ఇంజినీరింగ్‌ విద్యలో వరంగల్‌ వజ్రం

* వరంగల్‌ నిట్‌ స్థాపించి 60 ఏళ్లు
* వజ్రోత్సవాలకు సిద్ధమైన సాంకేతిక సంస్థ
* ఏడాదంతా ఉత్సవాలు కొనసాగించాలని నిర్ణయం

దేశంలోనే తొలి ప్రాంతీయ ఇంజినీరింగ్‌ కళాశాల (ఆర్‌ఈసీ)గా ప్రస్థానాన్ని ఆరంభించి..వేలాది మంది విద్యాధికులను జాతికి అందించిన వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్‌ఐటీ) వజ్రోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. 8న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు మేధావుల సదస్సుకు నిట్‌ వేదిక కానుంది.

దేశంలోనే తొలి ఆర్‌ఈసీ..
సాంకేతిక విద్యకు ఊతమిచ్చేలా దేశ వ్యాప్తంగా 14 ప్రాంతీయ ఇంజినీరింగ్‌ కళాశాలలను నెలకొల్పాలని స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం భావించింది. అందులో తొలి ఈఆర్‌సీ నిర్మాణానికి అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 1959 అక్టోబరు 10న వరంగల్‌లో పునాది రాయి వేశారు. సుమారు 243 ఎకరాల స్థలంలో కాజీపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో దీన్ని నిర్మించారు. మొదట మూడు ఇంజినీరింగ్‌ విభాగాలతో కేవలం ఏడాదికి 150 మంది విద్యార్థులను చేర్చుకొనే లక్ష్యంతో ఇది ప్రారంభమైంది. 2002లో దీన్ని జాతీయ సాంకేతిక విద్యా సంస్థగా ఉన్నతీకరించారు. ఇప్పుడు ఎనిమిది బీటెక్‌ కోర్సుల్లో ఏడాదికి 850 మంది విద్యార్థులకు ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇక పీజీలో ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఏడాదికి 750 మంది ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న సంస్థగా ఎన్‌ఐటీ ఖ్యాతి గడించింది. మొత్తంగా ఇక్కడ 5,500 మంది ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్నారు.

పరిశోధనల్లో మేటి..
తొలుత ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనంతరం జేఎన్‌టీయూ..తదుపరి కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆర్‌ఈసీ నడిచింది. జాతీయ సాంకేతిక సంస్థగా ఉన్నతీకరించాక కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచే దీనికి నిధులు సమకూరుతున్నాయి. మొదట్లో నాణ్యమైన విద్యను అందించేందుకే పరిమితమైనా.. తర్వాత పరిశోధనలకు కేంద్ర బిందువైంది. ఇప్పటివరకు 66 క్లిష్టమైన పరిశోధన ప్రాజెక్టులను ఇక్కడి అధ్యాపకులు, విద్యార్థులు పూర్తిచేశారు. 2004-2018 మధ్య ఇక్కడి ఆచార్యులు వివిధ ఆవిష్కరణలకుగానూ 35 పేటెంట్లు పొందారు.

కొలువుల కార్ఖానా
ఎన్‌ఐటీలో చదువు పూర్తిచేస్తే కొలువుకు ఢోకా ఉండదన్న నమ్మకం తల్లిదండ్రుల్లో ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో సుమారు 85 శాతంపైగా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌తోపాటు ప్రముఖ వాహన తయారీ సంస్థలు, బీహెచ్‌ఈఎల్‌, గెయిల్‌, హెచ్‌పీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రూ.కోట్ల వార్షిక వేతనంతో ఇక్కడి విద్యార్థులకు కొలువు కట్టబెడుతున్నాయి.

ఇదో చిన్న ప్రపంచం
ఎన్‌ఐటీని మినీ భారత్‌గా..చిన్న ప్రపంచంగా అభివర్ణిస్తారు. ఇక్కడ దేశంలోని అనేక రాష్ట్రాలు..42 దేశాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. క్యాంపస్‌లో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధించారు. విద్యార్థులు లోపల ద్విచక్ర వాహనాలు వినియోగించరు. కేవలం సైకిళ్ల మీదే తిరుగుతారు.

Posted on 08-10-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning