ఇంటర్న్‌షిప్‌ల బాటలో ఐటీ సంస్థలు

* భారీ సంఖ్యలో ఎంపిక చేసుకుంటున్న కంపెనీలు
ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంగణ నియామకాల్లో ఎంపికై, నేరుగా కొలువులో చేరేవారికి భారీ వేతనమిస్తూ శిక్షణ ఇవ్వడం ద్వారా సమయం వృథా, వ్యయం అధికమని భావిస్తున్న ఐటీ పరిశ్రమలు విద్యార్థులను నేరుగా ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన వారికి ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు అవకాశమిస్తుండగా, మరికొన్ని ఇంటర్న్‌షిప్‌లకే ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నాయి. అక్కడ వారి పనితీరు నచ్చితే కొలువిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు పెద్దసంఖ్యలో ఇంటర్న్‌షిప్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. సంస్థలు ఇప్పటివరకు కళాశాలలకు వచ్చి ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులను ఎంపిక చేసుకుని, చదువయ్యాక వారిని కొలువుల్లో నియమించుకొని శిక్షణ ఇచ్చేవి. భారీ వేతనమిస్తూ, శిక్షణ ఇవ్వడం వల్ల ఖర్చు, సమయమూ వృథా అవుతోందని, సీనియర్లు శిక్షణ ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యలో చేరిననాటి నుంచే ఇతర ఉద్యోగులతో సమానంగా పనిచేసేలా ‘రెడీ టూ ఇండస్ట్రీ’ విద్యార్థులు కావాలని పరిశ్రమలు ఇంజినీరింగ్‌ కళాశాలలను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కళాశాలలు కన్సల్టెన్సీలను నియమించుకొని ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇప్పిస్తుండగా, పరిశ్రమలు ఇంటర్న్‌షిప్‌లకు తెరలేపాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఇంటర్న్‌షిప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో 600 మందికి 200 మంది ఇంటర్న్‌షిప్‌ పొందారు. ఎంవీఎస్‌ఆర్‌ కళాశాలలో ఇప్పటివరకు 70మంది ఎంపికయ్యారు. సీబీఐటీలో 250మందిని ఆయా కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. పలు కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి. పరిశ్రమలను బట్టి నెలకు రూ.20వేల నుంచి రూ.35వేల వరకు ఊతం ఇస్తున్నాయని కళాశాలల ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. వాసవి కళాశాలలో బీటెక్‌ ఐటీ బ్రాంచి నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థి సంతోష్‌ మాట్లాడుతూ..యాడ్‌ట్రాన్‌ నెట్‌వర్క్స్‌ అనే కంపెనీ ఇంటర్న్‌షిప్‌ ఇచ్చిందని, నెలకు రూ.20వేలు ఇస్తోందని చెప్పారు. జనవరి మొదటి వారం నుంచి కంపెనీకి వెళ్లాలని, ప్రతి శనివారం కళాశాలకు వస్తామని అన్నారు.
సేవల నుంచి ఉత్పత్తి వైపు...
గతంలో ఇక్కడి ఐటీ సంస్థలు ఇతర కంపెనీలు, దేశాలకు సేవలందించేవి. అలాంటి పనులకు ఇతర దేశాల నుంచి పోటీతోపాటు కొత్త సాంకేతికతల వైపు వెళ్లాల్సి రావడంతో భారత్‌ పరిశ్రమలు సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసేలా మారక తప్పడం లేదు. ఇందుకు కోడింగ్‌పై పట్టున్న మానవ వనరులు అవసరం. అందుకే ఇంటర్న్‌షిప్‌లకు అవకాశమిచ్చి కొరతను కొంత తీర్చుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సైతం ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయడం, ఎంపికైన వారికి హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆదేశించడంతో కళాశాలలు సైతం ప్రోత్సహిస్తున్నాయి.

Posted on 24-12-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning