కొలువులు కొట్టేశారు..!

* డిగ్రీ చేస్తుండగానే ఉద్యోగాలు

* జమ్మికుంట ప్రభుత్వ కళాశాల జేకేసీ ద్వారా ఇప్పటి వరకు 150 మందికి ఉపాధి

కరీంనగర్ (జమ్మికుంట) న్యూస్‌టుడే: ఉద్యోగం... యువతరానికి ఇదో సవాల్‌. అన్ని రంగాల్లో పెరుగుతున్న పోటీతో 'కొలువు' కలగా మారుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క ఉద్యోగానికి పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారు. చదువు పూర్తయితే చాలు.. నిత్యం ఉద్యోగ వేటలో మునిగిపోతున్నారు. కానీ.. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగిస్తూనే కొలువు సాధించారు. కరీంనగర్‌లో ఇటీవల నిర్వహించిన 'జాబ్‌మేళా'లో ప్రతిభను ప్రదర్శించిన కుర్రాళ్లు నాలుగు అంకెల వేతనాన్ని పొందే ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. కార్పోరేట్‌ సంస్థలో కొలువుదీరిన విద్యార్థులు సంపాదించుకుంటూనే తాము ఏర్పర్చుకున్న లక్ష్యాన్ని చేధిస్తామని చెబుతున్నారు. విద్యను అందించిన కళాశాలకు, ప్రోత్సాహం ఇచ్చిన తల్లిదండ్రులకు, ముందుకు నడిపించిన గురువులకు కీర్తి తెచ్చిపెడతామని పేర్కొంటున్నారు. జమ్మికుంట డిగ్రీ కళాశాల జేకేసీ ద్వారా ఇప్పటి వరకు 150 మంది ఉద్యోగాలు సాధించటం విశేషం.

డిగ్రీ చదువుతోనే కొలువు
మారెపల్లి ప్రశాంత్‌కుమార్‌ది జమ్మికుంట మండలం ఇల్లందకుంట. తల్లిదండ్రులు మణెమ్మ, సంపత్‌. వ్యవసాయ కూలీలు. ప్రభుత్వ పాఠశాలలో ఎస్సెస్సీ పూర్తిచేసి చేసి జమ్మికుంటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ సీఈసీ చదివాడు. బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న ప్రశాంత్‌ను యురేకా ఫోర్బ్స్‌లో 'సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌' ఉద్యోగం వరించింది. ఎంకాం చదవడం లక్ష్యమని వెల్లడించాడు.
బ్యాంకు ఉద్యోగమే ధ్యేయం
జమ్మికుంట మండలం ఇల్లందకుంటకు చెందిన మారెపల్లి రాజు బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు సరోజన, సారయ్య. వ్యవసాయ కుటుంబం. గ్రామంలోని సర్కారు పాఠశాలలో పదోతరగతి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. జమ్మికుంటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ సీఈసీ పూర్తిచేసి 740 మార్కులు సాధించాడు. జాబ్‌మేళాలో ఇతనికి ఎస్‌బీఐ జీవిత బీమాలో ఉద్యోగం వచ్చింది. బ్యాంకు ఉద్యోగి సాధించటమే లక్ష్యమంటున్నాడు.
అదృష్టం కలిసొచ్చిన జితేందర్‌
మొట్లపల్లికి చెందిన వడ్డెపల్లి జితేందర్‌ అక్కడే సర్కారు బడితో పదో తరగతి చదివాడు. జమ్మికుంటలో ఇంటర్‌ ఎంపీసీ పూర్తిచేసి తర్వాతడిగ్రీ ఎంపీసీఎస్‌లో చేరిన జితేందర్‌ ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నాడు. జాబ్‌మేళాలో అతను యురేకా ఫోర్బ్స్‌లో 'సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌'గా ఎంపికయ్యాడు. ఉద్యోగం చేస్తూనే ఎంసీఏ చేస్తానంటున్నాడు. జితేందర్‌ తల్లిదండ్రులు నర్మద, సారయ్య...వారిది వ్యవసాయ కుటుంబం.
సర్కార్‌ విద్యాలయాల్లో చదివి సత్తా
ఓదెల మండలం గూడెం వాసియైన ఎండీ అమీదా బేగం బీఎస్సీ ఎంపీసీ చివరి సంవత్సరం చేస్తోంది. తల్లిదండ్రులు రంజాన్‌బీ, జలీల్‌. వ్యవసాయమే కుటుంబానికి జీవనాధారం. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అమీదా ఎస్సెస్సీలో చదివింది. జమ్మికుంటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీలో చేరి ఓ మాదిరిగా మార్కులు సంపాదించింది. ప్రస్తుతం ఎలికో కంపెనీ ఉద్యోగానికి ఎంపికైంది.
నేత కుటుంబం నుంచి వచ్చి...
ఆరగొండ శ్రీలతది వీణవంక మండలం కిష్టంపేట. తల్లిదండ్రులు మణెమ్మ, లక్ష్మయ్య. చేనేత కార్మికులు. గ్రామంలో సర్కారు పాఠశాలలో చదువుకుంది. పదోతరగతిలో 440 మార్కులు సాధించగా వీణవంక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ పూర్తిచేసి మంచి మార్కులు తెచ్చుకుంది. బీఎస్సీ ఎంపీసీ తృతీయ సంవత్సరం అభ్యసిస్తున్న ఆమెకు జాబా మేళాలో ఉద్యోగం వచ్చింది.
కూలీ కూతురుకు బీమా కంపెనీలో అవకాశం
ఈదునూని అనూషది వీణవంక మండలం చల్లూరు. తల్లిదండ్రులు వెంకటమ్మ, లక్ష్మయ్య. కూలీయే జీవనాధారం. సొంతూర్లో ఎస్సెస్సీ చదివిన అనూష 457 మార్కులు, జమ్మికుంట ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ సీఈసీ పూర్తిచేసి 630 మార్కులు రాబట్టుకుంది. బీకాం (జనరల్‌) చివరి సంవత్సరం చేస్తున్న ఆమె ఎస్‌బీఐ జీవిత బీమాలో ఉద్యోగం సంపాదించింది. బీఈడీ చేసి ప్రభుత్వ ఉద్యోగి కావాలనేదే లక్ష్యమని పేర్కొంది.
లెక్చరర్‌ అయ్యేందుకు ప్రయత్నం
భీంపల్లి వాసియైన కొరండ్ల శ్రీవిద్య బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రథమ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు అరుణ, సుధాకర్‌రెడ్డి. వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌ సీఈసీలో చేరి 747 మార్కులు సాధించింది. శ్రీవిద్యకు ఎలికో కంపెనీలో ఉద్యోగం వచ్చింది. లెక్చరర్‌ అవుతాననే అశాభావాన్ని వ్యక్తం చేసింది.
ఉద్యోగం వచ్చినా ఎంఎస్‌సీ వైపు చూపు
బీఎస్సీ ఎంపీసీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న బాసాని రాజుది జమ్మికుంట మండలం నాగారం. తల్లిదండ్రులు శారద, సదయ్య. వ్యవసాయ కుటుంబం. వావిలాలలోని ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి, జమ్మికుంటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ చదివాడు. జాబ్‌మేళాలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఎమ్మెస్సీ చేసి సర్కారు ఉద్యోగం సాధిస్తానని చెప్పాడు.
రెడ్డీ ల్యాబ్స్‌ లో కొలువు
కోరపల్లికి చెందిన గుండారపు మహేశ్వరాచారి డిగ్రీ ఎంపీసీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు తిరుపతమ్మ, సదానందచారి. వడ్రంగి కార్మికుడు. కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతనికి ఎస్సెస్సీలో 433 మార్కులొచ్చాయి. జమ్మికుంటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ చదవగా మార్కులు ఓ మాదిరిగా వచ్చాయి. రెడ్డీ ల్యాబ్స్‌లో కొలువు సంపాదించాడు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి..
జమ్మికుంట వాసి బామన్లపల్లి లావణ్య ఎంపీసీఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు సుగుణ, శంకర్‌. వ్యవసాయ కుటుంబం. స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి, ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ పూర్తిచేసి ఓ మాదిరిగా మార్కులు తెచ్చుకుంది. లావణ్య ఎస్‌బీఐ జీవిత బీమా సంస్థకు ఎంపికైంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning