ఆంగ్లం గలగల

* భాషపై పట్టు.. భవితకు మెట్టు

* రాణింపునకు ఇంగ్లిష్ ల్యాబ్‌లు

* కళాశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు

పటాన్‌చెరు(హైదరాబాద్), న్యూస్‌టుడే: ప్రపంచం కుగ్రామంగా మారిన నేపథ్యంలో ఆంగ్ల భాషకున్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. భాషపై పట్టు ఉంటేనే ఉద్యోగ విధుల్లో రాణించకలిగేది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఆంగ్లంపై పట్టు లేకపోవడంతో ఉద్యోగ నియామకాల సమయాల్లో అవకాశాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 5.5 లక్షల మంది ఇంజినీర్లు తయారవుతున్నారు. వారిలో 10-25 శాతం మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయని ఓ జాతీయస్థాయి సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో నిపుణులతో తర్ఫీదు ఇప్పిస్తున్నాయి. ఇవి విద్యార్థులు వివిధ రూపాల్లో భాషపై పట్టుపెంచుకోవడానికి ఉపయోగపడుతున్న తీరుపై 'న్యూస్‌టుడే' కథనం.
ఇంజినీరింగ్ కళాశాలల్లో పోటీ తత్వాన్ని తట్టుకోవడానికి యాజమాన్యాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేటట్టు తర్ఫీదు ఇప్పిస్తున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో చెప్పింది వినడం, మాట్లాడటం, రాయడం, చదవడం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. వారానికి నాలుగు గంటలపాటు ఇందుకు కేటాయిస్తున్నారు. ఆంగ్ల భాష నేర్చుకోవడానికి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఆన్‌లైన్ విధానంలోనూ అవగాహన కలిగిస్తున్నారు. మాట్లాడే సమయంలో పూర్తిగా ఆంగ్లాన్నే వినియోగించిడం ద్వారా భాషపై పట్టుపెంచుతున్నారు.
వినడం...
* ఇద్దరి మధ్య ఆంగ్లంలో జరిగే సంభాషణను ఆడియో ద్వారా వినిపిస్తారు. దీనికి అనుబంధంగా ప్రశ్నలు ఇస్తారు.
*ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో ఒక ఆంగ్ల పదాన్ని ఉచ్ఛరించడం
* ఒక అంశంపై ఇద్దరు వ్యక్తులు ఆంగ్లంలో మాట్లాడుకుంటున్న దాన్ని విశ్లేషణ చేసి అనుబంధంగా ప్రశ్నలు ఇస్తారు.
మాట్లాడటం..
* తరగతిలో బోధించిన పాఠాన్ని అంశంగా తీసుకుని బృంద చర్చ పెడతారు.
* జస్ట్ ఏ మినిట్ అనే విభాగంలో అధ్యాపకులు ఇచ్చిన ఓ అంశాన్ని ఒక నిమిషం పాటు అనర్గళంగా మాట్లాడాలి. దానిపై అధ్యాపకులు పలు రకాలుగా సూచనలు ఇస్తున్నారు.
*ఉచ్ఛారణలోనూ శిక్షణ ఇస్తున్నారు.
రాయడం..
* ఆంగ్లంలో వ్యాసాలు, ఉత్తరాలు, నివేదికలు రాసే విధానాలపై అవగాహన కలిగిస్తున్నారు.
* ఈ మెయిల్ రాసే విధానంపై ప్రత్యక్షంగా అవగాహన.
* మంచి, చెడు వార్తలను ఎదుటి వ్యక్తికి ఒప్పించి చెప్పే రీతిలో ఎలా వ్యవహరించాలి.. అనే దానిపై రాయమంటున్నారు.
* ఒక పెద్ద అంశాన్ని కుదించి అర్థం చెడకుండా చిన్నదిగా రాసే విధానంపై మెలకువలు.
చదవడం..
* బిజినెస్, కమ్యూనికేషన్ విభాగాల్లో ఉండే పుస్తకాలు నిత్యం చదువుతుండాలి.
* విద్యార్థులను బృందాలుగా విడదీసి రోజువారీ పాఠ్యాంశాలను పూర్తిస్థాయిలో చదవమంటున్నారు.
* చదివిన ప్రతి పుస్తకంలోని అంశాలపై ప్రశ్నలు వేసి ఆంగ్లంపై పట్టు సాధించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతిభ అంచనా..
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు జరుగుతుంటాయి. వీటిల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల వారు ఆంగ్లంపై పట్టులేని విద్యార్థులను ప్రారంభం దశల్లోనే తిరస్కరిస్తున్నారు. ఇలా ప్రతి వంద మందిలో 80 మంది తిరస్కరణకు గురవుతున్నట్లు సమాచారం. ఆయా సంస్థలు తాము నిర్వహించే రాత పరీక్షల్లోనే విద్యార్థి ప్రతిభను అంచనా వేస్తున్నాయి. దానిలో ప్రశ్నలు సాంకేతికంగా ఉంటున్నాయి. అలానే ఇంటర్వ్యూల సమయంలో కూడా అడిగిన ప్రశ్నలకు ఆంగ్లంలో ధాటిగా జవాబులు చెప్పలేకపోతున్నారని గుర్తించారు. ఈ మెయిల్ సైతం రాయలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో సమాచారం ఉండడం లేదు. అడిగిన ప్రశ్నను అర్థం చేసుకోలేకపోతున్నారు. వాస్తవానికి ప్రశ్నను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా జవాబు చెప్పాల్సి ఉంటుంది.
25 శాతం మంది మాత్రమే..
పారిశ్రామిక ట్రేడ్ అసోసియేషన్‌కు చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్‌కామ్) సంస్థ దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉద్యోగులపై అధ్యయనం చేసింది. ఏటా 5.5 లక్షల మంది ఇంజినీర్లు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 10-25 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉంటున్నాయని తేల్చింది. ఐటీ ఆధారిత రంగాల్లో 25 శాతం, ఇంజినీరింగ్ రంగాల్లో 4.22 శాతం, ఉత్పాదక రంగంలో 17 శాతం మంది విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అర్హత ఉంటోందని నాస్‌కామ్ ఆ నివేదికలో పేర్కొంది. దీనికి ఆంగ్లం రాకపోవడం, నైపుణ్యాలు లోపించడం, ధారాళంగా మాట్లాడలేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చింది.
ఒక్కరాత్రిలో వచ్చేది కాదు..
- చంద్రశేఖర్, ఆంగ్లభాష నిపుణుడు
ప్రాథమికస్థాయి విద్య నుంచే మార్పులు రావాలి. ప్రైవేటు పాఠశాలల్లో బట్టీ విధానం అమలవుతోంది. అయిదో తరగతి నుంచి ఆంగ్ల భాషపై విద్యార్థుల్లో పట్టు పెంచాలి. అనంతరం ఇంటర్‌లోకి వచ్చిన తరవాత సిలబస్ పూర్తవ్వాలి అనే భావనలో కళాశాలల్లో హడావుడిగా పాఠాలు పూర్తి చేస్తున్నారు. డిగ్రీలోకి వచ్చిన తరువాత చివరి దశలో లోపాలు గుర్తించి ఆంగ్లం నేర్చుకుందామనుకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. భాష ఒక్క రాత్రిలో వచ్చేది కాదు. అందుకే చాలా మంది విద్యార్థులు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికే ప్రత్యేక శిక్షణకు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning