కోర్సా? కొలువా?

విద్యా సంవత్సరం దాదాపుగా ముగిసిపోయింది. ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సర విద్యార్థులు త్వరలోనే పట్టాతో బయటకు వచ్చేస్తున్నారు. కళాశాల వదిలి రాబోతున్న వీరిలో చాలామంది భవిష్యత్తు గురించిన ఊగిసలాటతో ఉన్నారు. డిగ్రీ అర్హతతో ఉద్యోగంలోకి చేరితే తర్వాత పీజీ చేసే అనుకూల పరిస్థితులు ఉండవేమో; ఒకవేళ పీజీలో చేరితే.. ఈ రెండేళ్ల వ్యవధిలో లభించే మెరుగైన ఉద్యోగావకాశాలేమైనా కోల్పోతామేమో.. అనే సందేహాలు. విద్యార్థులు అన్ని కోణాల్లో ఆలోచించి, ఏది తమకు ప్రయోజనకరమో గుర్తించి, నిర్ణయం తీసుకోవాల్సిన తరుణమిదే!

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో ఎంపీసీ ఎంచుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థుల లక్ష్యం ఇంజినీరింగే అవుతోంది. తల్లిదండ్రుల కల అనో, పక్కవారు ఎంచుకుంటున్నారనో, వేరే కోర్సులపై తక్కువ అభిప్రాయమో.. మొత్తానికి ఎంపీసీ అనగానే బీటెక్‌/బీఈ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇంటర్‌లో రెండేళ్లపాటు ఐఐటీలోనో, ఎన్‌ఐటీలోనో సీటు కొట్టేయాలని కష్టపడి సాధించేవారు కొందరైతే, ప్రసిద్ధ విద్యాసంస్థల్లో చేరగలిగేది మరికొందరు. మిగిలినవారు ర్యాంకుకు తగ్గ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరిపోతారు. మొదటి ఏడాది సబ్జెక్టులు, అకడమిక్‌ విధానాన్ని తెలుసుకోవడం, కళాశాల జీవితానికి అలవాటు పడటంతో చాలామందికి సరిపోతుంది. రెండో ఏడాదిలో కొంచెం కుదుటపడ్డామనుకునేలోగా మూడో ఏడాది వచ్చేస్తుంది. ఇక నాలుగో సంవత్సరం నుంచీ ఒక ప్రశ్న మొదలవుతుంది- కోర్సు పూర్తిచేశాక ఏంటని?
ఏటా కళాశాల నుంచి బయటకు వచ్చే బీటెక్‌ పట్టభద్రుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. బయటకు వచ్చే ప్రతి విద్యార్థిదీ ఉద్యోగమా? పైచదువులా? అనే సందేహమే! నిజానికి బీటెక్‌ డిగ్రీ అంటే.. విద్యార్థి తన విద్యా జీవితంలో చాలాదూరం ప్రయాణించినట్టే. నేడు జాబ్‌ మార్కెట్‌ పరిధి విస్తృతంగా పెరుగుతోంది. కేవలం మార్కులు, ర్యాంకులకే ఉండే ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో ఒక ఉద్యోగానికి అదనపు అర్హతలు అవసరమవుతున్నాయి. అందుకే తను నేర్చుకున్న పరిజ్ఞానం సరిపోతుందా అన్న సందేహం విద్యార్థుల్లో మొదలవుతోంది.
ఉన్నత చదువు, ఉద్యోగం రెండు వేర్వేరు గమ్యాలు. ఒకటి విజ్ఞానానికి సంబంధించినదైతే, రెండోది సంపాదనకు సంబంధించినది. దేన్ని ఎంచుకున్నా విద్యార్థి మంచి గమ్యాన్నే చేరుకోగలడు. కాబట్టి తన భవిష్యత్తు లక్ష్యం ఏంటన్నదానిపై విద్యార్థికి స్పష్టత ఉండాలి. తన కెరియర్‌ లక్ష్యాలు, సామర్థ్యాలు, ఆసక్తుల ఆధారంగా సముచిత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మాస్టర్స్‌ మార్గం
ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేయటం కెరియర్‌కు పటిష్ఠమైన దిశను నిర్దేశిస్తుంది. సబ్జెక్టుపై సమగ్ర అవగాహన పీజీ వల్ల లభిస్తుంది. పరిధి విస్తృతమై, లక్ష్యాలు సమున్నతమవుతాయి. ఉన్నతవిద్యలో చేరాలనుకుంటే... ఎంటెక్‌/ఎంఎస్‌; ఎంబీఏ... రెండు దారులున్నాయి.
ఎంటెక్‌: దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందాలంటే ఎంటెక్‌/ ఎంఎస్‌ చేయటానికి మొగ్గు చూపవచ్చు. బీటెక్‌లో మాదిరిగానే ఎంటెక్‌లోనూ ఎంచుకున్న స్పెషలైజేషన్‌ను లోతుగా చదివి, దానిలో నైపుణ్యాన్ని సాధించవచ్చు. భవిష్యత్తులో రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ప్రొఫెసర్‌ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారికీ ఇదే మార్గం.
కొన్ని విశ్వవిద్యాలయాలు సొంతంగా ప్రవేశపరీక్షను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తుండగా చాలావరకూ గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ద్వారా తీసుకుంటున్నాయి.
ఎంఎస్‌: చాలామంది విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ డిగ్రీని పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. అక్కడి విశ్వవిద్యాలయాలూ విదేశీ విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విద్యను అందించడంతోపాటు విద్యారుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వీరు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో స్కోరు సాధించాల్సివుంటుంది.
ఎంబీఏ: దీని విషయానికొస్తే.. మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులకు జీతభత్యాలు ఎక్కువగా ఉండటం ఇక్కడ ఎక్కువమందిని ఆకర్షించే అంశం. కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఇది అనుకూలం. ప్రస్తుతం నిత్య జీవితంలో టెక్నాలజీది ప్రధాన పాత్ర. కాబట్టి, సాంకేతికతతోపాటు మేనేజీరియల్‌ నైపుణ్యాలూ సమ్మిళితంగా ఉండటం తప్పనిసరి అయింది.ఎంబీఏ పూర్తయ్యాక మార్కెటింగ్‌, సేల్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కావాలనుకుంటే తరువాత టెక్నికల్‌ విభాగంలోనూ కొనసాగవచ్చు.
ఉద్యోగంలో చేరినప్పటికీ బృందంతో పనిచేసేటపుడు నాయకత్వ లక్షణాలు, అందరితో కలిసి పనిచేయడం, తమ పనిని అందరూ మెచ్చేలా ప్రదర్శించడం వంటి లక్షణాలు అవసరమవుతున్నాయి. వీటిపై అవగాహనకూ ఎంబీఏ డిగ్రీ సాయపడుతుంది. నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మొదలైనవి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
క్యాట్‌, గ్జాట్‌, మ్యాట్‌, సీమ్యాట్‌ ద్వారా ప్రవేశాలను పొందొచ్చు. కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేకంగా తమకంటూ ప్రవేశపరీక్షను నిర్వహించి కూడా తీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌లో ర్యాంకు సాధించడం ద్వారా కూడా చదవొచ్చు. అయితే.. ఇప్పటిదాకా చదివిన అంశాలకు పూర్తి భిన్నమైనవాటిని చదవాల్సి ఉంటుంది. సేల్స్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, అకౌంట్స్‌.. మొదలైన కొత్త అంశాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. బీఎస్‌సీ, బీకాం.. ఇలా ఏ కోర్సు చదివినవారికైనా పీజీలో ఎంబీఏ అందుబాటులో ఉంది. కాబట్టి, విపరీతమైన పోటీ ఉంటుంది.

ఉద్యోగ బాట
బీటెక్‌ తరువాత ఎక్కువ శాతం విద్యార్థుల ఎంపిక ఉద్యోగమే! సుప్రసిద్ధ ఇంజినీరింగ్‌ కళాశాలలు తమ విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లను కల్పిస్తున్నాయి. కోర్సు పూర్తయ్యాక సంస్థలకు నేరుగా దరఖాస్తు చేసుకుని ఉద్యోగాన్ని పొందడం కంటే ప్రాంగణ నియామకాల ద్వారా పొందడం సులువైన పద్ధతి. డిగ్రీ పట్టాతో బయటకు వచ్చాక ఉద్యోగం పొందడం కొంత కష్టంతో కూడుకున్న పనే! ప్రాంగణ నియామకాల్లో రానివాళ్లు, ఆ సదుపాయమే లేనివాళ్లు సంస్థలకు నేరుగా దరఖాస్తు చేసుకోవడమో, ఉద్యోగ మేళాల్లో పాల్గొనడం ద్వారానో కూడా ప్రయత్నించవచ్చు. ప్రైవేటు సంస్థల్లో కంటే ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం సాధించడం మంచిదనుకుంటే వాటికీ ప్రయత్నించవచ్చు.
పీఎస్‌యూ పోస్టులు: పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌లను క్లుప్తంగా ఇలా వ్యవహరిస్తారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు గేట్‌ స్కోరు ఆధారంగా ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ విద్యార్థులను నియమించుకుంటున్నాయి. సీఐఐ, ఇస్రో, బార్క్‌ వంటివీ ప్రత్యేక పరీక్షలను నిర్వహించి ఇంజినీరింగ్‌ పట్టభద్రులను తీసుకుంటున్నాయి.
ఈఎస్‌ఈ: ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌. యూపీఎస్‌సీ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్ష ఇది. వాడుకలో దీన్ని ఐఈఎస్‌ అని కూడా అంటారు. రక్షణ, పీడబ్ల్యూడీ, రైల్వేస్‌ మొదలైనవాటిల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.
సివిల్‌ సర్వీసెస్‌: డిగ్రీ తరువాత ఎక్కువమంది ఆసక్తి చూపేదానిలో ఇదీ ఒకటి. ప్రతిష్ఠాత్మక కెరియర్‌గానూ దీనికి పేరు. ఎన్నో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు మంచి జీతాలు కల్పిస్తున్నప్పటికీ, చాలామంది అభ్యర్థులు యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్స్‌ సర్వీసెస్‌ వైపు మొగ్గు చూపుతుంటారు. సివిల్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ దశలను దాటితే ఉద్యోగాన్ని చేజిక్కించుకోవచ్చు. ఇంజినీరింగ్‌ అభ్యర్థులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో దీనికి సిద్ధమవుతుంటారు.
పై చదువులు, ఉద్యోగం.. లాభాలు, ఉన్న మార్గాల గురించి ఎంత ఆలోచించినా ఇంకా సందేహంగా ఉందా? అయితే నిపుణుల సలహా తీసుకోవటం మేలు. వారు కౌన్సెలర్లే అవ్వాల్సిన పని లేదు. మీకంటే ముందు మీ ప్రస్తుత దశను దాటిన వాళ్ల సలహా అయినా ప్రయోజనకరమే. వ్యక్తిగత నెట్‌వర్క్‌లు, ఫేస్‌బుక్‌, లింక్‌డిన్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో సంబంధిత రంగంలోనివారితో నెట్‌వర్క్‌లను ఏర్పరచుకుని వారి సాయం తీసుకోవచ్చు. వారి అనుభవం, సలహాలు భవిష్యత్తును మెరుగ్గా నిర్మించుకోవడానికి తప్పక సాయపడతాయి.
ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగంలో చేరి, తర్వాత పీజీ చేద్దామనుకున్నప్పటికీ కొందరు విద్యార్థులు వాయిదాలు వేస్తూ పోతుంటారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

పీజీ చేస్తే?

అనుకూల అంశాలు
* చదివే బ్రాంచిపై అమితాసక్తి ఉంటే.. ఇంకా దానిలో విలువైన ఉన్నత పరిజ్ఞానం పొందవచ్చు.
* పరిశోధనపై ఆసక్తి ఉంటే... పీజీ చేయటం మంచి నిర్ణయమవుతుంది.
* కోర్‌ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు బాగా మెరుగవుతాయి.
* కోర్‌ పరిశ్రమల్లో ఉద్యోగిగా చేరినప్పుడు వీరికి పదోన్నతుల్లో ప్రాధాన్యం లభిస్తుంది.
*తక్షణ ఆర్థిక ప్రయోజనం పక్కనపెట్టి పరిశోధనలపై అధికాసక్తి ఉంటే పీజీ చేయటం చాలా మంచిది. దీర్ఘకాలంలో ప్రయోజనాలు సమకూరతాయి.
*ఎంటెక్‌ అయినా, ఎంబీఏ అయినా..పట్టా పొందితే రెండేళ్ల తర్వాత కూడా మంచి ఉద్యోగాలే లభిస్తాయి.
అననుకూల అంశాలు
* విద్యాభ్యాసంపై ఆసక్తి తగ్గిపోయినవారికి మరో రెండేళ్లపాటు చదువు కొనసాగించటం భారంగా అనిపిస్తుంది.
* పీజీ కరిక్యులమ్‌ క్లిష్టంగా ఉంటుంది. కొన్ని సంస్థల్లో ఒకటి రెండు పరిశోధన పత్రాలు ప్రచురించటం తప్పనిసరి.
* పోస్టుగ్రాడ్యుయేషన్‌ తర్వాత కెరియర్‌ దిశ వేరేగా మార్చుకోవటం కొంచెం కష్టం.
* కోర్సు ముగిసేదాకా ఫీజు, పుస్తకాలు, ఇతర ఖర్చులకు ఆర్థిక వనరులు వెచ్చించాల్సివుంటుంది.

కొలువుకు బీటెక్‌ చాలు, కానీ..
నిపుణుల అభిప్రాయం ప్రకారం- ఇంజినీరింగ్‌ వృత్తికి అవసరమైన పరిజ్ఞానం బీటెక్‌ స్థాయిలో లభిస్తుంది. చాలావరకూ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పీఎస్‌యూల్లో ఉద్యోగం సాధించడానికి బీటెక్‌ అర్హత సరిపోతుంది. ఉన్నత చదువులపై ఆసక్తి మేరకో.. టెక్నికల్‌ రంగంపై, ఆర్‌ అండ్‌ డీ, టీచింగ్‌ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే తప్ప ఎంటెక్‌ అవసరం లేదనేది వారి అభిప్రాయం. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగంలో చేరి, తర్వాత పీజీ చేద్దామనుకునే కొందరు ఒక పట్టాన పీజీ పూర్తిచేయలేకపోతుంటారు. విద్యార్థులకు డిగ్రీ తర్వాత వెంటనే ఎంటెక్‌/ఎం.ఎస్‌, ఎంబీఏ చేయటానికి ప్రేరణ, శక్తి సామర్థ్యాలు సహజంగానే ఉంటాయి. ఈ మానసిక స్థితి పీజీని విజయవంతంగా పూర్తిచేయటానికి ఉపకరిస్తుంది. పీజీ పూర్తిచేస్తే.. మెరుగైన హోదాతో, అధిక ప్యాకేజితో ఉద్యోగం పొందే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి!

Posted on 11-05-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning