విపత్తులపై పత్ర సమర్పణలు

* సాంకేతిక విప్లవం భళా!

* జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ప్రతిభ

వేంపల్లె, న్యూస్‌టుడే : సాంకేతిక సిగలో విజ్ఞాన గ్రామీణ ముత్యం మెరిసింది. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని ఆలోచనతో ట్రిపుల్ఐటీ విద్యార్థి మేడా వినయ్‌కుమార్ ముందుకు సాగుతున్నారు. వివిధ అంశాలపై పరిశోధనలు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై పత్ర సమర్పణలు చేశారు. పదికి పైగా సాంకేతిక అంశాలపై సమర్పణ చేసి తన మేధస్సుతో యువతకు స్ఫూర్తి నింపుతున్నారు.
అందరిలో ఒకడిగా కాకుండా..
అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన జ్యోతి, రాజగోపాల్ దంపతుల కుమారుడు వినయ్‌కుమార్. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. అందరిలో ఒకడిగా కాకుండా.. తనకంటూ ప్రత్యేకత చాటాలనే ఉద్దేశంతో ప్రయోగాలపై దృష్టిమళ్లించారు. వరదల విపత్తు గురించి ప్రస్తుతం ఉన్న వాటి కంటే ఇంకా ముందుగా చెప్పేందుకు స్మార్ట్ ఆటోమేటెడ్ ఫర్ ఎస్టిమేషన్ (సేఫ్) అనే పరికరాన్ని తయారుచేశారు. నదుల్లో నీటి పరిమాణం కొలవడం, విపత్తులను కంప్యూటర్ ద్వారానే తెలుసుకునేలా తయారుచేశారు. 'సేఫ్' పరికరం ద్వారా విపత్తును ముందే గుర్తించి ప్రజలను హెచ్చరించడంతో పాటు వారి ప్రాణాలను కాపాడవచ్చు. నదుల పరిశోధన, నీటిపారుదల శాఖ అధికారులకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు.
* మానవ శరీరం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానంపై రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. దీనికి తమిళనాడులోని కల్పకం అటామిక్ రీసెర్చ్ సెంటర్ విశ్రాంత శాస్త్రవేత్త బాపురావు, మరికొందరు సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు.
అంతర్జాతీయ వేదికలపై సమర్పణలు
* 2013 డిసెంబరులో వరంగల్ నిట్‌లో టెక్నోజియం-13 జాతీయస్థాయి సాంకేతిక సదస్సు నిర్వహించారు. ఇందులో 'సేఫ్' పరికరంపై పత్ర సమర్పణ చేసి ప్రథమ బహుమతి సాధించారు. ప్రొఫెసర్ శ్రీనివాసరావు నుంచి రూ.3500 నగదు బహుమతి సాధించారు.
* 2014లో హైదరాబాదులోని ఇబ్రహీంబాగ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వారు అక్యూయన్ సివిల్14 నిర్వహించిన జాతీయస్థాయి వైజ్ఞానిక సదస్సులో విపత్తుల నివారణ గురించి పత్ర సమర్పణ చేశారు. మొదటి బహుమతి లభించింది.
* 2013 నవంబరులో తమిళనాడులోని ఫెరియార్ మణియమ్మాయి యూనివర్శిటీ (తంజావూరు)లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వరద నివారణ గురించి పత్ర సమర్పణ చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అయ్యావో నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు.
* 2013లో వరంగల్ నిట్‌లో జరిగిన జాతీయ సదస్సులో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన పత్రాన్ని సమర్పించారు. అదే ఏడాది హైదరాబాదు బిట్స్‌పిలాని క్యాంపస్‌లో అట్రాస్ పేరిట నిర్వహించిన జాతీయ సాంకేతిక మేనేజ్‌మెంట్ సదస్సులో పత్రం సమర్పించి తృతీయ బహుమతి అందుకున్నారు.
* 2013 అక్టోబరులో హైదరాబాదులో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్‌లో డిజైన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ ఆఫ్ ఆటో ఇరిగేషన్ యూనిట్‌పై పత్రాన్ని సమర్పించి ప్రశంసాపత్రం అందుకున్నారు.
* 2012లో కేరళ రాష్ట్రంలోని కాలికట్‌లోని నిట్‌లో జరిగిన తత్వ 12 జాతీయస్థాయి సాంకేతిక సదస్సులో పాల్గొన్నారు. వెహికులర్ క్రాసెస్ ఇన్ హైవే వర్కింగ్ జోన్స్‌పై పత్రం సమర్పించి ద్వితీయ బహుమతి కింద రూ.5వేలు నగదు బహుమతి అందుకున్నారు.
* 2012లో కర్ణాటకలోని సూరత్‌లో ఇంజినీర్-12 జాతీయస్థాయి సాంకేతిక సదస్సులో టెక్ పేరిట పత్రం సమర్పించి ప్రశంసాపత్రం అందుకున్నారు.
* 2013 డిసెంబరు హైదరాబాదు ఐఐటీలో తోటి విద్యార్థులు నజీమా, రాజేష్‌తో కలిసి బిల్డింగ్ ఆఫ్ ప్లాట్స్ పరిశోధన చేసి నిర్వాహకుల నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు.
* 2014 జనవరిలో ముంబై ఐఐటీలో ది సామినేషన్ అనే అంశంపై సమస్యల్లో ఉన్న ప్రజలను చైతన్యం చేసేలా 44 మందితో కలసి రూపొందించిన ఒక ప్రాజెక్టును సమర్పించారు. స్టూడెంట్ డీన్ వైజిలిన్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు.
* 2014లో బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన జాతీయస్థాయి సాంకేతిక సదస్సులో శక్తిపై పత్రం సమర్పించారు. మొదటి పదిమందిలో స్థానం దక్కించుకుని ప్రశంసలు అందుకున్నారు.
* చిన్నపిల్లలకు సులువుగా చదువు చెప్పేందుకు 12 ప్రాజెక్టులను తయారు చేశారు. చెన్నైలోని మోస్ట్ మొబైల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియానికి సమర్పించారు.
అందరూ ప్రమాదాలను గుర్తించగలగాలి
సమాజంలోని చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ప్రమాదాలను ముందుగానే గుర్తించ గలగాలన్నదే నా ఆశయం. ఇందుకు నేను తయారుచేసిన పరికరాన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తేవాలన్నదే తలంపు. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఈ లక్ష్యాన్ని అధిగమిస్తా.
- మేడా వినయ్‌కుమార్, ఈ3 విద్యార్థి, ట్రిపుల్ఐటీ

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning