బీటెక్‌లో ఉత్తమశ్రేణి కష్టమే

* నాలుగేళ్లలో ప్రతి సబ్జెక్టులో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలి
* 2016-17 బ్యాచ్‌ విద్యార్థులకు వర్తింపు
* మూడో ఏడాది పూర్తయ్యేనాటికి రేసులో నిలిచింది 6 వేల మందే

ఈనాడు - హైదరాబాద్‌: బీటెక్‌లో ఉత్తమశ్రేణి సాధించాలంటే ఇక సులభం కాదు. విద్యార్థులు నాలుగేళ్లపాటు పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి సారిస్తేనే అది సాధ్యమవుతుంది. అందుకు కారణం జేఎన్‌టీయూహెచ్‌ నిబంధనలను మార్చడమే. దీనివల్ల ఉత్తమశ్రేణి (డిస్టింక్షన్‌)లో ఉత్తీర్ణులయ్యే వారి సంఖ్య గణనీయంగా పడిపోనుందని వర్సిటీ ఆచార్యులు అంచనా వేస్తున్నారు. గతానికంటే కనీసం 20 శాతం తగ్గుతుందని వారు భావిస్తున్నారు. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని కళాశాలల్లో బీటెక్‌లో చేరిన విద్యార్థులు నాలుగో సంవత్సరం పూర్తయ్యేనాటికి మొత్తం మీద 70 శాతం మార్కులకు మించి సాధిస్తే వారికి ఫస్ట్‌క్లాస్‌ విత్‌ డిస్టింక్షన్‌ అని ధ్రువపత్రంపై ముద్రించి ఇచ్చేవారు. అది 2015వ సంవత్సరం వరకు చేరిన విద్యార్థులకు వర్తించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌లో మార్కులు బదులు గ్రేడింగ్‌ విధానాన్ని 2016-17 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తోంది.
ఉత్తమశ్రేణికి చేసిన మార్పులు ఇవీ...
* బీటెక్‌ తొలి సెమిస్టర్‌ నుంచి పూర్తయ్యేవరకు (8వ సెమిస్టర్‌) ప్రతి సబ్జెక్టులో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావాలి. అంటే నాలుగేళ్లలో ఏ ఒక్క సబ్జెక్టులో కూడా తప్పకూడదు.
* అన్ని సబ్జెక్టులను మొదటిసారి రాసి ఉత్తీర్ణులైనా 10కి 8 క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజి (సీజీపీఏ) సాధించాలి.అప్పుడే వారికి ఫస్ట్‌క్లాస్‌ విత్‌ డిస్టింక్షన్‌ అని ధ్రువపత్రం ఇస్తారు.
ఈసారి 4 వేలకే పరిమితం!
2015లో బీటెక్‌లో చేరిన వారికి పాత నిబంధనలు వర్తిస్తాయి. వారికి గత మే నెలలో బీటెక్‌ పూర్తయ్యింది. మొత్తం 61,463 మందిలో 5,022 మంది ఉత్తమశ్రేణి దక్కించుకున్నారు. 2016లో చేరిన వారికి 4 వేలకు మించకపోవచ్చని జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యులు అంచనా వేస్తున్నారు. కొత్తగా బీటెక్‌లో చేరిన విద్యార్థులకు కూడా ఈ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఆచార్య యాదయ్య తెలిపారు.


Posted on 16-09-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning