డిగ్రీ చదువుతూనే ఉద్యోగానికి సన్నద్ధత!

* రిమోట్‌ ఇంటర్న్‌షిప్‌తో సాకారం
ఇంటర్నెట్‌తో అనుసంధానమవుతున్న ఇళ్లు, పరిశ్రమలు మరింత స్మార్ట్‌గా మారిపోతున్నాయి. స్వీయ చోదిత కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ గుర్తింపు అన్నది ప్రధానావసరంగా మారింది. సరికొత్త డిజిటల్‌ సాంకేతికతలుగా చెబుతున్న ఇండస్ట్రీ 4.0 వల్ల మన జీవనం, పనితీరే సమూలంగా మారిపోతోంది. ఆధునిక సాంకేతికత వల్ల ఉద్యోగ నైపుణ్య అవసరాలు కూడా మారుతున్నాయి. ఈ డిజిటల్‌ విప్లవం వల్ల సరికొత్త రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డిమాండ్‌ ఏర్పడే 5జీ, కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌/సునిశిత అధ్యయనం (ఎంఎల్‌/డీఎల్‌), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఆగ్‌మెంటెడ్‌/వర్చువల్‌ రియాలిటీ, బ్లాక్‌చెయిన్‌, సైబర్‌భద్రత వంటి రంగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. అనలిటిక్స్‌, కృత్రిమమేధ, రోబోటిక్స్‌కు దేశీయ ఉద్యోగ విపణిలో గిరాకీ లభిస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), వీబాక్స్‌ రూపొందించిన ‘భారత నైపుణ్యాల నివేదిక 2019’ గుర్తించింది. వ్యాపారసంస్థలు ఈ అధునాతన సాంకేతికతలను ఏర్పాటు చేసుకుంటున్నందున, తగిన నిపుణుల లభ్యత సవాలుగా మారుతోంది. ఈ నైపుణ్యాలు నేర్పేందుకు సమయం, అయ్యే వ్యయాలు పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లే. మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా, నిపుణులను వేగంగా అందివ్వడం విద్యారంగానికీ సాధ్యం కావడం లేదు. 2017లో విద్యారంగ నిపుణులతో ఐబీఎం నిర్వహించిన సర్వే ప్రకారం.. పరిశ్రమ, విద్యారంగం మధ్య అవగాహనా లేమి ఉందని 54 శాతం మంది, తగిన పాఠ్యాంశాలు రూపొందించడం లేదని 59 శాతం మంది అభిప్రాయ పడటం గమనార్హం.
తొలిరోజు నుంచే పూర్తి బాధ్యత..
సాధారణంగా కార్పొరేట్‌ సంస్థలు ఎంపికలు ప్రాంగణ ఎంపికలు జరిపాక, దాదాపు ఏడాది పాటు విద్యార్థి కళాశాలలోనే ఉంటారు. ఈ సమయంలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందిస్తే, ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే బాధ్యతల్లో ఒదిగిపోయేలా చూడొచ్చు. ఇందుకోసమే పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యంతో వినూత్న పథకం ‘రిమోట్‌ ఇంటర్న్‌షిప్‌’ను టీసీఎస్‌ ప్రవేశపెట్టింది. డిగ్రీ/ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ‘పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాలు’ నేర్పడమే ఈ పథక ఉద్దేశం.
పాఠ్యాంశాల (కరిక్యులమ్‌) రూపకల్పన, ప్రయోగశాలల్లో మెరుగైన అసైన్‌మెంట్లు, అధ్యాపకులు-విద్యార్థులకు వర్క్‌షాప్‌లు-శిక్షణ, పరిశ్రమ అవసరాలకు తగిన ప్రాజెక్ట్‌ వర్క్‌ల కేటాయింపు, నిరంతరం వారితో అనుసంధానం వహించేలా చూస్తున్నారు. వీటిని విద్యారంగ-పారిశ్రామిక నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు సమగ్ర శిక్షణ ఇవ్వడమే ఈ పథక లక్ష్యం.

అమలు ఇలా
* ఎటువంటి పాఠ్యాంశాలు ఎంపిక చేసుకోవాలనే అంశాన్ని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో ఉండే సీనియర్‌ లీడర్లు నిర్ణయిస్తారు. వీరికి పరిశ్రమ నిపుణులు సహకరిస్తారు. సరైన సబ్జెక్ట్‌ ఎంపికతో పాటు తగిన విధంగా అభివృద్ధికి శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు మూడో సంవత్సరంలోనే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)ని ఎంపిక చేసుకునే వీలు కల్పించాలని గతంలో సూచించారు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రాజెక్టులుగా ప్రాబ్లం స్టేట్‌మెంట్‌లను పరిశ్రమ నిపుణులు తయారుచేసి ఇస్తున్నారు.
అధ్యాపకులకు శిక్షణ: విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలంటే, అధ్యాపకులకు ఎంతో పరిజ్ఞానం అవసరం. రోజువారీగా విద్యార్థులను ప్రోత్సహించడం, మార్గదర్శకత్వం నెరపడం వీరి బాధ్యత. ఇందుకోసమే అత్యాధునిక సాంకేతికతలపై, రంగాల వారీ కార్యశాలలను పరిశ్రమలోని సీనియర్‌ నిపుణులు నిర్వహిస్తున్నారు. ఐఓటీ, క్లౌడ్‌కంప్యూటింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, వీఎల్‌ఎస్‌ఐ, ఎల్‌టీఈ అంశాల్లో శిక్షణ ఉంటుంది.
ఆసక్తి ఉన్న రంగాల్లో: విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రాజెక్ట్‌ చేయొచ్చు. ఐఓటీ ఆధారిత స్మార్ట్‌ సేఫ్టీ సొల్యూషన్‌, ఏఐ వినియోగించి నెట్‌వర్క్‌ ఆప్టిమైజేషన్‌, ఏఐ ఆధారిత డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ వంటి ప్రాజెక్టులు ఇస్తున్నందున, ఎంతో ఉత్సుకతతో డిజిటల్‌ టెక్నాలజీల్లో విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇందువల్ల టెక్నాలజీ కాన్సెప్ట్‌లు అర్థం కావడంతో పాటు, వాస్తవ ఇబ్బందులు కూడా వారికి తెలుస్తాయి. నిశిత పరిశీలన, సమయ పాలన, సమస్య పరిష్కారం, ఇతరులతో సాదరంగా మాట్లాడటం-సమాచారం ఇవ్వడం వంటివీ విద్యార్థులకు అలవడతాయి.
* మారుమూల ప్రాంతాల్లోని కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం కోసం టెలి-వీడియో కాన్ఫరెన్స్‌లను కూడా విరివిగా వినియోగిస్తున్నారు. దీంతోపాటు విద్యార్థిగా ఉన్నప్పుడే కంపెనీల్లో పనిచేసే ప్రాజెక్ట్‌ బృంద సభ్యులతో మాట్లాడి, అన్నీ అర్థం చేసుకునేలా చూస్తున్నారు. పరిశ్రమ ప్రయోగశాల్లోనూ వారికి ప్రవేశం కల్పించి, కార్పొరేట్‌ వాతావరణాన్ని పరిచయం చేస్తున్నారు. 2018లో ఇలా శిక్షణ పొందిన వారు, వృత్తి జీవితంలో శరవేగంగా రాణిస్తున్నారని తేలుతోంది.
4 కళాశాలలతో ప్రారంభించి..
తొలుత 4 కళాశాలలతో ప్రారంభించి, సత్ఫలితాలు ఇవ్వడంతో మరో 9 కళాశాలలకు విస్తరించారు. మరింత విస్తృతం చేయాలన్నది ప్రణాళిక. దీనివల్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో కొత్తగా చేరిన వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సమయం, ఖర్చు ఆదా అవుతాయి. నేరుగా ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. కంపెనీ నిర్వహణ, పనితీరు కూడా సులభంగా అర్థం చేసుకుని, ముందుకు సాగుతారు.


Posted on 26-06-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning