మార్కులను మించి.. మీ మార్క్‌ను పెంచి!

* నాలుగేళ్ల వ్యూహం.. నలభైఏళ్ల జీవితం!

ప్రొఫైల్‌ బిల్డింగ్‌
ఇంజినీరింగ్‌లో అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ సరదాగా సాగాల్సిన ప్రయాణాన్ని పరుగులు పెట్టించి ప్రయాసలపాలు చేసుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కులు మాత్రమే సరిపోవు. ఆసక్తులు, అభిరుచులను పెంపొందించుకోవాలి. సమాచార నైపుణ్యాలను, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. మొదటి సంవత్సరం నుంచే సరైన ప్రణాళికతో కెరియర్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేసుకోవాలి. ఆఖరిదశలో హడావిడి పడితే వైఫల్యాలే మిగులుతాయి. క్రమంగా అర్హతలను సంపాదించుకుంటూ, అభ్యర్థులు తమ బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహనతో రూపొందించుకున్న ప్రొఫైల్‌ రిక్రూటర్లను ఆకట్టుకుంటుంది.

ఇంటర్మీడియట్‌లో మంచి ర్యాంకు వస్తే చాలు జీవితంలో స్థిరపడ్డట్టే అంటారు. అందరూ అనడం వల్లనో, మనకు మనమే అనుకోవడం వల్లనో తెలియదు కానీ, ఇంటర్‌ ఫలితాలు రాగానే ఏదో సాధించేశామన్న ఫీలింగ్‌ వచ్చేస్తుంది. ఇక కష్టపడింది చాలు, కళాశాల జీవితాన్ని అనుభవించాలి అనుకుంటూ 2-3 సంవత్సరాలు ఏమీ చేయకుండానే గడిపేస్తాం. చివరి ఏడాదిలోకి రాగానే ‘ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకోవాలి, జీవితంలో స్థిరపడాలి’ అని రాత్రింబగళ్లు కష్టపడతాం.
అందుకు అవసరమైన నైపుణ్యాలన్నీ ఒకే ఏడాదిలో సాధించడానికి ప్రయత్నిస్తాం. కోచింగ్‌లకు ఎంతో సమయం, డబ్బు ఖర్చు పెడతాం. ఆ ప్రయత్నంలో ఏదో తెలియని ఒత్తిడికి గురవుతాం. మొదటి ఇంటర్వ్యూలో విఫలమైతే చాలా నిరుత్సాహపడిపోతాం. ఎంత కష్టపడుతున్నా ఉద్యోగం రావట్లేదు, ఏదీ కలిసి రావట్లేదు అంటూ బాధ పడుతుంటాం.
పొద్దున, మధ్యాహ్నం ఏమీ తినకుండా రాత్రి భోజనానికి అన్నీ కలిపి తింటే అరుగుతుందా? కడుపు నొప్పి వస్తుంది. ఆరోగ్యం పాడవుతుంది. కళాశాల జీవితం కూడా అంతే. మొదటి సంవత్సరం పొద్దున చేసే అల్పాహారం లాంటిది. రెండో ఏడాది మధ్యాహ్న భోజనం. మూడు, నాలుగు సంవత్సరాలు సాయంత్రం తినే స్నాక్స్‌, రాత్రి భోజనం లాంటివి. అన్నింటినీ సమయానికి తింటేనే నిద్ర సరిగా పట్టి, ఆరోగ్యం బాగుంటుంది.

సీనియర్ల సాహచర్యం
మన విద్యావ్యవస్థ సిలబస్‌, కరికులమ్‌లో బీటెక్‌లో చేరిన మొదటి ఏడాది నుంచి ఏటా పది సబ్జెక్టులు, ప్రతి సబ్జెక్టులో థియరీ, ప్రాక్టికల్‌, వైవా, ల్యాబ్‌వర్క్‌, ఎక్స్‌టర్నల్స్‌, ఇంటర్నల్స్‌, మేజర్స్‌, మైనర్స్‌, అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, థీసిస్‌... ఇలా అకడమిక్‌ పనే ఎంతో ఉంటుంది. ఇదంతా తెలిసీ విశ్రమిస్తాం అంటే కష్టమే అవుతుంది మరి! కాబట్టి ఇంజినీరింగ్‌లో ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, ఐటీ, మెకానికల్‌, సివిల్‌.. ఇలా ఏ బ్రాంచి తీసుకున్నా కెరియర్‌ ప్లానింగ్‌ సరిగా ఉండాలి. బీటెక్‌ మొదటి ఏడాది అన్ని బ్రాంచీల వారికి కామన్‌ సబ్జెక్టులుంటాయి. వీటిలో చాలావరకూ ఇంటర్మీడియట్‌ సబ్జెక్టులే. కాబట్టి, వీటిలో పునాది గట్టిగా వేసుకునే ప్రయత్నం చేయాలి.
ఈ మధ్య ప్రతి ప్రైవేటు సంస్థా ఉద్యోగానికి 60-65% మార్కులను అర్హతగా పేర్కొంటోంది. కాబట్టి, స్కోరు పెంచుకోవడంలో ఈ మొదటి సంవత్సరం బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు కాలేజీ వాతావరణానికి అలవాటు పడాలంటే సీనియర్ల సాహచర్యమూ ప్రధానమే. ప్రాంగణ నియామకాల నిమిత్తం కళాశాలకు తరచూ వస్తున్న సంస్థ ఏంటి? దాని అవసరాలేంటి? మనలో ఏయే నైపుణ్యాలుండాలని వారు ఆశిస్తున్నారు.. లాంటి వాటిమీద ఒక అవగాహన రావాలంటే సీనియర్లతో మాట్లాడటం, వాళ్ల అనుభవాలను తెలుసుకోవడం తప్పనిసరి.
దీంతోపాటు మిగతావాటితో పోలిస్తే మొదటి ఏడాదిలో ఎక్స్‌ట్రా కరికులర్‌ యాక్టివిటీస్‌కు ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి డిబేట్లు, ఎస్సే రైటింగ్‌ మొదలైన వాటిల్లో పాల్గొంటే ఆ సర్టిఫికెట్లకు రెజ్యూమేలో మంచి వెయిట్‌ ఉంటుంది.
ఉదాహరణకు- చెస్‌ను బుద్ధికి సంబంధించిన ఆటగా పరిగణిస్తారు. దానిలో మీకు ఆసక్తి ఉన్నా, ప్రావీణ్యమున్నా ఇంటర్వ్యూలో వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. ఆటలో ఎత్తులు, పై ఎత్తులు ఎలా ఉంటాయో ఇంటర్వ్యూలో విశ్లేషించే అవకాశాలూ ఎక్కువే. అది మీ ప్రొఫైల్‌కు యాడ్‌ఆన్‌ అవుతుంది. ఆట ఏదైనా మొదటి ఏడాది నుంచే ఆడటం ప్రారంభించాలి. దాన్ని ప్రొఫైల్‌లో సూచించడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీం మేనేజ్‌మెంట్‌, నిర్ణయం తీసుకునే మనస్తత్వం, గెలుపోటములను సమానంగా తీసుకునే స్థిరత్వం మీలో ఉన్నాయని మీ ప్రొఫైల్‌ చూస్తే అర్థమవుతుంది.
కళాశాలలో ఏవైనా ఈవెంట్స్‌ను నిర్వహించడంలో మీ సీనియర్లకు సాయం అందిస్తే, వాటిపై అవగాహన పెరుగుతుంది. కొత్త పరిచయాలూ ఏర్పడతాయి. ఎన్నో విషయాలపై మాట్లాడే అవకాశం వస్తుంది. దీంతో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మెరుగవుతాయి. ఇవన్నీ మొదటి ఏడాదిలోనే ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండో ఏడాదికి వచ్చేసరికి కళాశాల సౌకర్యవంతం అవుతుంది. అలాగే మొదటి ఏడాది తరువాత వచ్చే సెలవుల్లో వేరే కళాశాలల్లో జరిగే సబ్జెక్టు వర్క్‌షాప్‌లకు హాజరవొచ్చు. ఐఓటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌ లాంటివి నేర్చుకోవచ్చు.

మినీ ప్రాజెక్టు
రెండో ఏడాది ఎంచుకునే బ్రాంచిలో బేసిక్స్‌ను దృఢపరచుకునేలా ఒక సబ్జెక్టును ఎంచుకుని దానిలో ప్రావీణ్యం సాధించడానికి ప్రయత్నించాలి. అన్నింటినీ ప్రయత్నించి, దేనిలోనూ ప్రావీణ్యం లేకుండా ఉండటం కంటే ఒకే సబ్జెక్టులో పూర్తి పరిజ్ఞానం ఉండేలా చూసుకోవాలి. ఆ సబ్జెక్టులో అందరికంటే ముందుండేలా ప్రయత్నించాలి. ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్నీ పెంచుకోవాలి. ఒక మంచి ఆథర్‌ టెక్స్ట్‌ పుస్తకాన్ని రిఫరెన్సుగా పెట్టుకోవాలి.
ఉదాహరణకు- రెజ్యూమెలో బాగా నచ్చిన సబ్జెక్టును పేర్కొన్నప్పుడు ఇంటర్‌వ్యూలో అందులో నుంచి లోతుగా ప్రశ్నలు అడుగుతారు. వాటికి ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పగలగాలి.
రెండో ఏడాది సెలవులను మినీ ప్రాజెక్టుకు కేటాయించుకోవచ్చు. దీనివల్ల ప్రాక్టికల్‌ పరిజ్ఞానం పెరుగుతుంది. మినీ ప్రాజెక్టు బాగా చేస్తే ఇంటర్వ్యూలో మంచి మార్కులు వస్తాయి.
రెండో ఏడాదిలోనే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ఆంగ్లభాషపై పట్టూ తప్పనిసరే. భావప్రసరణ ప్రధాన మార్గం ఆంగ్లమే కాబట్టి, అనర్గళంగా మాట్లాడగలగాలి. అది ఒక్కరోజులో వచ్చేది కాదు. కాబట్టి, ఇంగ్లిష్‌ పోస్టర్‌ ప్రెజెంటేషన్‌, సెమినార్లు ఇవ్వడం, స్నేహితులతో ఇంగ్లిష్‌లోనే మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. యూట్యూబ్‌లో టెడ్‌ టాక్స్‌ వినడం, క్రికెట్‌ కామెంటరీ వినడం వల్ల కూడా భాష మెరుగవుతుంది.

మేజర్‌ ప్రాజెక్టు, ఇంటర్న్‌షిప్‌
మూడో ఏడాది సెలవుల్లో మేజర్‌ ప్రాజెక్ట్‌, ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాలి. ఇది ఎంత అంకితభావంతో చేస్తే కెరియర్‌కు అంత ప్రయోజనం. ప్రాక్టికల్‌గా వచ్చే సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో ఇంటర్న్‌షిప్‌లో అర్థమవుతుంది. మంచి సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేస్తే పరిజ్ఞానాన్ని పెంచుకునే వీలుంటుంది.
ప్రాజెక్టు కూడా అంతే. ఈ మూడేళ్లలో నేర్చుకున్న పరిజ్ఞానపు అప్లికేషన్‌ను ప్రాజెక్ట్‌ అవుట్‌పుట్‌ తెలియజేస్తుంది. ఇంటర్వ్యూలో ప్రాజెక్టుపైనా ప్రశ్నలుంటాయి.

సాధన... సాధన
తుది సంవత్సరంలోకి చేరగానే నియామకాలకు అవసరమైన ఆప్టిట్యూడ్‌, టెక్నికల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను సాధన చేస్తూ, పెంచుకుంటూ ఉండాలి. మాదిరి పరీక్షలు రాయాలి. లెక్చరర్ల సాయంతో నమూనా ఇంటర్వ్యూలు, గ్రూప్‌ డిస్కషన్లకు సాధన చేయాలి. గేట్‌, జీఆర్‌ఈ, క్యాట్‌ రాయాలనుకునేవారికీ దాదాపుగా ఇవే నైపుణ్యాలు అవసరమవుతాయి.
ఈ అర్హతలూ, సాంకేతిక సామర్థ్యాలూ, ఆచరణాత్మక నైపుణ్యాల వివరాలను రెజ్యూమేలో పొందుపరిస్తే.. పటిష్ఠమైన ప్రొఫైల్‌ తయారవుతుంది. ఇంజినీరింగ్‌ను ఇలా ప్లాన్‌ చేసుకోవడం వల్ల పరీక్ష, ఇంటర్వ్యూ ఇలా దేనికి హాజరైనా విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి.
బీటెక్‌ పూర్తయ్యేనాటికి మహా అయితే 21-22 ఏళ్లు వస్తాయి. ఆ తరువాత ఎంతో జీవితం ఉంటుంది. ఈ 3-4 ఏళ్లు ప్రణాళికబద్ధంగా కష్టపడితే తరువాతి 30-40 ఏళ్లు ఎలాంటి ఒత్తిడీ లేకుండా గడిపేయొచ్చు.
ఇంజినీరింగ్‌ విద్యనుద్దేశించి ఒక గొప్ప వ్యక్తి.. ‘If You plan your work for just 4 years, You can play with your work for rest 40 years’ అన్నారు. అంటే బీటెక్‌లో నాలుగేళ్లను సరిగా ప్లాన్‌ చేసుకుంటే ఉద్యోగంలో నలభై ఏళ్ల పని కూడా ఒక ఆటలా అనిపిస్తుందట!!

ట్రెండింగ్‌ టెక్నాలజీలు
మూడో ఏడాదికి వచ్చేసరికి సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిపెట్టాలి. మొదటి, రెండేళ్లలోనే నేర్చుకుంటే మూడు, నాలుగేళ్లకు వచ్చేసరికి అవుట్‌డేట్‌ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటినెప్పుడూ మూడో సంవత్సరంలో మొదలు పెట్టడం సరైన పని. ప్రస్తుతం సంస్థల్లో వాడుతున్న టెక్నికల్‌ లాంగ్వేజెస్‌ లేదా స్కిల్స్‌ విషయానికొస్తే ట్రెండింగ్‌ టెక్నాలజీల మీద పట్టున్న వారికి రిక్రూట్‌మెంట్‌ సులువవుతుంది. శాలరీ ప్యాకేజీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌డేటా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌ టెక్నాలజీలు.
వీటిలో మెషిన్‌ లర్నింగ్‌ చాలా ముఖ్యం. ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఒక అప్లికేషన్‌. కంప్యూటర్‌కు మనం ఏం చెప్పకుండానే స్పందిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్‌ను ప్రోగ్రాం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అదే తెలుసుకుంటుంది. గత అనుభవాల నుంచి నేర్చుకుంటుంది. దానికి అనుగుణంగా స్పందిస్తుంది. ఒక తెలివిగల వ్యక్తి ఒక పరిస్థితికి ఎలా స్పందిస్తాడో కంప్యూటర్‌ కూడా అలా స్పందించేలా చేయడమే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మెషిన్‌ లర్నింగ్‌.
మన చుట్టూ ఉండే వస్తువులను ఇంటర్నెట్‌ ద్వారా ఆపరేట్‌ చేయడం.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌. సెన్సర్లు, ఆక్టివేటర్లతో హ్యూమన్‌ను డిటెక్ట్‌ చేసేలా ప్రోగ్రాం రాయడం. పెద్ద మాల్స్‌లో తలుపులు తెరుచుకోవడం, మూసుకోవడానికి కారణం ఐఓటీనే. వీటితోపాటు సీ, సీ++, జావా, పైథాన్‌, ఒరాకిల్‌ వంటి లాంగ్వేజెస్‌ కూడా ప్రధానమే.

Posted on 16-10-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning