జయహో భారత్

* అంతరిక్ష పరిశోధనల్లో మనమే

* భవిష్యత్తు యువతదే

* షార్ డైరెక్టర్, పద్మశ్రీ ప్రసాద్

మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం అగ్రస్థానంలో దూసుకుపోతోందని షార్ డైరెక్టర్, పద్మశ్రీ డాక్టరు ఎం.వై.ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. నరసాపురం మండలం సీతారాంపురం సౌత్‌లోని స్వర్ణాంధ్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ (సైట్) కళాశాలలో సోమవారం జరిగిన సెమినార్‌లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీహరికోటలో జరుగుతున్న అంతరిక్ష పరిశోధన అంశాలు, తీరుతెన్నులను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సుమారు గంటన్నర పాటు విద్యార్థుల కళ్లకు కట్టినట్లు వివరించారు.
ఏం చదివామన్నది కాదు.. ఎంత శ్రద్ధగా చదివాం.. ఎంత నేర్చుకున్నాం అన్నదే ముఖ్యమని షార్ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. వైఎన్ కళాశాలలోని అరబిందో ఆడిటోరియంలో నిర్వహించిన 'భారతీయ అంతరిక్ష పరిశోధన' సదస్సులో పాల్గొని ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా జీఎస్ఎల్‌వీ రాకెట్ ప్రయోగం వీడియోను, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను చూపించారు.
నైపుణ్యం సిద్ధిరస్తు
నైపుణ్యంతో కూడిన చదువులు దేశానికి ఎంతో అవసరం. దేశ జీడీపీలో 14 శాతం ఆదాయమే పారిశ్రామికరంగం నుంచి లభిస్తోంది. వాస్తవానికి ఆ మొత్తం సరిపోదు. మరింత వృద్ధి ఉండాలి. బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ ఇలా ఏది చదివినా ఫర్వాలేదు. కాకుంటే ఆ చదువులు చక్కని నైపుణ్యంతో కూడినవి కావాలి. అలాంటి వారికి చక్కని ఉపాధి అవకాశాలెన్నో. సైన్సులో రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ కోసం దేశం బడ్జెట్‌లో ఒక శాతం మాత్రమే వెచ్చిస్తున్నారు. కనీసం రెండు శాతం కేటాయిస్తే సైన్సురంగం నుంచి వచ్చే పదేళ్లలో గణనీయ రాబడి సమకూరి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.
అతనితో ఏడేళ్లు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, నేను ఏడేళ్లు జీఎస్ఎల్‌వీ రాకెట్ ప్రయోగంలో చేశాం. ఆయనకు నా ఇంటిపేరుతో సహా తెలుసు. నన్ను పూర్తి పేరుతో సహా పిలిచే అతికొద్ది మందిలో కలాం ఒకరు. ఆయన చేసే పనిపట్ల శ్రద్ధతో పాటు దానిపై నమ్మకం ఉంచుతారు.
కిరోసిన్ దీపంలో
నరసాపురం ప్రత్యేకత గోదావరి. చిన్నప్పుడు (మూగమనసులు) సినిమా ఇక్కడ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చూడాలని అనుకునే వాడిని. ఆ రోజుల్లో కరెంటు లేక కిరోసిన్ దీపం వెలుగులో చదివాను. అయినా ఏ రోజూ నిరుత్సాహం పడలేదు. చదువును, జీవితాన్ని ఆస్వాదిస్తూనే పెరిగాను. ఎనిమిదో తరగతిలో సత్యనారాయణ మాస్టారు పెద్దయ్యాక ఏం చేస్తావని అడగ్గా.. ఫారిన్ రిటర్న్‌డ్ ఇంజినీరు అవుతా అన్నాను. ఆ విధంగానే విదేశాల్లో ఎంటెక్ చేశా. అమెరికాలో పనిచేసే అవకాశం వచ్చినా షార్‌కే మొగ్గు చూపా.
షార్ నుంచి ఈ ఏడాది మూడు పీఎస్ఎల్‌వీ, ఒక జీఎస్ఎల్‌వీ శాటిలైట్ ప్రయోగాలు చేపట్టనున్నాం. గతేడాది ప్రయోగించిన మంగళయాన్ వచ్చే సెప్టెంబరు 24కు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుంది. రోజుకు 3 లక్షల కిలోమీటర్ల చొప్పున ఇప్పటి వరకూ 1.60 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. వచ్చే మార్చి 31న పీఎస్ఎల్‌వీ 26 శాటిలైట్‌ను ప్రయోగిస్తాం. ఈ ప్రయోగాల్లో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల చేపట్టిన జీఎల్ఎల్‌వీ ప్రయోగ సమయంలో ఇంధన లీకేజీ గమనించాం. ఐదు నిమిషాలు జాప్యం జరిగినా నష్టం అపారం. లీకైన ఇంధనాన్ని శుభ్రపరచడానికి ఇంజినీర్లు, సిబ్బంది ముప్పై రోజులు శ్రమించాల్సి వచ్చింది.
గంట నుంచి సెకనుకు
పదో తరగతి చదువుకునే రోజుల్లో పరీక్షల కేంద్రం నరసాపురంలో ఉండేది. మొగల్తూరు నుంచి బస్సులో రావడానికి ఏడు కిలోమీటర్ల దూరానికి ఒక గంట సమయం పట్టేది. ఇప్పుడు షార్ నుంచి ప్రయోగించే రాకెట్‌లు 7 కిలోమీటర్లు సెకన్‌లో గమ్యస్థానం చేరుతున్నాయి. అది చూస్తుంటే మొగల్తూరు-నరసాపురం బస్సు ప్రయాణం గుర్తుకొస్తుంది. విదేశాల్లో కొన్ని విందులో పాల్గొనేవాణ్ని. అక్కడ తెలియక చేసిన పొరపాట్లు, అనుభవాలు సభికులకు వివరించారు. అప్పుడు బారిస్టర్ పార్వతీశం గుర్తుకొచ్చేవాడని చెబుతూ అందరిని నవ్వించారు. ఈ సందర్భంగా ఆయనను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు జీవీకే రామారావు, కార్యదర్శి, కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ అందే బాపన్న, కోశాధికారి డాక్టర్ పొన్నపల్లి రామకృష్ణారావు, యర్రమిల్లి గోపాలకృష్ణమూర్తి, పోలిశెట్టి రఘురామారావు, కోట్ల రామ్‌కుమార్, వడ్డే రామానుజరావు, డాక్టర్ ఎంవీఆర్‌కే నర్సింహాచార్యులు, డాక్టర్ కేవీసీఎస్ అప్పారావు, డాక్టర్ లక్ష్మీనరసమ్మ, రెడ్డప్ప ధవేజీ పాల్గొన్నారు.
షార్‌లో మహిళలకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి?' - విశ్వజ, వైఎన్ కళాశాల విద్యార్థిని.
షార్‌లో పనిచేస్తున్న 16 వేల మందిలో 2500 మంది మహిళలు ఉన్నారు. 'లాంచ్ వెహికల్‌ను అమ్మాయిలు ఆపరేట్ చేసే దృశ్యం ప్రపంచవ్యాప్తంగా షార్‌లో మాత్రమే చూడగలం' అని బదులిచ్చారు.
క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్లు శాటిలైట్ ప్రయోగాల్లో వాడవచ్చా? - ప్రవీణ్, ఇంజినీరింగ్ విద్యార్థి.
అధునాతన న్యూక్లియర్ టెక్నాలజీని వినియోగించనున్నాం.
భువి నుంచి చంద్రుని వరకు
షార్ 1963 సంవత్సరంలో అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టగా- నేడు అంతర్జాతీయ ఖ్యాతిని నిలబెట్టేలా పరిశోధన ఫలితాలు విస్తృతం అవుతున్నాయి. ఇప్పటివరకు శ్రీహరికోటలో ప్రయోగించిన అంతరిక్ష పరిశోధనల్లో 'చంద్రయాన్' ప్రతిష్టాత్మకమైంది. ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపై నీటి ఛాయలు ఉన్నాయన్న విషయం వెల్లడైంది. ఇదే పద్ధతిలో అమెరికా చేసిన అంతరిక్ష పరిశోధనలు పెద్దగా విజయవంతం కాలేదు. చంద్రయాన్ పరిశోధనకు 10 అంతర్జాయతీయ అవార్డులు వచ్చాయి. షార్ ద్వారా చేపట్టిన 15 ఉపగ్రహాల ప్రయోగాలకు రూ.1500 కోట్ల వ్యయం కాగా రూ.1100 కోట్ల ఆదాయం వస్తోంది. టెలివిజన్ శాటిలైట్ వ్యవస్థ ద్వారా ఇది సమకూరుతుంది. ఒక్కొక్క ఉపగ్రహం 15 సంవత్సరాలు పనిచేస్తోంది.
0.04 శాతం వ్యయం
కేంద్ర ప్రభుత్వ వ్యయంలో ఉపగ్రహాలకు 0.04 శాతం ఖర్చు చేస్తుంది. 2000 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది రూ.4500 కోట్లు పరిశోధనలకు కేటాయించింది. ఇది ముదావహం. 25 శాటిలైట్లు ప్రస్తుతం భారతదేశానివి అంతరిక్షంలో ఉన్నాయి.
కొలువుల కోట
ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ విద్యార్థులకు షార్ కొలువుల కోటగా చెప్పవచ్చు. అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగాల కోసం ఎటువంటి నోటిఫికేషన్ వెలువడదు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూరించి పంపాలి. దేశవ్యాప్తంగా 3000 మందికి ముఖాముఖీలు జరపగా వారిలో ప్రతిభ ఆధారంగా మొదటి 300 మందిని ఎంపిక చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇంజినీరింగ్ విద్యార్థులు కష్టపడి చదివి ఆ స్థాయికి ఎదగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
నా అదృష్టం
నరసాపురం వైఎన్ కళాశాలలో చదవడం అంటే విద్యార్థి అదృష్టంగా భావించాలని ప్రసాద్ పేర్కొన్నారు. కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల విశిష్టతను గుర్తు చేసుకున్నారు. తాను వైఎన్ కళాశాలలో చదవాలని ఆశ పడ్డానని, ఆర్థిక పరిస్థితి వల్ల ఏలూరులోని అన్న గారి వద్ద ఉండి పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కళాశాల కరదీపిక 'రిఫ్లెక్షన్స్' ఆవిష్కరించారు. తర్వాత కళాశాల పీజీ గ్రంథాలయాన్ని సందర్శించారు.
ఆత్మీయ స్వాగతం
పద్మశ్రీకి ఎంపికైన తర్వాత తొలిసారిగా స్వగ్రామం వస్తూ నరసాపురం రైల్వేస్టేషన్‌లో తిరుపతి ఎక్స్‌ప్రెస్ దిగిన ప్రసాద్‌కు ఆత్మీయ స్వాగతం లభించింది. మొగల్తూరు నుంచి ఆయన బంధువులు, చిన్ననాటి స్నేహితులు, వైఎన్ కళాశాల ప్రిన్సిపల్ నర్సింహచార్యులు, వైఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ అప్పారావు, అధ్యాపక బృందం పూలమాలలతో స్వాగతం పలికారు.
-న్యూస్‌టుడే, నరసాపురం పట్టణం,
సీతారాంపురం సౌత్ (నరసాపురం గ్రామీణ), మొగల్తూరు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning