ఎస్సీ, ఎస్టీల ఉన్నత విద్యకు వారధి..!

* బీటెక్‌, ఫార్మసీ చదివిన పేద విద్యార్థులకు వర ప్రదాయిని 'అంబేద్కర్‌ ఓవర్సీస్‌'

* ఈ ఏడాది ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురి ఎంపిక

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న కాంక్ష ఉన్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వర ప్రదాయినిగా మారింది అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకం.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన కార్యక్రమమే అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్టడీస్‌. బీటెక్‌, ఫార్మసీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేసిన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య అంటే అందని ద్రాక్షే. రూ.లక్షల వ్యయంతో చదువంటే వూహకైనా అందదు. ఈ నేపథ్యంలో నూతన పథకం వారికి చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది ఈ పథకం కింద అర్హత సాధించిన ముగ్గురు విద్యార్థుల నేపథ్యాన్ని చూస్తే ఇది నిజమనిపించక మానదు. ప్రతిభతో తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ ముగ్గురికీ విదేశాల్లో ఉన్నత చదువులు చదివే అవకాశం వారికి దక్కనుంది. రోజూ కూలీ చేసుకొని పొట్టపోసుకొని జీవిస్తున్న కుటుంబాలకు చెందిన వీరంతా ఫీజు రీఎంబర్స్‌మెంటు పథకం ద్వారా యంత్రవిద్య పూర్తిచేశారు. ఆ ముగ్గురి నేపథ్యాన్ని చూస్తే..
ఉన్న ఎకరం పొలంతోనే..
ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన పగిడిమళ్ల పాండురాజు పదో తరగతి జిల్లా పరిషత్‌ పాఠశాలలో 87.5 శాతం మార్కులతో, ఇంటర్మీడియట్‌ ఖమ్మం ఎక్స్‌లెంట్‌ కళాశాలలో 85శాతం మార్కులతో పూర్తి చేశారు. అనంతరం బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ 2013లో పూర్తి చేశారు. పాండురాజు తల్లిదండ్రులకు ఎకరం పొలం ఉంది. రోజు కూలీకి వెళ్తూ పాండురాజుతోపాటు, ఇద్దరమ్మాయిలను ఉన్నత చదువులు చదివించారు. జీఆర్‌ఈ పరీక్షల్లో పాండురాజు ఉత్తీర్ణత సాధిస్తే తమ కుమారుడు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే అవకాశం ఉందన్న విషయం వారిలో సంతోషాన్ని నింపుతోంది.
తల్లి శ్రమకు తగ్గ ఫలం..
కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన మోటపోతు నాగరాజుకు బాల్యంలో తండ్రి మృతి చెందాడు. తల్లి రాములమ్మ కూలీనాలి చేసి నాగరాజును చదివించింది. ఖమ్మం నగరంలోని రిక్కాబజార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఎస్సెస్సీలో 64 శాతం, ఇంటర్మీడియట్‌ను తల్లాడ క్రీస్తుజ్యోతి కళాశాలలో 70శాతం మార్కులతో పూర్తిచేశాడు. బీటెక్‌ ఈఈఈని నగరంలో 66.5 శాతం మార్కులతో పూర్తిచేశాడు. ప్రస్తుతం ప్రవేశ పరీక్ష నెగ్గే పనిలో ఉన్నాడు.
బాల్యంతో తండ్రిని కోల్పోయి..
ఖమ్మం నగరానికి చెందిన సూరపల్లి ప్రసన్నకుమార్‌ తండ్రి బాల్యంలో మృతి చెందాడు. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు అబ్బాయిలను చదివించేందుకు తల్లి నాగరత్నం ఎంతో శ్రమించింది. తల్లి శ్రమను వృథా చేయకుండా ప్రసన్నకుమార్‌ నగరంలోని నిర్మల్‌ హృదయ్‌ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 89.5 శాతం మార్కులతో, ఇంటర్మీడియట్‌ నగరంలోని శాంతి జూనియర్‌ కళాశాలలో 82.5 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. 2012లో ఖమ్మంలో 67.5 మార్కులతో బీటెక్‌ పూర్తి చేశాడు.
పరీక్ష ఫీజు ఆర్థిక భారమే...
ఇదే సమయంలో జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలు రాసేందుకు ఈ విద్యార్థులు రూ.22 వేల వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. వీటిని విద్యార్థులే చెల్లించుకోవాలని, అనంతరం వాటిని రీఎంబర్స్‌ చేస్తామని అధికారులు చెప్పారు. వీరికి వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ఈ పరీక్షలు రాయడం కొంత ఇబ్బందిగా మారింది. ఈ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తే ఇబ్బందులు తలెత్తవు.
ఎవరు దీనికి అర్హులు?
ప్రతిభ గల ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు అందించాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకమే అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్టడీస్‌. గత ఏడాది ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎంపికైన వారికి రూ.15లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసిన(బీటెక్‌, ఫార్మసీ తదితర) వారు మాత్రమే దీనికి అర్హులు. బ్యాచ్‌లర్‌ డిగ్రీ పూర్తిచేసిన వారు ఈపాస్‌లో ఆన్‌లైన్‌ విధానంలో తమ వివరాలను ముందు రిజిష్టర్‌ చేసుకోవాలి. ఎప్పుడైనా రిజిష్టర్‌ చేసుకోవచ్చు. అనంతరం రాష్ట్ర వ్యాపితంగా మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపికచేస్తారు. వీరికి జీఆర్‌ఈ కోచింగ్‌ ఇస్తారు. ఈ వ్యయాన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయితే వీరికి విదేశీ విద్యకు కావాల్సిన రుణాన్ని అందిస్తారు. ఒక్కో విద్యార్థికి అందించే రూ.15 లక్షల్లో రూ.10 లక్షల రాయితీ లభిస్తుంది. మిగిలిన రూ.5 లక్షలను రుణంగా అందిస్తుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning