నవతరానికి నవీన ఎంబీఏలు

ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకుంటున్న కోర్సుల్లో ఎంబీఏ ఒకటి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పలు సంస్థలు మేనేజ్‌మెంట్‌ విద్యలో స్పెషలైజేషన్లను అందిస్తున్నాయి. బిజినెస్‌ మార్కెట్ అవసరాలపై అవగాహన పెంచుకొని ఆసక్తికి అనుగుణమైన కోర్సును ఎంచుకుంటే కార్పొరేట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టవచ్చు. నవతరానికి ఈ నవీన ఎంబీఏలు మంచి భవిష్యత్తును అందిస్తున్నాయి.
మేనేజ్‌మెంట్‌ విద్యలో మేటి స్పెషలైజేషన్లు
ఉజ్వల భవితకు బాటలువేసే కోర్సుల్లో ఎంబీఏ ఒకటి. అన్ని రంగాల్లోనూ అవకాశాలే ఇందుకు కారణం. ఆధునిక అవసరాలు మేనేజ్‌మెంట్‌ విద్యలో స్పెషలైజేషన్ల పాత్రను పెంచాయి. ఆసక్తులకు అనుగుణంగా నచ్చిన రంగంలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్‌, సప్లై చెయిన్‌, ఏవియేషన్‌, సస్టెయినబిలిటీ, లగ్జరీ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాల్లో ఎంబీఏ అభ్యసించవచ్చు. సాధారణ గ్రాడ్యుయేట్లు క్యాట్‌ స్కోర్‌తో ప్రవేశం దక్కించుకోవచ్చు. ఈ సంవత్సరానికి క్యాట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది.

కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌
సంస్థల బ్రాండ్‌ ఇమేజ్‌ని పెంచడంలో కమ్యూనికేషన్‌ కీలకం. ఆ సంస్థ గురించి ఆ నోటా ఈ నోటా చెప్పుకోవడానికీ¨, ఉత్పత్తులు జనబాహుళ్యంలో చొచ్చుకుపోవడానికీ¨ బలమైన కమ్యూనికేషన్‌ విభాగం అవసరం. అడ్వర్టైజింగ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర చోట్ల వీరికి అవకాశాలుంటాయి. బ్రాండ్‌ మేనేజర్‌, కాపీ రైటర్‌, మీడియా మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌, సోషల్‌ మీడియా మేనేజర్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషనల్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌, సేల్స్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ ఎనలిస్ట్‌, మార్కెట్‌ రిసెర్చర్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషనల్‌, అడ్వర్టైజింగ్‌ ప్రొఫెషనల్‌...తదితర హోదాలతో ఉద్యోగాలు లభిస్తాయి. అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలు, మార్కెటింగ్‌ ఏజెన్సీలు, మీడియా సంస్థలు, పీఆర్‌ ఏజెన్సీలు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, బ్రాండ్‌ కన్సల్టింగ్‌ ఏజెన్సీలు, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌, ఈ-కామర్స్‌ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి. కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌ లేదా మీడియా మేనేజ్‌మెంట్‌ పేరుతో కోర్సులు నిర్వహిస్తున్నారు.
సంస్థలు: ముద్రా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆర్ట్స్‌ (మైకా), అహ్మదాబాద్‌; సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌, పుణె, బెంగళూరు; వెల్లింగ్‌కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌, ముంబయి.

ఫ్యాషన్‌ అండ్‌ లగ్జరీ బ్రాండ్‌
వాడే వస్తువేదైనా సరే.. బ్రాండ్‌కి ప్రాధాన్యం పెరిగింది. ఆధునికతను కలబోసే ఫ్యాషన్‌ దుస్తులు, గ్యాడ్జెట్స్‌, ఇతర పరికరాలు ఎక్కువమంది దగ్గర దర్శనమిస్తున్నాయి. యువతరానికి లగ్జరీ ఐకాన్‌గా బ్రాండ్‌ మారింది. దీంతో కంపెనీలు ఎన్నో కొత్త సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నాయి. ఉత్పత్తులను మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నాయి. పాత సంస్థలు సైతం కొత్త ఉత్పత్తులను తయారుచేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ తరహా వస్తువులు తయారుచేసే సంస్థలు తమ ఉత్పత్తులను విపణిలోకి తీసుకెళ్లడానికి ఫ్యాషన్‌ అండ్‌ లగ్జరీ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివినవారికి అవకాశం కల్పిస్తున్నాయి. ప్రొడక్ట్‌ మేనేజర్‌, బ్రాండింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌, విజువల్‌ మర్చెండైజర్‌, ఫ్యాషన్‌ రిటైల్‌ మేనేజర్‌ తదితర హోదాలతో విధుల్లోకి తీసుకుంటున్నాయి.
సంస్థలు: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌; ఎస్‌పీ జైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి; పెర్ల్‌ అకాడమీ ఆఫ్‌ ఫ్యాషన్‌, న్యూదిల్లీ; లగ్జరీ కనెక్ట్‌ బిజినెస్‌ స్కూల్‌, గుర్‌గ్రామ్‌.

సప్లై చెయిన్‌
సంస్థల్లో తయారైన ఉత్పత్తులు వినియోగదారులకు చేరితేనే విజయం. ఆ పని సక్రమంగా జరిగేలా సప్లై చెయిన్‌ మేనేజర్లు చూసుకుంటారు. ఇందుకోసం ముందుగా ఉత్పత్తులను సేకరిస్తారు. అక్కడ నుంచి గిడ్డంగులకు పంపుతారు. ఆ తర్వాత వాటిని పంపిణీదారులకు చేరవేస్తారు. అక్కడి నుంచి స్టాకిస్టులు, దుకాణాలకు వెళతాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేవారే సప్లై చెయిన్‌ మేనేజర్లు. ప్రపంచీకరణ కారణంగా ఉత్పత్తులు ఎల్ల్లలు దాటి అన్ని చోట్లా విస్తరిస్తున్నాయి. ఇందులో రవాణా కీలకమైంది. అన్ని సంస్థల ఉత్పత్తులు ప్రతి చోటా లభించడంలో సప్లై చెయిన్‌ విభాగం సేవలే కీలకం. ఆన్‌లైన్‌ అమ్మకాలు సప్లై చెయిన్‌ డిమాండ్‌ను పెంచాయి. భారతదేశంలో పారిశ్రామిక విప్లవం కారణంగా రానున్న రోజుల్లో ఈ విభాగానికి గిరాకీ పెరగనుంది. రిటైల్‌, తయారీ, ఆరోగ్యరంగం, ఎఫ్‌ఎంసీజీ, ట్రాన్స్‌పోర్ట్‌, లాజిస్టిక్‌, ఈ కామర్స్‌ తదితర సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
సంస్థలు: ఐఐఎంలు, ఐఎస్‌బీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఎస్‌పీ జైన్‌, ఐఐఎఫ్‌టీ, నార్సీమోంజీ

ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌
భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతోన్న రంగాల్లో విమానయానం ముందుంది. ఏటా 24 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. భవిష్యత్తులో 350కు పైగా విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. వీటి నిర్వహణకు సమర్థ మానవ వనరులు అవసరం. విమానయాన సంస్థలు, విమానాశ్రయాల నిర్వహణ, సేవలు సాఫీగా కొనసాగడానికి ఏవియేషన్‌ మేనేజర్ల సేవలే కీలకం. ఎంబీఏ ఏవియేషన్‌ చదివినవారికి ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ ఫ్యూయల్‌ కంపెనీలు, రెగ్యులేటరీ అథారిటీలు, జాతీయ, అంతర్జాతీయ విమాన సంస్థలు, విమానాశ్రయాలు, ఎయిర్‌ కార్గో ఆపరేటర్ల వద్ద ఉద్యోగాలు లభిస్తాయి. ఎయిర్‌ పోర్ట్‌ మేనేజర్‌, ఆపరేషన్స్‌ మేనేజర్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ మేనేజర్‌, ఎయిర్‌ కార్గో డిశ్పాచ్‌ మేనేజర్‌, ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజర్‌ తదితర హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు.
సంస్థలు: ఐఐఎం- కోల్‌కతా, ఇండోర్‌; ఎఫ్‌ఎంఎస్‌, న్యూదిల్లీ; సీఎంఎస్‌, బెంగళూరు; డీవైపాటిల్‌, ముంబయి; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌, చెన్నై; యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, దెహ్రాదూన్‌; హిందూస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, చెన్నై

బిజినెస్‌ ఎనలిటిక్స్‌
రంగమేదైనప్పటికీ ఎనలిటిక్స్‌ ప్రాధాన్యం పెరిగింది. సమాచారం విశ్లేషించి అందుకు అనుగుణంగా సంస్థలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఆర్థిక సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, బీమా, కన్సల్టింగ్‌ విభాగాలు, వైద్యరంగం, ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, సోషల్‌ మీడియా, టెలికాం...తదితర సంస్థలన్నింటికీ అనలిస్టుల సేవలు ఎంతో కీలకం. వ్యాపార విస్తరణ, కొత్త పుంతలు తొక్కడానికి ఎనలిటిక్స్‌ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
సంస్థలు: ఈ కోర్సును పలు సంస్థలు అందిస్తోన్నప్పటికీ ఐఎస్‌ఐ కోల్‌కతా, ఐఐటీ, ఖరగ్‌పూర్‌, ఐఐఎం కోల్‌కతా కలిసి అందిస్తోన్న పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు ప్రత్యేకమైంది. ఒక్కో సంస్థలో 6 నెలలపాటు చదువుకుంటారు. చివరి 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఎనలిటిక్స్‌ సంబంధిత సాంకేతికాంశాలు ఐఐటీలో, ఎనలిటిక్స్‌ సంబంధిత స్టాటిస్టిక్స్‌, మెషీన్‌ లర్నింగ్‌ థియరీని ఐఎస్‌ఐ, ఎనలిటిక్స్‌ అనువర్తనాలను ఐఐఎంలో నేర్పుతారు. గ్రేట్‌ లేక్స్‌, ఎస్‌పీ జైన్‌, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్‌, నార్సీమోంజీ, ఐఎస్‌బీ-హైదరాబాద్‌, సింబయాసిస్‌ పుణె ఈ కోర్సుకు ప్రసిద్ధ సంస్థలు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌
సంస్థల సమాచారమంతా ఇంటర్నెట్‌తో అనుసంధానమవుతోంది. దీని సమర్థ నిర్వహణకు టెక్నాలజీపై పట్టున్న మేనేజ్‌మెంట్‌ నిపుణులు అవసరం. సాంకేతిక పరిజ్ఞానానికి వ్యాపారాంశాలు జోడించడమే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌. కొత్త సాంకేతికతను ఉపయోగించుకోవడం, సమాచారానికి తగిన భద్రత కల్పించడం, సాఫ్ట్‌వేర్‌ల నిర్వహణ ఇవన్నీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మేనేజర్లు చూసుకుంటారు. వీరికి ప్రతి సంస్థలోనూ ఉద్యోగాలు లభిస్తాయి.
సంస్థలు: ఐఐఎం-అహ్మదాబాద్‌, బెంగళూరు, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-జంషెడ్‌పూర్‌, ఐఐటీ దిల్లీ, ఎస్‌పీ జైన్‌ ముంబయి.

సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌
భవిష్యత్తు అవసరాలు తీర్చుతూనే, రాబోయే తరాలవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం సస్టెయినబుల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రధాన కర్తవ్యం. ఒకప్పుడు ఇది ప్రభుత్వ విభాగాల్లోనే ఉండేది. అయితే ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల్లోనూ సస్టెయినబుల్‌ మేనేజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వృథాను అరికడుతూ, ప్రతికూలతలను తగ్గిస్తూ, తిరుగులేని శక్తిగా సంస్థలను ముందువరుసలో నిలపడంలో వీరి కృషి ఉంటుంది. ఆ కంపెనీలు చేపట్టే పనుల ద్వారా దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా వీరు చూసుకుంటారు. పర్యావరణంపై ప్రభావం పడకుండా కర్మాగారాలు నెలకొల్పడం, అందుకు అవసరమైన పనిముట్ల నిర్వహణ, బాధిత వర్గానికి న్యాయం జరిగేలా చూడడం, ఎక్కువ కాలం ఆ వ్యాపారం కొనసాగేలా చూడడం...ఇవన్నీ సస్టయినబిలిటీలో భాగమే. పలు పరిశ్రమల్లో వీరికి అవకాశాలు లభిస్తాయి. ఎకాలజిస్ట్‌, సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజర్‌, నేచర్‌ కన్జర్వేషన్‌ ఆఫీసర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ తదితర హోదాలతో వీరు విధులు నిర్వర్తిస్తారు.
సంస్థలు: ఐఐఎం, లక్నో; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (ఎన్‌ఐటీఈ), ముంబయి; టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబయి; ది ఎనర్జీ అండ్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (తెరీ), దిల్లీ; జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ సస్టెయినబిలిటీ, ఒడిశా.


Posted on 29-07-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning