలి.
* అటు పరిశ్రమలూ, ఇటు పైచదువుపై ఆసక్తి ఉన్నవారికి కూడా ప్రచురణలు అదనపు బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఈ సెమిస్టర్‌లోకానీ, పై సెమిస్టర్‌లో కానీ వీలుంటే రెండు సెమిస్టర్‌లలోనూ పేపర్‌ పబ్లిషింగ్‌ చాలా మంచిది.
మూడో సంవత్సరం లక్ష్యాలు: బ్రాంచికి సంబంధించిన కొత్త కోర్సు సర్టిఫికేషన్‌, ఎన్‌పిటెల్‌ వంటి మూక్‌ కోర్సు, టెక్నికల్‌- ఫార్మల్‌ కమ్యూనికేషన్‌, ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌, మినీ ప్రాజెక్ట్‌ సంసిద్ధత.
4. సబ్జెక్టులు, ప్రాజెక్టులపై శ్రద్ధ
నాలుగో ఏడాది దాదాపు చాలాభాగం ప్లేస్‌మెంట్‌ విభాగానికి కేటాయిస్తారు. మొదటి సెమిస్టర్‌లో వివిధ కంపెనీల ప్రాంగణ, ప్రాంగణేతర ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి వినియోగమవుతుంది.
* మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌ వరకూ నేర్చుకున్న మెలకువలనూ, నైపుణ్యాలనూ ప్రదర్శించేది ఈ సంవత్సరంలోనే!
* మొదటి సెమిస్టర్‌లో కాలేజీ సహకారంతో మాక్‌ ఇంటర్వ్యూలలో పాల్గొనడం, భావవ్యక్తీకరణ అభ్యాసం, దుస్తుల ధారణ వంటి సున్నితమైన అంశాలపై అభ్యాసం చెయ్యాలి.
* దీనితోపాటు బీటెక్‌లోని సబ్జెక్టులపై, ప్రాజెక్టుపై శ్రద్ధ చూపాలి.
ఈ విధంగా ఇంజినీరింగ్‌ ప్రయాణం మొదలుపెడితే నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ సమయానికి అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్‌తో కాలేజీలోంచి ఉద్యోగ ప్రపంచంలోకి అడుగు వెయ్యడం సాధ్యమే!
వీటిని గమనిద్దాం!
* మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థికి ముందస్తు ప్రణాళిక కాస్త కష్టం అనిపించవచ్చు. అధ్యాపకులు, సీనియర్లు, శ్రేయోభిలాషుల సహాయం తీసుకుంటూ మోడల్‌ ప్లాన్‌ వేసుకోవాలి. దానికి మార్పులు చేర్పులు ఎలాగూ చేసుకోవచ్చు.
* మొదటి సంవత్సరం నుంచే వివిధ హ్యాకథాన్‌లు, కోడింగ్‌ పోటీల వివరాలు సేకరించి పాల్గొనడానికి సిద్ధం కావాలి. భవిష్యత్తులో ప్రాంగణ నియమకాలు తక్కువ, కోడింగ్‌లో పాల్గొన్నవారిని నియమించుకోవడం ఎక్కువ కాబోతున్నది. ఉద్యోగంకోసం కేవలం కాలేజీ మీద ఆధారపడకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటే తగిన పురస్కారానికి అర్హత పొందవచ్చు.
* మన బ్రాంచిలో వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. మనం వాడే ప్రతి వస్తువు కూడా నిర్దిష్టమైన ఇంజినీరింగ్‌ ప్రక్రియ ద్వారా వచ్చినదే కదా! ఆ ప్రక్రియకు ఆధారమైన భౌతికశాస్త్ర సూత్రాలను గుర్తించగలగాలి. ఉదాహరణకు పెన్నులో ఉన్న ద్రవం తలకిందులుగా ఉంచి రాస్తున్నా ఎందుకు ఒక్క సారిగా ప్రవహించదు? అందులో ఉన్న ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ సూత్రం ఎలా అనువర్తింపజేశారు అవి ప్రశ్నించుకుని సమాధానం తెలుసుకోవాలి. రెండు తీగలు ఉంటేనే విద్యుత్తు ప్రవాహం సాధ్యం కదా, మరి స్మార్ట్‌ఫోన్‌లో టచ్‌స్క్రీన్‌ పని చేయడానికి అవసరమైన రెండు తీగలు ఏవి? అవి ఏ రూపంలో ఉంటాయనే ప్రశ్న రావాలి.
* యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న వీడియోలలో సబ్జెక్టుకు, బ్రాంచికి సంబంధించి నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అందులో అర్థంకాని అంశాలపై సందేహాలను అధ్యాపకుల సహాయంతో తీర్చుకోవాలి.
* కేవలం మన బ్రాంచికి సంబంధించే కాకుండా, ఇతర బ్రాంచిల గురించి కూడా తెలుసుకోవాలి.
Posted on 25-07-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning