మీ రెజ్యూమె... ఎంత సృజనాత్మకం?

ప్రతి రంగంలోనూ మార్పులు సహజం. వాటిని గమనించి తగిన నైపుణ్యాలను పెంపొందించు కుంటేనే రాణింపు సాధ్యం. జాబ్‌ మార్కెట్‌ పరిస్థితీ అంతే. ఆధునిక ట్రెండ్‌లకు అనుగుణంగా అభ్యర్థులు రెజ్యూమెలను సిద్ధం చేసుకోవాలి. పాత పద్ధతులను, యాంత్రిక విధానాలను విడిచిపెట్టాలి. సృజనాత్మకతను ప్రదర్శించి రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడానికి తగిన మెలకువలను నేర్చుకోవాలి.
కలల కొలువులో చేరడానికి చేసే ప్రయత్నాల్లో మొదటి మెట్టు- రెజ్యూమె. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు, జాబ్‌మేళా.. ఇలా మార్గమేదైనా రిక్రూటర్లకు అభ్యర్థిని పరిచయం చేసేదీ, వారిపై ఒక అభిప్రాయాన్ని కలిగించేదీ ఇదే! ఒకరకంగా దీన్ని అభ్యర్థి ముఖచిత్రంగా చెప్పొచ్చు. తమలోని ప్రత్యేకతను అభ్యర్థులు ప్రస్ఫుటంగా ప్రదర్శించగలిగే సాధనమిది. నిజానికి సంస్థలు ఒక రెజ్యూమెపై కేటాయించే సమయం కొద్ది నిమిషాలే. అయినా ఈ కొద్ది సమయంలోనే అభ్యర్థిని తరువాతి రౌండ్‌కి పంపాలో లేదో నిర్ణయించేస్తారు. కాబట్టి, రెజ్యూమె రూపకల్పనపై శ్రద్ధ పెట్టడం తప్పనిసరి. దీని తయారీకి తగినంత జాగ్రత్త వహించాలి. సమయం కేటాయించాలి. కొంత పరిశోధన చేయాలి. అంటే.. వీటికి సంబంధించిన కొత్త ట్రెండ్స్‌ ఏమిటో తెలుసుకోవాలి. వాటిని ఉపయోగించడం ద్వారా మనం అప్‌డేట్‌గా ఉన్నామని తెలియజేయాలి.
ఆటోమేటిక్‌ బిల్డర్‌
ఉత్తమ రెజ్యూమె అంటే.. కేవలం విద్య, అనుభవ సమాచారమే కాదు. దాని సమర్పణ విధానం, ఫార్మాట్‌ కూడా ముఖ్యమే. ఎక్కడి నుంచో కాపీ చేయడం వల్ల అంత ప్రభావపూరితంగా ఉండదు. అభ్యర్థి తన అర్హతలూ, ప్రత్యేకతలను మెరుగ్గా ప్రతిఫలించే విధంగా ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే ఆటోమేటిక్‌ రెజ్యూమె బిల్డర్‌ల సాయం తీసుకోవచ్చు. పలు సంస్థలు ఆన్‌లైన్‌లో ఈ సేవలను అందిస్తున్నాయి. తగిన టెంప్లేట్‌ ఎంచుకొని మన వివరాలను ఇస్తే రెజ్యుమె సిద్ధమవుతుంది. దీన్ని ప్రింట్‌ తీసుకోవచ్చు. వాక్య సంబంధమైన దోషాలపై ఈ బిల్డర్‌లు తగిన సూచనలూ చేస్తాయి.
కీలక పదాలు
చాలా సంస్థలు స్క్రీనింగ్‌లో భాగంగా అప్లికెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఏటీఎస్‌)ను ఉపయోగిస్తుంటాయి. అంటే.. ఏదైనా ఉద్యోగానికీ, హోదాకూ సంబంధించి ఎంపిక నిర్వహిస్తున్నపుడు అభ్యర్థులను మదింపు చేయడానికి కంప్యూటర్‌ సాయం తీసుకుంటారు. ఇందుకు కొన్ని కీలక పదాలను (కీ వర్డ్స్‌) ప్రామాణికంగా తీసుకుంటారు. అవి రెజ్యూమెలో ఉపయోగించిన వారిని మాత్రమే తరువాతి రౌండ్లకు ఆహ్వానిస్తారు. లేనివారిని పక్కనపెడతారు. సంస్థ కోరిన సర్టిఫికేషన్‌, నైపుణ్యాలు, అనుభవం వంటివి లేనప్పుడు అభ్యర్థి రెజ్యూమె పరిశీలనకు నోచుకోదు. కాబట్టి, దరఖాస్తు చేసుకునే సంస్థ ఏమి ఆశిస్తోందో గమనించి రెజ్యుమె తయారు చేసుకోవాలి.
సోషల్‌ మీడియా
చాలా సంస్థలు అభ్యర్థులను ఎంచుకునే క్రమంలో వారి సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నాయి. లింక్‌డ్‌ఇన్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌.. మొదలైన వాటిని గమనించి, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి, సంస్థ ప్రయోజనాలకు ఎంతవరకూ ఉపయోగపడుతారో చూస్తున్నాయి. రెజ్యూమెలో ప్రొఫైల్‌కు సంబంధించి కస్టమైజ్‌డ్‌ యూఆర్‌ఎల్‌ను ఇవ్వడం మంచిది. సోషల్‌ మీడియాలో వివరాలను సక్రమంగా రాయాలి. లింక్‌డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో ఫొటోతో సహా అన్నీ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఫంకీ ఫోటోలు ఉండకూడదు. సాధించిన విజయాల వివరాలను క్లుప్తంగా, కేస్‌స్టడీలతో సహా ఉంచాలి. ఫ్రెషర్‌ అయితే విద్యాపరమైన విజయాలను సంఖ్యల్లో చెప్పొచ్చు. ఇంటర్న్‌షిప్‌ వంటి వాటినీ వివరించవచ్చు.
వీడియో రెజ్యూమె
రెజ్యూమె రూపకల్పనలో ఇదో కొత్త ట్రెండ్‌. అభ్యర్థి తన వివరాలను చిన్న వీడియో రూపంలో చిత్రీకరించి ఇంటర్నెట్‌/ సంస్థల వెబ్‌సైట్లల్లో అప్‌లోడ్‌ చేస్తారు. వ్యక్తిగత నైపుణ్యాలు, అనుభవం తదితర వివరాలను పొందుపరుస్తారు. వీడియో రెజ్యూమె తయారుచేసేటప్పుడు ఫార్మల్‌ దుస్తులు ధరించాలి. వీడియో నేపథ్యం హుందాగా ఉండేలా చూసుకోవాలి. మొత్తంగా రిక్రూటర్‌ దృష్టి అభ్యర్థినీ, వారి మాటలనూ దాటిపోకుండా చూసుకోవాలి. ఆగి ఆగి మాట్లాడటం, స్క్రిప్ట్‌ను చదవడం వంటివి చేయకూడదు. వీలైనంత సహజంగా ఉండాలి. రిక్రూటర్‌ను ఆకర్షించడానికి ఇదో అనుసరించదగిన ట్రెండ్‌.

నైపణ్యాలకు రేటింగ్‌

అభ్యర్థి తన విజయాలూ, నైపుణ్యాలను అంచనా వేసుకోవాలని ప్రస్తుత రిక్రూటర్లు, హైరింగ్‌ మేనేజర్లు ఆశిస్తున్నారు. అంటే తన నైపుణ్యాలకు ఒక్కోదానికి 1 నుంచి 10 వరకు రేటింగ్‌ ఇవ్వడమో, నక్షత్రాల ద్వారా సూచించడమో చేయాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు- మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌: 7/10 లేదా బీబీబీబీ కోర్‌ జావా 6/10 లేదా బీబీబీ ఇలా అన్నమాట. ఇక్కడ నిజాయతీగా మార్కులు లేదా రేటింగ్‌ ఇచ్చుకోవాలి. అన్నీ ఎక్కువగా ఇచ్చుకుంటే అనుమానాలకు దారితీస్తుంది. సరైన స్వీయ అంచనాతో మార్కులు వేసుకోవాలి. మార్కులు, రేటింగ్‌ కాదనుకుంటే ‘వర్డ్‌ప్రెస్‌లో మంచి నైపుణ్యం ఉంది’, ‘అనలిటికల్‌ టూల్స్‌పై అవగాహన ఉంది’, ‘పైథాన్‌, జావా లాంగ్వేజ్‌లపై పని అనుభవం ఉంది’ ఇలా రాసుకోవచ్చు. కానీ మార్కులు/ నక్షత్రాల విధానం పదాల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది.
Posted on 04-07-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning