వేటలో వెనకబడొద్దు!

* ఉద్యోగాల అన్వేషణకు విభిన్న మార్గాలు
డిగ్రీ పట్టా పుచ్చుకున్న పవన్‌ ఉద్యోగంలో చేరాలని ఉత్సాహంగా ఉన్నాడు. ఖాళీల సమాచారం కనుక్కోవడం ఎలా, ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి.. అర్థం కావడం లేదు. ప్రకటనలకు దరఖాస్తులు పంపితే సరిపోతుందా.. తెలిసిన వాళ్లతో చెప్పించాలా.. సందేహాలతో సతమతమవుతున్నాడు. ఇప్పటి కాలంలో అంత టెన్షన్‌ అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. సంప్రదాయ పద్ధతులను, అంతర్జాల అస్త్రాలను ప్రయోగిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోడానికి దూసుకుపోవాలని సూచిస్తున్నారు. వీటితోపాటు మరికొన్ని నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగాన్వేషణలో విజయం మీదే అంటున్నారు.కళాశాల ప్రాంగణం విడిచి ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించే దశ చాలా ముఖ్యమైనది. క్లాస్‌మేట్స్‌తో అంటీ ముట్టనట్టు... పుస్తకాలకే, మార్కుల శాతం పెరగటానికే పరిమితమైపోతే వెనకబడిపోతాం. లేనిపోని సంకోచాలూ, అనవసరమైన మొహమాటాలూ వదిలెయ్యాలి. మిత్రులతో నిరంతరం ‘టచ్‌’లో ఉంటూ విస్తృతమైన నెట్వర్‌్్కను ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని పటిష్ఠం చేసుకోవాలి. కొత్తగా వచ్చే అవకాశాలన్నీ తెలుసుకుంటూ ఉండాలి. చర్చించుకోవాలి. చొరవగా, చురుకుగా ముందుకుసాగాలి. ఉద్యోగాల ఖాళీలు వాటంతటవే అభ్యర్థిని వెతుక్కుంటూ రావు కదా! వాటిని వెతుక్కుంటూ వెళ్లడమో, తన దగ్గరికి వచ్చేలా చేయడమో చేయాలి. ఈ రెంటికీ కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి.

ప్రధానంగా సానుకూల మానసిక దృక్పథం, తగిన దృష్టికోణాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగాల వేటకు ఏ నైపుణ్యాలు ఉపయోగపడతాయో ముందు తెలుసుకోవాలి. ఇవి సాంప్రదాయిక, ఆధునిక, స్వీయ మెరుగుదల (ట్రెడిషనల్‌, మోడర్న్‌, సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌) నైపుణ్యాలుగా ఉంటాయి.

సొంత విలువ ఎంతైనా పెంచుకో..
మార్కెటింగ్‌ నైపుణ్యాలు కొరవడటం వల్లే ఉద్యోగ సాధనలో విఫలమవుతున్నామనేది చాలామంది భావన. కానీ దాన్ని అధిగమించడం చాలా సులువే. ఇంటర్నెట్‌ ఎన్నో రకాల వెబ్‌సైట్ల రూపంలో ఆ అవకాశాన్నిస్తోంది. వీటి ద్వారా విలువైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చు. అయితే ఎంచుకున్న కోర్సునుబట్టి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
కోర్స్‌ఎరా: ఇది యూనివర్సిటీలతో భాగస్వామ్యాన్ని కలిగివుంది. ఇక్కడ కంప్యూటర్‌ సైన్స్‌ నుంచి బయాలజీ వరకు అన్నిరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఖాన్‌ అకాడమీ: కోర్స్‌ఎరాలాగే ఉంటుంది. అయితే సెమినార్‌ తరహా తరగతుల్లా కాకుండా సొంతంగా నేర్చుకునేలా ఉంటాయి.
కోడ్‌ అకాడమీ: కోడింగ్‌ ఎలా రాయొచ్చో నేర్చుకోవచ్చు.
ఎక్సెల్‌ ఈజీ: దాదాపుగా అన్ని సంస్థల్లో ఎక్సెల్‌ ఉపయోగం ఉంటుంది. దీన్ని ఇక్కడ సులువుగా నేర్చుకోవచ్చు. టెక్నికల్‌ అభ్యర్థులకు ఇది ఉద్యోగంలో ఎదగడానికీ సాయపడుతుంది.
ఇలాంటి వెబ్‌సైట్లు ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి. తగినదాన్ని ఎంచుకుంటే కొత్త నైపుణ్యాలను రెజ్యూమెలో జోడించుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్‌లు: కొన్నిసార్లు ఇంటర్న్‌షిప్‌లు, తాత్కాలిక ఉద్యోగాలకే కాకుండా శాశ్వత ఉద్యోగాలకు కూడా దారి తీస్తాయి. అయితే ఇది కాస్త పెద్ద సంస్థలో అయితే ఎక్కువ ప్రయోజనకరం. ఒకవేళ శాశ్వత ఉద్యోగం దొరక్కపోయినా భవిష్యత్తులో తోడ్పడే మంచి పరిచయాలు దొరుకుతాయి.
వైవిధ్య నైపుణ్యాలు: అభ్యర్థి కేవలం తన రంగానికే పరిమితం కాకుండా తన రంగంతో సంబంధమున్న ఇతర రంగాల నైపుణ్యాలపైనా కొంత పరిజ్ఞానం కలిగివుండాలి. ఇది రిక్రూటర్లను ఆకర్షించడానికే కాకుండా వ్యక్తిగత ఎదుగుదలకూ తోడ్పడుతుంది.

సంకోచం వీడు.. చొరవ చూపు
సంప్రదాయ విధానాలైనా, ఆధునిక పద్ధతులైనా ఉద్యోగార్థులకు అద్భుతంగా ఉపయోగపడేది నెట్‌వర్క్‌. ఉద్యోగాల వేట ఒంటరిగా చేయదగినది కాదు. సహాధ్యాయులతో, మిత్రులతో విస్తృతమైన నెట్‌ వర్క్‌ను ఏర్పరచుకోవాలి. దానిలో క్రియాత్మకంగా ఉండాలి. దీనివల్ల ఉద్యోగాల సమాచారం తెలియటం మాత్రమే కాకుండా తాజా పరిజ్ఞానం గ్రహించటం, చర్చల ద్వారా తెలిసిన విషయాలపై మరింత పట్టు పెంచుకోవటం..ఇలా ఎన్నో ప్రయోజనాలుంటాయి.
ఒక్కోసారి కొన్ని పోస్టులకు ముఖ్యంగా చాలా తక్కువ సంఖ్యలో ఖాళీలున్నపుడు సంస్థలు ప్రకటనలు ఇవ్వవు. తమ వద్ద ఉన్న రెజ్యూమెలను పరిశీలించి వారిని ఇంటర్వ్యూకు పిలవడమో, ఉద్యోగులకు తెలిసినవారిని ఇంటర్వ్యూకు ఆహ్వానించడం లాంటివి చేస్తుంటాయి. ఇలాంటపుడు నెట్‌వర్క్‌ పనికొస్తుంది. స్నేహితులు, స్నేహితుల స్నేహితులు, కుటుంబ సభ్యులను వారికేమైనా ఉద్యోగ సమాచారం తెలుసేమో కనుక్కుంటుండొచ్చు. వారిలో ఎవరికైనా హైరింగ్‌ మేనేజర్‌ తెలిస్తే.. మీ రెజ్యూమె నేరుగా వారివరకూ వెళ్లే అవకాశముంటుంది కదా! వారికి అవసరమైన నైపుణ్యాలు మీవద్ద ఉంటే, ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది. ఆ దశ కూడా దాటితే ఇక ఉద్యోగమే!
స్నేహితులు, నెట్‌వర్క్‌/కనెక్షన్స్‌ లేకపోతే ఎప్పుడూ ఇబ్బందే. మీలో చొరవ లేదని అర్థం. సంస్థలూ బృందంతో కలిసిపోయి పనిచేసేవారినే కోరుకుంటాయి. కాబట్టి, పరిచయాలు పెంచుకోవడం, సంబంధ బాంధవ్యాలను కొనసాగించడం అలవాటు చేసుకోవాలి.

సంప్రదాయ పద్ధతుల్లో...
వార్తాపత్రికల్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలను వెతుక్కోవడం, నేరుగా సంస్థలకు వెళ్లడం, ఫోన్‌ చేసి కనుక్కోవడం వంటివన్నీ ఎప్పటినుంచో వస్తున్న విధానాలు. నేటి వేగవంతమైన పరిస్థితుల్లో వీటికింకా ప్రాముఖ్యం ఉందా అని చాలామంది సందేహం. ఎందరో అభ్యర్థులు వీటిని ఇప్పటికీ ఉపయోగిస్తూనేవున్నారని గ్రహించాలి.
వార్తాపత్రికలు: ఉద్యోగ సమాచారం కోసం ప్రాంతీయ వార్తాపత్రికలను చూడటం ప్రయోజనకరమే. పత్రికల ప్రకటనలో ఫోన్‌ నంబరు ఇస్తే.. ఫోన్‌లో సంప్రదించండి. ఈ-మెయిల్‌ ఇస్తే రెజ్యూమె పంపొచ్చు.
టెలిఫోన్‌ కోల్డ్‌ కాలింగ్‌: అభ్యర్థి సంస్థలకు ఫోన్‌ చేసి, తన శక్తియుక్తులను తెలిసేలా చేయొచ్చు. ఈ ‘కోల్డ్‌ కాలింగ్‌’ చాలామంది అభ్యర్థులకు నచ్చదు. కానీ దీనిద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అయితే.. ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం ముఖ్యం. నెమ్మదిగా, భయపడుతూ మాట్లాడితే మాత్రం వ్యతిరేక ప్రభావం పడే అవకాశముంటుంది.
స్వయంగా వెళ్లడం: నచ్చిన సంస్థ అంటే దానికి సంబంధించిన ఎంతో కొంత సమాచారం కూడా అభ్యర్థి దగ్గరుంటుంది. ఆ ఇష్టాన్నీ, ఆసక్తినీ స్వయంగా సంస్థకు వెళ్లడం, అక్కడి అధికారులతో మాట్లాడటం ద్వారా వ్యక్తం చేయొచ్చు. తద్వారా మంచి అవకాశాలనూ అందిపుచ్చుకునే అవకాశముంది. అయితే సానుకూల అభిప్రాయం ఏర్పడేలా వస్త్రధారణ ఉండాలి. రెజ్యూమె, కవర్‌ లెటర్లను వెంట తీసుకెళ్లాలి. తగినంత సమాచారం సేకరించాకే సంస్థకు వెళ్లడంపై దృష్టిపెట్టాలి.

ఇప్పటి కాలానికి తగినట్టు...
ఆధునిక తరహా వ్యాపారాలైన వెబ్‌ కంపెనీలు, ఆప్‌ డెవలపర్స్‌ వంటి వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధునిక నైపుణ్యాలు తప్పనిసరి అయ్యాయి. ఇప్పుడు అరచేతిలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉంది. కొలువును పట్టడానికి ఉపయోగపడే ఎన్నో సెర్చింగ్‌ టూల్స్‌, సహాయపడే సంస్థలున్నాయి. రోజురోజుకీ ఇంటర్నెట్‌ ఆధారిత జాబ్‌ సెర్చ్‌ టూల్స్‌ సంఖ్య పెరుగుతోంది. దీంతో అవకాశాలు మరింత చేరువవుతున్నాయి. సమయం వృథా కాకుండా.. ఉద్యోగ వివరాలను వెనువెంటనే తెలుసుకునే వీలూ ఉంది.
ఏదేమైనా ఇంటర్నెట్‌లో వేగంగా సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగా అభ్యర్థి కూడా మారాలి. అంటే.. పోటీకి తగ్గట్టుగా అభ్యర్థి కూడా తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ ఉండాలి. నేటి ప్రపంచంలో ముందు వరుసలో నిలిపే టూల్స్‌... చాలామందికి తెలిసినవే. కానీ వాటిని సమర్థంగా ఉపయోగించటం కూడా తెలియాలి.
జాబ్‌ సెర్చ్‌ ఇంజిన్స్‌: వివిధ వెబ్‌సైట్ల నుంచి ఉద్యోగ సమాచారాన్ని సేకరించి వాటి వివరాలను ఒకచోట సెర్చ్‌ ఇంజిన్లు పొందుపరుస్తుంటాయి. అంతర్జాతీయ స్థాయిలోని వివరాలను తెలుసుకోవడానికీ ఇవి చాలా ఉపయోగకరం. ఎందుకంటే ప్రత్యేక నైపుణ్యాలున్న అభ్యర్థులను ఎంచుకోవడానికి సంస్థలూ మొదట అంతర్జాతీయ వేదికలనే ఎంచుకుంటాయి. మాన్‌స్టర్‌.కామ్‌, నౌక్రీ.కామ్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికలెన్నో అందుబాటులో ఉన్నాయి. కేవలం వాటిపైనే ఆధారపడకుండా నేరుగా హైరింగ్‌ మేనేజర్లకు మెయిల్‌ చేయడం, ఎప్పటికప్పుడు ఫాలోఅప్‌ చేయడం లాంటివీ చేస్తుండాలి.
ట్విటర్‌: ట్విటర్‌ పేరు వినగానే స్పామ్‌, అనవసర వాదనలూ గుర్తొస్తాయి. కానీ లక్ష్యానికి మాత్రమే ప్రాధాన్యమిస్తే ఇదో మంచి ఉద్యోగ వేదిక కూడా. ‘సెర్చ్‌ ఫంక్షన్‌’లో మీ ప్రొఫెషన్‌ను టైప్‌ చేస్తే.. సంబంధిత సంస్థల ట్వీట్లూ, ఖాళీల వివరాలు మొదలైనవి ఉంటాయి. వాటిలో మీకు తగినవేమైనా ఉన్నాయేమో చూసుకుని, ప్రయత్నించొచ్చు.
లింక్‌డిన్‌: ఇది ఇప్పుడు తప్పనిసరి అయింది. చాలామంది రిక్రూటర్లు తమ సంస్థల కోసం నిపుణులను ఈ వేదిక నుంచే ఎంచుకుంటున్నాయి. ఎక్కువ మొత్తంలో కొత్త ప్రతిభకు అవకాశం కల్పించాలన్నా దీన్నే ఆశ్రయిస్తున్నారు. లింక్‌డిన్‌లో రెజ్యూమెను అప్‌లోడ్‌ చేస్తే, మీ స్నేహితులు, తోటివారు మీ నైపుణ్యాలను బలపరిచే వీలుంటుంది ఇక్కడ. అలాగే మీకోసం రెకమెండేషన్‌ లెటర్లు కూడా రాసే అవకాశముంది. సంస్థ ప్రతినిధులు తమకు కావాల్సిన నైపుణ్యాలున్న అభ్యర్థి కోసం వెతికేటపుడు కొన్ని కీవర్డ్స్‌ను ఉపయోగిస్తారు. మీ రంగంలో ఆ నైపుణ్యాలు మీకుంటే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు. అంటే, ఎక్కువ ఉద్యోగావకాశాలకు అందుబాటులో ఉన్నట్లే కదా!
రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు: ఉద్యోగసాధనలో ప్రొఫెషనల్‌ అవసరముంది అని అనిపించినపుడు వీటిని ఆశ్రయించొచ్చు. కొన్నిసార్లు వీటి సేవలను పొందడానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. చాలా సంస్థలు తమ నియామకాలను రిక్రూట్‌ ఏజెన్సీల ద్వారా జరుపుతాయి. సమయంతోపాటు, డబ్బు కూడా ఆదా అవడమే ఇందుకు కారణం. ఈ ఏజెన్సీలు తమను ఎంచుకున్న సంస్థల్లో అభ్యర్థికి తగిన ఉద్యోగం ఉంటే దానిలో అతను చేరేలా సహాయం చేస్తుంటాయి.

ఆఫ్‌ క్యాంపస్‌.. అవకాశం
సరిగా వెతుక్కోవడం తెలియాలే కానీ ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. ఎప్పటికపుడు వార్తాపత్రికలు, వెబ్‌సైట్లలో నోటిఫికేషన్లు చూసుకోవడం, సంస్థల వివరాలు తెలుసుకుంటుండటం చేయాలి. వివిధ సంస్థలు ఏటా ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌లు, జాబ్‌ ఫేర్‌లు నిర్వహిస్తుంటాయి. వాటి వివరాలు ఎప్పటికపుడు గమనిస్తుండాలి. నేను అలా హైదరాబాద్‌లో నిర్వహించిన ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌లో పాల్గొని ఉద్యోగం సంపాదించాను. అయితే ఐఐటీల్లో ఎంటెక్‌ చేయాలనేది నా కల. అందుకోసం బీటెక్‌ మూడో ఏడాది నుంచే సన్నద్ధత ప్రారంభించాను. ఆ సమయంలోనే మా ఫ్యాకల్టీ ద్వారా ఎల్‌అండ్‌టీ వారు అందించే స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ గురించి తెలుసుకున్నాను. ఈ సంస్థ ఏటా ఒక రాతపరీక్ష నిర్వహిస్తుంది. అది కూడా గేట్‌ తరహాలోనే ఉంటుంది. దీనిలో ఎంపికైనవారికి ఐఐటీల్లో ఎంటెక్‌కి స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. వారిలో కొంతమందిని తమ సంస్థలో ఉద్యోగ నిమిత్తం కూడా ఎంపిక చేస్తారు. నేను ఎల్‌అండ్‌టీ వారి రాతపరీక్ష రాశాను. స్కాలర్‌షిప్‌తోపాటు ఉద్యోగానికీ ఎంపికయ్యాను. ప్రస్తుతం ఐఐటీ-మద్రాస్‌లో ఎంటెక్‌ చేస్తున్నాను.
- అశ్విన్‌ రెడ్డి, విద్యార్థి
జాబ్‌ పోర్టళ్లలో నమోదు మేలు
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు జాబ్‌పోర్టళ్లలో తమ పేర్లను నమోదు చేసుకోవడం మంచిది. లింక్‌డిన్‌, ఇన్‌డీడ్‌, గ్లాస్‌డోర్‌, నౌకరీ.. ఇలా ఎన్నో జాబ్‌పోర్టళ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తాము చేసిన ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రొఫైళ్లలో పొందుపరచడం ద్వారా సంస్థల దృష్టిని ఆకర్షించవచ్చు. అయితే వీటితోపాటు సంబంధిత అదనపు నైపుణ్యాలూ, సర్టిఫికెట్లనూ సంపాదించుకోవాల్సి ఉంటుంది. బ్లాగులు రాయడం, టెక్నికల్‌ విద్యార్థులైతే కోడింగ్‌ వేదికలపై గమనించదగ్గ స్కోరును సాధించడం వంటివి చేయొచ్చు. అప్పుడే సంస్థలు షార్ట్‌లిస్ట్‌ చేసుకోవడానికి ఆసక్తిని చూపుతాయి. ఇంటర్న్‌షిప్‌లు చేయడమూ లాభిస్తుంది.
- పరుచూరి సతీష్‌ చంద్ర, ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్

Posted on 15-08-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning