పరిజ్ఞానం ఉన్నవారికే ప్రాధాన్యం

* ప్రాంగణ నియామకాల్లో సాఫ్ట్‌వేర్‌ సంస్థల తీరు
* సివిల్, మెకానికల్‌లలో తగ్గిన జోరు

ఈనాడు, అమరావతి: సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఉద్యోగుల నియామకాల్లో కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. గతంలో నాలుగో సంవత్సరం విద్యార్థులను ఎంపిక చేసుకుని, వారికి శిక్షణ ఇచ్చి తీసుకునేవారు. ఇప్పుడు నేరుగా పనిచేయగల నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోడింగ్‌ నైపుణ్యాలతో పాటు అదనపు పరిజ్ఞానాలు ఉన్నవాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం పాఠ్యాంశాలు చదువుకోవడమే కాకుండా.. సర్టిఫికేషన్లు చేసినవారివైపు మొగ్గుతున్నాయి. గతంలో పాఠ్యాంశాలతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను మాత్రమే పట్టించుకునేవారు. కానీ ఇప్పుడు అదనపు అర్హతలు పొందడం తప్పనిసరవుతోంది.
ఇలా తీసుకుంటున్నాయి..
ఆన్‌లైన్‌ పరీక్షల ద్వారా ముందుగా విద్యార్థుల లాజికల్‌ నైపుణ్యాలను పరీక్షిస్తున్న కంపెనీలు.. ఆ తర్వాత ముఖాముఖిలో వారి కోడింగ్‌ సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయి. సంస్థ అవసరాలకు తగినస్థాయిలో ఉంటేనే తీసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది మొదట్లోనే విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వీరికి 5-6 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తున్నాయి. ఈ శిక్షణ తర్వాత విద్యార్థులు చదువు పూర్తిచేసి కంపెనీల్లో చేరుతున్నారు. పరిశ్రమల్లో మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ, నైపుణ్యం ఇస్తున్న కళాశాలల నుంచే ఎక్కువమంది ఎంపికవుతున్నారు.
టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలు ఆన్‌లైన్‌లోనే ఎంపికలు నిర్వహిస్తున్నాయి. ముందుగా ఒకటి, రెండుదశల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు, తర్వాత ముఖాముఖి నిర్వహిస్తున్నాయి. చిన్న కళాశాలల విద్యార్థులకూ అవకాశాలు లభిస్తున్నాయి. టీసీఎస్‌ సంస్థ నింజా, డిజిటల్‌ అనే రెండు విభాగాల్లో జాతీయస్థాయి అర్హతపరీక్ష (టీసీఎస్‌ ఎన్‌క్యూటీ) నిర్వహిస్తుంది. జులైలో ఆన్‌లైన్‌ పరీక్షలు, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ముఖాముఖి నిర్వహించి కొందరిని ఎంపికచేసుకుంది. విప్రో ఎలైట్‌ జాతీయస్థాయి టాలెంట్‌హంట్‌ నిర్వహిస్తోంది. ఇన్ఫోసిస్‌ సర్టిఫికేషన్‌ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో 65% కంటే ఎక్కువ స్కోరు సాధిస్తే నేరుగా మౌఖికపరీక్షకు హాజరుకావొచ్చు.
* కృత్రిమమేథ (ఏఐ), మెషీన్‌లెర్నింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బిగ్‌డేటా, సైబర్‌ సెక్యూరిటీ లాంటి అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికి డిమాండ్‌ ఉంది. వారికి వేతన ప్యాకేజీలు రూ.6-7లక్షల వరకు వస్తున్నాయి.
వారికి 10శాతమే
ఇంజినీరింగ్‌లో సివిల్, మెకానికల్‌కు ఈ ఏడాది ప్రాంగణ నియామకాలు తగ్గాయి. కంప్యూటర్‌ సైన్సు, ఐటీ, ఈసీఈ కోర్సు చదివినవారితో పోల్చితే వీరికి లభిస్తున్న అవకాశాలు తక్కువ. సివిల్‌లో ఉద్యోగాలు రాష్ట్రంలో 10%లోపే ఉంటున్నాయని వెల్లడిస్తున్నాయి. మెకానికల్‌లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు.
మాంద్యం ప్రభావం లేదు
ఇంజినీరింగ్‌ ప్రాంగణ నియామకాలు గతేడాది కంటే పెరిగాయి. ప్రస్తుత ఆర్థికమాంద్యం ప్రభావం నియామకాలపై లేదు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కోడింగ్, ప్రొగ్రామింగ్‌ నైపుణ్యాలనే పరిశీలిస్తున్నాయి. విద్యార్థులను తీసుకొని శిక్షణ ఇచ్చేందుకు ఇష్టపడట్లేదు. -పి.వెంకటరావు, ఏపీ ఉపాధి, శిక్షణ అధికారుల సంఘం అధ్యక్షుడు
నేరుగా పనిచేసేవారికే ప్రాధాన్యం
కంపెనీలు నేరుగా పనిచేసే నైపుణ్యం ఉన్నవారే కావాలని కోరుతున్నాయి. అదనపు నైపుణ్యాలు అందిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్వయంప్రతిపత్తి కళాశాలలు ఇంటర్న్‌షిప్‌ ద్వారానూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. - విజయమారుతి బాబు, ప్రాంగణ నియామక అధికారి, వీఆర్‌ సిద్దార్థ కళాశాలలు
ఏపీ ఉపాధి, శిక్షణ అధికారుల సంఘం వివరాల ప్రకారం..
ప్రాంగణ నియామకాలిలా..
సీఎస్‌ఈ, ఐటీ: 40%
ఈసీఈ: 30%
ఈఈఈ: 25-30%
సివిల్, మెకానికల్‌: 10%
వేతన ప్యాకేజీలు ఇలా..

     ఇన్ఫోసిస్‌     విప్రో   టీఎసీఎస్‌
గతేడాది  రూ.3.3లక్షలు  రూ.3.25లక్షలు  రూ.3.30లక్షలు
ప్రస్తుతం  రూ.3.60లక్షలు  రూ.3.50లక్షలు  రూ.3.30లక్షలు


Posted on 23-09-2019

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning