యంత్ర విద్యార్థుల సక్సెస్ మంత్ర

* కళాశాలలోనే నైపుణ్యాలపై శిక్షణ

* ఉపాధి సాధనలో జేకేసీ సహకారం

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే బహుళ జాతి కంపెనీల్లో కొలువు సాధించడం సులువే.. కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థి దశ నుంచే శిక్షణ ఇస్తే చదువు పూర్తయ్యేలోపు ఉద్యోగాలకు అనుగుణంగా తయారవుతారు. ఇందులో అటు కళాశాలల ఇటు ప్రముఖ కంపెనీలు తమ వంతు సహకారం అందించాలి. వారిని సమన్వయం చేస్తూ ఇలాంటి శిక్షణలకు జిల్లాలోని జేకేసీ (జవహర్ నాలెడ్జి కేంద్రం) రూపకల్పన చేస్తోంది. ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర లాంటి కంపెనీలు యంత్ర కళాశాలల్లో విద్యార్థులకు సక్సెస్ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాయి. తిమ్మాపూర్ మండలంలోని వివిధ యంత్ర కళాశాలల్లో జరిగిన ఈ శిక్షణల్లో విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పుతున్నారు. అవి వారికి ఎలా ఉపయోగపడుతున్నాయి. ఉపాధిలో అందుతున్న తోడ్పాటుపై 'న్యూస్‌టుడే' నిపుణులు, విద్యార్థులతో మాట్లాడింది. ఆ వివరాలివి.. - న్యూస్‌టుడే, ఎల్ఎండీ
విద్యార్థుల్లో నైపుణ్యాలే ప్రధానం: సురేష్, జవికేం జిల్లా మేనేజర్
బహుళ జాతి కంపెనీలు యువ ఇంజినీర్ల సేవలను కోరుకుంటున్నాయి. కళాశాల స్థాయిలోనే విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చి వారిని తమ కంపెనీల అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. అయితే పట్టణ స్థాయిలో కంటే గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉద్యోగాలు పొందడం సులువైన ప్రక్రియే. విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అత్యంత ముఖ్యం. అధిక శాతం ఆంగ్లంలో చాలా వెనకబడి ఉంటున్నారు. అదే విధంగా సాంకేతిక, సాఫ్ట్ నైపుణ్యాలు కూడా విద్యార్థులు కలిగి ఉండాలి. వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం వల్ల ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు.
శిక్షణ వల్లే ఉద్యోగం..
నా పేరు సౌమ్య. వాగేశ్వరి యంత్ర కళాశాలలో ఈసీఈ చివరి సంవత్సరం చదువుతున్నా. కళాశాలలో గత మూడేళ్లుగా ప్లేస్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో పలు కంపెనీలతో ప్రత్యేక శిక్షణలు ఇప్పిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇన్ఫోసిస్ సంస్థ ఇచ్చిన శిక్షణ ఉద్యోగం పొందేందుకు ఎంతగానో ఉపకరించింది. ప్రస్తుతం గిరిజా ఐటీ సొల్యూషన్స్ సంస్థలో ఉద్యోగం పొందడానికి కళాశాలలో ఇచ్చిన శిక్షణే ఎంతగానో ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు నైపుణ్యాల్లో వెనుకబడడమే ఉపాధిలేమికి ప్రధాన కారణం.
తార్కిక పరిజ్ఞానంతోనే ఉద్యోగం
నా పేరు శ్రేయ సంజన. ఈసీఈ చివరి సంవత్సరం చదువుతున్నా. మా కళాశాలలో రెండేళ్ల క్రితం ఇన్ఫోసిస్ సంస్థతో పాటు టెక్ మహీంద్ర ప్రతినిధులు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థులు కంపెనీలకు అవసరమయ్యే తార్కిక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవడంపై చెప్పిన అంశాలు ఉద్యోగం పొందేందుకు ఎంతగానో ఉపకరించాయి. ప్రాంగణ నియామకాల్లో తార్కిక ఆలోచనతో కంపెనీలో ఏర్పడిన సమస్యను ఎలా పరిష్కరించగలవని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చా. విద్యార్థిగా ఉన్న దశలోనే ఆప్తిటెక్నోసాఫ్ట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.
అవగాహనే మంత్రం
నా పేరు నిక్షిప్తరెడ్డి. ఈసీఈ చివరి సంవత్సరం చదువుతున్నా. మా కళాశాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై ఇన్ఫోసిస్ సంస్థ ఇస్తున్న శిక్షణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శిక్షణలో కమ్యునికేషన్, సాఫ్ట్ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు చెప్పిన మెలకువలు ఉద్యోగం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇటీవల సీజే సాఫ్ట్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలకు హాజరు కాగా అత్యంత ప్రధానమైన తొలి రౌండ్ రాత పరీక్షలో కమ్యునికేషన్స్, సాఫ్ట్ నైపుణ్యాలపై అధిక శాతం ప్రశ్నలడిగారు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడంతో ఉద్యోగం ఇచ్చారు. శిక్షణతోనే ఆత్మవిశ్వాసం
నా పేరు సిరికొండ శ్రావ్య. సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇటీవల తమ కళాశాలలో ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులు నిర్వహించిన ప్లేస్‌మెంట్ శిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. శిక్షణలో భాగంగా బహుళ జాతి కంపెనీలు మా నుంచి ఏం కోరుకుంటున్నాయో అర్థమయింది. ఆంగ్ల భాషపై పట్టు, సాంకేతిక, కమ్యునికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు కంపెనీల్లో ఎలా ప్రవర్తించాలనే అంశంపై కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొదటి సంవత్సరంలోనే ప్లేస్‌మెంట్‌కు సంబంధించి శిక్షణ ఇస్తే విద్యార్థి దశలోనే ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning