సాధన చేద్దాం.. సాధించేద్దాం!

* 4,336 బ్యాంకు కొలువులు
* ఐబీపీఎస్‌ ప్రకటన

బ్యాంకు ఆఫీసర్‌ కొలువు... ఎందరో ఉద్యోగార్థుల కల! ఇలాంటివారికి శుభ వర్తమానం అందిస్తూ 4336 పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హత, 20-30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడంచెల పరీక్షలో నెగ్గటం కోసం ఇప్పటినుంచే సమగ్రంగా సన్నద్ధం కావాలి. ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండింటిలోనూ ఒకే విధమైన సబ్జెక్టులున్నాయి. కాబట్టి ప్రిపరేషన్‌ కూడా కలిసే ఉండాలి. మెయిన్స్‌కు సిద్ధమైతే ప్రిలిమ్స్‌కూ సిద్ధమైనట్లే. చివరివరకూ నేర్చుకోవడం కాకుండా సాధనపైనా దృష్టిపెట్టాలి. ఇలా చేస్తే బ్యాంకులో పాగా సాధ్యమే!
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజిమెంట్‌ ట్రైనీల భర్తీకి ఐబీపీఎస్‌ నిర్వహించే ఉమ్మడి భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్‌ విడుదలైంది. 4336 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ తుది నియామకాలు జరిగే సమయానికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రాతపరీక్షలూ, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లోని ప్రతి విభాగంలో కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు కోత విధిస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్‌ల్లో ఉన్న మొత్తం ఏడు విభాగాలను పరిశీలిస్తే, ప్రిలిమినరీలోని మూడు విభాగాలు మెయిన్స్‌లోనూ ఉన్నాయి. ప్రిలిమ్స్‌లోని క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, మెయిన్స్‌లోని డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ఒకే విభాగానికి చెందినవి. మెయిన్స్‌కు సన్నద్ధమైతే ప్రిలిమినరీ సన్నద్ధత కూడా పూర్తవుతుంది.
ఏ విభాగంలో ఎలా?
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమినరీలోని ఈ విభాగంలో సాధారణంగా ప్రశ్నలు సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, పర్ముటేషన్‌- కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ, వివిధ అరిథ్‌మెటిక్‌ అంశాల నుంచి ఉంటాయి.
* డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌: మెయిన్స్‌లోని ఈ విభాగం సాధించడానికి అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా పర్సంటేజెస్‌, యావరేజ్‌, రేషియో-ప్రపోర్షన్‌లపై మంచి అవగాహన వుండాలి. కాల్‌క్యులేషన్స్‌ వేగంగా చేయగలగాలి. ఈ విభాగానికి ప్రాక్టీస్‌ బాగా అవసరం.
* రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండింటిలోనూ రీజనింగ్‌ ఉంది. పీఓ పరీక్షకు రీజనింగ్‌ ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవే అనిపించేలా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచుకుంటే ఇలాంటి ప్రశ్నలు సులభంగా సాధించే అవకాశం వుంటుంది. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 5-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.
* ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటితోపాటుగా డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లోనూ ఈ విభాగం ఉంది. చాలా ముఖ్యమైనది. సాధారణంగా ప్రశ్నలు వచ్చే సెంటెన్స్‌ కంప్లీషన్‌, పారా జంబుల్డ్‌, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, క్ల్లోజ్‌ టెస్ట్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ మోడల్‌ ప్రశ్నలతోపాటు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ ప్రశ్నలుంటాయి. గ్రామర్‌పై పట్టుంటే వీటిని తేలికగా సాధించవచ్చు. పాసేజీ వేగంగా చదివి అర్థం చేసుకోగలిగితే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు సాధించవచ్చు.
డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో లెటర్‌, ఎస్సే రైటింగ్‌ ఉంటాయి. ఏదైనా విషయాన్ని తీసుకొని 150-200 పదాలతో ఎస్సే రాయగలిగేలా చూసుకోవాలి. ఎక్కువమంది బ్యాంకు పరీక్షలలో ఫెయిలయ్యేది ఈ విభాగంలోనే అనేది గుర్తుంచుకొని సాధన చేయాలి.
* జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: దీనిలో కరెంట్‌ అఫైర్స్‌, బ్యాంకింగ్‌ టర్మినాలజీ, స్టాండర్డ్‌ జీకేల నుంచి ప్రశ్నలుంటాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలుంటాయి. గత 5, 6 నెలలకు సంబంధించిన తాజా పరిణామాలు బాగా చూసుకోవాలి. ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ మొదలైనవి. అంతర్జాతీయ సంస్థలు, నీతి ఆయోగ్‌, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థ, కేంద్రప్రభుత్వ పథకాలు, స్టాక్‌ మార్కెట్‌, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలను తెలుసుకోవాలి. కేవలం ప్రశ్నకు జవాబు అనే రీతిలో కాకుండా, విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వాటిని తమ అభిప్రాయాలతో విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటే ఇంటర్వ్యూ సమయంలోనూ ఉపయోగం.
ప్రిలిమినరీకి దాదాపుగా రెండున్నర నెలల సమయం ఉంది. ఆలోగా మెయిన్స్‌లోని విభాగాలకూ సన్నద్ధత పూర్తయ్యేలా చూడాలి. తొలిసారిగా బ్యాంకు పరీక్షలు రాసేవారు టాపిక్స్‌ నేర్చుకోవడంతోపాటు వాటిలో వివిధ స్థాయుల ప్రశ్నలు సాధన చేయాలి. పరీక్ష తరహాలో పూర్తిస్థాయి మోడల్‌ ప్రశ్నపత్రాలను సమయాన్ని నిర్దేశించుకుని రాయాలి. దీనిద్వారా నిర్దేశించిన సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో అవగతమవుతుంది. తగినట్లుగా సన్నద్ధతలో మార్పులు చేసుకోవచ్చు. గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రశ్నలు ఏ విధంగా, ఏ స్థాయిలో వుంటున్నాయో తెలుస్తుంది. రోజులో ఎన్ని గంటలు కేటాయిస్తున్నామని కాకుండా ఎంత నిబద్ధతతో ప్రిపేర్‌ అవుతున్నారనేది ముఖ్యం.


ఆన్‌లైన్‌ దరఖాస్తు: 07-08-2019 నుంచి 28-08-2019
ప్రిలిమ్స్‌ పరీక్ష: అక్టోబరు 12/13/19/20 తేదీలు
మెయిన్స్‌: 30-11-2019
వెబ్‌సైట్‌: www.ibps.in

తొలిసారీ గెలవొచ్చు

ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష తొలిసారి రాసినా విజయం సాధించగలిగేంత సమయముంది. దాన్ని సరిగా ఉపయోగించుకోవడం ప్రధానం. ఇందుకుపయోగపడే 10 సూత్రాలు...
1. ఎంత శ్రద్ధ: అభ్యర్థులు తమకు తాము వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇది. దీనిని బట్టే విజయం సాధించడానికి సరిపడా శ్రమించగలరో లేదో తమను తాము తెలుసుకోవడం సులువవుతుంది.
2. పరీక్షపై అవగాహన: తొలిసారి పరీక్ష రాస్తున్నట్లయితే దానిగురించి పూర్తిగా తెలుసుకోవాలి. పరీక్ష విధానం, సిలబస్‌, సబ్జెక్టులు, ప్రశ్నల సరళి మొదలైన వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
3. ప్రణాళిక: సన్నద్ధతకు ఎంత సమయం కేటాయించగలరో చూసుకుని, ప్రణాళిక తయారు చేసుకోవాలి.
4. అంశాలవారీ సన్నద్ధత: సబ్జెక్టుల్లోని అంశాలు ముఖ్యంగా అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ల్లోని వాటిని నేర్చుకుని, ప్రశ్నలను సాధన చేయాలి. ముందుగా సులువైనవాటిపై, తర్వాత కఠినమైనవాటిపై దృష్టిపెట్టాలి.
5. షార్ట్‌కట్‌లు: అంశాలపై పట్టు వచ్చాక వాటిని వేగంగా చేయడంపై దృష్టిపెట్టాలి. ఇందుకు సాధ్యమైనన్ని షార్ట్‌కట్‌ పద్ధతులను నేర్చుకోవాలి. కాల్‌క్యులేషన్స్‌ వేగంగా చేయడానికి స్పీడ్‌ మేథ్స్‌ పద్ధతులను సాధన చేయాలి.
6. వేగాన్ని మెరుగుపరచుకోవడం: ఐబీపీఎస్‌ పీఓ ప్రిలిమ్స్‌ పరీక్షలో 100 ప్రశ్నలు సాధించడానికి గంట సమయం మాత్రమే ఉంటుంది. సగటున ఒక ప్రశ్న సాధించడానికి అందుబాటులో ఉన్నది 36 సెకన్లు మాత్రమే. వేగంగా ప్రశ్నలు సాధించడం అత్యంత అవసరం. దీనిని వీలైనంత సాధన చేయాలి.
7. ఇంగ్లిష్‌పై పట్టు: సాధారణంగా ఎక్కువమంది అభ్యర్థులు విఫలమయ్యేది ఇంగ్లిష్‌ విభాగంలోనే. ఐబీపీఎస్‌ పీఓ పరీక్షలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌తోపాటు మెయిన్స్‌లోని డిస్క్రిప్టివ్‌లోనూ ఇంగ్లిష్‌ విభాగం ఉంది. దీనిపై గట్టి పట్టు తప్పనిసరి. ఇందుకుగానూ గ్రామర్‌పై పట్టు సాధించాలి. లెటర్‌ రైటింగ్‌, ఎస్సేలు బాగా సాధన చేయాలి.
8. మాదిరి ప్రశ్నపత్రాలు: చివరి వరకూ నేర్చుకోవడంపైనే దృష్టిపెట్టొద్దు. పరీక్షపై అవగాహనా ఏర్పరచుకోవాలి. ఇందుకు పూర్తిస్థాయి పరీక్షలు సాయపడతాయి. నిర్ణీత సమయంలో కనీసం రెండు నుంచి మూడు పరీక్షలైనా రాయాలి. దీని ద్వారా నిర్దేశిత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలను సాధించగలుగుతున్నారో, వేటిని మెరుగుపరచుకోవాలన్న దానిపై అవగాహన ఏర్పడుతుంది.
9. ముందు తేలికవి: పరీక్ష సమయంలో అభ్యర్థులు తాము సులువుగా భావించే విభాగాన్ని ముందుగా మొదలుపెట్టాలి. వాటిలోనూ తేలికైన వాటిని ముందుగా సాధించి, కఠినమైన/ ఎక్కువ సమయం తీసుకునేవాటిని తరువాత చేయాలి. సమయం ఉంటే తిరిగి వాటిని సాధించే ప్రయత్నం చేయాలి.
10. ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌: ఇదే మొత్తం ప్రక్రియలో కీలకం. ఎంత ఎక్కువ సాధన చేశారన్నదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. తెలిసిన ప్రశ్నలు/ విభాగమైనా సాధన చేస్తూనే ఉండాలి. ఇదే అభ్యర్థిని విజయంవైపు నడిపిస్తుంది.


Posted on 05-08-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning