బేగంపేట నుంచి సియాటెల్‌కు

* ఇక్కడే పాఠశాల విద్య

* అంచెలంచెలుగా ఎదిగిన తెలుగు వ్యక్తి

వ్యాపారమనేది దీర్ఘకాలికం కాదు... ప్రస్తుతానికెంత ఉపయుక్తం! ఈ ఒకే ఒక అంశం నన్ను ప్రతిరోజూ లేవగానే నడిపిస్తుంది.. ప్రతిరోజూ నిద్రలేకుండా చేస్తుంది.నిరంతరం నేర్చుకుంటునే ఉండాలి. నేర్చుకోవటం ఆపేస్తే ఉపయోగపడే పని చేయలేం. చేసే పనిపట్ల తపనుండాలి. మనలోని నేర్చుకునే స్విచ్‌ను ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచాలి. 1992 నుంచి మైక్రోసాఫ్ట్‌లో భాగస్వామినవ్వటం నా అదృష్టం. ఓరోజు బిల్‌గేట్స్‌ నుంచి మెయిల్‌ వచ్చింది. అది నేను చేస్తున్న ఓ పని గురించి! ఓ మామూలు ఉద్యోగి చేసే పనిని అంత నిశితంగా కంపెనీ సీఈఓ పరిశీలించి, ఆయన అభిప్రాయాలు చెబుతాడని నేనూహించలేదు. తర్వాత కూడా ఆయనతో కలసి సన్నిహితంగా పనిచేసే అవకాశం దొరికింది.

అభిరుచులు: క్రికెట్‌, కవిత్వం, బింగ్‌ సెర్చింజిన్‌
మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా ఎంపికైన తెలుగు వ్యక్తి నాదెళ్ల సత్య (అసలు పేరు సత్యనారాయణ) ప్రస్థానం మన హైదరాబాద్‌ నుంచే మొదలైంది. ఇక్కడి బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆయన పాఠశాల విద్య పూర్తిచేశారు. మణిపాల్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టబద్రులైన సత్య.. అక్కడ్నించి ఉన్నతాభ్యాసం కోసం అమెరికాకు పయనమయ్యారు. ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక మైక్రోసాఫ్ట్‌ సంస్థలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. 1975లో ఆవిర్భవించిన్నాటి నుంచి ఇప్పటిదాకా బిల్‌గేట్స్‌, స్టీవ్‌ బామర్‌ల రూపంలో ఇద్దరంటే ఇద్దరే దిగ్గజాలను చూసిన మైక్రోసాఫ్ట్‌కు నాదెళ్ల సత్య ఎలా ఎంపికయ్యారు? ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహామహులుండగా... ఈ హైదరాబాదీనే ఎందుకా ప్రతిష్ఠాత్మక పదవి వరించింది? ఇతరల్లో లేనివీ... ఈయనలో ఉన్నవీ ఏంటి? ఈ స్థాయికి చేరుకోవడం వెనుక అపార శ్రమ, అమోఘమైన తెలివితేటలు దాగి ఉన్నాయని ఒక్కముక్కలో తేల్చేస్తే.. ఆయనలోని ప్రత్యేకతలను విస్మరించినట్లే! యువతకు స్ఫూర్తినిచ్చే ప్రత్యేకతలెన్నో ఆయనలో ఉన్నాయి. సత్య విజయానికి కారణమైన ఆ అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే..

బహుముఖ ప్రతిభ: టెక్నాలజీ + బిజినెస్‌... ఈ రెండింటి కలయిక సత్య. ఈ బహుముఖ ప్రతిభ ఆయనకు కలిసొచ్చిన అంశం. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యాపారపరమైన పరిజ్ఞానం కూడా ఉండటం ఆయనను రేసులో ముందు నిలిపింది.
నిరంతర తపన: లక్ష్యం దిశగా నిరంతరం శ్రమిస్తారు. లక్ష్య సాధన పట్ల మొదటి నుంచి స్పష్టత ఉందంటారు ఆయన్ను సన్నిహితంగా ఎరిగినవారు. 1970లనాటి కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్లకే పేరొందిన మైక్రోసాఫ్ట్‌ను ఆధునిక కాలానికి, రాబోయే తరానికి అత్యంత కీలకం కాబోతున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత సత్యదే! క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బింగ్‌ సెర్చి ఇంజిన్‌ బిజినెస్‌లో మైక్రోసాఫ్ట్‌కు వినూత్నంగా అభివృద్ధిని అందించి ఒకరకంగా ప్రస్తుత మార్కెట్‌లో సంస్థను నిలదొక్కుకునేలా చేశారు సత్య. అందరూ ఆలోచించే మార్గంలో కాకుండా.. మరేదైనా కొత్తగా చేయలేమా? అని భిన్నంగా ఆలోచించే మనస్తత్వం. తోటి వారిలో స్ఫూర్తినింపడంలోనూ విశిష్టమైన వ్యక్తిత్వం.

యువతకు స్ఫూర్తినిచ్చే 'సత్యా'లు
ఎంత ఎదిగినా: మృదుభాషి.. ఎప్పుడూ తన కెరీర్‌ ఎక్కడ మొదలైందన్న మూలాలను మరిచిపోరు. ఆ సంస్కారమే ఆయన్ని ఈ స్థాయికి చేర్చిందన్నది ఆయనకు పాఠాలు చెప్పిన గురువుల భావన. అహాలు... ఆగ్రహావేశాల చర్చోపచర్చల సమాహారమైన మైక్రోసాఫ్ట్‌లో... ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఉన్నత వ్యక్తిత్వం ఆయన్ను మైక్రోసాఫ్ట్‌లో అజాతశత్రువుని చేసింది. 'సత్యను విమర్శించేవారు... మైక్రోసాఫ్ట్‌లో ఆయన గురించి చెడ్డగా మాట్లాడేవారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు' అని సహచరులంటుంటారు. అందుకే మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఆయనంటే అందరికీ ఎంతో గౌరవం. ఈ సీఈఓ పదవి కోసం ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా సత్య మాత్రం తన పేరు గట్టిగా వినిపిస్తున్నా... ఏమీ జరగనట్లుగానే వ్యవహరించేవారు. అంతెందుకు... ఈ ఎంపిక పక్రియ మొదలవటానికి ముందు ప్రస్తుత అధినేత (వైదొలగుతున్న) స్టీవ్‌ బామర్‌ ఓసారి మాట్లాడాలంటూ పిలిస్తే... పనిలో బిజీగా ఉన్నానంటూ బదులిచ్చాట్ట!
సారథ్య లక్షణాలు: ప్రస్తుతం గూగుల్‌ తదితర సంస్థల నుంచి ఆధునిక పరిజ్ఞానంలో ఎంతో సవాళ్ళను ఎదుర్కొంటున్న మైక్రోసాఫ్ట్‌ను బతికించాలంటే ఇంటిలోని వారు కాకుండా బయటి వ్యక్తిని తీసుకొస్తే విప్లవాత్మక మార్పులు చేస్తారనేది అంతా అనుకున్నారు. కానీ సంస్థ పెరటి చెట్టే వైద్యానికి మంచిదని నమ్మింది. సంస్థ గురించి తెలిసినవారే ఎక్కువ ఉపయోగపడతారని భావించింది. అన్నింటికి మించి సత్య సారథ్య లక్షణాలు ఈ సందర్భంగా ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చెప్పేది జాగ్రత్తగా వినటం... తన దగ్గర పనిచేసేవారి విజయానికి తోడ్పడటం... ఆయనుకున్న ప్రధాన లక్షణాలు. ఇవన్నీ సత్యకే పగ్గాలు అప్పజెప్పటానికి కారణమయ్యాయి.
స్నేహశీలి: ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. పాత స్నేహితులను మాత్రం మరిచిపోలేదు. ఇప్పటికీ హైదరాబాద్‌కు వస్తే.. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడపడం అంటే ఆయనకిష్టం. ఇటీవల గత ఏడాది జరిగిన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ 90వ వార్షికోత్సవ కార్యక్రమంలో హాజరైన సత్య.. బాల్య మిత్రులను పేరు పేరునా పలకరించారని చెబుతారు ఆయన మిత్రులు. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారని చెబుతారు.
తొణకరు.. బెణకరు: దేన్నీ తేలిగ్గా తీసుకోరు. ఏ విషయంలోనూ తొందరపడరు. విజయం దక్కగానే ఎగిరి గంతులేయడం.. అపజయం ఎదురవ్వగానే కుంగిపోవడం అన్నది ఆయన మనస్తత్వం కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొణక్కుండా ఉండగలరు. చిన్నప్పటి నుంచే తనది ఇదే మనస్తత్వంమంటారు దగ్గరగా పరిశీలించిన స్నేహితులు.
ప్రశ్నించే తత్వం: ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. చదువుకునే రోజుల్నుంచీ మంచి వక్త కూడా. ''ఇది ఇలా ఎందుకు జరిగింది? అది అలా ఎందుకు జరగలేదు?'' అని కళాశాల రోజుల్నుంచి ప్రతిదాన్ని తరచి తరచి ప్రశ్నించి.. ఆ విషయ పరిజ్ఞానం అంతుతేలేదాకా వదిలిపెట్టేవాడు కాదని ఇంజినీరింగ్‌ పాఠాలు బోధించిన ప్రొఫెసర్లు చెబుతారు.
నిరాడంబరత్వం: అనవసరమైన హంగామాలకు దూరంగా ఉంటారు. తను మైక్రోసాఫ్ట్‌లో అంత పెద్ద హోదాలో ఉన్నా కూడా.. ఇక్కడ హైదరాబాద్‌లో వారి పక్కింట్లో కూడా ఆయన గురించి తెలియదు. ఇప్పటికి చాలాసార్లు ఇక్కడికి వచ్చినా.. ఎప్పుడూ ఆడంబరాలు లేకుండా గడుపుతుంటారు. ''ఏదో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నామనుకున్నామే గానీ.. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారనే విషయం మాకు తెలియదు. చాలా నిరాడంబరంగా ఉంటాడు'' అని పక్కింటివారు ఆశ్చర్యపోయారంటే.. ఆయన ఎంత నిరాడంబరుడో అర్థం చేసుకోవచ్చు.
సత్యకు సవాల్‌...: కంప్యూటర్‌ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా పేరొందిన మైక్రోసాఫ్ట్‌ నిజానికిప్పుడు సవాల్‌ ఎదుర్కొంటోంది. ఇంటర్నెట్‌, మొబైల్‌లతో గూగుల్‌, ఆపిల్‌ లాంటి సంస్థ ద్వారా గట్టి పోటీ ఎదురవుతోది. అందుకే ప్రస్తుతం తన మూలమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన నుంచి ఇప్పుడు హార్డ్‌వేర్‌, ఇంటర్నెట్‌ ఆధారిత సర్వీసుల దిశగా మళ్ళుతోంది. అందులో భాగంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ముందంజలో ఉంది కూడా. కానీ... మొబైల్‌ ఫోన్ల రంగంలో మైక్రోసాఫ్ట్‌కు సవాల్‌ ఎదురవుతోంది. అదే సత్యముందున్న అతి పెద్ద సవాల్‌!

క్రికెట్టే అన్నీ నేర్పింది
''క్రికెట్‌ ఆడడమే నాకు అన్నీ నేర్పిందనుకుంటాను. బృందాలతో పనిచేయడం; నాయకత్వం ఇవన్నీ.. నా వృత్తి జీవితమంతా ఉపయోగపడ్డాయి. టెస్ట్‌ క్రికెట్‌ చూడటమంటే ఎంతో ఇష్టం. అందులో ఉండే ఉపభాగాల వల్ల ఓ రష్యా నవలను చదివినట్లుగా ఉంటుంది. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివేప్పుడు... ఓసారి మ్యాచ్‌లో నేను మామూలుగా బౌలింగ్‌ చేస్తున్నాను. వికెట్లు పడటం లేదు. ఆ క్షణంలో మా కెప్టెన్‌ తనే బంతిని తీసుకొని వికెట్లు తీసి... ఆ తర్వాత మళ్ళీ నాకు బౌలింగ్‌ ఇచ్చాడు. ఆ సంఘటనను నేనెన్నటికీ మరచిపోలేను. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదేనే నిజమైన నాయకత్వ లక్షణం... ఇలాంటి అనేకానేక ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి. ఇప్పుడు చాలామందికి సారథ్యం వహిస్తున్నప్పుడు నాటి ప్రశ్నలన్నీ నన్ను నడిపిస్తుంటాయి'' అని చెబుతుంటారు సత్య.

పేరు: నాదెళ్ల సత్య
తండ్రి: యుగంధర్‌(గతంలో ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు)
కుటుంబం: అనుపమ(భార్య), ముగ్గురు పిల్లలు
వయస్సు: 46
విద్యార్హతలు: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌(మణిపాల్‌ విశ్వవిద్యాలయం)
మాస్టర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌(విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం-యూఎస్‌ఏ), మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (షికాగో విశ్వవిద్యాలయం-యూఎస్‌ఏ)
అనుభవం:
1992.. మైక్రోసాఫ్ట్‌లో విండోస్‌ డెవలప్‌మెంట్‌లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా చేరారు.
1999.. మైక్రోసాఫ్ట్‌ బీసెంట్రల్‌కు ఉపాధ్యక్షుడిగా..
2001.. మైక్రోసాఫ్ట్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌కు కార్పొరేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా..
2007.. ఆన్‌లైన్‌ సేవల విభాగానికి సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా..
2011.. సర్వర్‌ అండ్‌ టూల్స్‌ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా.. మైక్రోసాఫ్ట్‌లోనే వివిధ హోదాల్లో సేవలందించారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning