కొంగొత్త పరిశోధనలకు జైఎన్‌టీయూకే

* జెఎన్‌టీయూకేలో గోదావరి నాలెడ్జ్ పార్కు

* జేఎన్‌టీయూకే, గోదావరి సొసైటీ భాగస్వామ్యంతో ఏర్పాటు

* ప్రైవేట్, యూనివర్శిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఫస్ట్‌టైమ్

* వృథా నుంచి బయో ప్లాస్టిక్‌పై పరిశోధనలు

న్యూస్‌టుడే, బాలాజీచెరువు (కాకినాడ) : బియ్యం నూక నుంచి పంచదార... కర్ర పెండలం, బియ్యం నూకలతో పశువుల దాణా... మామిడి టెంకల నుంచి బయో ప్లాస్టిక్ తయారు చేయడం వంటి ఎన్నో... పరిశోధనలకు జవహర్‌లాల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ(కాకినాడ) ఇక కేంద్ర బిందువు కానుంది..! ఈ దిశగా జేఎన్‌టీయూకే, గోదావరి నాలెడ్జ్ పార్కు పరస్పరం ఒప్పందం చేసుకొని ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నాయి.
జేఎన్‌టీయూకే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. గోదావరి నాలెడ్జ్ పార్కు(ఇంక్యుబేషన్ సెంటర్) ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడం ద్వారా జేఎన్‌టీయూకే ఉపకులపతి డాక్టర్ తులసీరామ్‌దాస్ ఈ దిశగా తొలి అడుగు వేశారు. ఈ రెండు సంస్థలూ కలసి వచ్చే ఇరవై ఏళ్లపాటు జాతీయస్థాయిలో గుర్తింపు సాధించే పరిశోధనలపై దృష్టి సారిస్తారు. అందుకోసం ఇప్పటికే ఇక్కడి విద్యార్థులు, నిపుణులు సన్నద్ధం అవుతున్నారు. మరో నెల రోజుల్లో ఫుడ్ టెక్నాలజీ విభాగంలోని లేబరేటరీలో తాత్కాలికంగా ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రూ. కోట్లాది నిధులతో పరిశోధనలకు కావాల్సిన ఆధునిక పరికరాలు అమర్చుతారు. ప్రధానంగా వ్యవసాయం, సముద్ర ఉత్పత్తి రంగాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు, అధ్యాపకులు, కేంద్ర ప్రభుత్వ నిపుణులు పరిశోధనలు చేస్తారు. ప్రపంచంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి శాస్త్రవేత్తలను ఇక్కడకు తీసుకొచ్చి వీరికి సలహాలు ఇప్పిస్తారు. ఇప్పటి వరకు నివేదికలకే పరిమితమైన విద్యార్థుల పరిశోధనలు ఇకపై కార్యరూపం దాల్చుతాయి.
పేటెంట్ హక్కులు
ఇంక్యుబేషన్ కేంద్రంలో చేసే పరిశోధనలకు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసి పేటెంట్ హక్కులు పొందుతారు. వాటిని పరిశ్రమల యాజమాన్యాలకు విక్రయిస్తారు. దీనివలన రానున్న మూడేళ్లలో జిల్లాలో రూ. వంద కోట్ల విలువైన పరిశ్రమలు వస్తాయని భావిస్తున్నారు. పేటెంట్ల ద్వారా వచ్చే ఆదాయం జేఎన్‌టీయూకే, గోదావరి నాలెడ్జ్ సొసైటీలకు ఒప్పందాల ప్రకారం జమవుతుంది. జిల్లాకు పరిశ్రమలు రావడం వలన ప్రత్యక్షంగా పది వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా వ్యవసాయంలో ఇప్పటివరకు వృథాగా పోతున్న జీడిమామిడి పండ్లు, చెరకు పిప్పి వంటి వాటికి సైతం ధర లభించేలా చేసి రైతులు ఆర్థికంగా లాభపడే ఆవిష్కరణలు కనుగొంటారు. జేఎన్‌టీయూకేలోని అన్నీ విభాగాల ఇంజినీరింగ్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఎంబీఏ, విద్యార్థులు పరిశోధనలో పాల్గొంటారు.
కర్రపెండలం, బియ్యం నూక
కర్రపెండలం, బియ్యం నూక నుంచి పశువులకు ఉపయోగపడే దాణా తయారు చేసేందుకు పరిశోధనలు కొనసాగిస్తారు. ప్రధానంగా తక్కువ ధరలో అధిక ఉత్పత్తి సాధించేందుకుఇక్కడ కృషి చేస్తారు.
బియ్యం నూక నుంచి పంచదార
ఇప్పటివరకు పంచదారను చెరుకు నుంచే తీస్తున్నారు. ఇది తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు శరీరంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. అలా కాకుండా బియ్యం నూక నుంచి తయారు చేసిన పంచదారతో వారికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఉత్పత్తి తయారీపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఈ చక్కెర ఆహారంగా తీసుకున్న వెంటనే రక్తంలో కరగదు. దీని వలన మదుమేహులకు ప్రమాదం లేదు. దీన్ని బేకరీలు, సాఫ్ట్ డ్రింక్‌లలో కూడా తక్కువ మొత్తంలో వినియోగిస్తే సరిపోతుంది.
బియ్యం మిల్లులకు ప్రయోజనం
జిల్లాలో విస్తృతంగా రైస్ మిల్లులుండటం వాటి నుంచే వచ్చే బియ్యం నూక ద్వారా పంచదార ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే గోదావరి సొసైటీ బృందం జిల్లాలో ఉన్న రైస్‌మిల్లుల్లో పర్యటించింది. సంవత్సరానికి ఎన్ని టన్నుల బియ్యం నూక ఉత్పత్తవుతుంది..? దాని నుంచి ఎంత పంచదార ఉత్పత్తి చేయవచ్చు అనే అంశాలపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.
మత్స్యకారులకు
జిల్లాలో తొండంగి నుంచి అంతర్వేది వరకు విశాలంగా సముద్ర తీరం ఉంది. లక్షల మంది మత్స్యకారులు చేపలవేటపైఆధారపడి జీవిస్తున్నారు. వీరు ప్రధానంగా చేపలు, రొయ్యలు, పీతలను పట్టి వ్యాపారులకు అమ్ముకొని ఆదాయం పొందుతున్నారు. మత్స్య ఉత్పత్తులను మన ప్రాంతంలో రోడ్లపైనే ఆరబెట్టి ఎండపెడుతున్నారు. దీనివలన 35 శాతం వరకు చేపలు వృథా అవుతున్నాయి. చేపలు ఆరడానికి పది రోజుల సమయం పడుతుంది. కేజీ రూ. 80కి అమ్ముతున్నారు. అదే న్యూసోలార్ వేక్యూమ్ డ్రైయర్ ద్వారా పదిగంటల పాటు ఆరబెడితే నాణ్యమైన మత్స్య సంపద లభిస్తుంది. ఈ డ్రైయర్లుపై పరిశోధన ద్వారా అభివృద్ధి చేసి ప్రభుత్వం ద్వారా రాయితీపై మత్స్యకారులకు అందుబాటులోకి తెస్తారు. దీనిలో ఎండబెట్టిన మత్స్యసంపదకు నాణ్యంగా ఉండటంతో పాటు మంచి డిమాండు ఉంటుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ రూ. 20 డాలర్లు లభిస్తుంది. దీనివలన మత్స్యకారులు ఆర్థికపరిపుష్టి సాధిస్తారు.
గుర్రపు డెక్కలు, నాచు, చెరకుపిప్పు
ఎందుకు పనికిరాని గుర్రపు డెక్కలు, నాచు, చెరకుపిప్పి, మామిడిటెంకలు, జీడిమామిడి పండ్ల నుంచి బయోకెమికల్స్ తయారు చేయడంపై ఈ పార్కులో విద్యార్థులు రీసెర్చ్ చేస్తారు. వీటిలో పిండిపదార్థం ఉండటం వలన బయో కెమికల్స్ తీసుకొనేందుకు వీలుంటుంది. పైగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త సమస్య కూడా తగ్గుతుంది. ఇలా తయారైన బయో కెమికల్స్ వినియోగం వలన పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. పైగా వీటి నుంచి ఫ్యూయల్స్, ఆహార పదార్థాలు రూపొందించడానికి ప్రయోగాలు చేస్తారు.
మామిడి టెంకలతో
మామిడి టెంకలలో పిండిపదార్థం ఉంటుంది. దీనినుంచి బయోప్లాస్టిక్ తయారు చేయడంపై గోదావరి సొసైటీ కార్యదర్శి శంకర్‌ప్రసాద్ ఇప్పటికే పరిశోధనలు చేశారు. మరో మూడు నెలల్లో బయోప్లాస్టిక్ మార్కెట్‌లోకి తెచ్చేందుకు ఈయన కృషి చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. ఎనిమిది వారాల్లో భూమిలో కలిసిపోవడంతోపాటు భూసారం పెరుగుతుంది. భారతదేశంలో ప్లాస్టిక్ వినియోగం ఏడాదికి 30 మిలియన్ల టన్నులు ఉంది. దీనివలన పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. బయో ప్లాస్టిక్ వినియోగం అమలులోకి వస్తే ఇక పర్యవరణానికి ఎటువంటి హాని ఉండదు.
చేపల పొలుసులతో ఔషధాలు
మత్స్యసంపదలో వృథాగా వచ్చే పొలుసుల వంటి వాటిలో ఐవేల్యూ విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. వీటిపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు... ఈ ప్రయోగాలు విజయవంతమైతే జిల్లాలో కంపెనీలు స్థాపించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే రెండు అమెరికన్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
మెరైన్ వృథా నుంచి ప్లాస్టర్
మెరైన్ వృథా నుంచి శరీరానికి వేసే ప్లాస్టర్‌ను తయారు చేయొచ్చు. ఈ ప్లాస్టర్ మెడిసిన్ రూపంలో శరీరంలో కలిసిపోతుంది. సాధారణ ప్లాస్టర్‌లా తిరిగి తీయాల్సిన అవసరంలేదు. దీనిపై కూడా ఈ కేంద్రంలో ప్రయోగాలు చేపడతారు.
- కాకర్ల శ్రీనివాసు, గోదావరి నాలెడ్జ్ సొసైటీ అధ్యక్షుడు
పరిశ్రమలు స్థాపించవచ్చు
ఇక్కడి పరిశోధనలను ఆధారం చేసుకొని ఔత్సాహికులైన విద్యార్థులు సొంతంగా పరిశ్రమలను స్థాపించి వందలమందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. దేశంలో చాలా మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళుతున్నారు. ప్రధానంగా ఐఐటీ, త్రిపుల్ఐటీ, ఐఐఎంలలో చదువుతున్న వారు అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలకు వెళుతున్నారు. దీన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. వీరంతా ఇక్కడే పరిశ్రమలు స్థాపించడం వలన దేశ ఆర్థికవృద్ధి వేగవంతమవుతుంది.
- ఎం.ఎస్.శంకర్‌ప్రసాద్, గోదావరి నాలెడ్జ్ సొసైటీ కార్యదర్శి
పీజీల పరిశోధనలకు
జెఎన్‌టీయూకేలో ఏర్పాటు చేస్తున్న ఇంక్యూబేషన్ సెంటర్ ప్రధానంగా పీజీ విద్యార్థుల పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుంది. పరిశోధనల కోసం దేశంలో సుదూరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థులు చేసే నూతన ఆవిష్కరణలు సమాజానికి మేలు చేస్తాయి. పరిశోధన ద్వారా లభించే పేటెంట్ల ద్వారా ఆదాయం లభిస్తుంది. జేఎన్‌టీయూకేకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పరిశోధనలకు ఇక్కడకు వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు తరలివస్తారు.
- డాక్టర్ తులసీరామ్‌దాస్,జేఎన్‌టీయూకేఉపకులపతి

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning