వర్ధమాన విపణుల్లో కొత్త సంస్థల విస్తరణ!

 • * క్లౌడ్‌, బిగ్‌డేటా, విద్యా రంగం కీలకం
  * మొబిలిటీ, సామాజిక సైట్లకూ
    ప్రాధాన్యం

       క్కువ పెట్టుబడితో ప్రారంభిస్తున్న కొత్త ఐటీ సంస్థలు దేశీయంగా, ఇతర వర్థమాన దేశాల్లోనూ సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సంస్థలకు ఐటీ ఖర్చులు తగ్గించే క్లౌడ్‌, వ్యాపార నిర్ణయాలకు కీలకంగా మారుతున్న బిగ్‌డేటాతో పాటు చెల్లింపు సేవలకు అవసరమైన ఉత్పత్తులు, విద్యా రంగంలో వినియోగించే సొల్యూషన్లు.. అన్ని రంగాలకు అనువైన మొబైల్‌ అప్లికేషన్లపై ఈ సంస్థలు దృష్టి కేంద్రీకరించాయి. వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ సంస్థలు కూడా ఇలాంటి సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

       సమాచార సాంకేతిక సేవలకు పేరొందిన దేశీయ ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉత్పత్తులపైనా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. దేశం నుంచి ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలకు జరుగుతున్న ఐటీ సేవలు/ ఉత్పత్తుల ఎగుమతుల్లో దిగ్గజ ఐటీ సంస్థల వాటాయే అధికం. అధిక మానవ వనరులు, ఎక్కువ పెట్టుబడి అవసరం అయ్యే పెద్ద ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను అగ్రశ్రేణి ఐటీ సంస్థలకే అప్పగిస్తుంటారు. అధిక ఆదాయం, లాభార్జనకు ఈ సంస్థలతో పాటు కొత్త ఐటీ సంస్థలు నూతన సాంకేతికత, ఐటీ ఉత్పత్తుల రూపకల్పనపై చూపు సారిస్తున్నాయి. దిగ్గజ సంస్థలు సంప్రదాయ విపణుల్లో కొనసాగుతుంటే, కొత్త సంస్థలు వర్థమాన దేశాలపై దృష్టి సారిస్తున్నాయి. దేశీయ ఐటీ ఉత్పత్తులపై ప్రస్తుతం 2.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.13,000 కోట్లు) వ్యాపారం జరుగుతోందని, 2020 నాటికి ఈ విభాగం 10 బిలియన్‌ డాలర్ల (రూ.62,000 కోట్లు) స్థాయికి చేరుతుందని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) పేర్కొంది. క్లౌడ్‌, మొబిలిటీ, సామాజిక సైట్లు, అనలిటిక్స్‌ విభాగాలు ఇందుకు దోహదం చేయనున్నాయి.

  తక్కువ ఖర్చు కోసమే ఎస్‌ఏఎస్‌

       ఐటీ రంగంలో సగటున ప్రతి అయిదేళ్లకు సరికొత్త సాంకేతికత దూసుకొస్తోంది. విభిన్న రంగాల సేవల తీరునే మార్చేసే విధంగా వినూత్న సాంకేతికత ఆవిష్కరిస్తున్నందున, శాశ్వత లైసెన్సు పద్ధతిలో అధిక మొత్తం చెల్లించ‌డానికి ఖాతాదారులు వెనుకాడుతున్నారు.

  అందువల్లే ఆయా ఐటీ సంస్థల నుంచి సాఫ్ట్‌వేర్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ -ఎస్‌ఏఎస్‌) సేవలను తక్కువ ఖర్చులో పొందేందుకు సుముఖత చూపుతున్నారు. చిన్న-మధ్యస్థాయి (ఎస్‌ఎంఈ) సంస్థలు కూడా మార్కెటింగ్‌, ఆర్డర్లు పొందేందుకు ఐటీ సేవలను క్లౌడ్‌ పద్ధతిలో వినియోగించుకోవడం పెరుగుతోంది. వర్థమాన దేశాలన్నిటిలోనూ నెట్‌ వినియోగం పర్సనల్‌ కంప్యూటర్లు/ ల్యాప్‌టాప్‌ల కంటే స్మార్ట్‌ఫోన్లపైనే అధికంగా జరగడం, వినియోగానికి రుసుం వసూలు చేయని అప్లికేషన్లు రూపొందుతున్నాయి. ఉచిత అప్లికేషన్లకు తాము తక్కువ ఖర్చుతో అందించే నాణ్యమైన సేవలకు తేడా చూపాల్సిన బాధ్యత సంస్థలకు కలుగుతోంది. ఎస్‌ఎంఈల్లో ఐటీ వినియోగానికి వెచ్చించే మొత్తాలు తక్కువ కావడంతో, అగ్రశ్రేణి సంస్థలకు ఆకర్షణీయంగా ఉండవు. ఇక్కడే కొత్త సంస్థలు చొరవ చూపుతున్నాయి. బెంగళూరు, ఎన్‌సీఆర్‌ (ఢిల్లీ), పుణె, హైదరాబాద్ లాంటి నగరాల్లో కొత్త ఐటీ సంస్థలుఏర్పాటవుతున్నాయి.

  వెంచర్‌ ఫండ్‌లు సిద్ధమే

       వినూత్న ఆలోచన, సాంకేతికతో ఏర్పాటవుతున్న కొత్త ఐటీ సంస్థలకు ఆర్థిక సాయం చేసేందుకు వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లు, ఏంజెల్‌ ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. సెకోషియా క్యాపిటల్‌, హెలియన్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌, నెక్సెస్‌ క్యాపిటల్‌ ఇండియా లాంటి సంస్థలు ఐటీ సంస్థల ఆవిర్భవానికి ఇతోధికంగా సహకరిస్తున్నాయి. చిన్న-మధ్యస్థాయి ఐటీ సంస్థలకు వెంచరీస్ట్‌, బీవైఎస్‌టీ గ్రోత్‌ ఫండ్‌ సాయం అందిస్తుంటే, మైక్రోసాఫ్ట్‌, సైట్రిక్స్ లాంటి బహుళజాతి సంస్థలు కూడా కొత్త సంస్థలను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేటర్లు, సీడ్‌ఫండ్స్‌కు శ్రీకారం చుట్టాయి. దేశీయంగా, విభిన్న విపణులకు అనువైన సేవలు/ ఉత్పత్తులకు రూపకల్పన చేసే కొత్త ఐటీ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆయా దేశాల సంస్కృతీ, సంప్రదాయాలకు అనుగుణంగా మెలగడంతో పాటు, అక్కడి సంస్థలకు ఐటీ వినియోగంతో కలిగే ప్రయోజనాలను సమర్థంగా వివరించడంపైనే ఈ సంస్థల విజయం ఆధారపడి ఉంటుందని నాస్కామ్‌ పేర్కొంది. ఇవి విజ‌య‌వంత‌మైతే ఐటీ రంగంలో నూత‌న మార్పులు రావ‌డ‌మే కాకుండా, సంబంధిత విభాగంలో రాణించాల‌నుకునే అభ్యర్థుల‌కు అంత‌ర్జాతీయంగా మంచి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.