మీ మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి !

ఉద్యోగం సంపాదించాలన్నా అందులో విజయవంతంగా రాణించాలన్నా.. పదోన్నతి లభించాలన్నా.. అత్యంత ప్రధానం భావ వ్యక్తీకరణ నైపుణ్యం. ఈ నైపుణ్యం లేకుంటే ఎంత ప్రతిభ, అర్హతలున్నా ఒక్కోసారి వైఫల్యాలు తప్పవు. భావ వ్యక్తీకరణ నైపుణ్యమంటే మనసులోని భావాల్ని అవతలి వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం మాత్రమే కాదు. మీ మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. అవతలివారిలోనూ విశ్వాసం పెంచాలి. ఒక్కోసారి మీరు వ్యక్తం చేసిన భావాలు అవతలి వారు ఆలోచించేలా చేయాలి. మీ అభిప్రాయాన్ని అంగీకరించే విధంగా మార్చాలి. లేకుంటే మీరు నాయకుడిగా.. ఉద్యోగిగా రాణించడం కష్టం.
భావ వ్యక్తీకరణ నైపుణ్యం అవసరం :
ఒక ఇంటర్వ్యూకి వెళ్లినపుడు దానికి దరఖాస్తు చేసిన వారి ఎక్కువ మందిలో సమాన స్థాయిలో ప్రతిభ, నైపుణ్యాలు ఉంటాయి. అయినా వారిలో కొందరికే ఉద్యోగం లభిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం తక్కిన వారిలో భావవ్యక్తీకరణ నైపుణ్యం లేకపోవడం. ఎందుకంటే ఇతరులతో సమాన ప్రతిభ, నైపుణ్యాలున్నపుడు వారికి వచ్చిన ఉద్యోగం వీరికీ రావాలి. కానీ.. వీరు ప్రతిభ, నైపుణ్యాలను సరిగ్గా వ్యక్తీకరించచకపోవడంతో ఉద్యోగం చేజారింది. వ్యక్తీకరణ నైపుణ్యం బాగా ఉంటే తప్పకుండా ఆ ఉద్యోగం వీరికీ వచ్చేది. ఇదీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కి ఉన్న ప్రాధాన్యం. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే.. ఎక్కడా సమాచారలోపం పనికిరాదు. ముఖ్యంగా మంచి ఉద్యోగి, నాయకుడు అనిపించుకోవాలంటే పటిష్ఠమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఉండాలి. ఒకవేళ ఇవి లేకుంటే సాధించేందుకు కొన్ని కోర్సులు లేకుంటే వర్క్‌షాపులకు హాజరవడం, మంచి పుస్తకాలు చదవడం మంచిది. ముఖ్యంగా నాయకుడు, సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు ఈ నైపుణ్యం తప్పనిసరి. వారు ఎలాగైనా దీన్ని సాధించాల్సిందే. లేకుంటే వృత్తి జీవితంలో ఇబ్బందులు తప్పవు.
ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం నాయకులకు, పదోన్నతి ఆశించే వారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలివే..:
* గొప్ప వక్తకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండాలి. ఒకరితో, పది మందితో లేదా వంద మందితో, బహిరంగ సభలోనో ఇలా వేదిక ఏదైనా సరే ఆ సందర్భానికి అతికినట్లు సరిపోయేలా మాట్లాడగలగాలి.

* ఒక సమావేశంలో.. ఇతరులు చాలా ఏకాగ్రతతో వినేంతగా ప్రసంగం సాగాలి. ఈ ప్రసంగంతో వారిలో విశ్వాసం పెరగాలి. వినేవారికి ఏమాత్రం విసుగు కలగకుండా జాగ్రత్తపడాలి.

* కొందరు సమాన హోదా కలిగిన వ్యక్తులతో బాగా మాట్లాడుతారు. ఉన్నత హోదా, లేదా లింగ బేధం వచ్చినపుడు సరిగా మాట్లాడలేరు. ఈ లక్షణం నాయకులకు పనికిరాదు. సాధారణంగా ఆత్మవిశ్వాసం లోపిస్తే ఈ పరిస్థితి తలెత్తుతుంది. అందరితోనూ ఒకే విధంగా ఒకే స్థాయిలో మాట్లాడగలిగేలా ఉండాలి. ఇందుకు తగిన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

* భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వృత్తి జీవితంలో ఇవి ఎప్పుడూ అదుపుతప్పకూడదు. మీరు మాట్లాడేటపుడు అవతలి వారి ముఖ కవళికలను గమనించాలి. అప్పుడే వారు మీరు చెప్పే విషయాలను ఎలా అర్థం చేసుకొంటున్నారో తెలుస్తుంది. లేకుంటే మీరు చెప్పింది వారు సరిగ్గా వినకపోవచ్చు. అప్పుడు మీ సమయం వృథా అవుతుంది.

* హాస్యచతురత కూడా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో ఒక భాగమే. ఇది సాధించాలంటే వర్తమాన అంశాలు, ఎదుటి వ్యక్తులపై ఒక అవగాహన ఉండాలి.

* భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో చాలా ప్రధానమైనవి హావభావాలు. మాటలకన్నా ఇవి చాలా పదునైనవి. వీటిని సందర్భానికి తగినట్లు పలికించాలి. ఎక్కువ మంది చక్కగా మాట్లాడగలిగినా హావభావాల విషయానికి వచ్చే సరికి వెనకబడుతుంటారు. ఇక్కడ తేడా వస్తే ముఖ్యమైన విషయాన్ని సైతం అవతలి వ్యక్తి చాలా తేలిగ్గా తీసుకొనే అవకాశం ఉంటుంది. చాలా విషయాలను మాటలకన్నా హావభావాల ద్వారానే ఎక్కువగా చెప్పవచ్చు. కనుక వీటిపై పట్టు చాలా ముఖ్యం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning