చిట్టి తెస్తోంది కొత్త కొలువులు

మనిషిని అనుకరించే మరమనిషిగా మొదలైన రోబో ఇప్పుడు ఆ స్థాయిని దాటేసింది. ‘రోబో’ సినిమాలో చిట్టిని చూశారుగా.. అది మనిషి కంటే ఎన్నోరెట్లు కచ్చితత్వంతో, వేగంగా సులువుగా పనిచేసింది. ప్రమాదకర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించగలిగేలా అవతరించింది. రోబోల నిర్మాణం, నిర్వహణ, వినియోగాలకు సంబంధించిన రోబోటిక్స్‌ రంగం సమీప భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో కొత్త తరహా ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం పెంచుకుంటోంది. దీనిలో కెరియర్‌ అవకాశాలూ, కోర్సుల విశేషాలను తెలుసుకుందామా?

భారీ కర్మాగారాల్లో మనుషులకు ప్రమాదకరమైన వాతావరణంలో పని చెయ్యాలన్నా, బిజీగా ఉండే ఉన్నతోెద్యోగి డ్రైవర్‌ అవసరం లేని ‘స్వయంచాలక’ కారులో ప్రయాణించాలన్నా, ‘మర’ లాగా పనిచేసే మనిషి లేదా ఆ తరహా గృహోపకరణం కావాలన్నా రోబోటిక్స్‌ సేవలే ప్రత్యామ్నాయం. నిత్యజీవనంలో మనం ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యలకు సమర్థ పరిష్కారం రోబోటిక్స్‌తోనే సాధ్యం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు, అభివృద్ధికి ప్రధాన సంకేతం ఈ రంగం.

మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ రంగాల సమష్టి కృషి ఫలితమైన రోబోటిక్స్‌లో ఏటా సగటున 3-4% ఉద్యోగావకాశాల అభివృద్ధి ఉంటుందని ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. సొంతంగా నిర్ణయాలు తీసుకుని మనిషికి సహాయకంగా మసలే యంత్రనిర్మాణం ఈ రంగం ప్రధాన లక్ష్యం.

రోబోటిక్స్‌లో 3 ప్రధాన విభాగాలు
రోబో శరీరం (Robot body) : రోబో ఆకార నిర్మాణం (శరీరం) ఈ విభాగం ప్రధాన లక్ష్యం. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలోని మెకానిక్స్‌, మెటీరియల్స్‌, మాన్యుఫాక్చరింగ్‌ పద్ధతులపై ప్రత్యేక దృష్టిని సారిస్తారు. మెకాట్రానిక్స్‌, రోబోటిక్స్‌ స్పెషలైజేషన్‌ కోర్సుల్లో రోబోల భౌతిక నిర్మాణాన్ని ప్రధానంగా బోధిస్తారు.
నాడీ వ్యవస్థ (Nervous system): ఎలక్ట్రానిక్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, కంట్రోల్‌ థియరీ విభాగాల విజ్ఞానంతో రోబో చలనానికి అవసరమైన వ్యవస్థ నిర్మాణం దీని లక్ష్యం. ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని రోబోటిక్స్‌ కోర్సుల్లో ఎలక్ట్రానిక్‌ నియంత్రణ వ్యవస్థను బోధిస్తారు. ఇంకా లోలెవల్‌ ప్రోగ్రామింగ్‌ కూడా ఉంటుంది.
మేధా వ్యవస్థ (Brain system): రోబోటిక్స్‌ రంగంలో కెరియర్‌ మలచుకోవడానికి ఉత్సాహం చూపేవారిలో ఎక్కువమంది రోబో నియంత్రణకు అవసరమైన ప్రోగ్రామ్‌లు రాస్తుంటారు. అంటే కంప్యూటర్‌ సైన్స్‌వారే అధికంగా రోబోటిక్స్‌ కెరియర్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. రోబోల నిర్మాణం ముగిశాక వాటిని పనిచేయించాలంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో, Python, Java, C++ వంటి హైలెవల్‌ ప్రోగామింగ్‌లో నైపుణ్యం ఉన్నవారు అవసరమవుతారు. ఈ విభాగంలో ఏఐ, సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ ప్రధాన పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఈ స్థాయిలోనే మనస్తత్వశాస్త్ర నేపథ్యమున్నవారు కూడా సేవలు అందించడానికి అవకాశం ఉంది. భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, ఇతర ఇంజినీరింగ్‌ శాఖలకు చెందినవారు కూడా కెరియర్‌ నిర్మించుకోవచ్చు.

విధులూ, అవకాశాలూ ఎన్నో
రోబోటిక్స్‌ ఇంజినీర్లు చేయటానికి వివిధ రకాల అవకాశాలుంటాయి. నిర్మాణ రూపకల్పన,.నియంత్రణలతోపాటు వివిధ రంగాల్లో రోబోల అనుసంధానానికి సంబంధించిన పనులు చాలా ముఖ్యమైనవి. రోబోల నిర్మాణం, పరీక్ష, ప్రోగ్రామింగ్‌,. రికార్డుల పరిరక్షణ, టెక్నీషియన్ల శిక్షణ, టెక్నికల్‌ సపోర్ట్‌ ఇలాంటివే. రోబోటిక్స్‌ను ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పాలంటే.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ మాన్యుఫాక్చరింగ్‌, మెడికల్‌ రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, మైక్రో రోబోటిక్స్‌, రోబో మోషన్‌ ప్లానింగ్‌, బయో సైబర్‌నెటిక్స్‌లను చెప్పుకోవచ్చు.

కెరియర్‌ అవకాశాలు
రోబోటిక్స్‌ నిపుణుల అవసరం ముందుముందు చాలా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో కూడా వివిధ స్థాయుల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రోబోటిక్స్‌ టెస్ట్‌ ఇంజినీర్ల్లు, సూపర్‌వైజర్లు, విశ్లేషకులు, రోబోట్‌ డిజైనర్లు, రోబోటిక్స్‌ ప్రోగ్రామర్లు, ఆటోమేషన్‌ ఇంజినీర్లు, శిక్షకులు, క్వాలిటీ ఇంజినీర్లుగా అవకాశాలుంటాయి. రోబోటిక్స్‌ ఇంజినీర్లు కింది సంస్థల్లో అవకాశాలను పొందవచ్చు.
* ప్రిసిషన్‌ ఆటోమేషన్‌ రోబోటిక్స్‌ ఇండియా (PARI)
* టాటా సంస్థలు
* హైటెక్‌ రోబోటిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌
* డీఆర్‌డీఓ (DRDO)
* డిఫాక్టో రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌
* బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌
* ఏషియా బ్రౌన్‌ బావరి (Asia Brown Bowri - ABB)
* కుకారోబోటిక్స్‌ (KUKA)
* ఇస్రో (ISRO)
* బీహెచ్‌ఈఎల్‌
* టెక్‌ మహీంద్రా
* ఆసిమొవ్‌ రోబోటిక్స్‌
* గ్రే ఆరెంజ్‌ బీ గ్రిడ్‌ బాట్స్‌

విస్తరిస్తోంది...
మాన్యుఫాక్చరింగ్‌, ఆటోమేషన్‌, రవాణా రంగంలోనే కాకుండా రోబోటిక్స్‌ విజ్ఞానం ఇతర రంగాలకూ విస్తరిస్తోంది. టెలిమార్కెటింగ్‌, పర్సనల్‌ అసిస్టెంట్స్‌, బ్యాంకింగ్‌, ఈ-కామర్స్‌, ప్యాకేజింగ్‌, వేర్‌హౌసింగ్‌, వైద్య రంగం, జర్నలిజం, పైలట్ల శిక్షణ, స్టాక్‌ మార్కెట్ల విశ్లేషణ, గృహోపకరణాలు, తపాలాశాఖ, మిలిటరీ, రక్షణ రంగాల్లో రోబోల విస్తరణ వేగంగా జరుగుతోంది.

ఏ నైపుణ్యాలు అవసరం?
సమకాలీన టెక్నాలజీలతోపాటు రేపటి టెక్నాలజీల అభివృద్ధికి ఎంతో అవకాశమున్న రోబోటిక్స్‌లో కెరియర్‌ నిర్మించుకోవాలంటే ఈ కి¨ంది నైపుణ్యాలు అవసరం.
* ఇంజినీరింగ్‌ స్థాయిలో గణిత శాస్త్రంలోని వివిధ అంశాలపై పటిష్టమైన అవగాహన ఉండాలి. ప్రత్యేకించి నమూనాల చిత్రీకరణకు అవసరమైన ఆల్జీబ్రా, ట్రిగొనామెట్రీ పాఠ్యాంశాలు బాగా నేర్చుకోవాలి.
* భౌతిక శాస్త్రంలోని మెకానిక్స్‌, డైనమిక్స్‌, ఎలక్ట్రిసిటీ, మెటీరియల్‌ సైన్స్‌పై పట్టు పెంచుకోవాలి.
* ప్రోగ్రామింగ్‌, కంప్యూటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మంచి స్థాయి నైపుణ్యం పెంపొందించుకోవాలి.
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌కి సంబంధించిన ప్రోడక్ట్‌ డిజైన్‌, మాన్యుఫాక్చరింగ్‌ బాగా నేర్చుకోవాలి.
* ఆటోక్యాడ్‌ వంటి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజి నేర్చుకోవాలి.
* C++, Java, Python, LISP, ఎలక్ట్రానిక్స్‌ రంగానికి సంబంధించినంతవరకు వివిధ రకాల సెన్సర్ల పనితీరుపట్ల అవగాహన ఉంటే మేలు.
* కంట్రోల్‌ సిస్టమ్స్‌లోని ట్రాన్స్‌డ్యూసర్లు, టెన్షియోమీటర్లు, ఫొటో రెసిస్టర్ల పనితీరుపట్ల ఒక మోస్తరు స్థాయి అవగాహన అవసరం.

ఏయే కోర్సులు?
అనేక విశ్వవిద్యాలయాలు ఐఐటీలతో సహా రోబోటిక్స్‌ రంగంలో డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులు అందిస్తున్నాయి. ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ, తమిళనాడులోని కాలేజీలు, కె.ఎల్‌. యూనివర్సిటి, బిట్స్‌, థాపర్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలు రోబోటిక్స్‌లో కోర్సులు అందిస్తున్నాయి. రోబోటిక్స్‌లో విజయం సాధించాలంటే బీటెక్‌లో ఉండే కోర్సులకి పరిమితమైతే సరిపోదు. కొన్ని అదనపు కోర్సులు నేర్చుకోవాలి. దాంతోపాటు ప్రయోగాత్మకంగా రోబోలతో పరిచయం పెంచుకోవాలి. లిగోమైండ్‌ స్టార్మ్స్‌ వంటి రోబోకిట్ల సాయంతో రోబోలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. www.robokits.co.in అనే వెబ్‌సైట్లో పలురకాల పనులను చేసిపెట్టే రోబోకిట్స్‌, విడిభాగాలు, డ్రోన్‌, ఆర్డ్యునో కిట్లు లభిస్తాయి. వీటి ఆధారంతో చిన్నచిన్న పనులు చేసే రోబోలను నిర్మించి పరిచయం పెంచుకోవాలి. అలాగే టెక్నాలజీకి సంబంధించిన మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ కోర్సులు చెయ్యాలి.
ఆన్‌లైన్‌లో రోబోటిక్స్‌, అనుబంధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
1. కొలంబియా యూనివర్సిటి 12 వారాల కోర్సును ఆన్‌లైన్‌లో అందిస్తోంది. edx లో ఈ కోర్సు ఉంది.
2. www.udemy.com
3. visualpath, Hyderabad
4.Automation APTRON, Noida
5. Courseera.com
6. Udacity
7. www.onlinerobotics.com
8. www.robogalaxy.com
9. www.futurelearn.com
10. www.swayam.gov.in ఇది తిఖిదిగిని అందిస్తున్న కోర్సు

Posted on 29-08-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning