విజ్ఞానమే వారథిగా...పరిశోధనే ప్రాణంగా..

* జేఎన్‌టీయూకే ప్రొఫెసర్‌కు యూజీసీ అవార్డు

న్యూస్‌టుడే, బాలాజీచెరువు(కాకినాడ) : దేశంలోని వందల విశ్వవిద్యాలయాల నుంచి ఇరవై వేల మంది ప్రొఫెసర్లు యూజీసీ రీసెర్చు అవార్డుకు దరఖాస్తు చేశారు. వారిలో వంద మందికి మాత్రమే ఎంపిక చేశారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో జేఎన్‌టీయూకే అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు ఒక్కరికి మాత్రమే ఈ అవార్డు లభించడం విశేషం. ఈఈఈ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నఈయన పరిశోధనల్లో రాణించడంతోపాటు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విధులు కూడా నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా చేకూరపాడు గ్రామంలో సన్నకారు రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చారు. ప్రాథమిక విద్య సొంత గ్రామంలోనే కొనసాగగా, బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎస్‌వీ విశ్వవిద్యాలయం తిరుపతి, ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూర్‌లో చదివారు. తరువాత జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా అందుకున్నారు.
అవార్డుకు ఎంపికయ్యారిలా...
ప్రతి రెండేళ్లకు యూజీసీ అవార్డుకు నోటిఫికేషన్ వెలువరిస్తుంది. ఈ ఏడాది శ్రీనివాసంరావు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్ ఇన్ రూరల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్‌ను పంపారు. ఇలా దేశవ్యాప్తంగా వంద విశ్వవిద్యాలయాల నుంచి ఇరవై వేల పరిశోధన పత్రాలు వచ్చాయి. వాటిని పరిశీలించిన యూజీసీ నిపుణుల బృందం వంద మందికి అవార్డులిచ్చింది. దేశవ్యాప్తంగా వారిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ అవార్డు జేఎన్‌టీయూకే ఆచార్యునికి మాత్రమే దక్కడం విశేషం. పైగా భవిష్యత్తులో పరిశోధనలు చేసేందుకు రూ.28లక్షలు నిధులు కూడా యూజీసీ ఈయనకు మంజూరు చేసింది. ప్రస్తుతం తన ఉన్నతికి నా తల్లిదండ్రులు శింగయ్య, సుబ్బులమ్మ, నా భార్య విజయలక్ష్మీల సహకారం మరువలేనిదని డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు చెప్తున్నారు. సమాజానికి మేలు చేసే పరిశోధనలు చేయడమే తన ముందున్న లక్ష్యమని ఈయన చెప్పారు.
నిధులతో ఏం చేస్తారంటే...
సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు మన రాష్ట్రంలో ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయో సర్వే చేస్తారు. ఉదహరణకు అనంతపురం జిల్లాలో పవన విద్యుత్తు ఉత్పత్తి బాగుంటుంది. దీనివలన ఇక్కడ విండ్ టర్బైన్లు ఏర్పాటు చేసి జనరేషన్ సిస్టమ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి బాగా చేయవచ్చు. మన జిల్లా తీరప్రాంతంలో గ్యాస్ సహజ వాయువు ఉత్పత్తి సమృద్ధిగా ఉంది. దీన్ని ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తిని ఎలా అధికం చేయొచ్చో వంటి అంశాలపై పరిశోధనలు చేస్తారు. దాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీకు పంపుతారు. అనంతరం యూజీసీ పోస్టు డాక్టరల్ ఫెలోషిప్ అవార్డును ప్రదానం చేస్తుంది.
ఏడు పర్యాయాలుగా...
జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల స్థాయిలో స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్‌పై 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011 సంవత్సరాల్లో వరుసగా ఏడు పర్యాయాలు శ్రీనివాసరావు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు ఈయనవి 17 పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వాటిలో నాలుగు ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈ పవర్‌సిస్టమ్స్‌లో వచ్చాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning