సత్తా ఉంటే కొలువు ఖాయం

* ఎక్కడ చదివామన్నది కాదు కొలువు కొట్టామా లేదా అనేదే కీలకం
* సాధారణ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరినా ఉద్యోగం పట్టేయచ్చు
* ప్రాంగణ ఎంపిక బదులు ఆన్‌లైన్‌ నియామకాలకు కంపెనీల మొగ్గు
* ‘బీ’ సీట్లకు పోటీ వద్దని సూచిస్తున్న నిపుణులు

పుణెలోని ఒక సాధారణ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన బీటెక్‌ విద్యార్థి లండన్‌ గూగుల్‌ కార్యాలయంలో రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఐఐటీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ స్థాయి జీతం దక్కుతుంది. అయితే ఆవిద్యార్థి 150కి మించి కోడింగ్‌ పోటీల్లో పాల్గొని అక్కడ చూపిన ప్రతిభ ఆధారంగా గూగుల్‌ అతన్ని నేరుగా వారి కార్యాలయానికి పిలిచి కొలువు ఇచ్చింది.
హైదరాబాద్‌ నగరంలోని ఓ ద్వితీయ శ్రేణి కళాశాలలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు ముంబయిలోని ఓ ప్రసిద్ధ కంపెనీలో నెలకు రూ.30 వేల స్టయిఫండ్‌తో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారు. జూన్‌3 నుంచి ఇంటర్న్‌షిప్‌ మొదలవనుంది. వీరిని ఎంపిక చేయడానికి ఆ కంపెనీ వీరు చదివే కళాశాలలకేమీ వెళ్లలేదు. కేవలం ఆన్‌లైన్‌ పోటీ పరీక్షల్లో పాల్గొనడమే కారణం.
ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ కళాశాలల్లో చేరితే ప్రాంగణ నియామకాల్లో ఏదో ఒక కొలువు దొరుకుతుందని యాజమాన్య సీట్ల(బీ సీట్లు)కు విద్యార్థులు పోటీ పడుతుండగా... నిపుణులు మాత్రం ఆ ధోరణికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. ప్రాంగణ నియామకాల ట్రెండ్‌ మారుతుందని స్పష్టం చేస్తున్నారు. స్థోమతను మించి రూ.లక్షలు ఖర్చు చేసి వాటిల్లో చేరాల్సిన అవసరం లేదని గట్టిగా చెబుతున్నారు. ఏ కళాశాలలో చదివినా సత్తా ఉంటే చాలు కోరుకున్న కంపెనీ కొలువు ఇచ్చే పరిస్థితి ఉందని వివరిస్తున్నారు. ఎంసెట్‌ ర్యాంకును బట్టి ద్వితీయ శ్రేణి కళాశాలల్లో చేరి ప్రణాళికబద్ధంగా చదువుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇప్పుడు కళాశాల స్థాయి కాక విద్యార్థి ప్రతిభ ఆధారంగా నియామకాలకు ఐటీ పరిశ్రమలు గత ఏడాదే శ్రీకారం చుట్టిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
ఆన్‌లైన్‌తో అందరికీ అవకాశం
ఏటా వేల సంఖ్యలో విద్యార్థులను నియమించుకొనే టీసీఎస్‌ దేశవ్యాప్తంగా 80-100 కళాశాలలకు వెళ్తుంది. గత ఏడాది కళాశాలలకు వెళ్లకుండా టీసీఎస్‌ నింజా, డిజిటల్‌ పేరిట రెండు రకాల ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించింది. విప్రో కంపెనీ సైతం దాదాపు సగం నియామకాలను ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారానే పూర్తి చేసింది. దీనివల్ల ప్రతిభావంతులైన అందరికీ అవకాశం ఇవ్వడంతోపాటు వ్యయం కూడా తమకు తగ్గుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈసారి మరిన్ని కంపెనీలు అందిపుచ్చుకుంటాయని కళాశాలలు కూడా భావిస్తున్నాయి. మొత్తం మీద 30 శాతం ఉద్యోగాలను ఐటీ కంపెనీలు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి భర్తీ చేసుకుంటున్నాయని చెబుతున్నారు.
ఆన్‌లైన్‌ పరీక్షల వల్ల ఏ కళాశాల విద్యార్థి అయినా హాజరయ్యే అవకాశం లభిస్తోంది. 2019-20 విద్యా సంవత్సరంలో బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు 2023లో ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసుకుంటారు. అప్పటికి మరిన్ని మార్పులు వస్తాయని జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యులు అంచనా వేస్తున్నారు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని ప్రాంగణ నియామకాల అధికారులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు.

మొదటి ఏడాది నుంచే ప్రణాళిక అవసరం -కాంచనపల్లి వెంకట్‌, సీఈవో, సన్‌టెక్‌ కార్ఫ్‌
మారిన పరిస్థితుల నేపథ్యంలో కేవలం ప్రాంగణ నియామకాల కోసం రూ.లక్షలు చెల్లించి యాజమాన్య కోటా కింద సీట్లు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేసుకుంటున్నాయి. 2017 వరకు కంపెనీలు ప్రముఖ కళాశాలలకు వెళ్లి నియమించుకునేవి. చేరిన తర్వాత కంపెనీలు కోడింగ్‌పై శిక్షణ ఇచ్చుకునేవి. ఇప్పుడు అందరూ పాల్గొనండి... సత్తా చాటుకోండి... కొలువు దక్కించుకోండి అని ఆన్‌లైన్‌ పోటీలు/పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కోడింగ్‌ అన్నది అన్ని బ్రాంచిల వారికి అవసరమే. కోడింగ్‌ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలంటే బీటెక్‌ మొదటి ఏడాది నుంచి ఒక ప్రణాళిక ప్రకారం నైపుణ్యాలను పెంచుకోవాలి. కోడింగ్‌ పోటీల్లో పాల్గొనాలి. అందుకు అవసరమైన వాటిపై పట్టు సాధించాలి. ఇప్పుడు ఆంగ్ల భాష ప్రావీణ్యానికి ప్రాధాన్యం తగ్గింది. సాంకేతికమైన విషయాన్ని ఎదుటి వారికి చెప్పే స్థాయి ఉంటే చాలు.

Posted on 27-05-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning