ప్రాంగణ ప్రభ..!

* బీటెక్‌లో ఏటేటా పెరుగుతున్న ప్రాంగణ నియామకాలు
* ఎంపికైనవారిలో 20 శాతం తెలుగు విద్యార్థులే
* 2017-18 కంటే 2018-19లో పెరిగిన కొలువులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌లో చేరేవాళ్లు క్రమేణా తగ్గుతున్నా.. ప్రాంగణ నియామకాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 2012-13 నుంచి దేశవ్యాప్తంగా ఏటా(2017-18లో తప్ప) నియామకాలు అధికమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంగణ కొలువులు ఎక్కువగానే జరుగుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) తాజా గణాంకాలను ఇటీవల వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత విద్యాసంవత్సరంలో సుమారు 3.80 లక్షల మంది బీటెక్‌ విద్యార్థులు కొలువులకు ఎంపికైనట్లు వాటిలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2017-18 విద్యా సంవత్సరంలో 7,29,125 మంది బీటెక్‌లో ఉత్తీర్ణులవగా అందులో 3,43,034 మంది (47 శాతం) కొలువులకు ఎంపికయ్యారు. తెలంగాణలో 56,682 మందిలో 29,128 మంది(51.38 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 73,908 మందిలో 35,607 మంది(48.17 శాతం) మంది ఉద్యోగాలు దక్కించుకున్నారని ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
తెలుగు విద్యార్థుల సత్తా..
దేశవ్యాప్తంగా ప్రాంగణ కొలువులకు ఎంపికవుతున్న వారిలో 20 శాతానికిపైగా ఏపీ, తెలంగాణ విద్యార్థులే ఉంటున్నారు. గత విద్యా సంవత్సరం(2018-19)లో 3,79,687 మందిలో రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులు 76,733 (20 శాతం) మంది ఉన్నారు. దీనికితోడు ఈ రెండు రాష్ట్రాల వారు కనీసం 6 వేల నుంచి 10 వేల మంది వరకు తమిళనాడు, కర్ణాటక, దిల్లీ చుట్టుపక్కల ఉన్న డీమ్డ్‌, ప్రైవేటు వర్సిటీల్లోనూ చదువుతున్నారు. వారిని కూడా కలుపుకుంటే ఈ శాతం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం(2019-20)లో ప్రాంగణ నియామకాలు ఇంకా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షల్లో ఎంపికకాని వారిని టీసీఎస్‌ తాజాగా ముఖాముఖీలకు పిలిచింది. అవసరం ఎక్కువగా ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. కొన్ని పరిశ్రమలు వార్షిక వేతనాన్ని(ప్రవేశ దశలో) పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి అని సన్‌టెక్‌ కార్ప్‌ సొల్యూషన్స్‌ సీఈఓ వెంకట్‌.కె తెలిపారు. అయితే, ప్రాంగణ నియామకాలకు సంబంధించిన ఈ సమాచారం ఎంత వరకు కచ్చితమన్న దానిపై సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు కళాశాలలు ఆన్‌లైన్‌ ద్వారా పంపించే సమాచారం ఆధారంగా ఏఐసీటీఈ గణాంకాలను విడుదల చేస్తోందని.. అవి ఎంత వరకు వాస్తవమన్న దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయటం లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రవేశాలు తగ్గుముఖం..
బీటెక్‌లో ప్రవేశాలు పొందేవారు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గిపోతున్నట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా 2014-15 నుంచి 2018-19 వరకు దాదాపు 1.60 లక్షల మంది తగ్గిపోవడం గమనార్హం. అయితే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు పెరగడంతో వాటిలో సీట్ల సంఖ్య పెరిగిందని, మరికొందరు విదేశాలకు వెళుతున్నారని చెబుతున్నారు. ఆ మేరకు ప్రవేశాల సంఖ్య తగ్గుతున్నా.. అది స్వల్పంగానే ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Posted on 07-06-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning