ద్వితీయ శ్రేణి నగరాల్లో... ఐటీ..

* కరీంనగర్‌లో ఇంక్యుబేషన్ కేంద్రం

* 16న కార్యాలయానికి శంకుస్థాపన

* జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు

కరీంనగర్, ఈనాడు: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార సాంకేతిక ఆధారిత పెట్టుబడి ప్రాంతంగా (ఐటీఐఆర్) గుర్తించాయి. ఇదే క్రమంలో జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఆ శాఖ చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రం కరీంనగర్‌లో ఇంక్యుబేషన్ కేంద్రం (ఐటీ పరిశ్రమలకు సంబంధించి అన్ని సౌకర్యాలు గల కేంద్రం) ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌కు చెందిన పది ఎకరాలలో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. సిరిసిల్ల బైపాస్ నుంచి మార్క్‌ఫెడ్ స్థలానికి రహదారిని ఏర్పాటు చేసి అక్కడ సకల వసతులతో కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజను ఈ నెల 16న చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.
ఇంక్యుబేషన్ కేంద్రం అంటే...
ఇప్పటి వరకు ఐటీ, దాని సంబంధిత కంపెనీలు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. ద్వితీయ శ్రేణి నగరాలు, పెద్ద పట్టణాల్లో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉన్న వారు.. ఐటీ కంపెనీల్లో పని చేయగలిగే నైపుణ్యం కల్గిన యువత ఉన్నా ఆ సంస్థలు స్థాపించడానికి అవసరమైన వసతులు వీటిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ ఆధారిత సంస్థలు తమ కార్యాలయాలు స్థాపించేలా వసతులు కల్పించడానికి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్మించేవే ఇంక్యుబేషన్ కేంద్రాలు. ఈ కేంద్రంలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ఇంటర్నెట్, ఏసీ గదులు, ఐటీ సంబంధిత విద్యార్థులకు శిక్షణ, ఐటీ సంబంధిత పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహికులకు మార్గదర్శకత్వం, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తారు.
ఉపాధి అవకాశాలు మెరుగు..
జిల్లాలో 16 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఏటా సుమారు ఆరు వేల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూర్ బాట పడుతున్నారు. ఇక్కడ ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటు అయితే వారికి ముందునుంచే మార్గదర్శకత్వం లభిస్తుంది. అలాగే ఇక్కడ స్థాపించే ఐటీ సంస్థలు ప్రాంగణ నియామకాల ద్వారా కొందరిని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు... దాని అనుబంధంగా ఏర్పడే ఇతర వ్యాపాకాలతో వందలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.
సందేహాలు ఎక్కువే....
కరీంనగర్‌లో ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుపై వివిధ వర్గాల నుంచి సంతోషం వ్యక్తమవుతున్నా... దీనికి ఎంత మొత్తం కేటాయిస్తున్నారు.... దీని పూర్తి రూపం ఎలా ఉంటుంది... ఎన్నికలకు ముందు హడావుడిగా చేసే ప్రారంభం అమల్లోకి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ ప్రభుత్వం ఏర్పడినా ఐటీని విస్మరించే పరిస్థితి లేకపోవడంతో ఈ కేంద్రం ఏర్పాటుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning