భావాల్ని పలికించండిలా !

వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలంటే ఏం చేయాలి?. ''అర్హత, నైపుణ్యాలతో కూడిన రెజ్యూమెను రిక్రూటర్లు ఆకట్టుకొనేలా రూపొందించాలి. మౌఖికపరీక్షకు వెళ్లడానికి కొన్ని మార్గదర్శకాలు (సమయానికి ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లడం, హుందాగా దుస్తులు ధరించడం, రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలకు సంయమనంతో సమాధానాలు చెప్పడం వంటివి) పాటించాలి'' అని అభ్యర్థులు భావిస్తుంటారు. అయితే ఇవన్నీ పాటిస్తే ఉద్యోగం వచ్చేస్తుందా?... పలు రకాలుగా వడపోసిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది భావవ్యక్తీకరణ నైపుణ్యం. ఈ నైపుణ్యం ఉంటే అభ్యర్థి ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలడని నిపుణులు చెబుతున్నారు.
మౌఖిక పరీక్ష ఒక్కటే కాదు రిక్రూటర్లు ఒక్కోసారి ఫోను లేదా ఈ-మెయిల్‌ ద్వారానూ అభ్యర్థులను పరిశీలిస్తుంటారు. ఈ సమయంలో అభ్యర్థి భావవ్యక్తీకరణ విషయంలో జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఫోను ఇంటర్వ్యూ కి సిద్ధంగా ఉండండి:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలా సంస్థలు ఫోను ఇంటర్వ్యూకి ఆసక్తి చూపుతున్నాయి. అభ్యర్థులు కూడా దీనికి సంసిద్ధంగానే ఉంటున్నారు. రెజ్యూమెల పరిశీలన అనంతరం నేరుగా అభ్యర్థులకు ఫోను చేసి వారి వివరాలు క్షుణ్నంగా తెలుసుకోవడంతోపాటు ఆసక్తి, అభిరుచులు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఫోను ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు అసహనం, చికాకు ప్రదర్శించకూడదు. ''ఈ సమయంలో మీతో మాట్లాడొచ్చా'' రిక్రూటర్లు తొలుత అడిగే ప్రశ్న ఇది. అభ్యర్థికి అది అనుకూల సమయమని చెబితేనే వారు ఇంటర్వ్యూ కొనసాగిస్తారు. కుదరని పక్షంలో సమస్యను సమగ్రంగా వివరించి మరోసారి అందుబాటులో ఉంటానని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఇంకో అవకాశం లభిస్తుంది. అప్పుడు మాత్రం దాన్ని కోల్పోవద్దు. అంతేకానీ ఎదురు ప్రశ్నలు వేసి వారి వివరాలు తెలుసుకొని అప్పుడు ఇంటర్వ్యూకి సన్నద్ధమని చెబితే మధ్యలోనే సంభాషణ ముగిసిపోవచ్చు. ఫోను ఇంటర్వ్యూ పూర్తయి రిక్రూటర్లను ముఖాముఖి కలుసుకొనే వరకూ ఫోన్‌ను వాయిస్‌ మెసేజ్‌లో ఉంచడం, సరదా కాలర్‌ ట్యూన్లు వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌లోనే కదా అని ఇంటర్వ్యూ సమయంలో ఏదో ఒకటి తింటూ మాట్లాడకూడదు. సుదీర్ఘ సంభాషణలు వద్దు. గతంలో ఏదైనా సంస్థలో పనిచేసి ఉంటే అక్కడి వారి గురించి చెడుగా మాట్లాడొద్దు.
ప్రొఫెషనల్‌గా ఉండాలి:
ఈ-మెయిల్‌ చిరునామా కూడా ప్రొఫెషనల్‌గా ఉండాలి. అంతేకానీ 'క్యూట్‌' 'లవ్లీ' తదితరాలతో ఈ-మెయిల్‌ చిరునామా ఉంటే ఇబ్బందికరమే. రిక్రూటర్లకు మీ ప్రొఫైల్‌ అర్థమవడానికి రెజ్యూమెతోపాటు ప్రస్తావన లేఖ జోడించడం మరవద్దు. ఎందుకంటే రిక్రూటర్లకు వచ్చే మెయిల్స్‌ అధికంగా ఉంటాయి కాబట్టి తక్కువ బైట్స్‌తో ఉండే మీ ప్రస్తావన లేఖ వారిని సులభంగా ఆకర్షిస్తుంది. ముఖాముఖి మాట్లాడడంలేదు కదా అని మెయిల్‌లో అక్షరదోషాలు సరిచూడడం మానొద్దు. వ్యాకరణ దోషాలు కూడా ఉండకూడదు. దోషాలు రిక్రూటర్లను ఇబ్బంది పెట్టడం ఒక్కటే కాదు.. అభ్యర్థిపై ప్రతికూలభావన ఏర్పడొచ్చు. మీరు పంపించే మెయిల్‌లో ఏదైనా వైరస్‌ ఉందేమో ముందుగానే సరి చూసుకోవాలి. రిక్రూటర్లకు, మీకు వారధి ఈ-మెయిల్‌ కాబట్టి సదరు మెయిల్‌ 'రిప్త్లె మోడ్‌'లో ఉందో లేదో కూడా చూడండి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య సంభాషణలు మరోసారి చూసుకోవడానికి కూడా వీలవుతుంది. సాధారణంగా రిక్రూటర్లు ఈ- మెయిల్‌ సమాధానం ఒక్క రోజులో ఆశిస్తారు కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ఇన్‌బాక్స్‌ చూస్తుండాలి. ఫోను లేదా ఈ-మెయిల్‌ ఇంటర్వ్యూ ఏదైనప్పటికీ చివరిగా రిక్రూటర్లకు కృతజ్ఞతలు తెలపడం మరవద్దు. ఇలా చేయడం వల్ల ప్రస్తుతానికి ఎంపిక కాకపోయినా మరోసారి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు అన్నీ ఉన్నప్పటికీ రిక్రూటర్లతో సంభాషణే కీలకమని గుర్తెరగండి. భావవ్యక్తీకరణ సరిగా లేకపోతే ఏ సంస్థ అయినా మిమ్మల్ని ఎంపిక చేయడానికి ఆసక్తి చూపదు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning