రెండు మ్యాట్‌లకూ ఒకటే దారి!

దేశవ్యాప్తంగా ఉన్న బీ స్కూళ్లలో ప్రవేశాలకు ప్రకటనలు వరసగా వెలువడుతున్నాయి. ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే ‘మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌’ (మ్యాట్‌) ప్రకటన విడుదలైంది. నార్సీమోంజీ సంస్థలతోపాటు మరికొన్ని ఎంబీఏ కాలేజీల్లో ప్రవేశానికి తోడ్పడే ఎన్‌మ్యాట్‌ నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. డిగ్రీ పూర్తయినవారూ, ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ వీటికి పోటీ పడవచ్చు. మ్యాట్‌ స్కోరుతో 600కుపైగా విద్యాసంస్థలూ, ఎన్‌మ్యాట్‌తో 23 బీ స్కూళ్లూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ రెండు ప్రవేశపరీక్షల సిలబస్‌లలో ఉమ్మడి అంశాలున్నాయి. అభ్యర్థులు ఉమ్మడి సన్నద్ధత ప్రణాళిక వేసుకుంటే సమయం, శ్రమా ఆదా అవుతాయి. దీనికి ఉపకరించే సూచనలు ఇవిగో!‌

మ్యాట్‌‌ను ఏటా నాలుగుసార్లు నిర్వహిస్తారు. ఫిబ్రవరి, మే, సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఎన్‌-మ్యాట్‌ను వేరువేరు స్లాట్లలో 75 రోజులపాటు నిర్వహిస్తారు. ఈ వ్యవధిలో అభ్యర్థులు ఈ పరీక్షను మూడుసార్లు రాయొచ్చు. మ్యాట్‌, ఎన్‌-మ్యాట్‌లకు కలిపి సిద్ధం అయితే గరిష్ఠంగా లబ్ధి పొందొచ్చు. ప్రస్తుతం సెప్టెంబరులో మ్యాట్‌, అక్టోబరులో ఎన్‌-మ్యాట్‌ జరగబోతున్నాయి. రెండింటికీ అర్హత గ్రాడ్యుయేషన్‌. సెప్టెంబరులోనే మ్యాట్‌ రాసేవారు వీలైనంత త్వరగా మాక్‌ పరీక్షలు రాయడం ఆరంభించటం మంచిది.

రెండు పరీక్షల్లోనూ ఉమ్మడిగా ఉన్నవి- 1. లాంగ్వేజ్‌ 2. మేథమేటికల్‌ స్కిల్స్‌ 3. రీజనింగ్‌. మ్యాట్‌లో అదనంగా ‘ఇండియా అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అనే అంశాన్ని చేర్చారు.
మ్యాట్‌ సెప్టెంబరులో, మరోసారి డిసెంబరులో ఉన్నందున సెప్టెంబరులో రాసేవారు మాక్‌ పరీక్షలపై దృష్టి సారించాలి. బేసిక్స్‌ను పటిష్ఠం చేసుకోవడానికి ఇది సమయం కాదు. కానీ డిసెంబరు పరీక్షకు సిద్ధమవుతున్నవారికి మాత్రం దానికి సమయపు వెసులుబాటు ఉంది. దీంతోపాటు ఎన్‌-మ్యాట్‌కు సిద్ధమయ్యేవారు ప్రాథమికాంశాలతో సన్నద్ధత కొనసాగించొచ్చు.

విభాగాలవారీగా ఎలా చదవాలి?
లాంగ్వేజ్‌ అంశాలు: కాంప్రహెన్షన్‌, ఎర్రర్స్‌, సమాన, వ్యతిరేక అర్థాలు, జంబుల్డ్‌ సెంటెన్సెస్‌, సెంటెన్స్‌ కంప్లీషన్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ ఉంటాయి. సన్నద్ధతను కాంప్రహెన్షన్‌తో ప్రారంభించాలి. ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే రాజకీయ, శాస్త్ర సాంకేతిక, సాంఘిక, రాజకీయ తదితర అంశాల సంపాదకీయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. అంటే రచయిత ‘ఏం చెప్పాలనుకుంటున్నాడు?’, ‘తాను అనుకున్న అంశాన్ని వ్యక్తం చేసినందుకు ఏమైనా ఉదాహరణలు ఇచ్చాడా?’, ‘సంపాదకీయ ప్రధాన లక్ష్యం (సెంట్రల్‌ ఐడియా) ఏమిటి?’.. ఇలా పలు రకాలుగా, వేగంగా ప్రశ్నలు వేసుకుంటూ జవాబులను రాబట్టాలి.

ప్యాసేజ్‌లు చదువుతున్నపుడు వచ్చే కొత్త పదాలను నేరుగా డిక్షనరీలో చూడకుండా సందర్భానుసారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత ఆయా పదాల వ్యతిరేక అర్థాలు, ఆ పదాలతో ఏవైనా ప్రొవర్బ్స్‌, ఇడియమ్స్‌, ఫ్రేజల్‌ వర్బ్స్‌ ఉన్నాయేమో పరిశీలించుకోవాలి.

సెప్టెంబరులో మ్యాట్‌ రాసేవాళ్లకు సమయం ఎక్కువ లేనందున రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సంపాదకీయాలు చదవాలి. అలాగే గ్రామర్‌లో ముఖ్యంగా నిబంధనలు తెలుసుకోవాలి. సబ్జెక్టు+ వర్బ్‌ అగ్రిమెంట్‌, టెన్సెస్‌, వర్బ్‌.. తదితర అంశాల్లో ఉండే వివిధ నియమాలు, వాక్య నిర్మాణంలో వాటి అన్వయాన్ని నిశితంగా పరిశీలించాలి.

మేథమేటికల్‌ స్కిల్స్‌: ఇందులో సరాసరి, శాతాలు, సరళ, చక్రవడ్డీ, కాలం-పని, కాలం-దూరం తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. 6-10 వరకు ఈ అధ్యాయాలు ఉంటాయి. వాటినే ప్రాథమికాంశాలుగా భావించవచ్చు. కాన్సెప్ట్‌ చాలా కీలకం. షార్ట్‌కట్స్‌పై అభ్యర్థులు దృష్టిసారించొద్దు. అలాగే ఒక ప్రశ్న చదివిన తరువాత దానిని ఇంకా ఎన్ని కోణాల్లో ప్రశ్నించొచ్చో చూడాలి. ఒక్కో గణిత సమస్యను ఎన్ని కోణాల్లో ప్రశ్నించవచ్చో పరిశీలిస్తూ వెళ్లాలి. దీంతో కాన్సెప్టుపై బాగా పట్టు వస్తుంది. వేగంగా సూక్ష్మీకరణలు చేయడం కోసం సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలను సాధన చేయాలి. ప్రతి అధ్యాయానికీ ఇదే తరహా విధానాన్ని అవలంబించాలి.

మ్యాట్‌లో పేర్కొన్న డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీలో పైచార్ట్స్‌, గ్రాఫ్స్‌, డేటా టేబుల్‌, మల్టిపుల్‌ గ్రాఫ్‌, డేటా కంపారిజన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. మేథమేటికల్‌ స్కిల్స్‌లో భాగంగా నేర్చుకున్న సరాసరి, శాతాలు, నిష్పత్తులు ఈ విభాగంలో ప్రాథమికాంశాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ విభాగానికి అభ్యర్థులు నేరుగా పరీక్షలు రాస్తూ వెళ్లాలి. ఎన్‌-మ్యాట్‌ లేదా డిసెంబరులో మ్యాట్‌ రాసేవారు ప్రాథమికాంశాలను చదవడానికి 4 నుంచి 5 వారాలకు మించి సమయం తీసుకోరాదు. ఆ తరువాత నేరుగా మాక్‌ పరీక్షలకు సిద్ధం కావాలి. అధ్యాయాలవారీగా కూడా పరీక్షలు రాయడం మేలు.

రీజనింగ్‌: ఇందులో ఫ్యామిలీ ట్రీ, ఆర్గ్యుమెంట్స్‌, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌, పÆజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, డైరెక్షన్స్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, సిలాజిజం తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు నేరుగా అధ్యాయాలవారీగా 4-5 రోజులపాటు ఒక్కో అధ్యాయానికి కనీసం 100 ప్రశ్నలు సాధన చేయాలి. ప్రాథమికాంశాలు అంటూ ఏమీ ఉండవు. కేవలం సిలాజిజం అన్న అంశానికే కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి ఒకసారి అధ్యయనం చేస్తే చాలు.

ఇండియా అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌
సెప్టెంబరులో పరీక్ష రాస్తున్నవారు రోజూ కనీసం 3 నుంచి 4 గంటలు ఈ అంశానికి సంబంధించిన అంశాలకు కేటాయించాలి. డిసెంబరులో రాసేవారు ఎన్‌-మ్యాట్‌ తరువాత చదువుకునేలా షెడ్యూల్‌ చేసుకోవాలి. ఇందులో కరెంట్‌ అఫైర్స్‌, ప్రముఖ అవార్డులు, అంతర్జాతీయ సంఘటనలు, ఇతర దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, బ్యాంకింగ్‌, వ్యాపార రంగాల్లో దేశ విధానాలు, ప్రముఖ వ్యక్తులు.. ఇలా ప్రశ్నలుంటాయి. కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా కూడా పూర్వాపరాలను అధ్యయనం చేయాలి.

ఉదాహరణకు- ఇటీవలే పదో బ్రిక్స్‌ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్‌ కూటమిలో ఉండే దేశాలు, బ్రిక్స్‌ బ్యాంకు, ప్రధాన కేంద్రం, దాని చైర్మన్‌.. ఇలా మొత్తం పుట్టుపూర్వోత్తరాలను చదవాలి. అలాగే ఆగస్టు 1న భారత రిజర్వ్‌ బ్యాంకు ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. అందులోని వివిధ రేట్లు, ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆర్‌బీఐ ఈ విధానాన్ని ప్రవేశపెడుతోందో పరిశీలించాలి. జీఎస్‌టీ తరువాత పరోక్ష పన్నుల వ్యవస్థలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయాలి. ఈ విభాగానికి సంబంధించి మాక్‌ పరీక్షలు రాయకున్నా ఫర్వాలేదు, సాధ్యమైనంత ఎక్కువగా అధ్యయనం చేయాలి.

సెక్షన్లవారీగా సన్నద్ధతను వారం- పది రోజులకు మించి తీసుకోరాదు. ఆ తరువాత నేరుగా పూర్తిస్థాయి మాక్‌ పరీక్షలు రాయాలి. కనీసం రోజుకు రెండు పరీక్షలు రాయడం ప్రయోజనకరం.

మ్యాట్‌లో ఒక్కో తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్‌ మార్కులుంటాయి. కాబట్టి ఊహించి సమాధానాలు గుర్తించటం ప్రమాదకరం. ఎన్‌మ్యాట్‌లో రుణాత్మక మార్కులు లేవు. సెక్షన్లవారీ కటాఫ్‌లు ఉన్నాయి.

మేథమేటికల్‌ స్కిల్స్‌లో భాగంగా నేర్చుకున్న సరాసరి, శాతాలు, నిష్పత్తులు డేటా అనాలిసిస్‌ & సఫిషియన్సీలో ప్రాథమిక అంశాలుగా పనిచేస్తాయి.

మ్యాట్‌ షెడ్యూల్‌..
మ్యాట్‌ పేపర్‌, కంప్యూటర్‌ రెండు విధానాల్లోనూ జరుగుతుంది. సెప్టెంబరు 2, 2018న పేపర్‌ ఆధారిత, సెప్టెంబరు 15, 2018న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు.
* పేపర్‌ ఆధారిత పరీక్ష రిజిస్ట్రేషన్‌ గడువు: ఆగస్టు 24, 2018
* అడ్మిట్‌కార్డులను ఆగస్టు 25 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష రిజిస్ట్రేషన్‌ గడువు: సెప్టెంబరు 8, 2018
* అడ్మిట్‌కార్డులను సెప్టెంబరు 11 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* డిసెంబరులో జరిగే పరీక్షకు రిజిస్ట్రేషన్లు అక్టోబరు తొలివారంలో ప్రారంభమవుతాయి.
వెబ్‌సైట్‌: https://www.aima.in/
మ్యాట్‌ ద్వారా సీట్లను భర్తీ చేసే ప్రముఖ సంస్థలు
* ఎబీఎస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌- దుర్గాపూర్‌
* ఏఆర్‌కేఏ జైన్‌ యూనివర్సిటీ- జంషెడ్‌పూర్‌
* భారతీయ విద్యా భవన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌- కోల్‌కతా
* భవాన్స్‌ సెంటర్‌ ఫర్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌- భువనేశ్వర్‌
* బిర్లా గ్లోబల్‌ యూనివర్సిటీ- భువనేశ్వర్‌

ఎన్‌-మ్యాట్‌ వివరాలు
* రిజిస్ట్రేషన్ల నమోదుకు చివరితేదీ: అక్టోబరు 3, 2018
* పరీక్షలు అక్టోబరు 4 నుంచి ప్రారంభమవుతాయి, డిసెంబరు 17 వరకు కొనసాగుతాయి.
* తుది ఫలితాలు: జనవరి-2019 మూడో వారంలో..
వెబ్‌సైట్‌: http://www.nmat.org.in/
ఎన్‌-మ్యాట్‌ ద్వారా భర్తీ చేసే సంస్థలు
* నార్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌- ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌
* ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌- హైదరాబాద్‌
* జేవియర్‌ యూనివర్సిటీ- భువనేశ్వర్‌
* థాపర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, మొహాలీ
* అమిటీ యూనివర్సిటీ- నోయిడా
* ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ- దిల్లీ, చెన్నై


Posted on 08-08-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning