కోడింగ్‌తో కొలువులు

* అదనపు నైపుణ్యాలకు పెరుగుతున్న ప్రాధాన్యం
* నేరుగా ఆన్‌లైన్‌లోనే పరీక్షిస్తున్న ఐటీ సంస్థలు
* క్రమంగా తగ్గుతున్న ప్రాంగణ నియామకాలు
* ముందే నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగవుతున్న ఉపాధి అవకాశాలు

ఈనాడు - అమరావతి: ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రాంగణ నియామకాల్లో మార్పులొస్తున్నాయి. ప్రధాన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కళాశాలలకు రావడం తగ్గించి నేరుగా ఆన్‌లైన్‌లోనే ఎంపికలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అదనపు నైపుణ్యాలుంటే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విద్యార్థులకు కోడింగ్‌ నైపుణ్యం తప్పనిసరిగా మారుతోంది. గతంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సంకేత భాషపై ఓ మోస్తరు పట్టున్న వారిని తీసుకుని శిక్షణ ఇచ్చేవి. ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకునే క్రమంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేరుగా పని చేయగలిగే వారినే ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు నైపుణ్యం ఉన్న వారికే ఇంజినీరింగ్‌లో ఉద్యోగావకాశాలు లభించే పరిస్థితి ఏర్పడింది. ఏ బ్రాంచి చదివారన్న దాని కంటే పరిశ్రమకు తగ్గ ఆప్టిట్యూడ్‌, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, కంప్యూటర్‌ భాష, ఆంగ్ల నైపుణ్యంపై పట్టు ప్రధాన అవసరాలుగా మారుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
జేఎన్‌టీయూ అనంతపురం విద్యార్థుల్లో కొందరికి టీసీఎస్‌లో అత్యధికంగా ఏడాదికి రూ.7.2లక్షల అతి తక్కువగా రూ.2.8లక్షల వేతనం లభించింది. జేఎన్‌టీయూ, కాకినాడలో 2015-16లో ప్రాంగణ నియామకాల్లో టీసీఎస్‌లో రూ.3.3 లక్షల నుంచి రూ.7 లక్షల ప్యాకేజీ లభించగా.. ఇది 2016-17లో రూ.3.36 లక్షల నుంచి 6 లక్షలకు తగ్గింది. శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో 1992 నుంచి దాదాపు 7వేల మందికి ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. వార్షిక వేతనం రూ.3.5 లక్షల నుంచి రూ.11లక్షల వరకు లభించింది. ఆంధ్ర వర్సిటీ ప్రాంగణ ఎంపికల్లో గతేడాది అత్యధికంగా ఏడాదికి రూ.12 లక్షలు కాగా.. సరాసరిన రూ.3-4 లక్షల వరకు వేతనాలు లభించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ ఏడాది జరిగిన ప్రాంగణ ఎంపికల్లో సరాసరిన ఏడాదికి రూ.2.5 నుంచి 3 లక్షల ప్యాకేజీ వరకు వచ్చాయి.
నైపుణ్య శిక్షణతో మెరుగు..
ఇంజినీరింగ్‌ కళాశాలలతో పాటు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. దీంతో శిక్షణ పొందుతున్న వారి జీతాలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 272 కళాశాలల్లో విద్యార్థులకు ఏపీఎస్‌ఎస్‌డీసీ నైపుణ్య శిక్షణనిస్తోంది. పైథాన్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డస్సాల్డ్‌ సిస్టమ్స్‌, గూగుల్‌ అండ్రాయిడ్‌, నానో డిగ్రీలపై ప్రత్యేకంగా శిక్షణనిస్తోంది. ఈ శిక్షణ పొందుతున్న వారిలో 42 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది చదివే 90,560 మందికి శిక్షణ అందించగా వీరిలో 37,548 మందికి ఉద్యోగాలు లభించాయి. గతేడాది నైపుణ్య శిక్షణ పొందిన వారిలో అత్యధిక ప్యాకేజీ రూ.7.2 లక్షలు కాగా.. అతి తక్కువ ప్యాకేజీ రూ.1.8 లక్షలుగా ఉంది. సరాసరిన రూ.4.7 లక్షలు.
సామర్థ్యం ఉంటేనే..- చెరెడ్డి శ్రీనివాసరావు, ప్రాంగణ నియామకాల అధికారి, ఆర్‌వీఆర్‌, జేసీ, గుంటూరు
విద్యార్థుల సామర్థ్యాలను అనుసరించే వేతన ప్యాకేజీలు లభిస్తున్నాయి. అదనపు నైపుణ్యాలున్న విద్యార్థులకు బైజూస్‌ లాంటి సంస్థలు అత్యధిక వేతనాలిస్తున్నాయి. గతంలోలా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కళాశాలలకు రావడం లేదు. ఆన్‌లైన్‌లోనే ఎంపికలు చేసుకుంటున్నాయి. దీనిపై విద్యార్థులకు శిక్షణనిస్తున్నాం.
నైపుణ్యంపై ప్రధాన దృష్టి
ప్రముఖ ఐటీ సంస్థలు ఆన్‌లైన్‌లోనే ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నాయి. అభ్యర్థులకు ఒక సమస్యను ఇచ్చి దాని పరిష్కారానికి ప్రోగ్రామింగ్‌ రాయాలని అడుగుతున్నాయి. అందువల్ల కొన్ని కళాశాలలు విద్యార్థులకు అదనపు నైపుణ్యాలను అందించేందుకు ప్రాధాన్యం ఇస్తుండగా.. మరికొన్ని వీటిని పట్టించుకోవడం లేదు. దీంతో నైపుణ్య శిక్షణ ఇస్తున్న కళాశాలలకే డిమాండు పెరుగుతోంది.

Posted on 28-04-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning