కృత్రిమ మేధస్సుపై 5 లక్షల మందికి శిక్షణ

* దేశవ్యాప్తంగా పది పరిశోధనశాలలు
* ఏఐ అనుకూల వాతావరణ సృష్టికి 715 సంస్థలతో భాగస్వామ్యం
* మైక్రోసాఫ్ట్‌ ఇండియా వెల్లడి

బెంగళూరు: కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతపై దేశ యువతకు పెద్ద ఎత్తున శిక్షణనిచ్చేందుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇండియా సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా పది విశ్వవిద్యాలయాల్లో ఏఐ పరిశోధనశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో పది వేల మంది డెవలపర్లకు నైపుణ్యాలు కల్పించాలని, 5 లక్షల మంది యువతీయువకులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. భారత్‌ ఆర్థిక, సామాజిక పురోగతి కోసం ఏఐని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా తాము సాధిస్తోన్న ప్రగతిని బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో వివరిస్తూ ఈ విషయాలను ప్రకటించింది. ప్రతి సంస్థకూ, వ్యక్తికీ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, విద్యాసంస్థలు, పౌర సమాజంలోని వివిధ వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ‘ఇంటెలిజెంట్‌ క్లౌడ్‌ హబ్‌ ప్రోగ్రామ్‌’ను కూడా ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఏఐ, డేటా సైన్సెస్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి అంశాల్లో పరిశోధక సంస్థలు, ఉన్నత విద్యాసంస్థల్లో శిక్షణకు ఈ ప్రొగ్రామ్‌ ద్వారా సంస్థ చేయూతను ఇవ్వనుంది.
వినియోగిస్తున్నవాటిలో 60శాతం భారీ సంస్థలే
ఏఐ అనుకూల వాతావరణ సృష్టికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించి, అమలు చేసేందుకు 715 సంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వివరించింది. ఉద్యోగి ఉత్పాదకత, వ్యాపార క్రియాశీలతలను పెంచేందుకు, వినియోగదారులతో సంబంధాలను మెరుగుపరిచేందుకు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు అవసరమైన పరిష్కారాల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపింది. 700కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ద్వారా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకున్నట్లు వివరించింది. వీటిలో 60 శాతం తయారీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన భారీ సంస్థలే ఉన్నాయని పేర్కొంది. వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్న కొత్త తరం సంస్థలతోనూ జట్టు కడుతున్నట్లు తెలిపింది.
ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వానికీ మైక్రోసాఫ్ట్‌ సహకారం అందిస్తోంది. వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం వంటి కీలక రంగాల్లో చేపట్టే కొత్త కార్యక్రమాల్లో సహకారం అందించేందుకు, సమస్యల పరిష్కారానికి నీతి ఆయోగ్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. క్లౌడ్‌, ఏఐ వంటి వాటిని ఉపయోగించి పరిష్కారాలు చూపనుంది. విద్య, నైపుణ్య కల్పన, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఏఐ వినియోగ అవకాశాలను గుర్తించేందుకు భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ)తోనూ కలిసి పనిచేస్తోంది.
* వేల మంది అభ్యర్థులను ఆటోమెటిక్‌గా వీడియో ఇంటర్వ్యూ చేసేందుకు టాల్వ్యూ అనే ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసింది.
భారత్‌కు గొప్ప పాత్ర
‘‘ఏఐ విప్లవంలో గొప్ప పాత్రను పోషించే స్థానంలో భారత్‌ ఉంది. దేశ అభివృద్ధికి, ఇక్కడి వ్యాపారాలకు ఏఐ ఎంతగానో దోహదపడనుంది. ముఖ్యంగా విద్య, నైపుణ్య కల్పన, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఇది కీలకం కానుంది. ఏఐ ఆధారిత సాంకేతికతలు వేగంగా విస్తరిస్తుండటంతో ఖర్చులూ తగ్గుతున్నాయి’’
- అనంత్‌ మహేశ్వరి, మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌
ఏఐతో మైక్రోసాఫ్ట్‌ చూపిన కొన్ని పరిష్కారాలు
* గుండె జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించే ఏఐ పరిష్కారాన్ని అపోలో ఆసుపత్రులతో కలిసి అభివృద్ధి చేసింది.
* కచ్చితమైన వ్యాధి నిర్ధారణకు, క్యాన్సర్‌ వంటి రోగాలను మందుగా గుర్తించేందుకు సాంకేతికతను ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌తో కలిసి రూపొందించింది.
* సందేశాల ద్వారా సంభాషణలు జరుపుతూ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు, వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే ‘రెవా’ అనే ‘చాట్‌బోట్‌’ను ఫ్యూచర్‌ జనరలి బీమా సంస్థకు అందించింది.
* ప్రముఖ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లేకు చెందిన స్పెక్టాకామ్‌ సంస్థ, స్టార్‌ ఇండియాలతో కలిసి క్రికెట్‌ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సాయపడే పవర్‌ బ్యాట్‌ను తయారు చేసింది.

Posted on 17-01-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning