కొలువుల పోటీలు

* విద్యార్థులకు టీసీఎస్‌ ఆహ్వానం
క్యాంపస్‌లో అవకాశం చేజారితే? అసలు కాలేజీలో క్యాంపస్‌ నియామకాలే లేకపోతే? ప్రతిభ వృథా కావాల్సిందేనా? లేదు! ఇలాంటివారికోసమే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ఇందులో నెగ్గితే టీసీఎస్‌లో చేరిపోవచ్చు. ఈ ఏడు కోర్సులు పూర్తిచేసినవారూ, 2023లోపు పూర్తిచేయబోతోన్న విద్యార్థులూ పరీక్షలు రాసుకోవచ్చు. బీసీఏ, బీఎస్సీ కోర్సులు చదివినవారికి సైతం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి శిక్షణ అనంతరం కొలువులను అందిస్తోంది టీసీఎస్‌!
బీఎస్సీ, బీసీఏ; బీఈ, బీటెక్‌; ఎంఈ, ఎంటెక్‌; ఎమ్మెస్సీ, ఎంసీఏ... చదువుతోన్న కోర్సు ఏదైనప్పటికీ. ప్రతిభ ఉన్న విద్యార్థులకు టీసీఎస్‌ ఆహ్వానం పలుకుతోంది. కోడింగ్‌లో మెరిస్తే కొలువులు అందిస్తోంది. అభ్యర్థులు తమకు సరిపడే విభాగాన్ని ఎంచుకుని అందులో పరీక్ష రాసి, ఇంటర్వ్యూలో నెగ్గితే ఉద్యోగం ఖాయమవుతోంది. ఇందుకోసం నేషనల్‌ క్వాలిఫయింగ్‌ టెస్టు 2019, 2020; కోడ్‌విటా-8, ఎన్‌కోడ్‌, ఎన్‌క్యూటీ-బీఎస్సీ, బీసీఏ పరీక్షలను నిర్వహిస్తోంది.
వెబ్‌సైట్‌: www.careers.tcs.com
టీసీఎస్‌ ఆఫ్‌ క్యాంపస్‌ టెస్టు (నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు)
ఎవరి కోసం: 2019 లో ఆఖరు సంవత్సరం కోర్సులు పూర్తిచేసుకున్న బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఎంసీఏ విద్యార్థులకు. ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచ్‌ల వాళ్లూ ఈ పరీక్ష రాసుకోవచ్చు. యూజీలో మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదువుకున్న ఎంసీఏ విద్యార్థులు, ఎమ్మెస్సీ - ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుకున్నవారు అర్హులు.
ఎంత శాతం మార్కులు: పది, ఇంటర్‌/ డిప్లొమా, యూజీ/ పీజీ అన్నింటా కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి.
రిజిస్ట్రేషన్లకు గడువు: జూన్‌ 10
పరీక్ష తేదీ: జూన్‌ 16
నియామకం ఇలా: ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఎంపికైనవారికి ముఖాముఖి ఉంటుంది. ఇందులో 3 దశలు అవి టెక్నికల్‌, మేనేజీరియల్‌, హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఉంటాయి.
ఎన్‌క్యూటీ: బీఎస్సీ/ బీసీఏ
బీఎస్సీ, బీసీఏ కోర్సులు 2019లో పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం టీసీఎస్‌ ప్రత్యేకంగా నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు (ఎన్‌క్యూటీ) నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైనవారిని ఇగ్నైట్‌ ప్రోగ్రాంలోకి తీసుకుంటారు. వీరికి కొత్త టెక్నాలజీల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. ఈ విధానంలో చేరినవాళ్లు టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూనే ఎంసీఏ కోర్సు చదువుకునే సౌలభ్యాన్నీ కల్పించారు.
రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జూన్‌ 10 పరీక్ష తేదీ: జూన్‌ 17
ఎవరు అర్హులు: బీసీఏ, బీఎస్సీ -2019లో పూర్తిచేసుకున్న వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ సైన్స్‌ వీటిలో ఏ కోర్సు చదువుకున్నవారైనా అర్హులే.
ఎంత శాతం మార్కులు: పదో తరగతి, ఇంటర్‌, బీఎస్సీ/ బీసీఏ ప్రతి తరగతిలోనూ కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.
ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా
కోడ్‌ విటా
కంప్యూటర్‌ భాష కోడ్‌లో మెరికలు డిజిటల్‌ ప్రపంచంలో దూసుకుపోవడానికి కోడ్‌ విటా సరైన వేదిక. ఇందులో మంచి ప్రతిభ చూపినవారికి టీసీఎస్‌లో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగమూ దక్కుతుంది. ప్రీ క్వాలిఫయర్‌ రౌండ్‌ దాటినవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అభ్యర్థుల ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ పదునుపెట్టడానికి కోడ్‌ విటా దోహదపడుతుంది.
ఎవరి కోసం: 2020, 2021, 2022, 2023లో ఇంజినీరింగ్‌/సైన్స్‌ నేపథ్యంతో యూజీ / పీజీ కోర్సులు పూర్తిచేయబోతోన్న విద్యార్థులకు.
ఎంపిక విధానం: ఇందులో 3 రౌండ్లు ఉంటాయి. మొదటిది ప్రీ క్వాలిఫయర్‌ జోనల్‌ రౌండ్‌. రెండోది క్వాలిఫయర్‌ మూడోది ఫైనల్‌.
ఎప్పుడు, ఎక్కడ: రౌండ్‌-1 ఆన్‌లైన్‌లో జూన్‌ 28 నుంచి జులై 13 వరకు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైనవారికి రెండో రౌండ్‌ కూడా ఆన్‌లైన్‌లోనే డిసెంబరు 8 నుంచి 10 వరకు ఉంటుంది. ఫైనల్స్‌ ఫిబ్రవరి 26, 2020న ఎంపిక చేసిన ప్రాంతంలో నిర్వహిస్తారు.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన‌ గడువు: జూన్‌ 24
ఎన్‌కోడ్‌, టీసీఎస్‌ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు (ఎన్‌క్యూటీ)-2020
ఎన్‌కోడ్‌
డిజిటల్‌ ప్రపంచంలో నాణ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను గుర్తించి, కొత్త టెక్నాలజీల్లో వారికి తర్ఫీదునివ్వడానికి ఎన్‌కోడ్‌ పేరుతో ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతోన్న విద్యార్థులకు క్వాలిటీ ఇంజినీరింగ్‌ కంటెస్ట్‌ నిర్వహిస్తున్నారు.
ఎవరు అర్హులు: 2020, 2021లో కోర్సులు పూర్తిచేసుకోబోతున్న ఇంజినిరింగ్‌ విద్యార్థులు ఈ పరీక్ష రాసుకోవచ్చు.
ఎంపిక విధానం: మూడు దశల్లో. తొలి రౌండ్‌ ఎంసీక్యూ, తర్వాత దశ కేస్‌ స్టడీ. చివరగా ఫైనల్స్‌ ఉంటాయి.
ఏ అంశాల్లో: ప్రస్తుత మార్కెట్‌ అవసరాలను తీర్చడానికి నాణ్యమైన ఇంజినీర్లను ఎంపికచేయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా అనలిటికల్, ప్రోగామింగ్, ఆటోమేషన్, అగైల్‌/ డెవోప్స్, డిజిటల్‌ స్కిల్స్‌పై ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. తొలి రౌండ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహిస్తారు. ఇవి జులై 3తో మొదలై, అదే రోజు ముగుస్తాయి. తర్వాత కేస్‌ స్టడీ అండ్‌ ప్రజెంటేషన్‌ ఉంటుంది. ఈ పోటీలు జులై 20 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. చివరగా ఫైనల్స్‌ ఉంటాయి. ఇవి సెప్టెంబరు 18న మొదలై, 19తో ముగుస్తాయి. ఈ పోటీలు నిర్దేశిత కేంద్రంలో ఉంటాయి.
చివరి తేదీ: జూన్‌ 30
టీసీఎస్‌ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు (ఎన్‌క్యూటీ)-2020
వచ్చే విద్యా సంవత్సరంలో కోర్సులు పూర్తిచేసుకోబోతోన్న విద్యార్థుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఎవరు అర్హులు: ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచీల విద్యార్థులు (బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌), ఎంసీఏ, ఎమ్మెస్సీ- కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అనుబంధ విభాగాల్లో కోర్సులు చదువుతున్నవారు అర్హులు. అయితే వీరంతా 2020లో కోర్సులు పూర్తిచేస్తున్నవారై ఉండాలి.
ఎంత శాతం మార్కులు: పదోతరగతి, ఇంటర్‌/ డిప్లొమా, యూజీ, పీజీ ప్రతి తరగతిలోనూ కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి.
ఎంపిక విధానం: ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభావంతులకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇందులో మూడు దశలు. తొలిదశలో టెక్నికల్‌ తర్వాత మేనేజీరియల్‌ చివరగా హెచ్‌ఆర్‌ రౌండ్లు ఉంటాయి. అన్ని దశల్లోనూ విజయవంతమైనవారికి టీసీఎస్‌లో ఉద్యోగం ఖాయమవుతుంది.
రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జులై 10
ప్రవేశ పత్రాలు: జులై 15న లభిస్తాయి.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జులై 20
ఇంటర్వ్యూలు: జులై 25 నుంచి
టీసీఎస్‌ ఆఫ్‌ క్యాంపస్‌ టెస్టు (నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు)-2019
పరీక్ష ఎలా ఉంటుంది: 4 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ప్రొగ్రామింగ్‌ అంశాలు, కోడింగ్‌ల నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఇంగ్లిష్‌ లో 10 ప్రశ్నలు వస్తాయి. వీటికి పది నిమిషాల్లో జవాబులు గుర్తించాలి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 20 ప్రశ్నలకు 40 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. ప్రోగ్రామింగ్‌ కాన్సెప్టుల నుంచి 10 ప్రశ్నలకు 20 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. కోడింగ్‌ విభాగంలో ఒక సమస్యకు సంబంధించి స్టేట్‌మెంట్‌ ఇస్తారు. దీనికి 20 నిమిషాల్లో కోడింగ్‌ రాయాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాక్‌ పరీక్ష రాసుకోవచ్చు. విభాగాలవారీ నిపుణుల సలహాలతో కూడిన వీడియోలు రూపొందించారు. పరీక్షలో ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూకు సంబంధించిన సమాచారం ఈ-మెయిల్‌ ద్వారా అందుతుంది. ముఖాముఖిలో నెగ్గినవారికి ఆఫర్‌ లెటర్లు అందిస్తారు. అయితే వీరు టీసీఎస్‌ ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఎన్‌క్యూటీ: బీఎస్సీ/ బీసీఏ- 2019
పరీక్ష ఇలా: ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌ నుంచి 35 చొప్పున మొత్తం 70 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. సెక్షన్‌-ఎలో వెర్బల్, క్వాంటిటేటివ్, అనలిటికల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి తేలికైన ప్రశ్నలు అడుగుతారు. దీంతోపాటు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు సంబంధించి ప్రాథమిక అవగాహనను పరిశీలించేలా కొన్ని ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-బిలో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. ఇందులోనూ వెర్బల్, క్వాంటిటేటివ్, అనలిటికల్‌ ఎబిలిటీల నుంచే ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు అదనంగా ప్రోగ్రామింగ్‌ లాజిక్, సి ప్రొగ్రామింగ్‌లో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు సెక్షన్‌-ఎలో మంచి ప్రతిభ కనబరిస్తే చాలు, ఇంటర్వ్యూ దశకు చేరుకోవచ్చు. అయితే సెక్షన్‌ బిలోనూ మెరుగైన మార్కులు సాధించినవారికి ఉద్యోగ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించి నిపుణుల మార్గదర్శకాలు, సూచనలను టీసీఎస్‌ కెరియర్స్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
టీసీఎస్‌ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు (ఎన్‌క్యూటీ)-2020
పరీక్షలో: ఇందులో 4 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్‌ అంశాలు, కోడింగ్‌ నుంచి వీటిని అడుగుతారు. ఇంగ్లిష్‌ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. వీటికి పది నిమిషాల్లో జవాబులు గుర్తించాలి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 15 ప్రశ్నలకు 30 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. ప్రోగ్రామింగ్‌ లాజిక్‌ నుంచి 10 ప్రశ్నలకు 20 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. కోడింగ్‌ విభాగంలో ఒక సమస్యకు సంబంధించి స్టేట్‌మెంట్‌ ఇస్తారు. దీనికి 30 నిమిషాల్లో కోడింగ్‌ రాయాలి. మొత్తం పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

Posted on 10-06-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning