కలిసి చదువుదాం.. లక్ష్యం సాధిద్దాం

* బట్టీ చదువులకు యువత స్వస్తి

అనంతపురం (కదిరి, ధర్మవరం పట్టణం ): పరీక్షలు దగ్గరపడుతున్నాయ్‌. విద్యార్థుల్లో ఒకటే ఉత్కంఠ. ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు. ఉద్యమం కారణంగా చాలా రోజులు విద్యా సంస్థలు తెరుచుకోలేదు. దీంతో ఈసారి విద్యార్థులు నూతన పంథాను ఎంచుకుంటున్నారు. పది నుంచి పీజీ వరకు ఎక్కువమంది ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు. కలిసి చదువుకుంటూ ఒకరికి తెలియని విషయాలను మరొకరి నుంచి నేర్చుకుంటున్నారు. తుది పరీక్షల్లో నెగ్గేందుకు కసరత్తు చేస్తున్నారు. అయిదు నుంచి 10 మంది వరకు ఒకచోట గ్రూపుగా కూర్చొని ఒక సబ్జెక్టులోని పాఠాన్ని ముందుంచుతారు. మొదట ఎవరికి తెలిసిన అంశాలను వారు చెబుతారు. వాటిని ఇతరులకు రాకుంటే.. అర్థమయ్యేలా వివరిస్తారు. ఇలా ఒకరికి తెలిసినవి మరొకరు తెలుసుకుంటున్నారు. ఈ విధంగా చదవడం వల్ల మెదడులో గుర్తుండిపోతాయి. అనుమానాలు నివృత్తి చేసుకోగలుగుతున్నామని చెబుతున్నారు. పరీక్షల సమయంలో కలిసికట్టుగా చదవడం ఎంతో ఉపయుక్తంగా ఉందంటున్నారు.
విద్యాశాఖదీ ఇదే దారి
జిల్లా విద్యాశాఖ అధికారుల కూడా ఈ ఏడాది దీన్నే అనుసరిస్తున్నారు. ఈసారి ప్రత్యేక ప్రణాళికతో పదోతరగతి విద్యార్థులను బృంద విద్యకు ప్రోత్సహిస్తున్నారు. ఓ విద్యార్థిని నాయకుడిగా ఎంపిక చేసి సమీప ప్రాంత విద్యార్థులంతా ఒకచోట చదివిస్తున్నారు. ఇందుకు అధికారులు 65 రోజుల కార్యక్రమంగా అమలు చేస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల వరకు అభ్యసనం సాగేలా చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు ఉపాధ్యాయులు పల్లెనిద్ర పేరుతో రాత్రి సమయంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పర్యవేక్షిస్తున్నారు.పాఠాలు సరిగా అర్థం కాని వారకీ ఇలా చదవడం వల్ల సులువుగా అర్థమవుతుంది. పాఠ్యాంశాల సమాచారాన్ని లోతుగా గ్రహించే వీలవుతుంది. తోటి విద్యార్థులెలా చదువుతున్నారో పరిశీలించడం ద్వారా లోపాలను సవరించుకోవచ్చు. నైపుణ్యాలను పెంచుకోవచ్చు. దీంతో క్లిష్టమైన అంశాలపై ఆసక్తి పెరుగుతుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
* సభ్యుల సంఖ్య 4-6కు మించకపోతే మంచిది. ఇంతకంటే తక్కువైతే నిరాసక్తంగా ఉంటుంది. ఎక్కువైతే విషయం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది.
* సమాచారం ఇచ్చి పుచ్చుకోవటం ప్రధానం. తెలిసిన సమాచారాన్ని ఇతర సభ్యులకూ తెలియజేయాలి. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో ఇతర అంశాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
* అంశాలు అందరి ఆమోదంతో ఎంపిక చేసి చర్చించాలి. ఏ అంశమైనా గంట నుంచి 2 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. చర్చించిన విషయానికి సంబంధించి పుస్తకాలు సిద్ధంగా ఉంచుకోవాలి. చివరగా 5 నుంచి 10 నిమిషాలు ఏమి చర్చించారో పునశ్చరణ చేసుకోవాలి.
కొత్త విషయాలను తెలుసుకోవచ్చు
కలిసి చదువుకోవడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. తోటి స్నేహితులకు తెలిసిన వాటిని మనమూ సులభంగా నేర్చుకోవచ్చు. పరీక్షల సమయంలో చాలా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వీటిని నిరంతరం కొనసాగిస్తే పరీక్షల్లో తేలికగా గట్టెక్కవచ్చు.
- సౌందర్య, సీనియర్‌ ఎంపీసీ
అధ్యాపకుల సహకారమూ అవసరమే
ప్రస్తుతం పరీక్షలు సమీపించే సరికి ఉమ్మడి చదువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనివల్ల అనేక సందేహాలు తీరుతున్నాయి. అధ్యాపకులు సైతం పర్యవేక్షిస్తూ సహకారం అందిస్తున్నారు. ఒంటరిగా చదివి పరీక్షలు రాస్తే వచ్చే మార్కుల కన్నా ఉమ్మడిగా చదివితే బాగా గుర్తుంటాయి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడుతుంది.
- మహబూబ్‌బాషా, సీనియర్‌ ఇంటర్‌
అధిక మార్కులు సాధించవచ్చు
విద్యార్థులు బృందాలుగా కూర్చుని ఆయా సబ్జెక్టుల వారీగా చర్చిస్తే.. ఒకరికి ఉన్న సందేహాలు మరొకరు తీర్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారికి పరీక్షల సమయంలో ఆ ప్రశ్న వస్తే సమాధానాన్ని వెంటనే గుర్తించగలరు. పాఠ్యాంశాన్ని సైతం గ్రూపులో చర్చించుకోవడం వల్ల మరోసారి చదవాల్సిన అవసరముండదు.
- కృష్ణయ్య, అధ్యాపకుడు, ఆర్ట్స్‌ కళాశాల, ధర్మవరం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning